ఆదివారం, జనవరి 12, 2014

జానకి పాటలు-4

లోకులు ఆమెని కాకుల్లా పొడుస్తున్నారు.. ఏకాంతం అన్నది ఆమెకి ఎండమావిగా మారింది. ఏ రహస్యాన్నైతే ఆమె తన ప్రాణం కన్నా ఎక్కువగా దాచుకుందో, అది ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ఆమెకి మనశ్శాంతి కరువయ్యింది. మనుషుల మీద నమ్మకం పూర్తిగా పోయింది. బతకాలన్న ఆశ తుడిచిపెట్టుకుపోయింది. లోకం ఆమెని మరణించనివ్వడం లేదు.. అలాగని, జీవించి ఉండడానికీ అడుగడుగునా అడ్డుపడుతూనే ఉంది.

జరిగిన దానిలో ఆమె తప్పు ఏముంది అసలు? ఆ పాతికేళ్ళ అమ్మాయి తన ప్రాణం పోయినా సరే, తన గతం ఏమిటన్నది మరొకరికి తెలియకూడదు అనుకుంది. పెద్దగా ప్రయత్నం లేకుండానే రాత్రికి రాత్రే వెండితెర కలలరాణి గా అవతరించింది. లక్షలాది మంది అభిమానులని సంపాదించుకుంది. సరిగ్గా ఈ తరుణంలో, ఆమె గతం తాలూకు రహస్యం లోకానికి తెలిసిపోయింది. ప్రపంచానికి ఓ పెద్ద వినోదం దొరికింది. ఎక్కడికి వెళ్ళినా అవే ప్రశ్నలు.

తనకంటూ ఎవరూ లేరనీ, కనీసం తన ప్రాణం తీసుకునే అవకాశం కూడా తనకి లేదనీ అర్ధమైంది ఆమెకి. అపనమ్మకం, నిరాశ, నిస్పృహల నుంచి ఓ ఆవేశం పుట్టింది.. అది పాటగా మారింది.'సితార' (1984) సినిమాలోని ఈ సన్నివేశం కోసం వేటూరి సుందర రామ్మూర్తి రచించిన కవితాత్మక వచనానికి, క్లిష్టమైన బాణీ కట్టారు ఇళయరాజా.

ఆ అమ్మాయి ఉన్న పరిస్థితులు, ఆమె నిరాశా నిస్పృహలు, అపనమ్మకం, విరక్తి... ఇవన్నీ గాయని గొంతులో ప్రతిఫలించాలి. ఆరంభంలో వచ్చే ఆలాపన, 'జీవిత వాహిని అలలై...' దగ్గర మొదలైన ఆవేశం 'పూల తీవెలో' దగ్గరకి వచ్చేసరికి ఆవేదనగా మారడం, 'నిన్నటి శరపంజరాలు..' చరణం పాడిన తీరు, ఒలికించిన విషాదం... ఒక్కటేమిటి? పాట మొత్తాన్ని చెప్పుకోవాల్సిందే.. నలభై ఐదేళ్ళ జానకి పాడిన 'వెన్నెల్లో గోదారి అందం..' పాట ఆమెకి జాతీయ అవార్డుని సంపాదించి పెట్టింది...


ఆమె ఓ కళాశాల అధ్యాపకురాలు. ఎక్కడ అన్యాయం కనిపించినా ప్రశ్నించడం ఆమె నైజం. ఆమెభర్త న్యాయవాది. కాకపొతే అతని తీరువేరు. న్యాయం అంటే కోర్టుకి మాత్రమే సంబంధించిన విషయం అతనికి. తన సహజ ధోరణిలో ఓ రౌడీని ఎదిరించి మాట్లాడింది ఆమె. ఆ రౌడీ అవమానంతో రగిలిపోయాడు. నడిరోడ్డు మీద ఆమెని వివస్త్రని చేశాడు. ఆమె భర్తతో సహా యావత్ ప్రపంచం కేవలం ప్రేక్షక పాత్ర పోషించింది ఆ క్షణంలో. ఓ వీధి రౌడీ చేతిలో అవమానింపబడిన భార్య తన ఇంట్లో ఉండడం తనకి అవమానం అనుకున్నాడు భర్త.

ఆమె రోడ్డు మీదకి నడిచింది. ఎప్పటిలాగే కాలేజీకి వెళ్ళింది. తరగతి గదిలో తను పాఠాలు చెప్పవలసిన బ్లాక్ బోర్డు మీద స్త్రీ నగ్నచిత్రాలు. మీసాలు, గెడ్డాలు మొలిచిన 'మగ' విద్యార్ధుల నుంచి అవహేళనలు. దారుణమైన అవమానం ఆమెకి. అంతకు మించిన ఆక్రోశం ఆమెలో.. తరగతి గదిలో ఒక్కో విద్యార్ధీ కాబోయే రౌడీలా కనిపించాడు ఆమెకి. బొమ్మలు గీసిన వాళ్ళకి ఘాటైన సమాధానం చెప్పింది, మాటలతో కాదు. ఒక పాటతో..

'ప్రతిఘటన' (1986) సినిమాలో ఈ సన్నివేశానికి పదికాలాల పాటు నిలబడిపోయే పాటని రాశారు వేటూరి సుందర రామ్మూర్తి. క్షణాల్లో బాణీ కట్టారు సంగీత దర్శకుడు చక్రవర్తి. అవమానాన్ని భరిస్తూ, అవహేళనని ప్రశ్నిస్తూ, అదే సమయంలో దారితప్పుతున్న యువతకి దిశా నిర్దేశం చేయాల్సిన పాట. గాయని మీద ఉన్న బాధ్యత చాలా పెద్దది. కథానాయిక భావసంచలనాన్ని ఆవాహన చేసుకుని, ఏమాత్రం సంయమనం కోల్పోకుండా ఆలపించాలీ పాటని.

నలభై ఏడేళ్ళ జానకి గొంతులో ఖంగున మోగింది 'ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో..' పాట. తుపాకీ గొట్టం చివరినుంచి పొగలు కక్కుతూ బయటికి వచ్చే గుళ్లని తలపిస్తాయి పదాలు. 'కన్న మహాపాపానికి ఆడది తల్లిగ మారి..' చరణం ఒక్కటి చాలేమో, జానకి మాత్రమే ఈ పాటని ఎందుకు పాడాలో.. పాట మొత్తానికి ఒకే వాక్యాన్ని ఎంచుకోమంటే, నేను చెప్పేది 'ప్రతి భారత సతిమానం.. చంద్రమతీ మాంగల్యం...' వేటూరి-జానకి ల నుంచి తప్ప మరొకరి నుంచి కనీసం ఊహించలేం.. 


ఆమె పదహారణాల తెలుగింటి అమ్మాయి. సంప్రదాయం నరనరాల్లోనూ జీర్ణించుకున్న తండ్రికి తనయ. తండ్రి ఉద్యోగ రీత్యా విదేశంలో స్థిరపడాల్సి వచ్చినా తలుగింటి కట్టునీ, బొట్టునే కాదు తెలుగు సంగీతాన్నీ మర్చిపోలేదు ఆమె. ఏదేశమేగినా తెలుగింటి అమ్మాయే తను. ఆమె ఇంటికి దగ్గరలో ఉన్న ఇద్దరు విదేశీ యువకులతో ఆమెకి స్నేహం మొదలైంది. వాళ్ళలో ఒకరు అమెరికన్, మరొకరు ఆఫ్రికన్.

ఉన్నట్టుండి ఒకరోజు యువకులిద్దరూ ఆమెని ప్రేమిస్తున్నామని చెప్పారు. ఇందుకు ఆమె నుంచి అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే ఆమె దృష్టిలో ప్రేమ, పెళ్లి అనేవి మనసుకి సంబంధించినవి, సంప్రదాయానికి సంబంధించినవి కానే కాదు. ఇంతకీ ఆ ఇద్దరిలో తను ఎవరిని ప్రేమిస్తున్నట్టు? ఇదీ ఆమె ముందున్న ప్రశ్న. పెద్దగా కష్ట పడక్కర్లేకుండానే ఆమెకి జవాబు దొరికేసింది. తను ప్రేమిస్తున్నది అమెరికన్ కుర్రాడినని. అతనిచ్చిన కానుకని తాకి చూడగానే, ఆరడుగుల అమెరికన్ కుర్రాడూ ఆమె కళ్ళకి బాలకృష్ణుడి లాగా కనిపించాడు.

సంప్రదాయాన్ని మరచిపోని అమ్మాయి కదూ.. అందుకే ఓ సంప్రదాయ కీర్తనలో ఆ అమెరికన్ బాలకృష్ణుడి లీలలని ఊహించుకుంది. 'పడమటి సంధ్యారాగం' (1987) లోని ఈ సన్నివేశం కోసం అన్నమాచార్య కీర్తనని ఉపయోగించుకున్నారు దర్శకుడు జంధ్యాల. సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కీర్తన సౌందర్యం ఏమాత్రం చెడని విధంగా, సినిమాకి తగినట్టు ఉండేలాగా స్వరాన్నిచ్చారు. బాలకృష్ణుడి చిలిపి చేష్టలని మధుర భక్తితో గానం చేయగలిగే గాయని కావాలి. ఆ గొంతులో ప్రేమ, భక్తి పారవశ్యాలకి రవ్వంత చిలిపిదనం మేళవించాలి.

నలభై ఎనిమిదేళ్ళ జానకి ఆలపించిన 'ముద్దుగారే యశోదా..' కళ్ళు మూసుకుని వింటుంటే, బాలకృష్ణుడు కళ్ళముందు ప్రత్యక్షం అవ్వడూ?? జానకి మేజిక్ తో పాటు, మిమిక్రీనీ వినాలి, పాట మధ్యలో... 


(ఇంకా ఉంది)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి