ఆల్బర్ట్ కామూ పేరు చాలా రోజులుగా పరిచయం. తరాలతో నిమిత్తం లేకుండా
చాలామంది తెలుగు రచయితల అభిమాన రచయిత కామూ. తెలుగు రచయితల మాటల్లో కామూని
గురించి చదివానే తప్ప, ఆయన రచనల్ని నేరుగా చదివింది లేదు. ఈ నేపధ్యంలో,
పీకాక్ క్లాసిక్స్ ప్రచురించిన 'అపరిచితుడు' నవల నా కంటపడింది. The
Outsider/The Stranger పేర్లతో కామూ రాసిన చిన్న నవలకి జి. లక్ష్మి చేసిన నూటరెండు పేజీల తెలుగు అనువాదం. తేలికగా కనిపించే బరువైన పుస్తకమిది.
ఇది అంతర్ముఖుడైన మెర్ సాల్ట్ కథ. అతని
జీవితం ఊహించని మలుపులు తిరిగిన క్రమంలో, మెర్ సాల్ట్ మానసిక స్థితులని
నిశితంగా చిత్రించిన నవల. ఒక్కమాటలో చెప్పాలంటే కథకి కర్త, కర్మ, క్రియ
మెర్ సాల్ట్ పాత్ర మాత్రమే. తన తల్లిని దూరంగా ఉన్న ఓ వృద్ధాశ్రమంలో ఉంచి,
నగరంలో ఓ చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు మెర్ సాల్ట్. వృద్ధాశ్రమం నుంచి అతని
తల్లి మరణించినట్టుగా టెలిగ్రాం రావడం నవలా ప్రారంభం. తల్లి మరణ వార్త
విని మెర్ సాల్ట్ కుప్ప కూలిపోడు. కనీసం కన్నీళ్లు కూడా పెట్టుకోడు. సెలవు
ఇవ్వడానికి పైకి కనిపించకుండా విసుక్కున్న బాస్ కి 'సారీ' చెబుతాడు కూడా.
రెస్టారెంట్ లో భోజనం చేసి, బస్సెక్కి ఓ పూటంతా ప్రయాణం చేసి సాయంత్రానికల్లా వృద్ధాశ్రమం ఉన్న
ఊరికి చేరుకున్న మెర్ సాల్ట్, తన తల్లి మృతదేహాన్ని చూడడానికి ఇష్టపడడు.
ఆశ్రమం వాచ్మన్ తో కలిసి శవ జాగరణ చేసే సమయంలో సిగరెట్లు కాలుస్తాడు. కాఫీ
తాగుతాడు. చెప్పాలంటే, చాలా మామూలుగా ప్రవర్తిస్తాడు. ఆశ్రమం ఆఫీసర్ మొదలు,
తల్లి స్నేహితుల వరకూ అందరికీ మెర్ సాల్ట్ ఓ పజిల్. అలాగని అతనికి తన
తల్లితో శత్రుత్వం ఏమీ లేదు. ఆమె సౌకర్యం కోసమే ఆమెని ఆశ్రమంలో చేర్చాడు.
నగరంలో తనదగ్గర ఉంచుకుని సౌకర్యంగా చూసేంత స్తోమతు లేకపోవడం వల్ల.
తల్లి
అంత్యక్రియలు జరిపి, నగరానికి తిరిగి వచ్చిన మెర్ సాల్ట్ అనుకోకుండా తన
పాత సహోద్యిగిని మేరీని కలుస్తాడు. ఆ వారాంతం వారిద్దరూ కలిపి ఈత కొడతారు,
కామెడీ సినిమా చూస్తారు, అతని ఇంట్లో సన్నిహితంగా గడుపుతారు. మెర్ సాల్ట్
కి స్నేహితులు చాలా తక్కువ. ఉన్న వాళ్ళలో, అదే భవనంలో ఉంటున్న రేమాండ్
కొంచం సన్నిహితుడు. వాళ్ళిద్దరూ కలిసి తరచూ ఆల్కహాల్ సేవిస్తూ ఉంటారు.
