మంగళవారం, మే 12, 2015

వంశీకి నచ్చిన కథలు - 2వ భాగం

"వంశీకి నచ్చిన కథలు మొదటి భాగం సక్సెస్ అయ్యింది. రెండో భాగం వెయ్యమని మిత్రులు చాలా ఎంకరేజ్ చేశారు" అంటూ మొదలైన వంశీ ముందుమాటలో 'సక్సెస్' అన్న మాట దగ్గర ఆగాను ఒక్క క్షణం. సక్సెస్, ఫెయిల్యూర్ అన్నవి 'కమర్షియల్' సాహిత్యానికి మాత్రమే వర్తించే మాటలని నా అభిప్రాయం. వైవిద్యభరితమైన కథలని ఏర్చి కూర్చి అందించిన కారణంగా 'వంశీకి నచ్చిన కథలు' ఎక్కువమంది పాఠకులని చేరిందన్నది నిజం. దీనిని 'సక్సెస్' అనే అనాలా?? రెండో భాగంలో చేర్చిన యాభైరెండు కథలనీ చదువుతున్నంతసేపూ ఈ ఆలోచన వెంటాడుతూనే ఉంది.

వంశీని గురించీ, సాహిత్యంలో వంశీ అభిరుచిని గురించీ ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏమీలేదు. తనకి నచ్చిన కథలతో ప్రచురించిన సంకలనానికి కొనసాగింపుగా వేసిన ఈ తాజా సంకలనంలోనూ 'వంశీ మార్కు' చాలా చోట్లే కనిపించింది. రెండు భాగాల మధ్యా పోలిక రావడం అనివార్యం. మొదటి భాగంతో పోల్చినప్పుడు రెండో భాగంలో కథల ఎంపిక విషయంలో వంశీ పెద్దగా శ్రద్ధ చూపలేదేమో అన్న సందేహం కలిగింది కొన్ని కథలు చదువుతూ ఉన్నప్పుడు. 'ఏవైనా మొహమాటాల వల్ల ఈ కథని సంకలనంలో చేర్చి ఉంటారా?' అనే సందేహాన్ని కలిగించిన కథలూ ఉన్నాయి.

శిరంశెట్టి కాంతారావు 'అడవి లోపల' కథతో మొదలైన ఈ సంకలనం కె.వి.యెస్. వర్మ రాసిన 'సుఖం' కథతో పూర్తయ్యింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కథల్లో నిలుస్తుంది 'అడవి లోపల.' వంశీ తీసిన 'అన్వేషణ' సినిమా గుర్తురాక మానదు ఈ కథ చదువుతుంటే. అడవి నేపధ్యంలో సాగే కథలలో  ఈతకోట సుబ్బారావు రాసిన 'కాశీబుగ్గ,' గోపిని కరుణాకర్ రాసిన 'కుమారధార తీర్ధంలో సాధువు,' జి. ఆర్. మహర్షి రాసిన 'పురాగానం,' ఒమ్మి రమేష్ బాబు రాసిన 'మంచులోయ' గుర్తుండిపోతాయి. సి. వేణు రాసిన 'నవ్విన దాన్యరాసి' అడివంచు పల్లెలో జరిగిన ప్రేమకథ. రాయలసీమ మాండలీకంలో సాగే ఈ కథ వెంటాడుతూనే ఉంటుంది.


నిజానికి, 'వెంటాడే' కథల జాబితాలో మొదటగా చెప్పుకోవాల్సింది కె. సదాశివరావు రాసిన 'చలిమంటలు' కథని గురించి. ఊహాజనితమైన కథలో వర్తమాన కవులనీ, కథకులనీ పాత్రలుగా చేసి ఆద్యంతం ఆసక్తికరంగా నడిపారు రచయిత. బుచ్చిబాబు రాసిన 'కవిరాజ విరాజితము' కథతో రేఖామాత్రపు పోలిక కనిపించే ఈ కథ కవిత్వాన్ని ఇష్టపడేవాళ్ళని మరింతగా ఆకట్టుకుంటుంది. ఎ. పుష్పాంజలి 'అవిభాజ్యం,' డాక్టర్ ఎమ్. హరికిషన్ రాసిన 'చూపు,' వి. అశ్వినీ కుమార్ 'పారిజాతం,' జయప్రభ 'రసఝారీ యోగం' కథలు చాలాకాలం పాటు గుర్తొస్తూనే ఉంటాయి.

దళిత స్త్రీవాదం నేపధ్యంగా వినోదిని రాసిన కథ 'ఒక విలన్ ఆత్మహత్య.' పేరులో చెప్పినట్టే విలన్ ఆత్మహత్యని నాయిక సమస్యకి పరిష్కారంగా చిత్రించారు రచయిత్రి. సామాన్య రాసిన 'మహిత' కథ నిడివిలో పెద్దదయినా ఆపకుండా చదివించే కథనం వల్ల పేజీలు  చకచకా తిరిగిపోతాయి. ఆదర్శ పురుషుణ్ణి చిత్రించిన కథ పాలకొడేటి సత్యనారాయణ రావు రాసిన 'ఏరు దాటిన కెరటం.' చక్కని ఎత్తుగడతో ఆరంభమై ఊహకందని ముగింపుని చేరుకుంటుంది. మనస్తత్వ చిత్రణకి పెద్ద పీట వేసిన కథలు పాలగుమ్మి పద్మరాజు రాసిన 'ఎదురుచూస్తున్న ముహూర్తం,' పూడూరి రాజిరెడ్డి రాసిన 'మరణ లేఖలు,' శ్రీకంఠమూర్తి రాసిన 'జాతర,' 

తిలక్ రాసిన 'ఆశా కిరణం' కథని గుర్తుచేస్తూ సాగే కథ పురాణం శ్రీనివాస శాస్త్రి రాసిన 'ఎన్నెన్నో ఆత్మహత్యలు.' ఎ.ఎన్. జగన్నాధ శర్మ 'నాన్నంటే,' కె. వరలక్ష్మి రాసిన 'ప్రస్థానం' కథలు వ్యవస్థ పనితీరుని ప్రశ్నిస్తాయి. స్వీయ రచన 'వెన్నెల నీడలో వాసంతి' కి చోటిచ్చారు వంశీ ఈ సంకలనంలో. మెహర్ కథ 'రంగు వెలిసిన రాజుగారి మేడ' మీద వంశీ ప్రభావం ఉన్నట్టే అనిపిస్తుంది. మొత్తం మీద చూసినప్పుడు కొన్ని కథల ఎంపిక విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకుంటే 'వంశీకి నచ్చిన కథలు' తో సమంగా నిలబడేది ఈ సంకలనం. వైవిధ్యభరితమైన ఇతివృత్తాలతో సాగే కథల్ని ఒకే సంకలనంలో కోరుకునే పాఠకులకి నచ్చే పుస్తకం ఇది. (సాహితి ప్రచురణలు, పేజీలు  400, వెల రూ. 300, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

2 కామెంట్‌లు:

  1. బాగుందండి పరిచయం....
    రంగు వెలిసిన రాజుగారి మేడ కథ చదివాను, చాలా బాగుంది...

    ఆ కథ చదవాలనుకునే వాళ్ళు క్రింద లింకు ద్వారా చదవవచ్చును
    http://loveforletters.blogspot.in/2011/07/blog-post_06.html

    రిప్లయితొలగించండి