బెజవాడతో ఎన్నేళ్ళ అనుబంధం ఉందో ఇంచుమించుగా అన్నేళ్ళూ 'నవోదయ'
తో అనుబంధం ఉంది నాకు. జంగమాన్నై ఊళ్లు తిరిగే క్రమంలో బెజవాడ చేరగానే మొదట
చేసిన పని ఇల్లు వెతుక్కుని చేరడం అయితే, రెండో పని ఏలూరు రోడ్డులో ఉన్న
పుస్తకాల షాపులన్నింటినీ పలకరించి రావడం. మిగిలిన షాపులు నాకు కొత్త కానీ,
వాటి మధ్యలో ఉన్న 'నవోదయ' మాత్రం చిరపరిచతమే. కళ్ళతో చూడడం అదే మొదటిసారి
అయినా, ఆ షాపుని గురించి ఎంతో మంది రచయితల మాటల్లో చదివి ఉన్నాను అప్పటికే.
షాపులోకి అడుగు పెట్టగానే ఎదురుగా కనిపించేవి బాపూ గీసిన బొమ్మలూ,
బాపూ రమణల పుస్తకాలూను. వాటి మధ్యలో టేబిల్ వెనుక కుర్చీలో కూర్చున్న
గంభీరమైన విగ్రహం - "అసలీయన నవ్వగా ఎవరైనా చూసి ఉంటారా? అని సందేహం కలిగేలా
- ఆయనే 'నవోదయ' రామమోహన రావు. రచయితలకి మాత్రమే కాదు, తెలుగు పాఠకులకి
కూడా ఆ పేరు ఒక భరోసా. ఎక్కడా దొరకని పుస్తకం అయినా సరే, రామమోహనరావు
గారికో మాట చెబితే ఏదోరకంగా దొరికేస్తుందన్న నమ్మకం.
'నవోదయ' కి
అటూ ఇటూ ఉండే పుస్తకాల షాపుల వాళ్ళతో బాగా స్నేహం కుదరడం వల్ల నా
కొనుగోళ్ళు 'నవోదయ' లో తక్కువ. నా బుక్ సెల్లర్ స్నేహితులు మాత్రం,
నేనడిగిన పుస్తకం వాళ్ళ దగ్గర లేకపోతే కుర్రాడిని నవోదయకి పంపి తెప్పించి
ఇచ్చేవాళ్ళు. 'నవోదయ' ప్రచురణలు, శ్రీరమణ పుస్తకాలు మాత్రం నవోదయలోనే
తీసుకునే వాణ్ణి. ఆ షాపులో గడిపినంత సేపూ అక్కడికి వచ్చి వెళ్ళిన మహామహులైన
రచయితలందరూ గుర్తొచ్చి వాళ్ళు తిరిగిన చోటు అన్న భావన చెప్పలేని
సంతోషాన్ని ఇచ్చేది. ఎందుకో తెలీదు కానీ, రామమోహనరావు గారిని పలకరించి
మాట్లాడాలని ఎప్పుడూ అనిపించలేదు.
విజయవాడ ప్రచురణ కర్తలు,
బుక్ సెల్లర్స్ అందరూ కలిసి 'నవోదయ' రామమోహనరావుగారి షష్టిపూర్తిని
పండుగలాగా జరిపారు. బెజవాడ పుస్తక ప్రపంచంలో రామమోహనరావు ఎంత ప్రత్యేకమైన
వ్యక్తో ప్రత్యక్షంగా చూసిన సందర్భం అది. ఆ సమయంలోనే రచయిత్రి సి. సుజాత
'ఆంధ్రజ్యోతి' లో ఒక వ్యాసం రాశారు, 'నవోదయ' తో తన అనుబంధాన్ని గురించి.
ఆమె తన నవల 'సుప్తభుజంగాలు' రాసిన సందర్భం, దానిని రామమోహనరావు గారు
ప్రచురించిన వైనం చదివినప్పుడు ఆ నవల చదవాలనిపించింది. షాపులో రామమోహనరావు
గారు లేరు. కుర్రాళ్ళు ఆ పుస్తకం లేదనేశారు.
కొన్నాళ్ళకి విజయవాడ
పుస్తకాల పండగ వచ్చింది. 'నవోదయ' స్టాల్లో ఉన్నారాయన. నేను వెళ్లి పుస్తకం
అడిగాను కుర్రాడిని. 'సప్తభుజంగాలా? ఆ పేరుతో పుస్తకం లేదండీ' అనేశాడు.
రామోహనరావుగారు ఆ కుర్రాడికి అరచెయ్యి చూపించారు. కౌంటర్ నుంచి లేచి
వెళ్లి, ర్యాకుల్లో వెతికి వెతికి కొంచం పాతగా ఉన్న పుస్తకం కాపీని నాకు
అందిస్తూ 'సుప్తభుజంగాలు' అని చెప్పారు కుర్రాడికి. పుస్తకం మీద ఆయనకున్న
ప్రేమని, శ్రద్దనీ ప్రత్యక్షంగా చూసిన సందర్భం అది. బ్లాగుల్లోకి వచ్చాక,
అమెరికాలో ఉండే తెలుగు సాహిత్యాభిమానులకోసం ఆయన శ్రమ తీసుకుని పుస్తకాలు
పంపిన సంగతులెన్నో తెలిశాయి. అలాంటి వ్యక్తి వ్యాపారాన్ని నిర్వహించలేక షాపుని శాశ్వతంగా మూసేయడమా?