రేమాండ్ తానో గిడ్డంగుల సంస్థలో పనిచేస్తున్నట్టు చెప్పుకుంటూ ఉన్నా, ఆ
చుట్టుపక్కల అతనికేమంత మంచిపేరు లేదు. రేమాండ్ ని గురించి రకరకాల వదంతులు
ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఇవేమీ మెర్ సాల్ట్ కి పట్టవు.
పారిస్
లో ఆరంభించ బోయే ఆఫీసు శాఖకి వెళ్లి పనిచేయాల్సిందిగా మెర్ సాల్ట్ కి
సూచిస్తాడు అతని బాస్. సరిగ్గా అదే సమయంలో మేరీ అతనిముందు పెళ్లి ప్రతిపాదన
పెడుతుంది. మేరీని తను ప్రేమించడం లేదు కానీ, పెళ్లి చేసుకోడానికి
అభ్యంతరం లేదంటాడు మెర్ సాల్ట్. పెళ్లి చేసుకుని అటుపై పారిస్ వెళ్ళేలా
ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు ఆ ఇద్దరూ. అంతా సాఫీగా జరిగిపోతే
చెప్పుకోడానికి ఏముంది? ఓ ఆదివారం మేరీ, రేమాండ్ తో కలిసి సముద్రతీరంలో
సరదాగా గడపడానికి వెళ్ళిన మెర్ సాల్ట్ ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి హత్య
చేస్తాడు. ఈ హత్య యాదృచ్చికంగా జరిగిందన్నది మెర్ సాల్ట్ భావన.
కేసు
కోర్టుకి వెడుతుంది. కోర్టు, మెర్ సాల్ట్ గత జీవితాన్ని తవ్వి తీస్తుంది.
తల్లి చనిపోయినప్పుడు కనీసం కన్నీళ్లు పెట్టుకోని కఠినాత్ముడిగా మెర్
సాల్ట్ ని చిత్రిస్తుంది ప్రాసిక్యూషన్. తల్లి మరణం తర్వాత మెర్ సాల్ట్
చేసిన ప్రతి పనీ అతన్ని కఠిన శిక్షకి దగ్గర చేసే ఆయుధంగా మారుతుంది
ప్రాసిక్యూషన్ చేతిలో. మెర్ సాల్ట్ కి శిక్ష పడిందా? మేరీ, రేమాండ్
ఏమయ్యారు? అన్నింటినీ మించి జైలు జీవితం మెర్ సాల్ట్ మీద ఎలాంటి
ప్రభావాన్ని చూపించింది? ఇత్యాది ప్రశ్నలకి జవాబులిస్తూ ముగుస్తుందీ నవల.
పుస్తకం చదవడం పూర్తయినా మెర్ సాల్ట్ వెంటాడుతూనే ఉంటాడు. సీరియస్ సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్ళు చదవాల్సిన నవల.
అనువాదం సరళంగానూ, సాఫీగానూ ఉంది. అన్నట్టు, యండమూరి వీరేంద్రనాథ్
'అంతర్ముఖం' రాయడానికి స్పూర్తినిచ్చిన పుస్తకం ఇదే. (పేజీలు 102, వెల రూ.
60, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)
అనిల్ అట్లూరి (ఈ-మెయిల్ ద్వారా): తల్లి చనిపోయినప్పుడు కనీసం కన్నీళ్ళు పెట్టుకుని కఠినాత్ముడిగా మెర్స్టాల్ని చిత్రిస్తుంది ప్రాసిక్యూషన్.
రిప్లయితొలగించండిపై వాక్యం లోని పదం పెట్టుకుని లో ఒక్క అక్షరం కు మొత్తం వాక్యం అర్ధాన్ని మార్చి పారేసింది.
@అనిల్ అట్లూరి: సరి చేశానండీ, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిantarmukhaaniki spoorti ani saralam ga anadam mee samskaaraanni soochisthundi kani... nirmohamaatam ga copy aneyochu ! Thanks for the post.
రిప్లయితొలగించండి