తెలుగునాట తొలితరం సంఘ సంఘ సంస్కర్తల్లో ఒకరు
చిలకమర్తి లక్ష్మీ నరసింహం (1867-1946). కందుకూరి వీరేశలింగం అనుయాయిగా
సంస్కరణోద్యమంలో పాల్గొన్న చిలకమర్తి కవి, నవలా, నాటక రచయిత కూడా. గోదావరి
జిల్లాలో (తర్వాత పశ్చిమ గోదావరి అయ్యింది) ఓ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో
జన్మించి, స్కూల్ ఫైనల్ వరకూ చదువుకుని, ఉపాధ్యాయ శిక్షణ పొంది, తొలుత
ఉపాధ్యాయుడిగా అటుపై పాఠశాల నిర్వాహకుడిగా జీవిక సాగిస్తూనే సంఘ సంస్కరణ,
సాహితీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి చిలకమర్తి. ఆయన పేరు చెప్పగానే,
నాటక ప్రియులకి 'గయోపాఖ్యానం,' హాస్యప్రియులకి 'గణపతి,' నవలాభిమానులకి
'రామచంద్ర విజయం' గుర్తొచ్చి తీరతాయి. దేశభక్తులు పెదవులు అప్రయత్నంగానే
'భారతఖండంబు చక్కని పాడియావు' అని పలుకుతాయి.
తన
గురుతుల్యుడు కందుకూరి బాటలోనే చిలకమర్తి తన ఆత్మకథని రాసుకున్నారు 'స్వీయ
చరిత్రము' పేరుతో. బాల్యం, విద్యాభ్యాసం, విధి నిర్వహణ, జీవిక సాగించడంలో
ఇబ్బందులు.. వీటన్నింటినీ ఎంత వివరంగా రాశారో, తన రచనల నేపధ్యాన్ని అంత
క్లుప్తంగానూ తేల్చేశారు. తాతగారి నుంచీ వారసత్వంగా వచ్చిన పాక్షిక దృష్టి
దోషం కారణంగా చదువు కొనసాగించడానికి చాలా కష్టపడ్డ చిలకమర్తి,
రాజమహేంద్రవరాన్ని తన కార్యస్థానంగా చేసుకుని చేపట్టిన కార్యక్రమాలు
ఒకపక్క, ఒకదానిపై ఒకటిగా మీదపడిన కుటుంబ బాధ్యతల్ని ఒడుపుగా నిర్వహించుకు
వచ్చిన తీరు మరో పక్కా, నాటి దేశ సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు,
చదువుకున్న యువకుల్లో మొదలైన సంస్కరణ, స్వాతంత్రాభిలాష మరో పక్క ముప్పేటగా
చేరి ఈ పుస్తకాన్ని ఆసాంతమూ విడవకుండా చదివిస్తాయి.
బాల్యం
సాఫీగానే గడిచినా, యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉండగానే ఆర్ధిక ఒడిదుడుకులు
చవిచూడాల్సి వచ్చింది లక్ష్మీనరసింహం కుటుంబానికి. మేనమామ కుటుంబం చాలా
వరకూ ఆదుకున్నా, చదువుతోపాటు సంపాదనా మార్గాలనీ అన్వేషించాల్సి వచ్చింది.
ట్యూషన్లు చెప్పడంతో మొదలు పెట్టి, నాటకాలు, నవలలు రాయడం వరకూ అనేక
మార్గాల్లో సంపాదించినప్పటికీ ఏనాడూ కేవలం డబ్బు సంపాదనకి మాత్రమే
పరిమితమైపోలేదు చిలకమర్తి. సామాజిక స్పృహ కలిగి ఉండడమే కాదు, దేశభక్తి
విషయంలో రాజీపడలేదు కూడా. పాఠ్యపుస్తకాలు రాసే రోజుల్లో, ఓ బ్రిటిష్
ప్రచురణ సంస్థ పెద్దమొత్తంలో డబ్బు ఆశ చూపినా "నేనెన్నడూ ఇంగ్లీష్
కంపెనీలకు గ్రంధములు వ్రాసి ఇవ్వను. స్వదేశీయు లెవరేనిజెసి యొక కంపెనీ
పెట్టిన పక్షమున వారికి వ్రాసి యిచ్చెదను. లేదా నాకు నేనే వ్రాసుకొనెదను,"
అన్న స్థిరచిత్తం ఆయనది.
ఔత్సాహిక నటులు, నాటక నిర్మాత
ఇమ్మానేని హనుమంతరావు నాయుడు కోరిక మేరకు 'కీచకవధ' నాటకంలో వచన నాటక రచన
ఆరంభించిన చిలకమర్తి తర్వాత 'గయోపాఖ్యానం' లాంటి ఎన్నో పద్య నాటకాలు
రాశారు. 'గయోపాఖ్యానం' కి ఎనలేని పేరొచ్చినా, ఆయనకి ఇష్టమైన స్వీయ రచన
మాత్రం 'ప్రసన్నయాదవం.' పద్యాలు చదవడం చేతకాని నటులకోసం వచనంలో రాసిన
నాటకాలన్నిటికీ జనాదరణ లభించడంతో పద్యాలు చేర్చి మలిముద్రణలు ప్రచురించారు.
తెలుగు దేశంలో నాటక సమాజాల తొలినాళ్ళని గురించిన సమగ్రమైన వివరాలని తన
స్వీయచరిత్రలో గ్రంధస్తం చేశారు చిలకమర్తి. నాటకసమాజాలు నడపడంలో ఉండే
ఇబ్బందులతో పాటు, తెరవెనుక రాజకీయాలనూ సందర్భోచితంగా ప్రస్తావించారు.
అదేవిధంగా నవలా ప్రోత్సహించేందుకు పెద్ద మొత్తం నగదు బహుమతులతో పోటీలని
నిర్వహించిన విశేషాలనూ చదవొచ్చు.
వీరేశలింగం ఆధ్వర్యంలో
జరిగిన సంఘ సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గోవడంతో పాటు, దళితులకోసం ప్రత్యేక
పాఠశాల నిర్వహించడం, ఆర్ధిక సమస్యలు ఉన్న పిల్లలకి చదువు కొనసాగేలా సాయం
చేయడంతో పాటు, పత్రికా నిర్వహణ ద్వారా సమాజంలోని చెడుని ఎత్తిచూపించి
సంస్కర్తగా తనవంతు పాత్ర పోషించారు. వితంతువులైన తన మేనకోడళ్ళకి చదువు
చెప్పించిన చిలకమర్తి, మరో అడుగు ముందుకు వేసి పునర్వివాహం జరిపించలేక
పోవడానికి అడ్డొచ్చిన పరిస్థితులని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.
కందుకూరి తర్వాత తాను అంతగా గౌరవించిన పిఠాపురం రాజాని పదేపదే
తల్చుకున్నారు. స్వీయ పోషణ నిమిత్తం, సంస్కరణ కార్యక్రమాలు కొనసాగించే
నిమిత్తం రాజావారు చేసిన ఏర్పాటు తర్వాతి కాలంలో దివాణం రాజకీయాల కారణంగా
క్షీణించిన వైనాన్ని వివరంగానే చెప్పారు.
కొన్ని విషయాలని
గురించి విస్తారంగా రాసిన చిలకమర్తి మరికొన్ని విషయాలని ఏమాత్రం
ప్రస్తావించక పోవడం ఆశ్చర్యపరిచింది. ఉదాహరణకి, నా చిన్నప్పుడు బరువుగా
సాగే వేసవి మధ్యాహ్నాలని అతి తేలిగ్గా మార్చేసిన 'గణపతి' నవల ప్రస్తావన
రేఖామాత్రంగా కూడా ఎక్కడా కనిపించలేదు. అంతే కాదు, ప్రస్తావించిన రచనల
తాలూకు పూర్వరంగాన్నీ వివరించలేదు. 'వారు నాటకం రాయమని కోరారు..
రాసిచ్చాను.. వీరు నవల రాయమన్నారు రాసిచ్చాను' తప్ప అంతకు మించిన వివరం
పెద్దగా కనిపించదు మొత్తం పుస్తకంలో. బ్రిటిష్ పాలనలో ఆంద్ర దేశపు తీరు
తెన్నులను, సంస్కరణల ఫలితంగా సంప్రదాయాల్లో తొంగిచూస్తున్న మార్పులని
రికార్డు చేసిన ఆత్మకథ ఇది. పరిశోధకులెవరైనా పూనుకుని, చిలకమర్తి రచనల
తాలూకు నేపధ్యాలను ప్రచురిస్తే బాగుండును. (ప్రాచీ పబ్లికేషన్స్ ప్రచురణ,
పేజీలు 410, వెల (2007 నాటి ముద్రణ) రూ. 125).
కొన్నేళ్ళ క్రితం ఈ పుస్తకం చదివానండి. అయితే చదవడానికి వేరే కారణం కూడ ఉంది. నేను ఇంటర్ చదివే రోజుల్లో (80 ల్లో) తెలుగులో ఒక పాఠం ఉండేది. దాని పేరు "నరసాపురంలో విద్యాభ్యాసం". అందులో మా ఊరి గురించి, మా స్కూలు గురించిన విశేషాలు ఉండేవి. ఆ రోజుల్లో ఫీజులు ఎక్కువగా ఉండడం వల్ల చిలకమర్తి వారు (నేను చదివిన) టేలర్ హైస్కూల్లో కాకుండా మిషన్ హైస్కూల్లో చదివానని వ్రాసారు.
రిప్లయితొలగించండి@బోనగిరి: అవునండీ.. ఆయనకీ టేలర్ స్కూల్లో చదవాలనిపించిందట.. కానీ ఆర్ధిక పరిస్థితి వల్లే మిషన్ స్కూల్లో చేరాల్సి వచ్చిందని రాశారు.. ఇంకా నరసాపురం కబుర్లు చాలానే ఉన్నాయిందులో.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి