బుధవారం, మార్చి 16, 2016

గేదెమీది పిట్ట

సమాజంలో ఒక పెనుమార్పు సంభవించినప్పుడు తత్కారణంగా జీవితంలో వచ్చిపడే మార్పులని 'నైతికత' కోణం నుంచి మరీ ఎక్కువగా చూసేది మధ్యతరగతి సమాజమే. ఇప్పుడిప్పుడు మధ్యతరగతి కూడా ఎలాంటి మార్పులనైనా హృదయపూర్వకంగా ఆహ్వానించేస్తున్నా, మిగిలిన వర్గాలతో పోల్చినప్పుడు నిన్నమొన్నటి వరకూ విలువల విషయంలో బాగా ఒత్తిడికి గురైంది ఈ సమాజం. విలువలు, డబ్బు ఈ రెంటిలో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన పరిస్థితులు తరచూ ఎదుర్కొనేది కూడా ఈ మధ్యతరగతే. ఇలాంటి ఓ మధ్యతరగతి జీవి కథే తల్లావఝల పతంజలి శాస్త్రి రాసిన 'గేదెమీది పిట్ట' నవలిక.

సాఫ్ట్వేర్ ఇంజినీర్లకి విపరీతమైన డిమాండ్ ఉన్న కాలంలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి జాబ్ మార్కెట్లో అడుగుపెట్టాడు ఆదినారాయణ మూర్తి. స్థిరమైన ఉద్యోగం రాకమునుపే,  పెద్దవాళ్ళు చూసిన సంబంధం స్కూలు టీచరుగా పనిచేస్తున్న పూర్ణని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకో పాప. తల్లి మరణించింది. బ్యాంకు ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన తండ్రి ఆది దగ్గరే ఉంటున్నాడు. ఓ మల్టిప్లెక్స్ నిర్మాణం దగ్గర సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆదికి, ఆ ప్రాజెక్టు పూర్తవుతూనే మరో ఉద్యోగం చూసుకోవాల్సిన పరిస్థితి. కనీసం ఇప్పుడైనా స్థిరమైన ఉద్యోగం దొరకాలన్నది అతని కోరిక.

ఆదికి ఉద్యోగం దొరకదు సరికదా, తండ్రికి గుండె ఆపరేషన్ చేయించాల్సి వస్తుంది. అందుకు అవసరమైన మొత్తం అటు తండ్రి దగ్గరా, ఇటు పూర్ణ దగ్గరా కూడా ఉందని తెలుసు. కానీ, తన డబ్బు ఖర్చు చేయలేకపోతున్నానన్న బాధ మొదలవుతుంది ఆదికి. మావగారిని అభిమానంగా చూసుకునే పూర్ణ తన డబ్బు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయిస్తుంది. ఈ పరిస్థితుల్లో, మల్టిప్లెక్స్ యజమాని చెల్లెలు నిర్మలతో పరిచయం అవుతుంది ఆదికి. ఆమె నడుపుతున్న బాతిక్ లో చిన్న చిన్న మార్పులు చేయించాల్సి వచ్చి అతని సలహా కోరుతుంది, భర్తనుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న నిర్మల. రెండు మూడు సార్లు బాతిక్ కి వెళ్లి మార్పులు చేయించిన ఆదికి కన్సల్టేషన్ ఫీజు ముట్టజెపుతుంది నిర్మల.


అలవాటుగా ఆ ఫీజు తెచ్చి పూర్ణ చేతిలో పెట్టిన ఆదికి భార్య కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. డబ్బు విషయంలో చాలా ప్లానింగ్ తో వ్యవహరించే పూర్ణ భర్తకి మరిన్ని కన్సల్టెన్సీలు దొరకాలని కోరుకుంటుంది. కొన్నాళ్ళ తర్వాత నిర్మల నుంచి మళ్ళీ పిలుపొస్తుంది ఆదికి. ఈసారి ఆమె అతన్ని తన పడకగదికి తీసుకెళ్తుంది. తిరిగి వెళ్ళేప్పుడు అతని జేబులో కరెన్సీ నోట్లున్న కవరు ఉంచుతుంది. ఇంటికి వచ్చిన ఆది, స్నానం చేసి ఆ కవర్ని పూర్ణకి అందిస్తాడు. అతనేమీ చెప్పక మునుపే 'మరో కన్సల్టెన్సీ దొరికిందా?' అని అడగడమే కాదు, తరచూ దొరకాలని కూడా కోరుకుంటుందామె.

మితభాషి, అంతర్ముఖుడు అయిన ఆది వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని నిశ్చయం అయ్యాక తన స్నేహితురాళ్ళు కొందరిని పరిచయం చేస్తుంది నిర్మల. స్టార్ హోటల్లో రూం బుక్ చేసి అతన్ని ఆహ్వానిస్తూ ఉంటారు వాళ్ళు. వీళ్ళెవరూ అతని విషయాలు అడగరు, వాళ్ళ సంగతులు చెప్పాలనిపిస్తే చెబుతారు. అతనికి ఏమాత్రం ఇబ్బంది కలగని విధంగా డబ్బులున్న కవరు జేబులో పెట్టి పంపిస్తూ ఉంటారు. ఆది తండ్రి మరణించడం, మల్టిప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యి, ఆది ఉద్యోగం పోవడం, స్టార్ హోటల్లో పరిచయమైన కుర్రాడు పార్టనర్షిప్ ఆఫర్ ఇవ్వడం ఒకేసారి జరుగుతాయి.

పూర్ణ దృష్టిలో ఆది ఇప్పుడు ఫుల్ టైం కన్సల్టెంట్. అతను ఎంత సంపాదిస్తే ఏమేం కొనుక్కోవచ్చో లెక్కలు చెబుతూ ఉంటుంది. పడకలు వేరవ్వడం కూడా పెద్ద విషయం కాదామెకి. ఆది ప్రకాష్ గా మారతాడు ఆదినారాయణ మూర్తి. ఈ ఆది కథని పూర్తి సంయమనంతో చెబుతారు రచయిత. ఎక్కడా తీర్పులిచ్చే పని పెట్టుకోకుండా, 'ఇలా జరిగింది' అని మాత్రం చెప్పి ఊరుకుంటారు. మొత్తం 119 పేజీల నవలికలో తొలి నలభై పేజీలని పాత్రల్ని పరిచయం చేయడానికి, పాఠకులని కథలోకి తీసుకెళ్ళడానికి కేటాయించారు. అంతేకాదు, ప్రతి పాత్ర దృష్టి కోణం నుంచీ ఆదిని పరిశీలించడానికి అవకాశం ఇచ్చారు. ఆది పాత్ర పాఠకులకి ఎలా అర్ధమయింది అన్నదాన్ని బట్టి ఈ నవలపై వారి అభిప్రాయం ఉంటుంది. ('చినుకు' ప్రచురణ, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

4 కామెంట్‌లు:

  1. పిట్టలే ధైర్యంగా వచ్చి గేదె మీద వాలుతుంటే శాస్త్రిగారేమి తీర్పు చెపుతారులెండి !

    రిప్లయితొలగించండి
  2. @నీహారిక: మీరన్న అర్ధంలో అయితే నవలిక పేరు 'దున్న మీద పిట్ట' అని పెట్టి ఉండేవారేమోనండీ :) ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  3. మీ బ్లాగ్ పోస్టుల్లో ఎత్తుగడ గమనించడం నాకు అలవాటు. చిత్రంగా ఈ సమీక్ష మొదటి, చివరి వాక్యాలు పోటీ పడుతున్నాయి. Haunting..

    రిప్లయితొలగించండి
  4. @కొత్తావకాయ: మీరు చదివే పధ్ధతి మరోమారు ఆశ్చర్యాన్ని కలిగించిందండీ.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి