శనివారం, మే 04, 2019

మజిలీ

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఆమె తండ్రి వాళ్ళ ప్రేమకి అడ్డుపడ్డాడు. ఆమె ఉన్నట్టుండి అతని జీవితం నుంచి మాయమైపోయింది. ఆమె జ్ఞాపకాల్లో అతడు దాదాపు పిచ్చివాడైపోయాడు. ఎప్పటినుంచో అతన్ని మూగగా ప్రేమిస్తున్న ఇంకో అమ్మాయి అతన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంది. భార్యగా అతని జీవితంలో ప్రవేశించింది. అతని గతాన్ని, తనపట్ల అతని నిరాదరణనీ కూడా అంగీకరించింది. ఉందోలేదో తెలియని ప్రేయసిపై అతడి ప్రేమ, అతని లవ్ ఫైల్యూర్ ని భరిస్తున్న ఆమె ప్రేమ - ఈ రెండింటిలో ఏ ప్రేమ గెలిచిందన్నదే 'మజిలీ' సినిమా.

ఇంకోలా చెప్పాలంటే, 'సాగర సంగమం' కథానాయకుడు బాలూ డాన్సర్ కాక క్రికెటర్ అయి ఉంటే, మాధవి మీద అతడి ప్రేమ తెలిసీ మరో స్త్రీ అతని జీవితంలో ప్రవేశించి, బాలూ మనసు మారడం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఏం జరిగి ఉండేదన్న ఊహాజనిత ప్రశ్నకి జవాబు 'మజిలీ' సినిమా. మిగిలిన ఏ విషయాల్లోనూ పోలిక కుదరదు కానీ, స్టోరీలైన్ మాత్రం అలనాటి విశ్వనాధ్-కమల్-జయప్రద-ఇళయరాజాల క్లాసిక్ ని గుర్తుచేసి తీరుతుంది, 'శైలజ' ప్రవర్తనతో సహా.

వైజాగ్ కుర్రాడు పూర్ణ (అక్కినేని నాగచైతన్య) రైల్వే టికెట్ కలెక్టర్ జగన్నాధరావు (రావు రమేష్) గారబ్బాయి. ఐటీఐ చదువుతూ, క్రికెట్ ని లక్ష్యంగా ఎంచుకుని స్థానిక టీమ్ లో ప్రవేశం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. క్రికెట్ ఆడే అవకాశం, అన్షు (దివ్యాంశ కౌశిక్) తో పరిచయం ఒకేసారి జరుగుతాయి. కుర్రాడు క్రికెట్లో దూసుకుపోవడం, అన్షుతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోవడం కూడా సమాంతరంగా జరుగుతున్న తరుణంలో, నేవీలో పనిచేసే అన్షు తండ్రికి వీళ్ళ ప్రేమకథ తెలిసి, ఆమెని దూరంగా తీసుకుపోతాడు. 

స్థానిక రాజకీయాల కారణంగా క్రికెట్ టీం లో చోటు దొరకదు పూర్ణకి. దీంతో అప్పటివరకూ క్లీన్ షేవ్ తో ఉన్నవాడు కాస్తా గడ్డం పెంచుకుని తాగుబోతైపోతాడు. ఎప్పటికైనా అన్షుని కలుసుకోడం మాత్రమే అతని జీవిత లక్ష్యం ఇప్పుడు. పూర్ణ సంగతులు పూర్తిగా తెలిసిన ఎదురింటి అమ్మాయి, రైల్వేలో బుకింగ్ క్లర్క్ గా పనిచేస్తున్న శ్రావణి (సమంత రూత్ ప్రభు) అతన్ని తప్ప మరొకర్ని పెళ్లిచేసుకోనని పంతం పట్టి మరీ అతని జీవితంలోకి ప్రవేస్తుంది. అతను తనని ఏమాత్రమూ పట్టించుకోకపోయినా, పూర్ణ మీద ఈగ వాలనివ్వదు. తన తల్లిదండ్రులతోనూ, మావగారితోనూ పోట్లాడి మరీ అతన్ని వెనకేసుకొస్తూ ఉంటుంది.

ఈ నేపథ్యంలో పూర్ణ, అన్షు తండ్రిని కలుసుకోడవం, ఏం జరిగిందో తెలుసుకోవడంతో పాటు, అతడు తనకి అప్పగించిన బాధ్యతని తీసుకోవడం, ఆ బాధ్యత నెరవేర్చడానికి శ్రావణి తన వంతు సాయం చేయడం తర్వాతి కథ. ఇంతకీ, ఆ 'సాయం' పూర్ణ-శ్రావణి లని దగ్గర చేసిందా అన్నది ముగింపు. శ్రావణి అనే ఐడియలిస్టిక్ పాత్ర ఈ సినిమా విజయానికి దోహదం చేసిందన్నది ఒప్పుకోవాల్సిన విషయం. బాయ్ ఫ్రెండ్/భర్తకి ఓ అభిమాన కథానాయిక ఉండడాన్ని కూడా జీర్ణించుకోలేని 'పొసెసివ్' అమ్మాయిలున్న కాలంలో, దర్శకరచయిత శివ నిర్వాణ శ్రావణి పాత్రతో రావడం, కమర్షియల్ గా మంచి తెలివైన ఆలోచన అని చెప్పాలి. శ్రావణిగా సమంత రెండో సగం అంతా తానై సినిమాని నిలబెట్టింది.

నాగచైతన్య చాలాచోట్ల తన తాత నాగేశ్వరరావు ని గుర్తు చేశాడు. క్లీన్ షేవ్ తో కన్నా, గెడ్డంతోనే బావున్నాడు. రావు రమేష్, పోసాని, సుబ్బరాజులవి పూర్తి నిడివి పాత్రలు. వీళ్ళతో పాటు, హీరో ఫ్రెండ్స్ గా వేసిన కుర్రాళ్ళూ బాగా చేశారు. సినిమాలో చాలాభాగం విశాఖపట్నంలోనే షూట్ చేశారు. అయితే, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తీసినప్పుడు లొకేషన్ల ఎంపికలో మరికొంచం జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది అనిపించింది. తమన్-గోపీ సుందర్ ల సంగీతం పర్లేదు. ఒక హాంటింగ్ ట్యూన్ ఉంటే మరింత బాగుండేది. హాస్యాన్ని కథలో భాగం చేసి, బరువైన సన్నివేశాలకి ముందూ వెనుకా ఒకట్రెండు నవ్వించే సీన్స్ వచ్చేలా జాగ్రత్త పడ్డం వల్ల ప్రేక్షకుల మీద మరీ ఎక్కువ బరువు పడలేదు. మొత్తంగా చూసినప్పుడు, చూడాల్సిన సినిమా ఇది.

7 కామెంట్‌లు:

  1. మొత్తానికి 'సాగరసంగమం' పోలికని మీరూ ఖరారు చేశారన్నమాట. నేను సినిమా చూడలేదు కానీ మీ సమీక్ష చదువుతూంటే 'మేఘసందేశం'లో జయసుధ కూడా గుర్తొచ్చిందెందుకో! సాహిత్యంలో 'నాయిక'లని అభిమానించే మీకో ప్రశ్న. జీర్ణించుకోలేని 'పొసెసివ్అమ్మాయిలే’ ఎందుకుంటారంటారు? :)

    రిప్లయితొలగించండి
  2. పొజెసివ్‌నెస్ అనేది ప్రేమకి లిట్మస్ టెస్ట్ కదా ? ఈరోజుల్లో పొజెసివ్ అమ్మాయిలు(దాదాపుగా) లేరండీ.

    https://youtu.be/2Sk2SQKYPW0

    రిప్లయితొలగించండి
  3. మేం మిస్సైన ఇంకో మంచి సినిమాలా వుంది. ఏ OTT లోనో వస్తే తప్పక చూస్తాము. పరిచయం చేసిన మీకు థాంక్స్!

    రిప్లయితొలగించండి
  4. చూస్తున్నంత సేపూ ఎందుకో సాగర సంగమం గుర్తొస్తూనే ఉంది, అందులో నాట్యం, ఇందులో క్రికెట్ అనుకున్నా.

    రిప్లయితొలగించండి
  5. @కొత్తావకాయ: చిక్కుప్రశ్నే. బహుశా అమ్మాయిలు మాత్రమే జవాబు చెప్పే ప్రశ్న అనుకుంటానండీ.. ధన్యవాదాలు.
    @నీహారిక: 'అసూయ అసలైన ప్రేమకి ధర్మామీటర్' అంటారైతే.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  6. @లలిత టీఎస్: చూడొచ్చండీ, అక్కడక్కడా కొంచం సాగతీత ఉన్నప్పటికీ.. ధన్యవాదాలు
    @మాధవ్: నాకూ అలాగే అనిపించినండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  7. మేమూ చూసామండీ వైజాగ్ లో రిలీజయినప్పుడు, సమంత నటన బావుంది ఆమెలాగే.(అవునూ ఈ మధ్యన నాకెందుకు మెయిల్స్ రావట్లేదు మీరు పోస్ట్ వేసినప్పుడల్లా మెయిల్ లో వచ్చేవి ఇదివరకు)

    రిప్లయితొలగించండి