గురువారం, డిసెంబర్ 08, 2011

నేను తిరిగిన దారులు

కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు నేను రాసిందే మళ్ళీ చదువుతున్నానేమో అనిపించింది. కొన్ని అనుభవాలని చదువుతున్నప్పుడు అవన్నీ నాక్కలిగినవే అని పదే పదే గుర్తొచ్చింది. 'ఇంకా ఏమేం రాసి ఉండొచ్చు?' అన్న ఆసక్తి, ఆసాంతమూ పుస్తకాన్ని వదలకుండా చదివేలా చేసింది. పుస్తకం పేరు 'నేను తిరిగిన దారులు.' నదీనదాలూ, అడవులు, కొండలు అనేది ఉప శీర్షిక. రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు. ఇది ఒక యాత్రా చరిత్ర.

కవి, రచయిత, సాహితీ విమర్శకుడిగా పేరున్న చినవీరభద్రుడు ఓ నిరంతర ప్రయాణికుడు కూడా. ప్రదేశాలని చూడడం కన్నా, ప్రపంచాన్ని చూడడానికి ఇష్టపడే ప్రయాణికుడు. ("కారు అద్దం నుంచి ప్రదేశాలని మాత్రమే చూడగలం, ప్రపంచాన్ని కాదు" అంటుంది జానకి..) ఈ కారణం వల్లనే కావొచ్చు, బాగా తెలిసిన ప్రదేశాలని సైతం అతని కళ్ళతో చూసినప్పుడు ఓ కొత్త ప్రపంచం కనిపించింది.. వెంటాడింది... వెంటాడుతూనే ఉంది...

మొత్తం పుస్తకాన్ని యాత్రా కథనాలు, యాత్రానుభవాలు, యాత్రాలేఖలు అన్న మూడు విభాగాలుగా విభజించారు వీరభద్రుడు. వీటిలో యాత్రా కథనాల్లో కొంత కల్పననీ, నాటకీయతనీ జోడించగా, యాత్రానుభవాలని ఉన్నవి ఉన్నట్టుగా పంచుకున్నారు. యాత్రా లేఖలు విభాగంలో ఢిల్లీ పర్యటనలో ఉండగా ఇంటికి రాసిన ఉత్తరాలలో కొన్ని భాగాలని ప్రచురించారు. ఓ స్థలాన్నో, సంఘటననో చూసినప్పుడు ఆ క్షణంలో తనకి కలిగిన స్పందనని లేఖలుగా అక్షరబద్ధం చేశారు.

'అరకులోయ దారుల్లో..' 'శివ సాన్నిధ్య సుఖం' 'పాపికొండల నడుమ..' ఈ మూడూ యాత్రా కథనాలు. మూడూ కూడా ఇండియా టుడే పత్రికలో అచ్చయినవే. అరకులోయ చూడడానికి వెళ్ళిన మిత్ర బృందం, కేవలం ప్రకృతిని చూసి, ప్రేమలోపడి తిరిగి వచ్చేయకుండా, అక్కడి గిరిజనుల జీవితాలని గురించి తెలుసుకున్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. కలిసి భోజనం చేశారు. కష్టసుఖాలు మాట్లాడారు. అడవికి వెళ్ళడం "నా ఇంటికి నేనే అతిధిగా పోవడం లాంటిది" అంటారు రచయిత.



కేవలం శ్రీశైల శిఖరాన్ని దర్శించినంత మాత్రానే పునర్జన్మ ఉండదని ఓ నమ్మిక. మరి అంత గొప్ప శ్రీశైలంలో చూసి తీరవలసింది మల్లికార్జునుడి ఆలయం ఒక్కటేనా? దీనికి జవాబు 'కాదు' అని చెబుతుంది 'శివ సాన్నిధ్య సుఖం.' ఇక మూడో కథనం 'పాపికొండల నడుమ' గురించి ఎంత చెప్పినా తక్కువే. "పాపి కొండల్ని చూడడం ఒక అనుభవం. అవి వాల్మీకి వర్ణించినట్టుగా ఏనుగుల్లా ఉన్నాయనో, భూమిని చీల్చుకు వచ్చిన పర్వతాల్లా ఉన్నాయనో అనుకోవడంలో తృప్తి లేదు. వాటి ఉనికిలో భూమి ఆవిర్భావంలోని ఉద్వేగభరిత క్షణమేదో ఉంది. వాటి ఆకృతుల్లో అదృశ్య దైవ హృదయంలోని కాల్పనిక కౌశలమేదో ఉంది," లాంటి ఏ కొన్ని వాక్యాలనో మాత్రమే ప్రస్తావించి ఊరుకోవడం ఎంత కష్టం!!

యాత్రానుభవాల్లో ఇంగ్లండ్ యాత్రని గురించి సవివరంగా రాశారు వీరభద్రుడు. ఇది ముందుగా ప్లాన్ చేసుకుని రాసింది కావడం వల్ల ఓ పూర్తి స్థాయి ట్రావెలోగ్ అయ్యింది. గత వైభవాన్ని క్రమక్రమంగా కోల్పోతున్నా, ఆ గాంభీర్యాన్ని నిలుపుకోవడం కోసం బ్రిటన్ చేస్తున్న ప్రయత్నాలనీ, ఆ క్రమంలో ఎదురవుతున్న ఒడిదుడుకులనీ తనదైన దృష్టికోణంలో ఆవిష్కరించారు రచయిత. "నిస్సందేహంగా ఇది నా జీవితంలో గొప్ప యాత్ర. నా జీవితమంతా ప్రయాణాల్లో గడిచిపోయిన మాట నిజమే. కానీ ఈ యాత్రతో నేను ప్రపంచ పధికుణ్ణయ్యాను," అని ప్రకటించారు.

బృందావనంలో ఆరగించిన నవనీత ప్రసాదం రుచిని 'హే గోవింద హే గోపాల' వ్యాసంతో పంచి, గోదావరి జన్మస్థలాన్ని చూడబోతున్న సమయంలో తనకు కలిగిన వివశత్వాన్ని 'త్రయంబకం యజామహే' కథనంలో ఆవిష్కరించారు వీరభద్రుడు. చలం రచనలగురించీ, వాటితో తనకున్న అనుబంధాన్ని గురించి మాత్రమే కాక, రమణ మహర్షిని గురించి భారతీయ తాత్వికతని గురించీ వివరంగా రాశారు 'అరుణగిరి దర్శనం' వ్యాసంలో. శ్రావణ బెళగొళ, హళెబీడు, బేలూరుల్లో 'రాళ్ళలో చెక్కిన కావ్యాల'ని పరిచయం చేస్తూ "హళెబీడు మను చరిత్ర లాంటి కావ్యమైతే, బేలూరు వసుచరిత్ర లాంటిదంటాను," అన్నారు. యాత్రానుభావాల్లో చివరిదైన 'ఆదిమానవుడూ, పూర్ణమానవుడూ' ఒక లోతైన వ్యాసం.

ప్రయాణాలని ఇష్టపడే వారు తప్పక చదవాల్సిన ఈ పుస్తకం ఆద్యంతమూ ఆసక్తికరంగా చదివిస్తుంది. అనేక విషయాలని గురించి మన దృష్టి కోణాన్ని విశాలం చేసుకోడానికి పనికొచ్చే విశ్లేషణలు కథనాల్లో అంతర్భాగమయ్యాయి. "తమ చుట్టూ ఉండే మనుషుల గురించి ఆలోచించే మనుషులు భారత దేశానికి ఎక్కువ అవసరం" అంటారు రచయిత 'ఢిల్లీ నుంచి ఉత్తరాలు' లో. ఈ పుస్తకం చదివాక ప్రదేశాల గురించి మాత్రమే కాక, ప్రపంచాన్ని గురించి చిన్నగా అయినా ఓ ఆలోచన మొదలవుతుంది. దీనిని రచయిత విజయంగానే భావించాలి. ('శ్రీ' ప్రచురణలు, పేజీలు 208, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులూ. ...కవర్ డిజైన్ తో పాటు లోపలి స్కెచ్ లూ రచయిత వేసినవే కావడం విశేషం!)

12 కామెంట్‌లు:

  1. మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. చాలా మంచి పుస్తకం పరిచయం చేశారండీ.

    Thank you...

    రిప్లయితొలగించండి
  3. భలే...బావుంది! మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదములు. ఇది ఎక్కడ దొరుకుతున్నాది? పుస్తకాల షాపుల్లో లభ్యమవుతున్నాదా?

    రిప్లయితొలగించండి
  4. నేను తిరిగిన దారులు అంటే మీమీరు చిన్నప్పుడు ఆడుకున్న ప్రదేశాలేమో అనుకున్నాను :)
    పుస్తక పరిచయం బాగుంది .

    రిప్లయితొలగించండి
  5. పుస్తకం గురించి కాస్త చదవగానే నాకు చచ్చేట్టు నచ్చే పుస్తకమని అర్ధమైపోయింది. ఎంతైనా నెమలికన్ను మురళీగారిదీ నా టేస్టే అని గర్వంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరదేవిధంగా ముగించే ముందు మరో విన్నపం దయచేసి వ్రాయడం తగ్గించకండి.

    రిప్లయితొలగించండి
  6. నాదీ పక్కింటబ్బాయి మాటే.మా అభ్యర్ధన అంగీకరించమని ప్రార్ధన.

    రిప్లయితొలగించండి
  7. మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  8. @కొత్తావకాయ: ధన్యవాదాలండీ..
    @గీతిక: ధన్యవాదాలండీ..
    @ఆ.సౌమ్య: విశాలాంధ్ర లో దొరుకుతోందండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. @సుజాత: నిజమండీ.. ధన్యవాదాలు.
    @మాలాకుమార్: కాదండీ, నేను ఈమధ్యనే తిరిగిన వాటి గురించి ఇప్పుడు రాస్తున్నా :-) ధన్యవాదాలు.
    @శ్రీ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  10. @పక్కింటబ్బాయి: ఏమాత్రం వీలు చిక్కినా నేను రాయకుండా ఉండనండీ.. ఈమధ్య కూసింత బిజీ.. మళ్ళీ మొదలుపెట్టేశాను కదా :-) ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: తప్పకుండానండీ.. ధన్యవాదాలు.
    @జయ: మీక్కూడానండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి