సాహిత్య వాతావరణం ఉన్న ఇంట్లో పుట్టి పెరిగి, ఆ తరం
సాహితీమూర్తులందరినీ దగ్గరగా చూసి, స్నేహం చేసి, తన తర్వాతి తరానికీ స్నేహ
హస్తం అందించి, ఒక్కరోజు కూడా సాహిత్యం నుంచి దూరం జరగకుండా జీవితాన్ని
గడిపిన వ్యక్తి తన అనుభవాలని అక్షరీకరిస్తే ఎలా ఉంటుదన్న ప్రశ్నకి జవాబుగా
అబ్బూరి వరదరాజేశ్వర రావు రాసిన 'కవనకుతూహలం,' 'వరదకాలం' పుస్తకాలని
చూపించవచ్చు. ఆధునిక తెలుగు సాహిత్యానికి మూలస్థంభాలనదగ్గ వారిలో ఒకరైన అబ్బూరి రామకృష్ణా రావు గారబ్బాయి వరద రాజేశ్వర రావు రాసిన ఈ రెండు పుస్తకాలూ ఇప్పుడు ఒకే పుస్తకంగా అందుబాటులోకి వచ్చాయి.
శ్రీరంగం
శ్రీనివాసరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రిలతో చిన్నప్పటినుంచీ స్నేహం వరద
రాజేశ్వర రావుకి. అడివి బాపిరాజు, గుడిపాటి వెంకటచలం, పురిపండా
అప్పలస్వామి, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి, మల్లాది రామకృష్ణ
శాస్త్రి, జాషువా లాంటి వారందరూ ఆప్యాయంగా దగ్గరికి తీశారు రావుని. అపారమైన
జ్ఞాపకశక్తి, మరీ ముఖ్యంగా నచ్చిన పద్యాలని అక్షరం పొల్లుపోకుండా
గుర్తుపెట్టుకునే శక్తి ఉండడంతో పాటు, ఆశువుగా పద్యాలల్లే శక్తీ చిన్ననాడే
అబ్బింది. పైగా అటు తండ్రీ, ఇటు స్నేహితులూ, ఆత్మీయులూ అందరూ కూడా సాహిత్యాన్ని జీవితంలో విడదీయరాని భాగంగా చేసుకున్న వాళ్ళే.
ఈ సంకలనంలో ఉన్న డెబ్భై ఎనిమిది వ్యాసాలూ తొలుత పత్రికల్లో కాలమ్స్
గా అచ్చయ్యాయి. అందువల్లే కావొచ్చు, క్లుప్తత వీటి ప్రధాన లక్షణం. చదివించే
గుణం పుష్కలం. అక్కడక్కడా ఒకట్రెండు పునరుక్తులు మినహా మిగిలిన పుస్తకం
ఆపకుండా చదివిస్తుంది. ఆనాటి మేటి సాహిత్యవేత్తలని గురించి ఇంత
సాధికారికంగానూ, ఆత్మీయంగానూ చెప్పగలిగేవాళ్ళు ఎవరుంటారు? కవినుంచి
మహాకవిగా శ్రీశ్రీ ఎదుగుదలని గురించి ఎంత సీరియస్ గా చెబుతారో, విజయవాడ
రోడ్ల మీద చలం కార్ డ్రైవింగ్ నేర్చుకోడాన్ని గురించి అంత సరదాగానూ
చెబుతారు రాజేశ్వర రావు. బాపిరాజు అమాయకత్వాన్నీ, కృష్ణశాస్త్రి గొంతులో
తీయదనాన్నీ పాఠకుల కళ్ళకి కట్టేస్తారు.
సహజంగానే తన
తండ్రి రామకృష్ణారావుని గురించి ఎక్కువ విశేషాలు చెప్పారు. ఇవన్నీ
అప్రయత్నంగా చెప్పినట్టే అనిపిస్తాయి. రామకృష్ణారావు విద్యాభ్యాసం, రచనలు,
'నటాలి' సంస్థ ద్వారా నాటక ప్రదర్శనలు, అటుపై ఆంధ్రా విశ్వవిద్యాలయంలో
లైబ్రరీ అధికారిగా విధి నిర్వహణ ఈ విశేషాలు ఒకే దగ్గర కాకుండా
సందర్భోచితంగా ప్రస్తావించారు. తెలుగునాట కమ్యూనిస్టు పార్టీ బలపడడానికి
కృషి చేసిన వారిలో రామకృష్ణారావూ ఒకరు. అయితే, పార్టీని విడిచిన తొలితరం
ప్రముఖుల్లో కూడా ఆయన ఒకరు. కమ్యూనిస్టు నుంచి రాయిస్టు గా మారారు రామ కృష్ణారావు. మరో రాయిస్టు ప్రముఖుడు పాలగుమ్మి పద్మరాజు కబుర్లూ చాలానే ఉన్నాయీ పుస్తకంలో.
'కన్యాశుల్కం'
నాటకాన్ని ఉత్తరాంధ్ర నుంచి కోస్తా ప్రాంతానికి తీసుకొచ్చి ప్రదర్శించడం
వెనుక పూనిక రామకృష్ణారావుదయితే, కృషి వరద రాజేశ్వర రావు తదితరులది.
ప్రదర్శన కబుర్లతో పాటు, 'రాజావారి సింహాచలం' 'మరో మధురవాణి' వ్యాసాలు 'కన్యాశుల్కం' అభిమానులకి విందుభోజనం అనే చెప్పాలి.
తనకి నచ్చినవీ, మంచివీ అయిన సంగతులు ఎంత విపులంగా చెప్పారో, నచ్చని వాటిని
చెప్పీచెప్పకుండా వదిలేశారు. శ్రీశ్రీ తో ప్రత్యక్ష యుద్ధం చేసిన శిష్ట్లా
ఉమామహేశ్వర రావు ('నవమి చిలక' గుర్తొస్తుంది మొదటగా) కబుర్లు ఇందుకు
ఉదాహరణ. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య లాంటి స్వతంత్ర పోరాట
యోధుల విశేషాలు స్ఫూర్తివంతాలు.
మొత్తం మీద
చూసినప్పుడు, నిన్నటి తరం ప్రముఖుల గురించి దగ్గరగానూ, ఆత్మీయంగానూ
తెలుసుకోడానికి ఉపకరిస్తుందీ సంకలనం. వరద రాజేశ్వర రావు ఓ పత్రికకిచ్చిన
ఇంటర్యూ తో పాటు ఆయన్ని గురించి సమ్మెట నాగ మల్లేశ్వర రావు రాసిన
వ్యాసాన్నీ చేర్చడం వల్ల కొత్త తరానికి వరద రాజేశ్వర రావు పరిచయం అవుతారు.
క్వాలిటీ విషయంలో రాజీ పడని తెలుగు ప్రింట్ వారు ప్రచురించిన ఈ సంకలనంలో
అనేక అచ్చుతప్పులు దొర్లడం విషాదం. కొన్ని శీర్షికల్లోనే ముద్రారాక్షసాలున్నాయి.
సాహిత్యాభిమానులు మళ్ళీ మళ్ళీ చదువుకునే పుస్తకం ఇది. ('కవనకుతూహలం మరియు
వరదకాలం,' తెలుగు ప్రింట్ ప్రచురణ, పేజీలు 387, వెల రూ. 300, అన్ని ప్రముఖ
పుస్తకాల షాపులు).
చాలా బాగుంది. ఇలా కవులు తమ జీవితాల్లో సాహిత్యక్షేత్ర పరిచయాల గురించి వ్రాసిన పుస్తకం ఉందా అని ఇదివరకు చర్చించాను ఇక్కడే మిత్రులతో.ఒకానొక సాహిత్యసంకలనంలోని 'పాతిక సంవత్సరాల కవిత్వ ప్రస్థానం' అన్న పేరుతో దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి వ్యాసం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జివిసుబ్రహ్మణ్యం గారి సంపాదకత్వంలోని ఆ సంకలనంలోని అన్ని వ్యాసాలూ చక్కనివే. కానీ ఇది ప్రత్యేకం.
రిప్లయితొలగించండితర్వాత అటువంటి ఒక రచన గురించి ఇప్పుడే వింటున్నాను. సంతోషం మురళి గారూ!
@లక్ష్మీదేవి: మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి 'చలవ మిరియాలు' కూడా చూడండి ఒకసారి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి