కొండకోనల్లో పుట్టి పెరిగిన అడవిమల్లి ఆ చిన్నది. నాగరికత వాసనలేవీ తెలియనే తెలియవు. మనసులో ఏదో దాచుకుని, పైకి మరేదో మాట్లాడాల్సిన అవసరం ఏమాత్రమూ లేని ప్రపంచం ఆమెది. చెట్టూ చేమల మధ్య ఆడుతూ పాడుతూ పెరిగిన ఆ అమ్మాయి, తనకి వయసొచ్చిన విషయం గ్రహించుకుంది. తోడు కావాలన్న తొందర ఆమెలో మొదలయ్యింది. ఓ చక్కని జానపదం అందుకుంది. తన చుట్టూ ఉన్న ప్రకృతితో పాట రూపంలో సంభాషించింది.
యవ్వనం వస్తూ వస్తూ తనతోపాటు ఉరిమే ఉత్సాహాన్ని తీసుకు వస్తుంది. ప్రపంచంలో ఉన్న అందమంతా తన చుట్టూనే ఉన్నట్టు, సంతోషం మొత్తం తనలోనే నిక్షిప్తమైనట్టూ అనిపించడం, యవ్వనారంభంలో అందరికీ సహజమే. ఇందుకు ఆ అడవిమల్లి మినహాయింపు కాదు. ఆమెలో కొత్త ఉత్సాహం పెల్లుబుకుతోంది. నవ్వు దాగనంటోంది. ప్రకృతిలో తననీ, తనలో ప్రకృతినీ చూసుకుంటూ తనకి తగ్గ జతగాడి కోసం ఎదురు చూస్తోంది.
'మౌనపోరాటం' (1989) సినిమాలో ఈ సన్నివేశానికి మన్యపు సౌందర్యాన్ని, గిరిజనపు వాడుకలనీ మేళవించి ఓ అందమైన పాట రాశారు వేటూరి సుందర రామ్మూర్తి. సంగీత దర్శకత్వం మరెవరో కాదు, ఎస్. జానకి!! గాయనిగా క్షణం తీరిక లేకుండా ఉన్న సమయంలో, జానకి ఎంతో ఇష్టంగా ప్రత్యేకించి సమయం కేటాయించుకుని మరీ సంగీత దర్శకత్వం వహించిన సినిమా ఇది. 'యాల యాల యాలగా ఇదేమి ఉయ్యాల...' అంటూ తొలి యవ్వనపు గిరితనయ లోకి పరకాయ ప్రవేశం చేసి, ఈ పాట పాడేనాటికి జానకి వయసు అక్షరాలా యాభయ్యేళ్లు!
జానకి గొంతులో వినిపించే చిలిపితనం, మధ్యమధ్యలో నవ్వులు, 'ఉప్పొంగి పోయింది మా తేనె గంగమ్మ... ముక్కంటి ఎంగిలి సోకని గౌరమ్మ..' పలికిన తీరు, కోయిలతో పోటీ పడడం.. ఇవేవీ మరో గాయని నుంచి ఆశించలేం..
మనుషులకుండే కట్టుబాట్లు, పట్టింపులకి అతీతురాలు ఆ యక్షిణి. మనసు పడ్డది ఏదైనా సాధించుకునే నేర్పు ఆమెకి సొంతం. ఆ యక్షిణి ఓ మానవ మాత్రుడిని మోహించింది. కార్యార్ధియై ఆమె దగ్గరకి వెళ్ళాడు అతడు. అందగాడు, యువకుడు అయిన అతన్ని చూడగానే ఆమెలో మోహం పొంగులెత్తింది. అతన్ని తన సరసకు, సరసానికి ఆహ్వానించింది.
మానవమాత్రుడు కదూ అతను. కట్టుబాట్లు పట్టి ఆపుతున్నాయి అతన్ని. అలాగని, ఆమె కోరికని తిరస్కరించి కోపానికి గురయ్యే సాహసం చెయ్యలేడు. అతడు నెరవేర్చాల్సిన కార్యానికి ఆమె సాయం కీలకం మరి. అందుకే ఆమె ఆహ్వానానికి అతడు 'అవున'ని చెప్పలేదు. 'కాద'ని ఆమెని దూరంగా నెట్టనూ లేదు. ఆమెని కవ్విస్తూనే, తను వచ్చిన పని పూర్తి చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు అతగాడు.
'భైరవద్వీపం' (1994) జానపద చిత్రం లోని ఈ సన్నివేశానికి తగ్గట్టుగా ఓ శృంగారభరిత గీతాన్ని రాశారు వేటూరి సుందర రామ్మూర్తి. ('జావళి' అనడం సబబేమో!) యక్షిణి కాంక్షని తన గొంతులో నింపుకుని పాటని ఆలపించే గాయని కావాలి. కథానాయకుణ్ణి కవ్వించాలి. యక్షిణి కోర్కెని వెల్లడించి, అతనిలో కదలిక తేవాలి. పాటలోని ప్రతి అక్షరంలోనూ శృంగారాన్ని ఒలికించాలి. యాభై ఐదేళ్ళ జానకి గొంతులో శృంగార రసం పలికిన తీరుని 'నరుడా ఓ నరుడా ఏమి కోరిక?' పాటలో వినాలే తప్ప, మాటల్లో చెప్పడం కష్టం..
కలలు అందరికీ ఉంటాయి.. కానీ వాటిని పదిమందితో పంచుకోగలిగే వాళ్ళు బహుతక్కువ. అందరూ ఏమనుకుంటారో అన్న బెరుకు, కలలేవీ నెరవేరకపోతే నవ్వుతారేమో అన్న భయం.. ఇవన్నీ పట్టి ఆపుతూ ఉంటాయి చాలామందిని. కానీ, ఆ టీనేజ్ అమ్మాయి అలా కాదు. అందరిలో ఒక్కర్తె గా బతకడానికి ఆమె వ్యతిరేకి.. అందరిలోనూ ప్రత్యేకంగా నిలబడాలి, తనగురించి అందరూ చెప్పుకోవాలి అన్నది ఆమె కల. తనకంటూ ఓ స్థానం సంపాదించుకోవాలన్నది ఆమె కోరిక, ఆశ, ఆశయం..
ఎవరేం అనుకుంటారో అన్న బెరుకు ఏ కోశానా లేని ఆ అమ్మాయి తన కలలని గురించి ఎలా చెబుతుంది? గొంతెత్తి చెబుతుంది.. ధైర్యంగా చెబుతుంది.. ఆత్మ విశ్వాసం తొణికిసలాడే స్వరంతో చెబుతుంది. కేవలం ఆశల్ని మాత్రమే ప్రస్తావించి ఊరుకోదు. వాటిని నెరవేర్చుకునే మార్గాల గురించీ, అందుకు పడాల్సిన శ్రమని గురించీ కూడా చెబుతుంది. అలా శ్రమ పడడానికి తను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి ఏమాత్రం మోమాట పడదు కూడా.. ఈ చెప్పడం అన్నది మాటల్లో కాక పాటగా అయితే?
'రంగేళి' (1995) అనువాద చిత్రంలో ఈ సన్నివేశానికి పాటని సిద్ధం చేశారు 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి. కుర్రకారుకి హుషారెక్కించే బాణీతో ఎదురు చూస్తున్నారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. గొంతులో పడుచుదనాన్ని పరవళ్ళు తొక్కించే గాయని కావాలి. ఎవరున్నారు? అన్న ప్రశ్నకి సమాధానం యాభయ్యారేళ్ళ ఎస్. జానకి. వయసుతో నిమిత్తం లేకుండా, ఆమె గొంతు పదహారు లోనే ఆగిపోయిందని ఒప్పుకోక తప్పదు, 'యాయిరే.. యాయిరే.. వారెవా ఇది ఏం జోరే..' పాట వింటూంటే.. 'వారెవా' వచ్చిన చోటల్లా ఒక్కోసారి ఒక్కోలా పలకడం, స్పూర్తివంతంగా ఉండే రెండో చరణాన్ని పాడిన తీరు ప్రత్యేకంగా గమనించాలి..
దేవుడు అనగానే మొదట గుర్తొచ్చేది సాత్వికమైన రూపం, చెదరని చిరునవ్వు. అదే, దేవత అనుకోగానే కళ్ళముందు మెదిలేది ఉగ్ర రూపమే.. దేవతలలో ప్రేమ, కరుణ, వాత్సల్యం ఇవన్నీ ఉన్నా ఒకలాంటి ఆవేశమే గుర్తొస్తుంది మొదట. అందుకే కాబోలు, దేవుళ్ళ స్తోత్రాల్లో మంద్రస్వరం వినిపిస్తే, దేవతలని స్తుతించే స్వరంలో ఆవేశం వినిపిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకి కనకదుర్గమ్మ పెట్టింది పేరు. అటు ఉగ్రంగానూ, ఇటు కరుణ పూరితంగానూ తన భక్తులకి కనిపించగల దేవత ఆమె.
మరి, అటువంటి దేవతని స్తుతించే గొంతు ఎలా ఉండాలి? ఆవేశమూ, కరుణా సమపాళ్ళలో రంగరించి ప్రార్ధించి ప్రసన్నం చేసుకోవాలి. మనసులో ఆ మూర్తిని నిలుపుకున్నప్పుడు తెలియకుండానే భక్త్యావేశం ఆవహిస్తుంది. 'దేవుళ్ళు' (2001) సినిమాలో ఇంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గని ప్రార్ధించే సన్నివేశం కోసం ఓ భక్తిగీతాన్ని రచించారు జొన్నవిత్తుల. ఆవేశపూరితంగా వినిపించే బాణీని అందించారు సంగీత దర్శకుడు 'వందేమాతరం' శ్రీనివాస్.
భక్త్యావేశాన్ని కరుణ రసంతో రంగరించి అరవై రెండేళ్ళ జానకి పాడిన పాట 'మహా కనకదుర్గా...' ఈ పాట వింటూ ఉంటే తన భక్తులని రక్షించుకోడానికి కనకదుర్గమ్మ కొండ దిగి వస్తున్న భావన కలుగుతుంది.. ముఖ్యంగా రెండో చరణం పాడిన తీరు అనితరసాధ్యం.
(ఐదు దశాబ్దాలకి పైగా అనేక వేల పాటలు పాడి, ఒక్క తెలుగే కాక దక్షిణాది సినీ సంగీతం మీద తనదైన సంతకం చేసిన నిరుపమాన గాయని ఎస్. జానకి స్వరానికి వినమ్ర అక్షరాంజలి!!)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి