నాలుగేళ్ల క్రితం విడుదల చేసిన కథాసంకలనం 'యానాం కథలు' కి
కొనసాగింపుగా కవీ, రచయితా దాట్ల దేవదానం రాజు ఏడాది క్రితం విడుదల చేసిన
అనుబంధ సంకలనం 'కళ్యాణపురం.' ఈ పుస్తకానికి 'యానాం కథలు-2' అని ఉపశీర్షిక
ఇచ్చారు రచయిత. మొదటి సంకలనంలో పద్దెనిమిది కథలు చేర్చిన దేవదానం రాజు,
రెండో భాగంగా పదహారు కథల్ని ప్రచురించారు. అయితే, మొదటి సంకలనంలో కథలన్నీ
కథాస్థలంతో సంబంధం ఉన్నవే కాగా, తాజా పుస్తకంలో నాలుగైదు కథలు మినహా
మిగిలినవి ఏ ప్రాంతంలో అయినా జరిగే అవకాశం ఉన్నవి. అంటే, వీటిలో కథా
స్థలానికి పెద్దగా ప్రాధాన్యత లేదు.
శీర్షికగా ఉంచిన
'కళ్యాణపురం' ఈ సంకలనంలో మొదటి కథ. యానాం పట్టణానికి పూర్వనామమే ఈ
కళ్యాణపురం. బ్రిటిష్ చట్టాలు అమలులో ఉన్న ఆంధ్ర ప్రాంత్రంలో ప్రభుత్వం
బాల్య వివాహాలను నిషేధించినప్పుడు, సంప్రదాయం తప్పడానికి ఇష్టపడని
శోత్రియులు ఫ్రెంచి పాలనలో ఉన్న యానాం వెళ్లి పిల్లలకి పెళ్ళిళ్ళు
జరిపించేవారు. అలాంటి ఓ బాల్య వివాహాన్ని కథా వస్తువుగా తీసుకుని రాసిన ఈ
కథ ఆద్యంతమూ ఉత్కంఠ భరితంగా చదివిస్తుంది. శోత్రియ కుటుంబాల ఆచార
వ్యవహారాలని కాసింత లోతుగానే అధ్యయనం చేసి కథని రాశారని అర్ధమవుతుంది.
సంకలనంలో
రెండో కథ 'దేశద్రోహి.' ఇది ఫ్రెంచి వాళ్ళ కథ. భారతదేశానికి స్వతంత్రం
వచ్చిన ఫలితంగా యానాంలో ఉన్న ఫ్రెంచి అధికారులలో పెరిగిన అభద్రతా భావం
కథావస్తువు. ఏదైనా చేసి యానాంని స్థిరవాసంగా చేసుకోవాలని నిర్ణయించుకున్న
అధికారి పౌల్ షెల్జ్ కి ఇంటినుంచే వ్యతిరేకత మొదలవుతుంది. విభజించి
పాలించాలన్న పౌల్ షెల్జ్ ప్రయత్నాలని అతని కుమారుడు, ఉన్నత విద్యావంతుడు,
రోనే తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. యానాం భవిష్యత్తుతో ముడిపడిన షెల్జ్ ఇంటి
తగువు ఎలా ముగిసింది అన్నది ఆసక్తికరంగా చెప్పారు రచయిత.
ప్రస్తుత సమాజంలో పెరిగిపోతున్న
ఆర్ధిక నేరాలని ఇతివృత్తంగా చేసుకుని రాసిన కథ 'మన్యంవోరి మేడ.' యానాం
జమీందారిణి మహాలక్ష్మమ్మ మంచితనం, నిక్కచ్చితనంతో పాటుగా నూట యాభై ఏళ్ళ
కాలంలో విలువల విషయంలో సమాజంలో చోటుచేసుకున్న వశ్యతని ప్రశ్నిస్తారు రచయిత.
అయితే, జమీందారీ వాతావరణ చిత్రణలో మరికొంచం శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది
అనిపించింది కథ చదవడం పూర్తిచేశాక. వీటి తర్వాత గుర్తుండిపోయే మరో కథ
'చూపుడువేలు.' ఓ వర్గం ప్రజలనుంచి పూజలందుకునే నాయకుడి విగ్రహానికి అపచారం
జరిగినప్పుడు యానాం పట్టణంలో చోటుచేసుకున్న రాజకీయాలని చిత్రించిన కథ
'చూపుడు వేలు.' కథా స్థలం యానాం కావడం వల్ల ముగింపు అతికినట్టుగా సరిపోయింది.
మానవ
సంబంధాలని ఇతివృత్తంగా తీసుకుని రాసిన 'పలకరింపు' గుర్తుండిపోయే కథల
జాబితాలో చేరుతుంది. ఒకప్పుడు యానాంలో ఉద్యోగం చేసి, చాలా రోజుల విరామం
తర్వాత చూసిపోడానికి వచ్చిన భాస్కర్ కథ ఇది. ముందుగానే చెప్పినట్టుగా మిగిలిన పదకొండు
కథలూ ప్రపంచంలో ఎక్కడైనా జరగడానికి అవకాశం ఉన్నవి. కొన్ని కథలకి కథా
స్థలంగా యానాంని ప్రకటించారు కానీ, నిజానికి 'స్థలం' అన్నది కథలో భాగం
కాలేదు. మానవనైజం ఇతివృత్తంగా చేసుకుని రాసినవే ఈ కథలన్నీ. 'విషాద మోహం' కథ
వడ్డెర చండీదాస్ మొదలు కాశీభట్ల వేణుగోపాల్ వరకూ కొందరు రచయితల కథలు
అప్రయత్నంగా గుర్తొస్తాయి.
'అభయం,' 'మళ్ళీ బాల్యం,'
'జగమంత కుటుంబం,' 'వెంటాడే విలువలు,' 'రంగు పడింది,' 'తీరని దాహం,' 'కొత్త
దేవుడు,' 'హోరు గాలి' కథలు మానవ సంబంధాలనీ, మనస్తత్వాన్నీ చిత్రించిన కథలు.
అయితే, సంకలనంలో మెజారిటీ కథలు హడావిడిగా రాసేసినట్టుగా అనిపించాయి. కథనం,
సంభాషణలు వంటి విషయాల్లో మరికొంత శ్రద్ద తీసుకుని ఉంటే గొప్ప కథలుగా
నిలబడే అవకాశం ఉన్నవే. అలాగే, కథల్లో యానాంకి మరింత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే
'యానాం కథలు-2' అన్న ఉపశీర్షికకి న్యాయం జరిగి ఉండేది. (శిరీష ప్రచురణలు,
పేజీలు 159, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
మీకు, మీ కుటుంబానికీ ఉగాది శుభాకాంక్షలు మురళి గారూ.
రిప్లయితొలగించండి@విన్నకోట నరసింహారావు: ధన్యవాదాలండీ. చాలా ఆలస్యంగా మీకు కూడా శుభాకాంక్షలు..
రిప్లయితొలగించండి