బుధవారం, అక్టోబర్ 12, 2011

అమ్మకి కోపం వస్తే..

ఇంట్లో అందరికీ మనమీద కోపం రావడం ఒక ఎత్తైతే, అమ్మకి కోపం రావడం మరో ఎత్తు. ఇంకెవరి కోపాన్నీ పెద్దగా పట్టించుకోక పోయినా పర్లేదు కానీ, అమ్మతో అలా కుదరదు. బోయినం మాట అటుంచి, మంచి నీళ్ళు కూడా సరిగా ముట్టవు. నాన్నకి కోపం వస్తే నాలుగు దెబ్బలు వేస్తారు. ఆ వెంటనే కోపం మర్చిపోతారు. కానీ అమ్మ అలా కాదు, ఏమీ అనదు కానీ అస్సలు మాటాడదు. మనం వెనక వెనకే తిరిగినా సరే అస్సలు మన వంక చూడనన్నా చూడదు.

అసలు అమ్మకి కోపం ఎందుకు వస్తుంది? మనం ఏదో ఒక పిచ్చి పని చేస్తేనే కదా?? 'వెర్రిదీ అమ్మేరా... పిచ్చిదాని కోపంరా..' అన్నాడు కదా ఓ సినిమా కవి. మనం తెలిసో తెలియకో చేసే పిచ్చి పనులు అమ్మకి మన మీద పిచ్చి కోపం రప్పిస్తాయన్న మాట. నాలుగు కొట్టాలనిపించినా గబుక్కున చేతులు రావు కదా, అందుకని ఏవీ అనకుండా ఊరుకుంటుంది. నాన్న మనల్ని కొట్టినా, మనం తనని చూడడం లేదనుకుని కళ్ళనీళ్ళు కక్కుకుని, అంతలోనే చెంగుతో తుడిచేసుకుంటుంది.

ఓసారేవయ్యిందంటే, అమ్మతో పాటూ శ్రావణమాసం పేరంటానికి వెళ్లాను. ఆ పేరంటానికి రాజ్యంగారమ్మాయి కొత్త చీర కట్టుకుని వచ్చింది. అందరూ ఆ చీరని ఒకటే మెచ్చుకోవడం. ఇంతలో నేను చేసిన ఓ పొరపాటు వల్ల ఆ చీరమీద మరక పడింది. చిన్న మరకే అయిన కొత్త చీర కదా, పైగా ఆ అమ్మాయి మొదటిసారి చీర కట్టుకుంది కూడాను, పేరంటానికి వచ్చిన అందరూ 'అయ్యో పాపం' అనడవే. ఏం చెయ్యాలో తెలీక నేను ఇంటికెళ్ళిపోయాను. తర్వాత కాసేపటికి అమ్మొచ్చింది. ఏవీ మాటాడలేదు.. ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడు రోజులు.

అది మొదలు అమ్మకి చాలా సార్లే కోపం వచ్చింది నా మీద. ఎక్కువగా అల్లరి చేసినప్పుడూ, ఆటల్లో దెబ్బలు తిని వచ్చినప్పుడూ, బళ్ళో మేష్టారు నామీద కోప్పడ్డప్పుడూ, బామ్మ గట్టిగా గసిరినప్పుడూ, పరీక్షల్లో మంచి మార్కులు రానప్పుడూ ఇలా.. ఒక్కోసారి అమ్మకి నామీద ఎందుకు కోపం వచ్చిందో కూడా తెలిసేది కాదు. కోపం వచ్చినదని మాత్రం తన ముఖం చూడగానే తెలిసిపోయేది.. కారణం తర్వాతెప్పుడో తెలిసేది. నేను అల్లరేక్కువ చేస్తున్నానో, ఇంకోటనో ఎవరన్నా అమ్మకి చెప్పినా అమ్మకి నామీదే కోపం వచ్చేసేది మరి.

నేను బడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఎప్పటిలాగా నవ్వుతూ ఎదుర్రాకుండా ముఖం గంటు పెట్టుకుని తన పన్లు తను చేసుకుంటోందంటే అమ్మకి నామీద కోపం వచ్చేసినట్టే. ఇంక నేనెంత వెంటబడి మాటాడినా విననట్టు నటిస్తుంది. నాకేవీ పనులు చెప్పదు. నేను చెయ్యబోయినా చెయ్యనివ్వదు. మొదట్లో అమ్మకి కోపం వస్తే నాకు భయం, బాధా వచ్చేసేవి కానీ, రాన్రాను అమ్మ కోపం పోగెట్టే ఉపాయం తెలిసిపోయింది. ఏవీలేదు, అమ్మకి కోపం రాగానే అన్నం ఎప్పుడూ తినేంత కాకుండా కొంచమే తినడం.

మొత్తం మానేస్తే నాన్న తంతారు కానీ, ఆకల్లేదు అని కొంచం తిని ఊరుకుంటే ఏవీ అనలేరు కదా. ఈ ఉపాయం మాత్రం బ్రహ్మాండంగా పనిచేసింది. ఓ పూటో రోజో చూసి అమ్మ వెంటనే మాటాడేసేది. తర్వాతేవో మంచి మాటలు చెప్పేది. నేను బుద్ధిగా వినేవాడిని. మళ్ళీ కథ మామూలే. అమ్మ కోపం కబుర్లు ఇలా ఉంటే, మన బ్లాగు లోకపు అమ్మ గూగులమ్మకి నా మీద కోపం వచ్చిందివాళ. ఉదయానే నన్ను మెయిల్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డగించి ఏదో ప్రశ్న అడిగింది, నా మూడ్ బాగోక ఓ తిక్క జవాబు చెప్పాను. అంతే.. దారి మూసేసింది.

చేసేది ఏముంది? ఇంతకాలం nemalikannu@gmail.com గా ఉన్న నా చిరునామా nemalikannumurali@gmail.com గా మారింది. ఎంతైనా అమ్మ అమ్మే.. గూగులమ్మ అమ్మ అవుతుందా? మనం అలిగినా పట్టించుకుంటుందా??

15 కామెంట్‌లు:

  1. గూగులమ్మని ఇక్కడ కొంచం బతిమాలండి

    http://mail.google.com/support/bin/topic.py?topic=1669055

    రిప్లయితొలగించండి
  2. హహహ బావుంది, అమ్మ కి గూగలమ్మ కి లింక్ పెట్టారా!

    మా అమ్మ కి కూడా కోపం వస్తే మాట్లేదేది కాదు మూణ్ణాల్రోజులు. మొహానికి గంటుపెట్టుకునే తిరిగేది. బతిమలైనా, బామాలినా లాభం లేదు. కోపం కాస్త తగ్గాక కరుణీంచేది. తరువాత కురిపించే ప్రేమని మాటల్లో కొలవలేము.

    ఇప్పుడీ గూగలమ్మ నామీద ఎప్పుడు అలుగుంతో అని భయంగా ఉంది మీరంతా ఇలా చెబుతుంటే ( ఇంతకుముందు ఒక నలుగురైదుగురు ఇదే మాట చెప్పారులెండి).

    రిప్లయితొలగించండి
  3. బాగుంది మీ టపా! మా ఇంట్లో ఇలా కాదుగా అమ్మకి కోపం వచ్చిందన్న మొఖం చూస్తే నేను బిక్కమొహం పెట్టడమో లేదా నాకే కోపం వచ్చినట్టు నటించి మాట్లాడకుండా మూతి ముడుచుకుని కుర్చుంటా. చూసి చూసి అమ్మే వచ్చి ఏమయింది? ఎందుకలా ఉన్నావ్ అని మాట్లాడేస్తుంది! నిజమే మనం తిండి మీద అలగాగానే మనమీదున్న అలక తప్పక తగ్గుతుంది!

    రిప్లయితొలగించండి
  4. అబ్బా అదా కథ. ఏం చేస్తాం నాకూ అలాగే జరిగింది. ఎన్నాళ్లగానో ఉపయోగించిన అక్కౌంట్లు పోతే బాధే లెండి. కొత్త జీమెయిల్ అక్కౌంటు ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  5. అమ్మకి గూగలమ్మకి లింక్ బాగుంది. :-)
    మీ బజ్ ప్రొఫైల్ పోయినట్టుంది కదా మళ్లీ వస్తుందేమో లెండి వెనక్కి.

    రిప్లయితొలగించండి
  6. అమ్మకీ, గూగులమ్మ కీ పోలిక బాగుంది. :)

    స్వీయ అనుభవం వల్ల తెలుసుకున్న సంగతేమిటంటే, అమ్మ ఇంకా వెర్రిదే. పిల్లలు మాత్రం గడుగ్గాయిల్లా తయారయ్యారు.

    రిప్లయితొలగించండి
  7. brahmaandangaa undi postu..amma kopam gurinchi inta kante baagaa elaa cheppagalam!!!!

    రిప్లయితొలగించండి
  8. :) మంచి పోలిక.చాలా రోజులకి వచ్చాను. నెమ్మది గా చదవాలి చాలా మిస్సయి ఉంటాను.

    రిప్లయితొలగించండి
  9. @శ్రీ: అన్ని ప్రయత్నాలూ అయ్యాయండీ.. రిట్రైవ్ అవుతుందేమో చూడాలి.. ధన్యవాదాలు..
    @ఆ.సౌమ్య: అబ్బే.. గూగులమ్మ కోపం ముందు అమ్మ కోపం యెంత చెప్పండి?!! కోపం రాకుండానే చూసుకోండి.. ధన్యవాదాలు.
    @ రసజ్ఞ: రివర్స్ గేర్ అన్నమాట.. మొత్తానికి పనవ్వడం కావాలి.. అంతే కదండీ :-) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @శశికళ: ధన్యవాదాలండీ..
    @పక్కింటబ్బాయి: అవునండీ, అదే కథ :-) ..ధన్యవాదాలు.
    @పద్మవల్లి: బజ్జు ఇక లేనట్టేనండీ.. ప్లస్సులో ప్రయత్నించాలి ఇంక.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @తొలకరి: ధన్యవాదాలండీ..
    @కొత్తావకాయ: స్వీయానుభవాన్ని మించింది లేదంటారు కదండీ.. ధన్యవాదాలు.
    @ఎన్నెల: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  12. @కృష్ణప్రియ: ఈమధ్య పెద్దగా రాయలేదండీ.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: ధన్యవాదాలండీ

    రిప్లయితొలగించండి