సోమవారం, జనవరి 09, 2012

ఉత్తరాంధ్ర యాత్ర-3

భుక్తాయాసంతో కారెక్కానేమో, కొంచం మగతగా అనిపించింది. ఆ వేళలో పట్టే కునుకుని 'కూటి కునుకు' అంటారట తూర్పున. నాకైతే ఆ కునుకేమీ రాలేదు. రోడ్డు పక్కన కనిపిస్తున్న ఒక్కో ఊరినీ చూస్తూ డ్రైవరుతో కబుర్లు మొదలు పెట్టాను. ఊళ్ళ పేర్లు చాలావరకు ఆయుర్వేద మూలికలని గుర్తు చేస్తున్నాయి. డ్రైవరు గోదారి జిల్లా వాడట. ఉపాధి వెతుక్కుంటూ విశాఖలో స్థిరపడ్డాడట. "మా జిల్లా నుంచి వలసలెక్కువ. గల్ఫ్ లో ఉన్న తెలుగు వాళ్ళలో మా జిల్లా వాళ్ళదే మెజారిటీ" అని నేనెంత మొత్తుకున్నా నమ్మని మిత్రులకి, ఇతన్ని ఉదాహరణగా చూపించాలని అనిపించింది.

'కథా నిలయం' చూడలేదన్న లోటుని మినహాయిస్తే, శ్రీకాకుళం టూరు అనుకున్నట్టే జరిగింది. కారు హైవే నుంచి విజయనగరం రోడ్డులోకి తిరిగిన కాసేపటికి 'డెంకాడ' బోర్డు కనిపించింది. "నేను డెంకాడ సూరిని. ఒంటి చేత్తో అడివి పందిని చంపిన వాడిని. ఈటె సూరి అంటారు నన్ను," అంటూ వీరబొబ్బిలికి తనని తాను దర్పంగా పరిచయం చేసుకున్న రాసబిడ్డ గుర్తొచ్చాడు. ఆవెంటనే ఆ పాత్రని సృష్టించిన అలమండ రాజుగోరు పంతంజలీ గుర్తొచ్చాడు. "అలమండ ఎలా వెళ్ళాలి?" అడిగాను డ్రైవరుని. ఉలిక్కిపడ్డాడతను. "వెళ్దాం" అంటానని అనుకున్నాడో ఏమో, "కొంచం ముందు కెళ్ళాక కుడేపుకి తిరగాలం"డని చెప్పాడు.

పతంజలి లేని అలమండని చూడాలని అనిపించలేదు. అదీకాక, ఆ రాజుల లోగిళ్ళన్నీ ఇప్పుడసలు ఉన్నాయో లేదో.. నా ఆలోచనలో నేనుండగానే, రోడ్డు పక్కన మురిక్కాలవలు, పందిపిల్లలూ కనిపించడం మొదలయ్యింది. గమ్యస్థానం సమీపిస్తున్నట్టుంది. "బుజ్జి బుజ్జి పందిపిల్లలు.. ఎంత ముద్దొస్తున్నాయో.." వినబడ్డ వ్యంగ్యాన్ని విననట్టు నటించా. సందడి సందడిగా ఉన్న బజారు వీధిలో కష్టపడి రోడ్డు క్రాస్ చేసి, పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నాం. సాయంకాలం కావడంతో గుడి బాగా రద్దీగా ఉంది. గుడి ఎదురుగా రెడీమేడ్ బట్టలు రాశులు పోసి అమ్ముతున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు పాలనని గురించి చదివింది గుర్తొచ్చి, నవ్వొచ్చింది.

"గురజాడ ఇల్లు" కారెక్కుతూ చెప్పాన్నేను. డ్రైవరు ముఖంలో ప్రశ్నార్ధకం. ఇద్దరు ముగ్గురిని అడిగి, రెండు మూడు వీధులు తిప్పి, గురజాడ వీధిలో కారు సర్రున పోనిస్తుండగా, బోర్డు చూసి "ఇదే..ఇదే.." అన్నాన్నేను. మిత్రులు చెప్పినట్టుగానే మంచి స్థితిలోనే ఉంది ఇల్లు. మరమ్మతులు చేసినట్టున్నారు. ఓ రీడింగ్ రూము నడుస్తోంది. పై అంతస్తుకి వెళ్లాం. తలుపులకి తాళాలు వేసి ఉన్నాయి. బాల్కనీ నుంచి చూస్తే కోట ఓ పక్కా, ఊరు మరో పక్కా కనిపిస్తున్నాయి. తాళాలు వేసిన గదుల్లో గురజాడ వాడిన వస్తువులని భద్రపరిచారేమో. మహాకవిని మన ప్రభుత్వం ఈమాత్రం పట్టించుకుందంటే అదే పదివేలనిపించింది. 'మధురా'న్ని మనసులోనే స్మరించుకున్నాను.


తరువాత వెళ్ళాల్సింది కోటకి. "లోపలేదో ప్రైవేటు స్కూలు పెట్టారట సార్. లోపలి వెళ్లనివ్వడం లేదు ఎవర్నీ," డ్రైవరు మాట లక్ష్య పెట్టలేదు నేను. గేటు దగ్గర ఆపిన సెక్యూరిటీ గార్డుని "లోపల చూడొచ్చా?" అని అడిగితే, ఆనందంగా గేటు తీశాడు. గజపతుల గత వైభవానికి గుర్తుగా, ఠీవిగా నిలబడ్డ కోటని చూడగానే, మళ్ళీ అదే భావన.. నాకు బాగా తెలిసిన ప్రాంతానికి వచ్చానని. నిజమే, ప్రభుత్వ కాలేజీతో పాటు, ఓ ప్రైవేటు స్కూలూ నడుస్తోంది కోట ప్రాంగణంలో. శిధిల సౌందర్యం అనలేను కానీ, ఒకప్పటితో పోలిస్తే వైభవం బాగా తగ్గిందన్నది ఒప్పుకుని తీరాల్సిన విషయం. కోట నుంచి బయటికి రావాలనిపించలేదు. కానీ, రాక తప్పదు కదా.

"అయ్య కోనేటికి తోవ ఇదే" అని చెప్పడానికి గిరీశం లేడక్కడ. కానైతే, కోట ముందు నిలబడి ఎవర్ని అడిగితే చెప్పరు కనుక? కోనేటి చుట్టూ కారుని ఓ ప్రదిక్షణ చేయించి, తూర్పు గట్టున ఆపాడు డ్రైవరు. ఎదురుగా ఆంజనేయస్వామి గుడి. బయటినుంచి చూడ్డానికి పాతకాలం ఆలయం లాగా ఉన్నా, లోపల మెరిసిపోతున్న పాలరాతి ఫ్లోరింగ్, కాంతివంతమైన లైట్లూ, చిన్న చిన్న కాగితాల మీద పెన్నుతో టిక్కులు పెట్టుకుంటూ హడావిడిగా ప్రదిక్షణలు చేస్తున్న మహిళలూ. అయ్యవారెందుకో అన్యమనస్కంగా ఉన్నారు. ఎవరితోనో కబుర్లు చెబుతూ పూజ కానిచ్చారు. మసక చీకటిలో అయ్య కోనేటి గట్టుని చూస్తుంటే ఎన్నో ఆలోచనలు.. ఎన్నెన్ని సాహితీ చర్చలకి వేదికై ఉంటుందో కదా ఈ ప్రదేశం అనిపించింది. విజీనారం మార్కు దోమలు విడవకుండా కుడుతుంటే, కార్లోకి లంఘించి "మహారాజా సంగీత కళాశాల" అని చెప్పా. "ఎవరూ ఇవి చూళ్ళేదండి," మరోసారి చెప్పాడు డ్రైవర్.