యాభై
తొమ్మిదేళ్ళ 'నవోదయ' మూతబడిందన్న వార్త ని నమ్మడానికి సమయం పట్టింది.
మిత్రులకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాక, ఆ వార్త అబద్ధమవుతుందన్న ఆశ అడుగంటింది. ఆర్ధిక నిర్వహణలో ఇబ్బందులు, ఈ-బుక్స్ నుంచి వస్తున్న పోటీ, పైరేటెడ్ పీడీఎఫ్ ల పీడ... ఇలా తరచి చూస్తే ఎన్నో కారణాలు. ఎప్పుడన్నా బెజవాడ వెళ్ళినా ఏలూరు రోడ్డులో 'నవోదయ' కనిపించదు అన్న ఊహే కష్టంగా ఉంది.
"ఆ పుస్తకం దొరకట్లేదా? నవోదయ లో అడిగి చూడండి" అని నాలుక కరుచుకోడం కనీసం
కొన్నాళ్ళ పాటు పుస్తక ప్రియులకి తప్పదు. కాలం కేవలం శక్తివంతమైనది మాత్రమే
కాదు, చాలా క్రూరమైనది కూడానని మరోసారి నిరూపితమైన సందర్భం ఇది.. (ఫోటో
కర్టెసీ : The Hindu)
తెలుగు పుస్తక ప్రచురణ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది, చాలా విచారకరం. 'నవోదయ' రామమోహనరావు గారు ఓ అరుదైన వ్యక్తిత్వం గల మనిషి. ఆయన చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు సందర్భోచితమయిన వ్యాసం వ్రాసారు.
రిప్లయితొలగించండిగుంటూరు నవోదయ నాకిష్టమైన ఒక పుస్తకాల షాపు. తెలుగు సాహిత్యం చదవడం మొదలు పెట్టిన తొలినాళ్ళలో మొట్టమొదటి సారిగా దేవులపల్లి వారి కృష్ణపక్షం, మొక్కపాటి వారి - బారిస్టర్ పార్వతీశం మొదలుకొని చాలా పుస్తకాలు అక్కడే కొనుక్కున్నాము నేను, నా ప్రియ స్నేహితురాలు.
రిప్లయితొలగించండిఅవే కాక నవోదయ వారి తెల్ల కాగితాల నోటు పుస్తకాలు గులాబీ రంగు అట్టతో రాస్తే వీటిలోనే రాయాలి అనిపించేలా ఉండేవి - అవి కూడా అక్కడే కొనుక్కునే వాళ్లము. ఈరోజు మీ పోస్టు చూడగానే ఒక్క నిముషం - అయ్యో ! అనిపించింది :( మూసివెయ్యడానికి వాళ్లకి ఎంత బాధగా వుంది వుంటుందో !
విస్తృతంగా విస్తరించవలసినవి మూతబడుతున్నాయి...వదిలించుకోవలసినవి అందలం ఎక్కుతున్నాయి. ఎటు పోతున్నాం మనం?
రిప్లయితొలగించండిరామమోహనారావుగారి నవ్వు పసిపిల్లడి నవ్వులాగా జగన్మోహణంగా ఉంటుంది.
రిప్లయితొలగించండిచాపకింద నీరులా సాకేంతికాభివృద్ధి పుస్తకాలని కబళించడం ఇంతవరకూ వచ్చిందన్నమాట.
రిప్లయితొలగించండిఅయ్యో! మూసేశారా? నమ్మలేకపోతున్నాను. ఒక్కసారే వెళ్ళగలిగాను. మళ్లీ వెళ్ళాలని ఆశపడ్డాను. పుస్తక ప్రదర్శన లోనయినా పెడతారు కదా అని ఆశ అయితే ఇంకా ఉంది.
రిప్లయితొలగించండి@విన్నకోట నరసింహారావు: నాకు తెలిసింది చాలా తక్కువండీ.. జ్ఞాపకం వచ్చిన నాలుగు మాటలూ ఇక్కడ పంచుకునే ప్రయత్నం.. ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@లలిత టి.ఎస్: గుంటూరు షాపు నేను చూడలేదండీ.. విజయవాడలో నేను చూసేనాటికి స్టేషనరీ సెక్షన్ లేదు.. అవునండీ, మూసివేత బాధాకరమే.. ధన్యవాదాలు..
@జ్యోతిర్మయి: 'మార్పు సహజం' అని సరిపెట్టుకోవాలేమోనండీ :( ధన్యవాదాలు..
@నారాయణస్వామి: అవునండీ.. కాకపొతే మరీ 'అరుదైన' నవ్వు :) ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: అభివృద్ధి తాలూకు విష ఫలాలదే పెద్ద పాత్ర అనిపిస్తుందండీ నాకు.. ధన్యవాదాలు
@జీకేఎస్ రాజా: ప్రస్తుతానికి మూత పడిందండీ.. తెరుచుకుంటుందని ఆశిద్దాం.. ధన్యవాదాలు