వర్షాకాలం, శీతాకాలాలతో పోలిస్తే వేసవిలో దొరికే కాయగూరలు బాగా
తక్కువ. పైగా, మండే ఎండల్లో మసాలా వంటలు తినడమే కాదు, వండడమూ కష్టమే.
ఈకాలంలో దొరికే వాటిలో సాధ్యమైనంత సింపుల్ గా వండుకు తినగలిగే కూరల్లో
అరటికాయ ఒకటి. మామూలుగా అయితే నవనవలాడే అరటికాయలు చూడగానే బజ్జీలో, వేపుడో
గుర్తొస్తాయి. కూరల్లో అయితే మొదటి ఓటు పులుసుకూరకే. కానీ, వేసవిలో ఇవేవీ
కుదరవు. కాబట్టి, ఉప్మాకూర బెస్ట్ చాయిస్. పేరు చూడగానే ఎలా వండాలో ఓ ఐడియా
వచ్చేసి ఉంటుంది కదూ..
ముందుగా ఓ గిన్నెలో నీళ్ళు తీసుకుని
స్టవ్ మీద పెట్టాలి. నీళ్ళు కొంచం వేడెక్కుతూ ఉండగానే కొంచం పసుపు
వేసేసుకోవాలి. చేతిక్కాస్త చవుర్రాసుకుని అరటికాయ చెక్కు తీసుకుని, సమంగా
ముక్కలు కోసుకుని పొంగుతున్న నీళ్ళలో వేసేయాలి. నీళ్ళు పొంగి స్టవ్ మీద
పడకుండా జాగ్రత్త తీసుకుంటే చాలు. పది నిమిషాల్లో అరటికాయ ముక్కలు చక్కగా
ఉడికిపోతాయి. స్టవ్ కట్టేసి, గిన్నెలో మిగిలిన నీళ్ళని వంపేసి, ముక్కల్ని
ఆరనివ్వాలి. ఈ పని అయ్యిందంటే, సగం వంట అయిపోయినట్టే.
వండుతున్నది
బొత్తిగా మసాలాలు లేని సాత్వికమైన కూర కాబట్టి, అలనాటి 'మల్లీశ్వరి' పాటలు
వినొచ్చు. 'మిస్సమ్మ' లేదా 'గుండమ్మ కథ' పాటలైనా పర్లేదు. నాలుగు పాటలు
అయ్యేసరికి కూర రెడీ అయిపోతుంది. వంటలో రెండో మరియు చివరి భాగానికి వస్తే,
ఉల్లిపాయ పెద్దదయితే ఒకటి, చిన్నవైతే రెండు మరీ సన్నగా కాకుండా తరిగి పెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి ఉప్మా కోసం సిద్ధం పెట్టుకున్నట్టే తరిగి
పెట్టేసుకోవాలి. పోపు సరంజామాతో పాటు, నాలుగు కర్వేప రెబ్బలు, ఓ చిన్న
నిమ్మకాయ పక్కన పెట్టేసుకుంటే కూర వండేందుకు సిద్ధం అయిపోవచ్చు.
స్టవ్ వెలిగించి, బాండీ వేడెక్కగానే రెండు చెంచాల నూనె వేసి అల్లం ముక్కలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేసి సన్న సెగ మీద వేగనివ్వాలి. సగం వేగాక పచ్చిమిర్చి, కర్వేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి గరిటెతో తిప్పాలి.
నాలుగైదు నిమిషాలు సన్నని సెగమీదే వేగనిచ్చి, నీళ్ళు వంపేసిన అరటికాయ
ముక్కల్ని బాండీ లోకి బదలాయించి బాగా తిప్పాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం
ఫ్లేం కి మార్చి, బాండీ మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత
తీస్తే, కూర మరీ పొడి పొడిగానూ బాగా ముద్దగానూ కాకుండా మధ్యస్తంగా
వస్తుంది.
అరటి, ఉల్లి ముక్కల మధ్య బంధాన్ని బలపరచడంతో
పాటు, కూరకి రుచి ఇవ్వాలంటే ఉప్పు తప్పనిసరి. తగినంత ఉప్పును కూరంతా జల్లి,
మరోసారి బాగా కలిపి, మూత పెట్టి రెండు నిమిషాలు స్టవ్ ని సిమ్ లో ఉంచాలి.
మూత తీసి, మళ్ళీ ఓసారి కలిపి స్టవ్ కట్టేయాలి. దీనితో కూర చాలావరకూ
పూర్తయినట్టే. పూర్తిగా అవ్వాలంటే మాత్రం, బాండీలో కూర చల్లారే వరకూ ఆగాలి.
