కొన్ని కథలు ఆసాంతమూ ఉత్కంఠ భరితంగా చదివిస్తాయి. మరికొన్ని చివర్లో వచ్చే ఒక ఊహించని మలుపుతో మెరిపిస్తాయి.. ఇంకొన్ని చదువరుల చేత చిరు దరహాసాలు కురిపిస్తాయి. మొత్తం నలభై కథల సంకలనాన్ని గురించి మూడు మాటల్లో చెప్పాలంటే అందుకు సరిగ్గా సరిపోయే మూడు మాటలు ఇవి. 'మానస' కలం పేరుతో ఉన్నవ హర గోపాల్ అరవై-ఎనభై దశకాల మధ్య రాసిన కథలను 'మదర్పిత... తాంబూలాది' పేరిట సంకలనంగా వెలువరించారు. ఆయనే రాసిన 'నవ్వినా కన్నీళ్ళే..' నవల ఈ సంకలనం లో బోనస్.
తొలికథ 'మదర్పిత... తాంబూలాది' నే పుస్తకం శీర్షిక గా ఉంచారు మానస. మూర్తి పని చేసే కంపెనీ ఎండీ గారమ్మాయి పెళ్లి. మూర్తి భార్య సుజాత కి ఆయన మావయ్య వరస. ఆ పెళ్ళికి మూడు రోజులు సెలవు పెట్టమని భర్తని బలవంతం చేస్తుంది సుజాత. మూర్తి మొహమాట పడుతుండగానే, ఆఫీసులో మేనేజరు కి విషయం తెలిసి, ఎండీ గారు మూర్తి పేరిట పంపిన శుభలేఖ ని అతని చేతిలో పెట్టి లీవు శాంక్షన్ చేసేస్తాడు. పెళ్ళికి వెళ్ళిన మూర్తి తో యెంతో సాదరంగా మాట్లాడతారు ఎండీ గారూ, ఆయన బంధువులూ. 'మన సుజాత వాళ్ళాయన' అంటూ మర్యాద చేసేస్తారు.
ఇంక పెళ్ళిలో హడావిడి అంతా సుజాతదే. ఎండీ గారి భార్యకి ఏం కావలసినా మొదట పిలిచేది సుజాతనే. ఎండీ గారి తమ్ముడైతే మూర్తిని అస్సలు వదిలి పెట్టడు.. వాళ్ళిద్దరూ చదరంగం ఆడుతూనే ఉంటారు, ఓ పక్క పెళ్లవుతున్నా. ఎండీ గారి సింప్లిసిటీ కి మూర్తి ముచ్చట పడుతుండగానే పెళ్లయిపోతుంది. పెళ్లికూతురితో పాటు సుజాతనీ, మూర్తినీ వెళ్ళిరమ్మని మూర్తిని రిక్వెస్టు చేస్తాడాయన. అనుకోకుండా ఎండీ గారు, వాళ్ళ తమ్ముడి సంభాషణ వింటాడు మూర్తి. అసలు సుజాత వాళ్ళకి ఎలా బంధువు? అని చర్చించుకుంటూ ఉంటారు వాళ్ళు.
"మనం వైజాగ్ లో ఉన్నప్పుడు మన పక్కింట్లో ఉండే వాళ్లండీ.. అప్పుడది చిన్నపిల్ల.. మావయ్యా మావయ్యా అంటూ మీ చుట్టూ తిరిగేది.. గుర్తు లేదూ' అంటుంది ఆవిడ. మూర్తి తన ఆఫీసులోనే ఒక క్లర్కని తెలిసి హతాశుడవుతాడు ఎండీ గారు. ఆయన తమ్ముడిదీ అదే పరిస్థితి. తర్వాత ఏం జరిగిందనేది మర్చిపోలేని ముగింపు. అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక మెతుకు చూస్తే చాలని కుక్కర్లు పుట్టక ముందు పుట్టిన ఒక సామెత. అలా కథల పుస్తకం లో కథలు ఎలా ఉండబోతున్నాయో ఒక కథ చదవగానే కొంతవరకూ అర్ధమవుతుంది కదా..
కథలన్నీ దాదాపు మధ్యతరగతి మందహాసాలే. యద్దనపూడి సులోచనారాణి నవలల్లో శీను, మామి పాత్రల్లా, మానస కథల్లో సుజాతో, మూర్తో, ఒక్కోసారి ఇద్దరూ కలిసో మనకి తప్పక ఎదురు పడతారు. చాలా కథల్లో కథాంశం మానవత్వం.. మనుషుల్లో అది తగ్గిపోతుండడం వల్ల జరుగుతున్న పరిణామాలు. కాలేజీ ఎన్నికలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, స్టార్ హోటళ్ళ సంస్కృతి, సంప్రదాయాలను వదులుకోడానికి ఇష్టపడని పెద్దలు, వాళ్ళని ఎదిరించలేక నలిగిపోయే పిల్లలు.. ఇలా కథలన్నీ మన కళ్ళ ముందు జరిగినట్టు అనిపిస్తాయి.
ఒకే రచయిత కథలతో వచ్చిన సంకలనాలలో ప్రతి కథా అద్భుతంగా ఉండడం అన్నది చాలా అరుదైన విషయం.. అలాగే ఈ సంకలనం లోనూ కొన్ని సాధారణ కథలూ ఉన్నాయి. అప్పటికే బాగా నలిగిన సబ్జక్టుని కథగా మలచినా కొసమెరుపు తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు రచయిత. రచనా శైలి రచయిత మన ఎదురుగా కూర్చుని కథ చెబుతున్నట్టుగా ఉంటుంది. వర్ణనలు అవీ ఏమీ లేకుండా సూటిగా కథ చెప్పేస్తారు. 'ట్విస్ట్' అంతే రచయితకి ఇష్టమని అనిపిస్తుంది, చాలా కథల్లో కొసమెరుపు చూసినప్పుడు.
మొత్తం సంకలనం చదవడం పూర్తి చేయగానే ఒక సందేహం తప్పక వేధిస్తుంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు తనకెదురైన ప్రతి అంశాన్నీ సమర్ధవంతంగా కథలుగా మలచిన రచయిత ఆ తర్వాత ఉన్నట్టుండి అస్త్ర సన్యాసం ఎలా చేయగలిగారా? అని. ఇప్పుడింక ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేశారు కాబట్టి మానస మళ్ళీ రాయడం మొదలు పెడితే బాగుంటుంది. ('మదర్పిత... తాంబూలాది,' రచన, ప్రచురణ: మానస, పేజీలు:422, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
good intro..
రిప్లయితొలగించండిఅన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక మెతుకు చూస్తే చాలని కుక్కర్లు పుట్టక ముందు పుట్టిన ఒక సామెత.:) :)ఒక్క టపా చదివితే చాలు మరి !
రిప్లయితొలగించండిఈయన లైబ్రరీ దొంగతనానికి వచ్చే వాళ్ళందరు చేతులెత్తండర్రా.. నాకు కుళ్ళొచ్చేస్తోది.. ఇన్ని పుస్తకాలేంటి ఈ టపాలేంటీ.. బావుందండి కధ. చదవాలనిపిస్తోంది మధ్యతరగతి ఆ మందహాసం..
రిప్లయితొలగించండిభావన గారు నేను లైన్ లో మొదట ఉంటాను :-) మురళి గారు చాలా బాగారాశారు.
రిప్లయితొలగించండి@ భావన గారు నేనెప్పుడో రెడీ ....
రిప్లయితొలగించండిఆ టైటిలు కథ ఎక్కడో చదివినట్టుందండీ.
రిప్లయితొలగించండిఎవరెవరో వచ్చి, ఏవేవో కథా సంకలనాలు వేస్తుంటారు, దేనిలో చూసినా, అదే కుటుంబరావు, అదే బుచ్చి బాబు, లేకపోతే అదే ఖదీర్ బాబు, అదే కుప్పిలి పద్మ.
ఈ మానసగారిలాగా సాధారణ మానవ జీవితాన్ని అసాధారణ కోణాల్లోంచి చూపే కథకులు, పెద్దగా పేరు రాకుండా అలాగే మిగిలి పోతుంటారు.
మంచి పరిచయం.
@తృష్ణ : ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@పరిమళం: అంతేనంటారా?? :):) ..ధన్యవాదాలు
@భావన: అబ్బే.. వస్తే మిగిలేది నిరాశేనండీ.. పెద్దగా ఏమీ దొరకవు.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: కాళ్ళ నొప్పులు మాత్రమే మిగులుతాయండీ, లైన్లో నిలబడ్డం వల్ల :):) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పరిమళం: మీక్కూడా అంతే.. :):)
@చంచం : మీ పేరు భలేగా ఉందండీ.. కథ మొదటిసారి వచ్చినప్పుడు చదివారేమో.. ధన్యవాదాలు.
టపా చాలా బాగుంది మురళిగారూ..ఇదే పుస్తకం గురించి మొన్న ఈనాడు ఆదివారం పుస్తకం లో సమీక్ష రాశారు..చూశారాండి?
రిప్లయితొలగించండిమురళిగారు, మీ లైబ్రరీ గురించి మాకు గొడవెందుకు గాని, మీరే రోజూ ఒక కథ ఇలా చెప్పేస్తూ పోతే పోలా! ఒకవేళ మీ లైబ్రరీ దొంగతనానికి అనుమతిస్తే మాత్రం, నన్నుకూడా క్యూ లో ఉండనీయండి. ప్లీజ్...ప్లీజ్.
రిప్లయితొలగించండి@ప్రణీత స్వాతి: చూశానండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జయ:ఇదేదో బాగుందండీ.. కానీ రోజూ ఒక కథ గురించి రాయడం అంటే.. అన్ని పుస్తకాలు లేవు మరి :( ..ధన్యవాదాలు.