రెండు రోజుల్లో బాలల దినోత్సవం వచ్చేస్తోంది. మన నాయకులకి నెహ్రూనీ, ఆయన వారసులనీ ఘనంగానూ, పిల్లలని కంటి తుడుపుగానూ తల్చుకోడానికి ఓ అవకాశం వస్తోంది. బొత్తిగా పిల్లలకోసం ప్రభుత్వం ఏమీ చేయడం లేదని జనం అనుకోకుండా పిల్లల కోసమని రాష్ట్ర రాజధానిలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం జరపడానికి ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. మరి ఆ సినిమాలు చూడడానికి అవకాశం లేని పిల్లల కోసం ప్రభుత్వం ఏమీ చేయనట్టే కదా.. అని అడక్కూడదు. ఆరోజు స్కూళ్ళకి సెలవు ఇస్తోంది.. ఇంకేం కావాలి??
అసలు పిల్లల కోసం ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే పిల్లలే భవిష్యత్తు కాబట్టి. మన ఇంటికైనా, మన దేశానికైనా భవిషత్తు పిల్లలే కదా. మరి పిల్లల కోసం ఆలోచించడం అంతే రేపటి రోజు కోసం ఆలోచించడమే కదా? మన పిల్లలకోసం మనం ఆలోచిస్తున్నట్టే, మొత్తం అందరు పిల్లల గురించీ ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా మరి? ఆలోచించడం అంతే, 'బడి బాట' 'మళ్ళీ బడికి' లాంటి పేరు గొప్ప ప్రోగ్రాములు ప్రకటించి ఊరుకోవడమేనా? వాటి అమలు సంగతి పట్టించుకోవాలా, వద్దా?
అక్షరాస్యత లాంటి విషయాల్లో వెనుకబడిఉన్న ఆంధ్ర దేశం, బాలకార్మికుల సంఖ్య విషయంలో మాత్రం ముందుంది. చవకగా దొరికే కూలీలు, చెప్పిన పని కిమ్మనకుండా చేస్తారు, ఇచ్చింది పుచ్చుకుంటారు, పెద్దల యందు ఉండే భయం వల్ల జాగ్రత్తగా పని చేస్తారు.. ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి కాబట్టే కాబోలు పొలాల్లోనూ, ఫ్యాక్టరీల్లోనూ, చివరికి ఇళ్ళలో కూడా చిన్న పిల్లలు పని చేస్తూ కనిపిస్తారు. పిల్లలు పని చేస్తున్నారు అంటే, కేవలం వయసుకు మించి శ్రమ పడుతున్నారు అని మాత్రమే కాదు.. భవిష్యత్తు అనేది లేకుండా చేసేసుకుంటున్నారు కూడా. చదువనేదే లేకపోవడం వల్ల వాళ్లకి ఎప్పటికీ కూలి పని తప్ప మరో ప్రత్యామ్నాయం దొరకదు కదా..
బాలకార్మిక వ్యవస్థని రూపుమాపడం కోసం ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు ఎందుకు విజయవంతం కావడం లేదు? రెండు కారణాలు కనిపిస్తాయి. పథక రచనలో పొరపాట్ల కారణంగా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనిపిస్తుంది. పిల్లలు పనికి వెళ్లడానికి మూల కారణం పేదరికం. తల్లిదండ్రుల సంపాదన కుటుంబం గడవడానికి సరిపోకపోవడం. ఇంకొంచం లోతుకి వెళ్తే తండ్రి సంపాదన తాగుడుకి పోగా, కేవలం తల్లి సంపాదనతోనే కుటుంబం గడవాల్సి రావడం. అసలు జబ్బుకి చికిత్స చేయకుండా పైపైన మందు పూయడం వల్ల రోగం పూర్తిగా తగ్గదు కదా. పోనీ ఆ మందైనా సక్రమంగా పూస్తున్నారా అంటే, పథకాల అమలులో వైఫల్యాలు బోల్డన్ని కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడా జవాబుదారీ తనం కనిపించదు.
ప్రతి విషయానికీ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చోవడమేనా? మనం ఏమీ చేయలేమా?? కచ్చితంగా చేయగలం. పనిమనిషి పిల్లలు వాళ్ళమ్మ వెనుక వచ్చి మనింట్లో పని చేయకుండా మనం ఆపగలం. మన వీధి చివర టీకొట్లో చిన్న పిల్లాడు టీలు అందిస్తుంటే, అతన్ని మానిపించే వరకూ ఆ కొట్టుకి రానని చెప్పగలం. ఏదైనా షాపులో చిన్న పిల్లలని పనిలో చూస్తే, ఆ యజమానితో మాటకలిపి మాటల మధ్యలో పిల్లలని పనిలో పెట్టుకుంటే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు పెడతారని చెప్పగలం. పని మానేసిన పిల్లలు బడికి వెళ్తూ ఉంటే వాళ్ళని ప్రోత్సహించగలం. వీటన్నింటితో పాటు ప్రభుత్వం చేత పని చేయించడానికి ఏదైనా మార్గమూ ఆలోచించగలం. ఇదంతా స్వార్ధానికి అతీతంగా కాదు.. రేపటి రోజు బాగుండాలనే స్వార్ధం తోనే..
మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం "భాలకార్మికులు తగ్గారు"చాల వరకు వృత్తివిద్య ల వైపు చూస్తున్నారు .మన వంతు సహాయం చిన్న మాట చాలు ,కనీసం మార్గాలు నిర్దేశించే వారులేక అక్కడితోనే ఆగిపోతున్నారు .ఆలోచించే టాపిక్ రాసారు .
రిప్లయితొలగించండిమీ ఆవేదన సమంజసమే! పేదరికం ఒక కారణం, మరోటి ఈ చదువులు పొట్ట నింపవన్న నమ్మకం ఆ పేద ప్రజల్లో గాఢంగా ఉండటం. ఉన్నత చదువులు చదివినంత మాత్రాన ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం లేదు. చదువు కేవలం పొట్ట నింపుకోటానికేనా? ఙ్ఞానాన్ని పొందడానికి అని మాత్రం అనకండి. వాళ్ళకు సంబంధించినంత వరకు ఏ పని చేసినా ఆకలి తీరడమే మొదటి ప్రాధాన్యం. మన దిక్కుమాలిన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేవరకు ఎన్ని చట్టాలు తెచ్చినా పసిజీవితాలు వసి వాడుతూనే ఉంటాయి.
రిప్లయితొలగించండిమురళిగారు బాలకార్మికవ్యవస్థను గురించి మాట్లేడటప్పుడూ అందరికీ ముందు గుర్తొచ్చేవి ఫాక్టరీలు, వ్యవసాయకూలీలు అలాగే ఇళ్లల్లో పనిచేసేవారు.
రిప్లయితొలగించండిఇంతకంటే దారుణమైన విషయం ఏవిటంటే మనదేశానికే తలమానికమైన విద్యాసంస్థలు ఐఐటీలు,ఐఐఎంల నుంచి రోడ్డుపక్కన పాకల్లో ఉన్న ఇంజనీరింగు కాలేజీలదాకా అన్ని కాంటీన్లలోనూ, మెస్సుల్లోనూ వాళ్లు కనిపిస్తారు. ఐఐటీ కాన్పూరు హాల్ఫోర్ నుంచి ప్రతి ఒక్క విద్యాసంస్థలో నాకళ్లతో చూసిన నిజం.
పిల్లలను ఇంట్లో పనివాళ్ళగా పెట్టుకునేవాళ్ళలో పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు ఉన్నారంటేనే ఈ సమస్య పై సమాజపు దృస్టి ఎంతవరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు.
రిప్లయితొలగించండిపాపం..పనితో పాటు వేదింపులు ఆ పిల్లలకు అదనం...మంచి అంశాన్ని సృశించారు. చివరిలో చెప్పిన మాటలు ఆచరణయోగ్యం...
చిన్న చిన్న పిల్లల్ని వాళ్ల అమ్మలే పనిలో పెడుతుంటే ...వాళ్ళైతే చెప్పినట్టు వింటారని పనిలో పెట్టుకునే విద్యావంతులూ మా చుట్టూ ఉన్నారు . ప్చ్ ... నిస్సహాయంగా చూస్తుండటం తప్ప ఏం చెయ్యలేక పోతున్నాం! నావరకు నేను మాఇంట్లో పెట్టుకోకుండా ఉండగలను కానీ మిగతా వాళ్ళమీద కంప్లైంట్ ఇద్దామన్నా ...ఒకచోట ఉండేవాళ్ళం అపార్ధాలు వస్తాయేమో అన్న సంశయంతో తలతిప్పుకు వెళ్లిపోవాల్సివస్తోందండీ....బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్మూలించబడాలంటే ముందుగా వాళ్ల తల్లితండ్రులకు కౌన్సిలింగ్ చేయాలి .ఆతర్వాత వారిని పనిలో పెట్టుకోమని నిక్కచ్చిగా వ్యవహరించాలి .అలాగే మనం ఒక్కరం బెదిరించినా కొట్టువాళ్ళు పిల్లల్ని పనిలోపెట్టుకోడం మానరు .అటువంటి చైతన్యం అందర్లోనూ రావాలి.కనీసం ప్రభుత్వం మామూలు చదువుతో పాటూ ,రెండోపూట వారికేవైనా వృత్తి విద్యా శిక్షణ వంటివి ఇప్పించినా భవిష్యత్తుపట్ల భరోసాతో పనుల్లో పెట్టకుండా ఉంటారేమో !
రిప్లయితొలగించండిమంచి టాపిక్ రాశారు మురళి గారు !
నా దృష్టిలో "పిల్లలే పండుగ"
రిప్లయితొలగించండిబాల కార్మికుల గురించి మరో మాట.
ఏదైనా చిన్న కాఫీ హోటలుకి వెళ్ళి చూడండి.
కొంతమంది మూర్ఖులు సప్లయి చేసే పిల్లలమీద అది బాగోలేదు, ఇది బాగోలేదు అని దాదాగిరి చేస్తుంటారు.
ఒకోసారి చెయ్యి కూడా చేసుకుంటారు.
అదే సప్లయిర్ పెద్దవాళ్ళయితే అలా తిట్టగలరా?
వాళ్ళ సొంత పిల్లలని అలాగే చూస్తారా?
@చిన్ని: నిజమేనండీ.. పిల్లలతో పాటు పెద్ద వాళ్లకి కూడా గైడెన్స్ అవసరం.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జీవని: చదువుకోవడం వాళ్ళ కొంత మెరుగైన జీవితం ఉంటుంది.. కొన్ని అవకాశాలు లభిస్తాయి అన్న హామీ అవసరమండీ.. నిరక్షరాస్యులే కాదు, కాస్తో కూస్తో అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా పిల్లల్ని పనికి పంపడానికే మొగ్గు చూపుతున్నారు.. వ్యవస్థలో రాత్రికి రాత్రి మార్పులు జరగుతాయని ఆశించలేమండీ.. కానీ మన వంతుగా చేయగల పనులు కూడా ఉన్నాయి.. వాటి మీద దృష్టి సారించడం మేలేమో అని నా అభిప్రాయం.. ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: నిజం అండీ.. కార్పోరేట్ కాలేజీల హాస్టళ్ళ లోనూ మెస్ లలోనూ పనిచేస్తూ కనిపించేది పసివాళ్ళే.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: మనవంతు ప్రయత్నం అనేది ప్రతీ సమస్యకీ యెంతో కొంత ఉంటుంది కదండీ.. ఎవర్నో తిట్టుకుంటూ కూర్చునే బదులు, యెంతో కొంత చేయడం మంచిది కదా.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పరిమళం: ఎవరో ఒకరు మాట్లాడడం మొదలు పెట్టాలి కదండీ.. తగువు పెట్టుకునే ధోరణిలోనే మాట్లాడనవసరం లేదండీ.. స్నేహపూర్వక సంభాషణల్లోనే ఇండైరేక్ట్ గా కూడా ప్రస్తావించొచ్చు కదా.. ధన్యవాదాలు.
@బోనగిరి: నిజం అండీ.. పైగా ఈ పిల్లలు దొంగలే అని కొందరు ప్రబుద్ధుల నమ్మకం.. ప్చ్.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
మురళి గారు, మీరు చెప్పింది నిజమే. ఎంత ప్రయత్నించినా, బాల కార్మికుల సంఖ్య పెద్దగా తగ్గిందేమి లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా లాభం లేదు. మనుషుల్లో మార్పు రావాలి. చిన్నపిల్లల ప్రగతికి ఇంక ఎన్నో ప్రయత్నాలు చేయాల్సే ఉంది.
రిప్లయితొలగించండిచివరి పేరాలో రాసిన విషయాలు చాలా నచ్చాయి. నిజమే మనందరం మనపరిధిలో ప్రయత్నించాలి.
రిప్లయితొలగించండిఇక్కడ నేను రాయాలనుకున్నవి చాలా మంది రాసేసారండీ...ఇంకేం లేదు రాయటానికి..:)
రిప్లయితొలగించండికానీ ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో వెళ్లారెమో అని ఒక చిన్న సందేహం కలిగింది...లేక ఇంకా విపులంగా రాయాల్సిందేమో మరి...
@జయ: నిజమేనండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: అవునండీ.. ధన్యవాదాలు.
@తృష్ణ: అలా అంటారా? మీరు చెప్పిన యాంగిల్లో మళ్ళీ చదువుతానని ఒకసారి.. బహుశా సబ్జెక్టు కి ఉన్న విస్తృతి వల్ల కావచ్చు.. ధన్యవాదాలు.