ఇది గడిచిన తరం కేరక్టర్ నటుడు, 'గుమ్మడి నాన్న' గా ప్రసిద్ధుడూ అయిన గుమ్మడి వెంకటేశ్వర రావు కి ఇష్టమైన వంటకాన్ని గురించిన
పరిచయం ఎంతమాత్రమూ కాదు. నిజం చెప్పాలంటే, కొద్దో గొప్పో ఆయన అభిరుచులు
తెలుసంతే, రుచుల సంగతి నాకు బొత్తిగా తెలీదు. కాబట్టి, ఇది నేను
తప్పనిసరై చేసిన మరో వంటింటి ప్రయోగం తప్ప మరొకటి కాదు. ప్రయోగ ఫలితం
బావుంది కాబట్టే (నాకైతే బ్రహ్మాండంగా ఉంది) పోస్టు రాస్తున్నానన్నమాట.
ఇంట్లో
ఒక్కరూ ఉండాల్సి వస్తే ఆడవాళ్ళైతే వండడానికి బద్దకించి ఏ కాయో, పండో
తినేసి పూట గడిపేస్తారు. మగవాళ్ళు, దొరికిన ఆటవిడుపుని సద్వినియోగం
చేసుకోడానికి హోటల్ వైపు దారి తీస్తారు. హోటల్ కి వెళ్ళాల్సిన వాడినే,
చివరి నిమిషంలో బద్ధకించాను. "కుక్కర్ పెట్టేసి, రెండు బంగాళా దుంపలు
వేయించుకుంటే పావుగంటలో బోయినం సిద్ధమయిపోతుంది కదా" అన్న అంతరాత్మ మాటని
బుద్ధిగా వినిపించుకుని కిచెన్ వైపు వెళ్లాను. కుక్కర్ పెట్టడం అయిపోయింది.
అప్పుడే, అసలు సమస్య మొదలయింది.
బుట్టలో కేవలం ఒకే
ఒక్క బంగాళాదుంప, అది కూడా ఓ మోస్తరు నిమ్మకాయ పరిమాణంలో ఉంది.. దానికో
చిన్న మొలక కూడా ఉంది. పక్కనే ఓ చుట్టు పెద్దదిగా ఉన్న ఒకే ఒక్క ఉల్లిపాయ.
బంగాళా దుంప తినడానికి మానసికంగా సిద్ధ పడిపోయాను కదా. ఫ్రిజ్లో ఏదో ఒక
కూరగాయ ఉండకపోదు అనుకున్నాను. కానైతే, ఫ్రిజ్ తెరచి అక్షరాలా హతాశుణ్ణయ్యాను. కేవలం అరచేయంత గుమ్మడికాయ ముక్క తప్ప, కనీసం కొత్తిమీర కూడా లేదక్కడ. నా అంతరాత్మ రాజీ పడద్దని హెచ్చరించడంతో మూడింటినీ ముక్కలుగా తరగడానికి పూనుకున్నాను.
గుమ్మడి
ముక్క చిన్నదే అయినా గట్టిగా ఉంది. పళ్ళు బిగించి "జోళ్ళు ఇచ్చుకో.. డబ్బు
పుచ్చుకో" హమ్ చేస్తూ బిట్స్ అండ్ పీసెస్ చేసేశాను. తరిగిన మూడు రకాల
ముక్కలతో అటు వేపుడు, ఇటు పులుసూ కూడా కుదరవు కాబట్టి కూర చేయాల్సిందే.
కూరేదైనా పోపు కామన్ కాబట్టి, బాండీ వేడెక్కగానే రెండు చెంచాల నూనె పోసి
వేడెక్కడం కోసం వెయిట్ చేస్తూ పోపుల పెట్టి తెరిస్తే శనగపప్పు మెరుస్తూ కనిపించింది. బామ్మ చేసిన గుమ్మడికాయ, శనగపప్పు కూర రుచి అప్రయత్నంగా నాలిక్కి గుర్తొచ్చింది ఉప్పుప్పగా.
వేడెక్కిన
నూనెలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి, ఓ క్షణం ఆగి
ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి, ఓ చిన్న గిన్నెలో పెద్ద చింతగింజంత
చింతపండుని నానబెట్టాను, "పోటీలో ఓ బావా.. నీ సత్తా చూపిస్తావా" పాడుకుంటూ.