అప్పటికే బాగా చీకటి పడిపోయింది. శీతవేళ కదూ. అయ్యవార్లూ, పిల్లలూ పాఠాలు ముగించుకుని ఇళ్ళకు వెళ్ళిపోయినా, తాళం వేసి ఉన్న లోగిలినన్నా చూసి వెళ్ళాలన్నది మా ఆలోచన. ఆశ్చర్యం!! గేట్లు తెరచి ఉన్నాయి. నెమ్మదిగా లోపలి వెళ్లేసరికి, కనిపించిన దృశ్యం ఎంతటి సంతోషాన్ని ఇచ్చిందంటే, వర్ణించడానికి కూడా మాటల్లేవు. విశాలమైన ఆవరణలో, చెట్లకింద అనేక వృత్తాలుగా కూర్చున్న విద్యార్ధులు. ఒక్కో వృత్తమూ ఒక్కో సంగీతం తరగతి. ఇవి కాకుండా, పక్కనే ఉన్న క్లాసు రూముల్లో వీణ, వాయులీనం, తబలా పాఠాలు జరుగుతున్నాయి. గేటు బయటి రణగొణ ధ్వనులేవీ లోపలి రావడం లేదు. మా ఉనికి, వాళ్ళెవరి ఏకాగ్రతకీ భంగం కలిగించలేదు కూడా. ఋషుల్లా, తపస్వినుల్లా పాఠాల్లో లీనమైపోయారు వాళ్ళు.

తరగతి గదుల్లో ఘంటసాల, ద్వారం ఇంకా మరికొందరి ఫోటోలు బయటికి కనిపిస్తున్నాయి. మొత్తంగా ఓ రెండు మూడొందల మంది విద్యార్ధులు ఉండి ఉంటారు. సాధనలో కొందరు, చర్చల్లో కొందరు, వాద్యాల మరమ్మతులు నేర్చుకుంటూ మరికొందరు... గజపతుల కళాభిరుచికి మనసులోనే మరో మారు జోహార్ చెప్పుకున్నాను నేను. తదుపరి మజిలీ విశాఖే కావడంతో, చాలా సేపే గడిపాం ఆ ఆవరణలో. అప్పుడు కూడా కదలాలని అనిపించలేదు మాకు. కోట సెంటర్లో కాఫీ టిఫిన్లు కానిచ్చి కారెక్కుతుంటే, ప్రియమైన వారిని విడిచి వెళ్తున్న భావన. అయితే, మరి కాసేపట్లో ఓ మిత్రుడి నుంచి వచ్చిన ఫోన్ కాల్ నా మూడ్ మార్చేసింది. ఉన్నట్టుండి, "తూనీగా...తూనీగా.." అంటూ కూనిరాగం అందుకున్నా (ఇంకాఉంది).

14 కామెంట్‌లు:

  1. డెంకాడ మీదుగా వెళ్ళా రన్న మాట. నేను తెలుగు ఉపాధ్యాయునిగా ఆ డెంకాడ లోనే కొంత కాలం పని చేసాను. అక్కడే రిటైరయ్యాను. ఇప్పుడు భాగ్య నగరంలో నివాసం లెండి. మా విజీనారంలో అయ్య కోనేరు చుట్టూ ప్రదక్షణలు కొట్టే రన్న మాట. చదువు కొనే రోజుల్లో నేను పెద్ద ఆంజనేయ స్వామి గుడి ప్రక్కనే ఓ గదిలో అద్దెకి ఉండే వాడిని. కోట సెంటర్లో టిపినీ చేసారా ? ఆ సెంటర్ని ఆ రోజుల్లో కవులూ,రచయితలూ ముద్దుగా స్యారిస్ కార్నర్ అని పిలుచు కునే వాళ్ళం.నేనూ, మా కె.ఎన్.వై . పతంజలీ మొదటి సారి కలుసు కొన్నది అక్కడే. ఆ స్నేహం పతంజలితో కడదాకా కొన సాగింది. ఆయన పోయినప్పుడు నవ్య వార పత్రిక వాళ్ళు నాచేత పతంజలీ, నేనూ, ప్యారిస్ కార్నరూ అని రాయించి వేసారు. అతను మహా రాజా కళాశాలలో చదివే వాడు. నేను మా సంస్కృత కళాశాలలో చదివే వాడిని. మా కాలేజీ చూడ లేదూ ? పిలకాయల వేద ఘోష విని పరవశించి పోయే వారు కదా. అయోధ్యా మైదానం చూడ లేదూ ? గంట స్తంభం, హస్తబల్ హాల్ , వ్యాస నారాయణ మెట్ట గురించీ. పూల్ బాగ్ గురించీ తెలుసునా ?విజీనారంలో చా.సో గారి హవేలీ చూడ లేదూ. మా ఉత్తరాంధ్ర గురించీ, విజీనారం గురించీ మీరు రాస్తూ ఉంటే పులకరించి పోతున్నాను. అందుకే నా వ్యాఖ్యలో కూడా నా ముచ్చట్టు కలబోసీసు కొన్నాను.

