సినిమా హాల్ నుంచి బయటికి రాగానే నేను చేసిన మొదటి
పని 'ఈ సినిమాకి ఎడిటర్ నిజంగా అక్కినేని శ్రీకర్ ప్రసాదేనా, నేనేమన్నా
పొరబడ్డానా?' అని చెక్ చేసుకోవడం. ఎడిటింగ్ విభాగంలో జాతీయ స్థాయి
అవార్డులు అందుకున్న ఒక ఎడిటర్ పని చేసిన సినిమాకి 'నిడివి' సమస్య కావడం
అన్నది చాలా ఆశ్చర్య పరిచే విషయం. కానీ, మణిరత్నం తాజా సినిమా 'చెలియా'
విషయంలో జరిగింది అదే. మొదటి సగంలో కొద్దిగానూ, రెండో సగంలో బాగానూ
సినిమాను సాగతీస్తున్నారన్న భావన కలగడం. దీనితో పాటు మరికొన్ని ఇబ్బందిగా
అనిపించిన విషయాలూ, బోల్డన్ని నచ్చేసిన సంగతులూ ఉన్న 'చెలియా' మణిరత్నం
మార్కు ప్రేమకథ.
కథ కార్గిల్ యుద్ధానికి కొన్ని నెలల
ముందుది. భారత వాయుసేనలో పనిచేసే వీసీ (కార్తీ) సాహసం, తెగింపు ఉన్న
యువకుడు. తనమాటే నెగ్గాలన్న పంతం సరేసరి. అదంతా తాను చేస్తున్న వృత్తి
కారణంగా వ్యక్తిత్వంలో వచ్చిన మార్పు అంటాడతను. అతను పనిచేస్తున్న శ్రీనగర్
లో ఆర్మీ హాస్పిటల్ లో డాక్టర్ గా చేరుతుంది లీలా అబ్రహాం (అదితీరావు
హైదరీ). ఆమె మిలటరీ కల్నల్ కి మనవరాలు, క్రిమినల్ లాయర్ కి కూతురు. అన్న
రవి వాయుసేనలో పనిచేస్తూ, విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోతాడు. ఆమె పన్నెండో
తరగతి చదువుతుండగా జరిగిన ఈ సంఘటన లీలని ఆర్మీ హాస్పిటల్ లో ఉద్యోగంలో
చేరేలా పురిగొల్పుతుంది.
వీసీ తన స్నేహితురాలితో షికారుకు
వెళ్ళినప్పుడు జరిగిన ఓ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడడంతో దూరంగా ఉన్న
ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్ కి కాకుండా దగ్గరలో ఉన్న ఆర్మీ హాస్పిటల్ లో
చేరుస్తారు. లీల మొదటి పేషెంట్ అతడే. బలమైన వ్యక్తిత్వం, స్వతంత్ర భావాలూ
ఉన్న అమ్మాయి లీల. తనపై మరొకరి పెత్తనాన్ని ఏమాత్రం సహించలేదు. అయితే వీసీ
ఇందుకు పూర్తిగా విరుద్ధం. తనవాళ్లంతా తాను చెప్పిన మాట విని తీరాల్సిందే
అన్నది అతని పంతం. భావజాలాల మధ్య ఘర్షణ వీసీ-లీలల ప్రేమని పెళ్లి పీటలు
ఎక్కనివ్వదు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వీసీ పాకిస్తాన్ సైనికులకు
బందీగా దొరుకుతాడు. జైల్లో అతని పశ్చాత్తాపం మొదలవుతుంది. ఆమెనికలిసి
క్షమాపణ కోరాలంటే, దుర్భేద్యమైన జైలు నుంచి బయట పడాలి. ఆపై ఆమెని వెతకాలి.
కార్గిల్
యుద్ధం అనే నేపధ్యాన్ని మినహాయించుకుంటే ఇదో మామూలు ప్రేమకథ. ప్రధాన
పాత్రలు రెండూ కూడా మణిరత్నం మార్కు చట్రాల్లో ఉన్నవీ, నిన్నమొన్నటి 'ఓకే బంగారం' తో సహా అనేక సినిమాల్లో చూసేసినవీను. హీరో పట్టుదలకీ, హీరోయిన్
వ్యక్తిత్వానికీ మధ్య జరిగే సంఘర్షణ మొదలు, వాళ్ళిద్దరి మధ్యా జరిగే
ప్రి-మారిటల్ సెక్స్ వరకూ అదే మూసలో ఉంటాయి సన్నివేశాలు కూడా. తెలుగు కన్నా
తెరమీద పాత్రలు ఇంగ్లీష్, హిందీ, తమిళంలో ఎక్కువగా మాట్లాడతాయి. హాలీవుడ్
సినిమా 'ది షశాంక్ రిడంప్షన్' స్పూర్తితో తీసినట్టు అనిపించే హీరో జైలు
బ్రేక్ దృశ్యాలు, అనంతర సన్నివేశాలు ఎంతబాగున్నప్పటికీ, అప్పటికే
ప్రేక్షకుడికి మొదలైన సాగతీత భావనలో పడి కొట్టుకుపోతాయి.
బాగున్నవి
ఏమీ లేవా అంటే, మొదట చెప్పుకోవాల్సింది రవి వర్మన్ ఫోటోగ్రఫీ, కథానాయిక
అదితీరావు హైదరీ, ఏఆర్ రెహ్మాన్ అందించిన నేపధ్య సంగీతం. కాశ్మీర్ అందాలని
కెమెరా ఒడిసిపట్టిన తీరు చాలాబాగుంది. చాలా ఫ్రేములు అందమైన గ్రీటింగ్
కార్డులని తలపించాయి. ఇక, రెండో సగం నడుస్తూ ఉండగా ప్రేక్షకులు బయటికి
వెళ్లిపోకుండా ఆపిన ఏకైక శక్తి కథానాయిక. అందం-నటన ఒకదానితో ఒకటి పోటీ పడడం
అంటే ఏమిటో తెలియాలంటే ఈ సినిమాలో అదితిని చూడాలి. రొమాంటిక్
సన్నివేశాల్లోనూ, ఎమోషనల్ సన్నివేశాల్లోనూ హీరోని డామినేట్ చేసిందనే
చెప్పాలి. నావరకు నాకు 'సాగర సంగమం' లో జయప్రద గుర్తొచ్చింది. ఒకానొక
సన్నివేశంలో ఓ క్లోజప్ షాట్లో ఆమె రోమాంచితం కావడాన్ని చిత్రించారు
దర్శకుడు, కెమెరామన్!
రవివర్మన్ కి కార్తీకి పాత కక్షలు
ఏమన్నా ఉన్నాయేమో తెలీదు కానీ, చాలా సన్నివేశాల్లో, మరీ ముఖ్యంగా క్లోజప్
షాట్లలో కార్తీ చాలా పేలవంగా కనిపించాడు. అతను అందంగా కనిపించిన ఫ్రేములు
బహు తక్కువ. నటన విషయానికి వస్తే, అక్కడక్కడా 'అపరిచితుడు' లో విక్రమ్ ని
అనుకరిస్తున్నాడేమో అన్న అనుమానం కలిగింది కూడా. రెండు గంటల ఇరవై ఆరు
నిమిషాల నిడివిలో ఓ ఇరవై నిమిషాలు కత్తిరించి ఉంటే, ప్రేక్షకులు థియేటర్
నుంచి బరువుగా కాక హాయిగా బయటికి వచ్చేవాళ్ళు. ద్వితీయార్ధంలో ముఖ్యమైన
సన్నివేశాలతో పాటు, క్లైమాక్స్ తాలూకు ఎమోషన్ నీ సినిమా నిడివి తినేసింది.
ఇందుకు దర్శకుడితో పాటు ఎడిటర్ కూడా బాధ్యుడే కదా. అందుకే, ఎడిటర్ టైటిల్
కార్డుని పొరబడ్డానా అని సందేహం కలిగింది నాకు.
ఇటీవల కాలంలో వచ్చిన మణిరత్నం సినిమాలు చూడాలంటే ఒకటి-రెండు సార్లు ఆలోచించేలా వుంటున్నాయి. ఈ 'చెలియా' కూడా online లో వూరికే దొరికితే తప్పకుండా చూస్తాను :)
రిప్లయితొలగించండిమంచి రివ్యూ చేసారు మురళి గారూ.. మనసుకు హత్తుకునే మీదైనా శైలిలో..
రిప్లయితొలగించండిగుడ్. కీప్ ఇట్ అప్...
-భాస్కర్ కూరపాటి.
ఫస్ట్ హాఫ్ చూసాక పర్లేదు అనుకున్నా, సెకండాఫ్ మొదలయ్యాక అభిప్రాయం మారిపోయింది. పాకిస్థాన్ నుండి ఇండియా వచ్చే ఎపిసోడ్లో ఎమోషన్ మిస్ అయినట్టనిపించింది. ఇంత ఈజీనా అనిపించేలా చేసారు
రిప్లయితొలగించండి@లలిత టీఎస్: బహుశా త్వరలోనే దొరికేస్తుందేమోనండీ.. ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@భాస్కర్: ధన్యవాదాలండీ
@మురళీధర్ నామాల: అవునండీ, లవ్ ఎపిసోడ్ మీద పెట్టిన శ్రద్ధ మిగిలిన వాటిమీద కూడా పెట్టి ఉంటే బాగుండేది. అన్నట్టు ఆ తప్పించుకునే ఎపిసోడ్ మొత్తం కాపీ అని ఓ కొత్త వివాదం మొదలైంది కూడా.. ధన్యవాదాలు..