ఉల్లి ముక్కలు బంగారు వర్ణంలోకి వచ్చాయనిపించుకుని బంగాళదుంప ముక్కలూ,
గుమ్మడి ముక్కలూ బాండీలో వేసి, కాస్త పసుపు జల్లి, కలియబెట్టి, మూత
పెట్టేశాను. రెండూ దుంప రకాలే కాబట్టి ఒకే పేస్ లో ఉడుకుతాయని నమ్మకం
కలిగింది కానీ, నమ్మకాలన్నీ నిజమవ్వాలని లేదు కదా.
వీధిలో కాకి అరుపు వినిపించడంతో జోళ్ళ పాటాపి, కాకి పాట అందుకున్నా.."అమ్మా అమ్మా మన ముంగిట్లో కూసెను నేడో కాకి.." అంటూ.
"చందమామా.. తలపైనా..." దగ్గర రికార్డు అరిగిపోయింది. తర్వాతి లిరిక్ గుర్తు
రావడం లేదన్న మాట. బాండీ మూత తీసి, చింతపండు రసం పోసి, ఓసారి కలిపేసి,
మళ్ళీ మూత పెట్టాను. ఓ క్షణమాగి చూసినా ముక్కలు ఎడమొహం, పెడమొహంగానే
ఉన్నాయి. వీటిని కలిపేదెట్టాగా? మెడని ఆధారంగా చేసుకుని తలనోసారి మూడొందల
అరవై డిగ్రీలు తిప్పితే ఐడియా తట్టేసింది.
బెల్లం డబ్బా
మూత తీసి, చిన్న ముక్క నోట్లో వేసుకుని, కొంచం రజను ఓ కప్పులో తీసుకుని,
నాలుగు చుక్కల నీళ్ళు కలిపి సిరప్ తయారు చేశాను. బాండీలో ఉడుకు పట్టిన
ముక్కల మీద ఈ సిరప్ జల్లి, కాసేపు కలిపితే కృష్ణవంశీ సినిమాలో కేరక్టర్
ఆర్టిస్టుల్లా ముక్కలన్నీ కలివిడిగా కనిపించాయి. హమ్మయ్య.. కూరకి ఆకారం
వచ్చేసింది. ఇక చూడాల్సింది రుచే. "ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య
భాస్కరా" అని శతకకారుడు చెప్పగా, చిన్నప్పుడు ఎక్కాల పుస్తకంలో చదూకున్నాం
కదా. ఆ విజ్జ వినియోగానికి వచ్చింది.
దగ్గర పడ్డ కూర ముక్కల మీద తగినంత ఉప్పుతో పాటు తగుమాత్రం కూర కారం (ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర కలిపి వేయించి కొట్టి,
సీసాకెత్తిన నిల్వ పొడి) జల్లి, రెండు తిప్పులు తిప్పేసి, రెండు నిమిషాల
తర్వాత స్టవ్ కట్టేశాను. నిజం చెప్పొద్దూ, కూర చూడగానే ఆకలి
రెట్టింపయ్యింది. వేడి కూర మరియు ఫ్రిజ్జులో ఉన్న నిల్వ వంటకాలతో లంచ్
పూర్తయ్యింది. అందానికి తగ్గట్టుగానే ఉంది రుచి కూడా. అసలు తియ్య గుమ్మడి
కాయతో బామ్మ అంత ఉప్పటి కూర ఎలా వండగలిగేదా అని ఆలోచించాను కానీ, నాకెందుకో
జవాబు తట్టలేదు.
:) :)
రిప్లయితొలగించండిఏమోనండి నాకు దప్పళం ,ఇగురు వండడమే వచ్చు ..ఇదేదో బంగాళా గుమ్మడి .... లా వుంది బావుందండి :))
రిప్లయితొలగించండి@పరిమళం: చాన్నాళ్ళ తర్వాత!! ధన్యవాదాలండీ...
రిప్లయితొలగించండి@రాధిక (నాని): గుమ్మడి దొరికితే ఇక బంగాళా అక్కర్లేదండీ.. సబ్ స్టిట్యూట్ అంతే :)) ధన్యవాదాలు..