    రిప్లయితొలగించండి
  2. మా ఊరిని మీ కళ్ళతో చూపినందుకు నెనర్లు మురళి గారు, ఇరవయ్యేళ్ళు ఉన్నా నెనెప్పుడూ సంగీత కళాశాలలోనికి అడుగుపెట్టిన పాపాన పోలేదు, ఈ సారి వెళ్ళినప్పుడు తప్పక చూసి రావాలి

    రిప్లయితొలగించండి
  3. ఔనండీ అంత దూరం వెళ్ళి బొబ్బిలి చూడకుండా వచ్చేసారే! అక్కడి వేణుగోపాలస్వామి బాగుంటాడు, అలాగే ఘంట్లాం వేంకటేశ్వరుడూను...
    నా మటుకు నేను బొబ్బిలి వేణుగోపాలస్వామి ప్రాంగణంలో నిల్చున్నప్పుడు ఇదే ప్రదేశంలో బొబ్బిలి యుద్ధం చిత్రీకరణ సమయంలో భానుమతి గారు నిల్చుని ఉంటారు అనే ఊహ కలిగి భలే సంతోషం వేసింది..

    రిప్లయితొలగించండి
  4. మాటల్లేవు.. మా ఊరు.. మా నేల.. ప్చ్! వేల మైళ్ళ దూరంలో ఉండి తలుచుకు నిట్టూర్చాల్సి వస్తున్నందుకు బాధగా.. మా ఊరు మిగుల్చుకున్న వైభవాన్ని అంత దూరం శ్రమకోర్చి వెళ్ళి చూసి, ఇంత అందంగా అక్షరాల్లో ఆ అనుభూతుల పరిమళాలను అందిస్తున్న మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ..

    "పందిపిల్లలూ.. ఇజీనారం మార్కు దోమలూ.." మావేటనీసుకోవు నెండి.. గాడిదిలు ఔపడ్నేదేటి బాపూ! :)

    రిప్లయితొలగించండి
  5. gurjaada gaaru nivaasamunnadi ijeenaaramaandee...sarva sidhdhi raayavaram anukunnaa...

    రిప్లయితొలగించండి
  6. మా విజీనగరంలో మీ అనుభవం గురించి ఇంత మంచిగా చెప్తారని ఊహించలేదు! :) బహుశా పైనుండి వచ్చేవాళ్ళకి బాగానే ఉందనిపిస్తుందేమో. అక్కడే పుట్టిపెరిగిన నాలాంటి వాళ్ళకి మాత్రం యిప్పటి ఊరి పరిస్థితి చెడ్డ బాధ కలిగిస్తుంది. కాలంతో పాటు మార్పు సహజమే కాని సుమారు ఒక అయిదారేళ్ళ క్రితం వరకూ ఆ మార్పు పెద్ద అసహజంగా కనిపించలేదు. గత కొన్నేళ్ళుగా మాత్రం రూపురేఖలు విపరీతంగా మారిపోయాయి. పెరిగిపోయిన రద్దీ, షాపులు, అపార్ట్‌మెంట్లు - ఎప్పుడు వెళ్ళినా నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి!
    మీరు కోటనుంచి ఐకోనేరుగట్టుకి వెళ్ళారంటే మా యింటి ముందునుండే వెళ్ళారన్న మాట! :)

    రిప్లయితొలగించండి
  7. మేము విజీనగరం లో పైడితల్లి గుడి , కోట గుమ్మం , సంగీత కళాశాల మాత్రమే చూసాము . ఐతే చాలా మిస్ అయ్యామన్నమాట .

    రిప్లయితొలగించండి
  8. బావుంది మురళి గారు ఈ భాగం కూడా ! జోగారావు గారి జ్ఞాపకాల తుట్టె కదిల్చినట్టున్నారు మీరు వారి వాఖ్య కూడా బావుంది !

    రిప్లయితొలగించండి
  9. "ఎవరూ ఇవి చూళ్ళేదండి," మరోసారి చెప్పాడు డ్రైవర్.
    super

    రిప్లయితొలగించండి
  10. మా ఊరెళ్ళారా, అచ్చంగా మా ఊరు.....నేనే వెళ్ళినంత ఆనందంగా ఉంది. నేనుండి ఉంటే మ ఐంట్లోనే ఆతిధ్యమిచ్చుండేదాని. ఓ రెండునెలల క్రితం వచ్చేరుకాదు. అయ్యకోనేరు గట్టుకి వెళ్ళారా? ఆంజనేయస్వామి గుడిపక్కన పెద్దిల్లు చూసారా...నా చిన్ననాటి జ్ఞాపకాలన్ని తిరుగాడే ఇల్లు.

    రిప్లయితొలగించండి
  11. మీతోపాటూ నేనూ అన్నీ తిరిగొచ్చేసానండీ మీ టపా చదువుతూ. మహరాజా కళాశాల చూసారా? నేను అక్కడే చదువుకున్నాను. గురజాడ ఇంట్లో ఆయన కూర్చుని కథలు రాసిన గది, ఆయన కుర్చీ, కళ్ళజోడు చూసారా? పెద్ద చెరువు చూడలేదా? ఏంటో ఎన్నో ఎన్నో ఏవో ఏవో గుర్తొస్తున్నాయి....హ్మ్ ఇజీనారం మా ఇజీనారం!

    రిప్లయితొలగించండి
  12. @పంతుల జోగారావు: అయ్యబాబోయ్.. చూడకుండా వదిలేసినవి ఎన్నో!! మరోసారి వెళ్ళాలి తప్పకుండా.. పతంజలి గురించి మీరు రాసిన వ్యాసం చదివానండీ.. ఆ పారిస్ కార్నర్ సెంటరు లోనే కాఫీ టిఫిన్లు.. నా టపా కన్నా కూడా మీ వ్యాఖ్య చాలా బాగుందండీ.. మనస్పూర్తిగా చెబుతున్నానీ మాట.. ధన్యవాదాలు.
    @సుభగ: జోగారావు గారి జాబితాని మీరు మరింత పెంచేస్తున్నారండీ.. బొబ్బిలి వెళ్ళాలనిపించింది.. వీణల తయారీ చూడొచ్చని.. ప్చ్ :( ఈసారి వెళ్ళినప్పుడు మీరు చెప్పినవి కూడా చూసి వస్తానండీ.. సంగీత కళాశాలకి తప్పక వెళ్ళండి.. ఓ మంచి అనుభవం.. ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: అయ్యో.. గాడిదలని మిస్సయ్యానండీ.. నాకసలే చాలా ఇష్టం కూడాను అవంటే.. శ్రమకోర్చి వెళ్ళడం కాదండీ, సరదాగా వెళ్లి చూసొచ్చాం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @ఎన్నెల: విజయనగరంలో ఉన్నారండీ.. కోటలో ఉద్యోగం చేశారు కూడా.. ధన్యవాదాలు.
    @భైరవభట్ల కామేశ్వర రావు: పట్టణం నుంచి నగరంగా మారుతున్నట్టు అనిపించిందండీ.. గతంతో పోల్చినప్పుడు ఇరుకిరుగ్గానే ఉంది.. రాజకీయ వాతావరణం కూడా వేడి వేడిగానే ఉన్నట్టుంది.. ఎక్కడ చూసినా బొత్స సత్తిబాబు నిలువెత్తు ఫ్లెక్సీలే.. ...ధన్యవాదాలు.
    @మాలాకుమార్: మేమూ పెద్దగా ఏమీ చూడలేదండీ, చూడకుండా వదిలేసినా వాటితో పోలిస్తే :( ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @శ్రావ్య వట్టికూటి: నిజం శ్రావ్య గారూ.. వారి వ్యాఖ్య చాలా బాగుంది.. ధన్యవాదాలు.
    @పక్కింటబ్బాయి: ధన్యవాదాలండీ..
    @ఆ.సౌమ్య: మీ ఆతిధ్యం మిస్సయ్యామన్న మాట!! ఆ పెద్దింట్లో ఎవరో ప్లీడరు గారు ఉంటున్నారండీ, బోర్డు చూశాను.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి