మంగళవారం, నవంబర్ 01, 2011

ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం

చాన్నాళ్ళ తర్వాత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన పుస్తకం చదివాను. అది కూడా పుస్తకం మార్కెట్లోకి విడుదలైన మూడేళ్ళ తర్వాత. 'అంతర్ముఖం' తర్వాత యండమూరి పుస్తకాలేవీ చదవలేదు నేను. తను కూడా నవలలకి స్వస్తి చెప్పి విజయానికి మెట్లు కట్టే పనిలో బిజీ అవ్వడం, ఆ మెట్ల మీద నాకు పెద్దగా ఆసక్తి లేకపోవడంతో తనతో బాగా గ్యాప్ వచ్చేసింది. విఠల్ వెంకటేష్ కామత్ ఆత్మకథ 'ఇడ్లి, ఆర్కిడ్ అండ్ విల్ పవర్' కి యండమూరి స్వేచ్ఛానువాదం 'ఇడ్లి-వడ- ఆకాశం' పేరుతో విడుదలయ్యింది. మలి ముద్రణలో అదే పుస్తకం పేరుని 'ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం' గా మార్చారు, కామత్ కట్టిన ప్రముఖ ఐదు నక్షత్రాల హోటల్ 'ఆర్కిడ్' పేరు కలిసొచ్చేలాగా.

మహానగరాల్లో ఉండేవాళ్ళకి మాత్రమే కాదు, చుట్టం చూపుగా ఆ నగరాలని చూసొచ్చిన వాళ్లకి కూడా కామత్ హోటళ్ళని ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. పొగలు కక్కే ఇడ్డెన్లు, క్రిస్పీగా కనిపించే దోశలు, వీటితో పాటు కేవలం వాసన తోనే నోరూరించే సాంబార్ ఈ దక్షిణాది ఫలహార శాలల ప్రత్యేకత. ఈ హోటళ్ళని నిర్వహించేది కర్ణాటక లోని కార్వార్ ప్రాంతానికి చెందిన కామత్ కుటుంబం వారు. 'ఇడ్లీ-వడ-సాంబార్' అన్నది వీళ్ళ ముద్దుపేరు. రుచికరమైన ఫలహారాలని తాజాగానూ, అందరికీ అందుబాటు ధరల్లోనూ అందించడం కామత్ హోటళ్ళ విజయ రహస్యం. అలాంటి కామత్ కుటుంబంలో, ఆరుగురు పిల్లల తండ్రి వెంకటేష్ కామత్ రెండో కొడుకు విఠల్ వెంకటేష్ కామత్.

తండ్రి చిన్న చిన్న హోటళ్ళని నిర్వహించడాన్ని చూస్తూ పెరిగిన విఠల్ ఏనాడూ కూడా హోటల్ రంగంలో అడుగుపెట్టాలని అనుకోలేదు. అయితే ఇంజనీరింగ్ పూర్తి చేశాక అనుకోకుండా హోటల్ రంగంలోకి వచ్చి దానినే వృత్తిగా స్వీకరించాల్సి వచ్చింది. పెరిగిన వాతావరణం కారణంగా, హోటల్ నిర్వహణ కోసం ప్రత్యేకించి ఎలాంటి శిక్షణా తీసుకోవాల్సిన అవసరం రాలేదు అతనికి. నిజానికి, పెరిగిన వాతావరణం ఒక వ్యక్తి జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనడానికి విఠల్ జీవితం ఓ మంచి ఉదాహరణ. హిట్లర్ లాంటి తండ్రి, ప్రేమించే తల్లి, వీటిని మించి తమలో కలుపుకున్న ఇరుగూ-పొరుగూ, శ్రద్ధగా చదువు చెప్పిన గురువులు వీళ్ళంతా తన వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేసిందీ ప్రారంభ అధ్యాయాల్లో విపులంగా చెప్పారు విఠల్. వీళ్ళందరి సాహచర్యం అతనిలో కష్టపడే తత్వాన్నీ, నేర్చుకోవాలనే ఆసక్తినీ పెంచింది.

వ్యాపారంలో ప్రవేశించాక, విదేశాలు తిరిగి వృత్తికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవాలని అనుకున్నప్పుడు విఠల్ తన తండ్రిని అడిగింది ఒక్కటే. "లండన్ కి టిక్కట్ కొనివ్వండి చాలు. అక్కడినుంచి నేను చూసుకుంటాను." అది అహంభావం కాదు, ఆత్మవిశ్వాసం. ఆ తండ్రికి కొడుకు మీద ఉన్న నమ్మకం ఎంతటిదంటే కేవలం ప్రయాణపు టిక్కట్ మాత్రమే కొనిచ్చాడాయన. భారతీయ భోజనశాలల్లో పనిచేస్తూ, కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు డబ్బునీ సంపాదిస్తూ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం బొంబాయికి తిరిగి వచ్చాడు విఠల్. రాత్రికి రాత్రి ఓ సర్దార్జీకి లడ్డూలు చుట్టి ఇచ్చినా, విదేశీ టూరిస్టులకి పుచ్చకాయ ముక్కలూ, పానీయాలూ అందించినా వాటి వెనుక ఉన్న లక్ష్యాలు రెండే.. నేర్చుకోవడం, సంపాదించడం.

చేసే పనిని విపరీతంగా ప్రేమించే విఠల్ కేవలం పని రాక్షసుడు కాదు. ఓ మామూలు మనిషి. అందుకే హోటల్ పనితో విసుగు చెంది, ఓ మధ్యాహ్నం తండ్రికి అబద్ధం చెప్పి సినిమాకి వెళ్ళాడు. తన రెస్టారెంట్ కి క్రమం తప్పకుండా వచ్చే ఓ అందమైన అమ్మాయిని మనస్పూర్తిగా ప్రేమించాడు. ఆ ప్రేమని పైకి ప్రకటించక పోయినా ఆమెకి మంచే చేశాడు. తనకో జీవిత భాగస్వామిని వెతికే బాధ్యతని మాత్రం తల్లిదండ్రులకే అప్పగించాడు. వివాహానికి ముందే కాబోయే భాగస్వామి విద్యతో వృత్తిపట్ల తన కమిట్మెంట్నీ, తన షార్ట్ టెంపర్నీ ఏమాత్రం దాచకుండా చెప్పేశాడు. తన తల్లిలాగే భార్యదీ
కష్టపడే తత్వమనీ, నలుగురిలోనూ కలిసిపోయే స్వభావమనీ తొందరలోనే గ్రహించాడు.

తండ్రికి చెప్పకుండా బొంబాయి ఏర్పోర్ట్ సమీపంలో త్రీ స్టార్ హోటల్ కొన్నా, అత్యంత వ్యయప్రయాసలకోర్చి 'ఆర్కిడ్' ఫైవ్ స్టార్ హోటల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నా అవన్నీ తన మీద తనకున్న నమ్మకంతోనే. త్రీ స్టార్ హోటల్ ఎంతగా విజయవంతం అయ్యిందో, ఫైవ్ స్టార్ హోటల్ అంతగానూ ఇబ్బందులు పెట్టింది. కుటుంబంలో చీలిక రావడం, విఠల్ వాటాకి అప్పుడే పునాదులు తీసిన ఆర్కిడ్ తో పాటు తలకి మించిన అప్పులు మాత్రమే రావడం బాగా కుంగదీసింది అతన్ని. డబ్బు ఉండడానికీ, లేకపోవడానికీ తేడా అతి కొద్ది రోజుల్లోనే అర్ధమైనా తన సహజ లక్షణమైన నిజాయితీని ఏనాడూ విడిచిపెట్టలేదు. ఈ కారణంగా మనుషుల మనస్తత్వాలని మరింత బాగా తెలుసుకోవడం సులువయ్యింది. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకుని, అమలు పరిచే చివరి నిమిషంలో దానిని విరమించుకోవడం విఠల్ జీవితంలో ఓ పెద్ద మలుపు. నిజానికి పునర్జన్మ అనాలి.

కష్టాలు చుట్టుముట్టినప్పుడు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, భార్య అందించిన సహకారం ఇవన్నీ తన అదృష్టాలుగా చెప్పుకున్నారు విఠల్. తన తండ్రి హోటల్లో బల్లలు తుడిచే పనితో జీవితాన్ని మొదలు పెట్టిన బొంబాయి నగరంలో, ఆయనే చైర్మన్ గా నిర్మించిన ఆర్కిడ్ హోటల్ని ఆయనే చేతుల మీదుగానే ప్రారంభించాలన్న తన కలని, ఎన్నో కష్టనష్టాలకోర్చి విఠల్ నిజం చేసుకున్న క్షణాలని మనమూ మర్చిపోలేం. ఆద్యంతమూ ఆసక్తిగా చదివించిన కథనం. యండమూరి కేవలం మూల రచనని అనువదించి ఊరుకోకుండా తనదైన శైలిలో మార్పులూ, చేర్పులూ చేసినట్టుగా అనిపించింది. చివర్లో చదివిన ముందుమాటలో ఇదే మాట కనిపించింది. స్పూర్తివంతమైన రచన. (నవసాహితి ప్రచురణ, పేజీలు 176, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు). ఈ పుస్తకాన్ని చదవమని సూచించిన బ్లాగ్మిత్రులందరికీ కృతజ్ఞతలు.

15 కామెంట్‌లు:

  1. మలి ముద్రణలో పేరు సవరించారన్నది కొత్త విషయం! అవునా! బాగుంది. చదివిన పుస్తకమే అయినా మళ్ళీ చదవాలనిపించేలా విశ్లేషణ రాసినందుకు మీమీద "కాల చౌర్యం" కేసు పెట్టాలని ఉంది. నా సమయమంతా మీరు సూచించే పుస్తకాల వెనకే ఖర్చైపోతోంది మరి! మహా ఇష్టమైన కష్టం సర్! :)

    రిప్లయితొలగించండి
  2. నేను మొదటి ముద్రణే చదివా అండి.. చాలా బాగుంటుంది. రాత్రి పది గంటలకి మొదలు పెట్టాను. తెల్లవారుఝామున రెండు వరకూ చదువుతూ ఉండిపోయా.... మొత్తానికి పూర్తిచేసి కానీ వదలలేదు. అంత నచ్చింది ఈ పుస్తకం...

    రిప్లయితొలగించండి
  3. ఇడ్లీ , వడ , ఆకాశం కాలం లో నేను చదివాను మురళి గారు ! నాకు నచ్చింది ఈ పుస్తకం !

    రిప్లయితొలగించండి
  4. నేను కూడా మొదటి ముద్రణనే చదివానండి.దీనికి ఇడ్లీ-ఆర్కిడ్-ఆత్మవిశ్వాసం అని పేరు పెడితే ఇంకా బాగుండేదేమో అని నా ఉద్దేశ్యం.

    రిప్లయితొలగించండి
  5. హమ్మయ్య, మురళి గారు చదివిన ఇంకో పుస్తకం నేను చదివాను. ఈ పుస్తకం బాగానే ఉంది కాని, నాకు అంతగా నచ్చలేదు (అంటే, దాన్నీ నేను నా లైబ్రరీలో చేర్చలేదు). ఇక, పేరు, నాకెందుకో "ఇడ్లీ-వడ-ఆకాశం" ఏ నచ్చింది. మార్చకుండా ఉండాల్సింది.

    రిప్లయితొలగించండి
  6. నాకూ నచ్చింది ఈ పుస్తకం. ఎవరో pdf పంపితే ఏకబిగిన చదివి తర్వాత పుస్తకం కొనుక్కున్నాను.

    రిప్లయితొలగించండి
  7. మురళి గారు ఈ బుక్ మా ఇంట్లోకి ఎప్పుడో వచ్చింది గాని, నేనే చదవలేదు:(

    రిప్లయితొలగించండి
  8. రాత్రి పది గంటలకి మొదలు పెట్టాను. తెల్లవారుఝామున రెండు వరకూ చదువుతూ ఉండిపోయా....
    నా మాటా అదే దాదాపు అలానే రాత్రి ఎనిమిదింటికి మొదలుపెట్టి బుక్కులో బుక్కైపోయాను.

    రిప్లయితొలగించండి
  9. ఆత్మకథల జోలికి నేను సాధారణంగా వెళ్లను. వాటిలో ఉండే అతిశయోక్తులు, రాసినవారు తమని తాము గ్లోరిఫై చేసి చూపించుకునే ప్రయత్నాల వల్ల అవి నాకంతగా నచ్చవు. అలాంటిది, మూడేళ్ల క్రితం యండమూరి పేరు చూసి, ఆయన రచనలు చదవక చాలా ఏళ్ళైందన్న కారణంతోనూ, పుస్తకం పేరు భిన్నంగా ఉండటంతోనూ అదేంటో కూడా కనుక్కోకుండా కొనుక్కున్నా. ఇంటికొచ్చాక అదో ఆత్మకథకి అనువాదం అని తెలిసింది. కొన్నాను కాబట్టి పక్కన పడేయకుండా చదవటం మొదలెట్టాను. ఆత్మకథలకి దూరంగా ఉండటం మంచిదన్న నా పూర్వాభిప్రాయం గట్టిపడే రీతిలోనే కథనం సాగింది. విజయవంతమైన వ్యాపారస్థుడిగా ఎదిగే క్రమంలో విఠల్ కామత్ వివిధ దశల్లో ప్రదర్శించిన లౌక్యం ఆయన రచనలో కూడా అగుపించింది నాకు. నిఖార్సైన వ్యాపారస్థుల్లో ఉండే లక్షణం - తమ ఉత్పత్తుల్లో లోపాలు దాచిపెట్టి వాటి గొప్పదనాన్ని మాత్రమే ప్రచారం చేయటం. విఠల్ కామత్ తనని తాను ప్రపంచానికి ఆవిష్కరించిన వైనం సైతం అలాగే అనిపించింది. తన lateral thinking కి సాక్ష్యంగా ఆయన చెప్పిన 'మూడు గుంటల ఇడ్లీ పళ్లెం' ఉదాహరణ, దాన్ని తన మేధతో కనుగొన్నట్లుగా రాయటం, కామత్ హోటళ్ల వల్లనే అవి దేశమంతటా ప్రాచుర్యం పొందాయనటమూ దీనికి పరాకాష్ఠ (నేనెరిగి, మా తాతగారి కాలం నుండీ అటువంటి పళ్లాలు వాడుకలో ఉన్నాయి. హోటళ్లలో వాడకం ఆయన ప్రవేశ పెడితే పెట్టుండొచ్చు కానీ, తానే అటువంటి ప్లేట్లకి రూపకల్పన చేశాననటం అబద్ధం). ఆ దెబ్బతో ఆయన రాసిన ఇతర విషయాల మీద సైతం అనుమానాలు పొడసూపాయి. ఆ చాప్టర్‌తో పుస్తకాన్ని పక్కన పడేశాను. ఇదీ నా అనుభవం, ఇడ్లీ-వడ-ఆకాశంతో.

    ఎక్కువ శాతం ఆత్మకథలు రాసేవారి కోణంలోనే సాగుతాయి. తమపై ఇతరుల అభిప్రాయాలు సైతం నిజాయితీగా వివరిస్తే తప్ప ఏ ఆత్మకథకీ పరిపూర్ణత రాదు. ఆ అవకాశం ఎవరికి వారు రాసుకునే ఆత్మకథల్లో కన్నా, ఒకరి గురించి వేరొకరు రాసే జీవితకథల్లో ఎక్కువగా ఉంటుందని నా నమ్మకం. మొన్నీ మధ్యనే విడుదలైన స్టీవ్ జాబ్స్ (by Walter Isaacson) జీవితగాధ దీనికో మంచి ఉదాహరణ. జాబ్స్ గొప్పదనాన్ని ఎత్తి చూపిస్తూ అదే సమయంలో అతని లోపాల్నీ, దుర్గుణాల్నీ సైతం బయటపెట్టిన ఈ పుస్తకాన్ని వీలైతే చదవండి.

    రిప్లయితొలగించండి
  10. @కొత్తావకాయ: మెచ్చుకున్నారా, నొచ్చుకున్నారా అని సంశయం కలిగింది ఒక్క క్షణం!! మెచ్చుకోలుగానే స్వీకరిస్తూ, ధన్యవాదాలు :))
    @జాహ్నవి: అవునండీ... రీడబిలిటీ విషయంలో యండమూరి నవలలన్నింటిలాగానే.. ధన్యవాదాలు.
    @శ్రావ్య వట్టికూటి: నేను చాలా ఆలస్యంగా చదివాలెండి :)) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @విశ్వనాధ్: అవునండీ.. నిజమే.. ధన్యవాదాలు.
    @రూత్: హోటల్ పేరు రావాలని అలా మార్చి ఉంటారండీ బహుశా.. ధన్యవాదాలు.
    @సునీత: పర్లేదండీ.. నెమ్మదిగా చదవొచ్చు :)) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @కృష్ణప్రియ: పీడీఎఫ్ చదివాక మళ్ళీ పుస్తకం కొన్నారా? గ్రేట్ మీరు!! ..ధన్యవాదాలు.
    @జయ: పర్లేదండీ.. నెమ్మదిగా చదవొచ్చు.. ఆసాంతమూ చదివిస్తుంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @పక్కింటబ్బాయి: ఈ విషయంలో మాత్రం యండమూరిని మెచ్చుకోవాలండీ.. విషయం ఏదైనా ఏకబిగిన చదివిస్తాడు.. ధన్యవాదాలు.
    @అబ్రకదబ్ర: ఈ ఆత్మస్తుతి మహా మహా వాళ్ళ ఆత్మ కథల్లోనే తప్పలేదండీ.. అది అలా సహజంగా వచ్చేస్తుందేమో.. గుంటల పళ్ళెం విషయంలో మీరన్నది నిజం.. మీరు పుస్తకాన్ని పూర్తి చేసి ఉండాల్సిందేమో.. స్టీవ్ జాబ్స్ గురించిన పుస్తకం తప్పక చదువుతానండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. ప్రింటు పుస్తకం మరియు ఈ-పుస్తకం ఇప్పుడు కినిగెలో లభిస్తున్నాయి. http://kinige.com/kbook.php?id=1427&name=Idli+Orchid+Aakasam

    రిప్లయితొలగించండి