కూర బాగా చల్లారింది అనిపించుకుని, నిమ్మకాయ సగానికి కోసి, గింజలు తీసేసి,
రసాన్ని కూర మీద పిండి బాగా కలిపితే కూర సిద్ధం.
ముందుగా
చెప్పినట్టుగా ఇది వేసవికి సరిపోయే సింపుల్ వంటకం. అలా అని మిగిలిన
కాలాల్లో చేసుకోకూడదు అనేమీకాదు. అరటికాయ దొరకడమే ఆలస్యం, చేసేసుకోవచ్చు.
అన్నంతో పాటు, రోటీలోకీ బావుంటుంది. ముక్కలు ఉడికించేందుకు సరిపడేన్ని
నీళ్ళే తీసుకుంటే, ఉడికాక నీళ్ళు వంపే పని ఉండదు. తరిగిన ముక్కలు ముందు
చన్నీళ్ళలో వేసి, అటుపై వేన్నీళ్ళలోకి మార్చే కన్నా, అప్పటికప్పుడు తరిగి వేడి
నీళ్ళలో వేసేయడం వల్ల ముక్కలు అస్సలు రంగు మారవు. కూర బాగా కలర్‌ఫుల్ గా
రావాలి అనుకుంటే ఉప్పు వేసేప్పుడు మరికొంచం పసుపు జోడిస్తే సరిపోతుంది. పెద్దవాళ్ళతో పాటు పిల్లలకీ నచ్చే కూర ఇది.
సాత్వికమైన కూర కాబట్టి మల్లీశ్వరి, గుండమ్మ కథ పాటలు వినొచ్చు....అహ్హహహ.. ఇంతకీ మీరు పసుపు వెయ్యలేదేం కూరలో ఆంటీబయాటిక్కు కదా..
రిప్లయితొలగించండిబాగుంది.. ఇదే విధానంలో బంగాళాదుంప ఉప్మా కూర కూడా చేసుకోవచ్చు....
రిప్లయితొలగించండిఅది కూడా సాత్వికమే కనుక... మల్లీశ్వరి,మిస్సమ్మ,గుండమ్మకథలతోపాటు మాయాబజార్ కూడా వినవచ్చు.....
మురళిగారు
రిప్లయితొలగించండిదీన్ని అరటికాయ ముద్ద కూర అనడం తెలుసు. "ఉప్మా" పదం చూసి అందులో రవ్వ వేస్తారేమో అనుకున్నా. పూరీలు తినేటప్పుడు చేసే బంగాళాదుంప కూరా, కందతోటీ కూడా చేసుకోవచ్చు కదండీ?
ఈ ముద్ద కూర తద్దినాల్లో చేయడం తప్పనిసరి అనుకుంటా (ఉల్లిపాయలూ, నిమ్మకాయా ఇత్యాదివి లేకుండా).
భలే పద్ధతిగా వండుతారండీ మీరసలు! చేతికి చవుర్రాసుకోవడంతో సహా.. :)
రిప్లయితొలగించండిపాటలంత కమ్మని కూర,కమ్మని అరటికాయ ఉప్మా కూరంత పాటలు కమ్మన.వింటూ చేసే భోజనం మరింత కమ్మన.
రిప్లయితొలగించండిమురళి గారూ, రెండు సందేహాలు.
రిప్లయితొలగించండి1. "ఉప్మా కూర" అని ఎందుకు అంటారు? కేవలం అల్లం, పచ్చిమిరపకాయలు, నిమ్మరసం తగిలించటం వల్లనా? లేక మరేదైనా కారణం ఉందా? (చేసిపెడితే తినడమే గాని, లోతైన వివరాలు తెలియని కేటగిరీలో నేనొకడిని :) )
2. "పల్లీలు" అనే పదం వాడకం ఎక్కడినుంచో వచ్చి ఇప్పుడు బాగా ఎక్కువయిపోతున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ మీరు కూడా "పల్లీలు" అనే వ్రాయటం చూసి కొంచెం ఆశ్చర్యం వేసింది. కాని మన "సంస్కృతి" లో దాని పేరు వేరుశనగ కదా. ఉదాహరణకి - కస్టేఫలే శర్మ గారు చూడండి, తన బ్లాగులో వంటకాల గురించి వ్రాస్తున్నప్పుడు "కావలసిన పదార్దాల్లో" చక్కగా వేరుశనగ గుళ్ళు అని వ్రాస్తారు, మీరు గమనించే ఉంటారు. మనందరం కూడా అలాగే మాట్లాడి మన "సంస్కృతి" ని నిలబెడితే బాగుంటుంది కదా, ఏమంటారు? మీ బ్లాగు మీ ఇష్టం అనుకోండి, కాని ఇదొక చిన్న విన్నపం.
రిప్లయితొలగించండి@Ennela: అయ్యో, 'తగుమాత్రం' వేశానండీ.. కాకపొతే, నిమ్మరసం పిండాక తెల్లగా వచ్చేసింది కూర.. ..ధన్యవాదాలు.
@Freebookbank: అవునండీ.. భలేగా గుర్తుచేశారు.. ..ధన్యవాదాలు..
@DG: అవునండీ.. కాకపొతే తద్దినం కూర మడి కట్టుకుని వండాలి.. కర్వేపాకు వేయరు :)) ధన్యవాదాలు.
@కొత్తావకాయ: రాస్తూండగా 'వెంకటేశం' గుర్తొచ్చాడండీ :)) ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@లక్ష్మీ'స్ మయూఖ: ధన్యవాదాలండీ..
@విన్నకోట నరసింహారావు: 1. మీరు చెప్పినవాటితో పాటుగా, చూడ్డానికి, రుచికి కూడా ఉప్మాని పోలి ఉండడం, ఉప్మా చేసినంత సులువుగా వండేయగలగడం కూడా కారణాలు అయిఉంటాయి అని నా అనుకోలండీ.
2. మా ఇంట్లో 'పల్లీలు' అని అనడం అలవాటండీ.. లోతుగా ఆలోచిద్దామంటే 'రుషిమూలం, నదీ మూలం..'గుర్తొచ్చి ఆగిపోతూ ఉంటాను :)) ... ధన్యవాదాలు..
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅలాక్కానివ్వండి.
రిప్లయితొలగించండిదీనికోసం "రుషిమూలం", "నదీమూలం" ఎందుకుగాని నా అవగాహన మేరకు వివరిస్తాను. మీకూ తెలిసే ఉంటుంది, వేరుశనగ కి హిందీలో పేరు మూంగ్ ఫలి. హిందీ / ఉర్దూ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ పేరే తెలుగులో కూడా వాడుతూ, కాలక్రమేణా ఆ ప్రాంతంలో తెలుగులో ఆ పదం కురచ అయ్యి పల్లీ, బహువచనంలో పల్లీలు అయ్యుంటుంది. అందువల్ల ఆ ప్రాంతం వారికి ఆ పేరే అలవాటు అయ్యుంటుంది. ఉద్యోగ వ్యాపార నిమిత్తం ఆ ప్రాంతంలో నివిసిస్తున్న వేరే ప్రాంతాల వారికీ ఆ పేరు పలకటమే అలవాటయినట్లుందిలెండి. ఇప్పుడు టీవీ ఛానెళ్ళ పుణ్యమా అని ఇంకాస్త.
@విన్నకోట నరసింహారావు: అయ్యో.. ఋషీ మూలం అని నేను సరదాగా అన్నానండీ.. మీరు సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. 'పల్లీలు' అనే మాట ఎలా వచ్చిందో తెలిసిందిప్పుడు. అవడానికి కోనసీమే అయినా, రెండుమూడు తరాలుగా హైదరాబాద్ ప్రభావం ఉందండీ.. తెలంగాణా రాష్ట్రంలో చాలామంది బంధుమిత్రులు ఉన్నారు మాకు! అలా వచ్చి చేరిన కొన్ని మాటల్లో కొన్ని ఈ పల్లీలు, బాండీ వగయిరా.. మరోమారు ధన్యవాదాలు మీకు..
రిప్లయితొలగించండిఅబ్బే, నేనేమీ సీరియస్సుగా తీసుకోలేదండీ మురళి గారూ. కోనసీమ వాస్తవ్యులు కదా ఈ పదం వాడారేమిటా అనుకున్నాను, అంతే. మీరు ఇప్పుడు చెప్పారుగా తెలిసింది. ఈ పదం యొక్క "మూలం" (నా అవగాహన ప్రకారం) మీకు అర్ధమయినందుకు సంతోషం.
రిప్లయితొలగించండి@విన్నకోట నరసింహారావు: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండిఇప్పుడే మీ పెసరట్టు కూర చూసి వస్తున్నా మేము పెసరట్టుతో తీపి పులుసు చేస్తాం :)
రిప్లయితొలగించండిఅరటికాయ ముద్దకూర అంటాం ఇలాగే అరటికి బదులు బంగాళాదుంప వాడొచ్చు :)
మొత్తానికి భాస్కర్రామిరెడ్డి గారు ఇంకా కొందరు బ్లాగు నలభీముల జాబితాలో మీరూనూ :)
@పరిమళం: హహహా.. ఎప్పుడైనా సరదాగా వంటల పోస్ట్ అండీ.. ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి