ఎవరన్నారు తెలుగు సినిమా తీయడానికి కథల కొరత
ఉందని? తెల్లారి లేచి పేపర్ చూస్తే బోలెడన్ని వార్తలు. టీవీ పెట్టి ఏ
చానల్ తిప్పినా లెక్కలేనన్ని వార్తా కథనాలు. ఏదో ఒక వార్తా కథనాన్ని ఆధారం
చేసుకుని, సినిమాటిక్ లిబర్టీని పుష్కలంగా ఉపయోగించుకుని, హీరోని సర్వ
శక్తిమంతుడిగా తీర్చి దిద్దుకుని, ఊపిరి బిగపట్టే స్క్రీన్ ప్లే, పదునైన
సంభాషణలతో కథ రాసుకుని తెరకెక్కిస్తే తప్పకుండా అదో వైవిద్యభరితమైన సినిమా
అవుతుంది. నమ్మకం కలగడం లేదా? అయితే నారా రోహిత్ కథానాయకుడిగా వచ్చిన 'రౌడీ
FELLOW' సినిమా చూడండి.
పశ్చిమ గోదావరి జిల్లాలోని
'కొల్లేరు' ఓ సామాజిక సమస్య.. పర్యావరణ సమస్య.. రాజకీయ సమస్య కూడా. ఆ
ప్రాంత రాజకీయ నాయకుల మధ్య విభేదాలొచ్చినప్పుడల్లా కొల్లేరు వార్తల్లోకి
వస్తూ ఉంటుంది. సరస్సుని ఆక్రమించి చేపల చెరువులు పెంచడాన్ని గురించి
పేపర్లలో కథనాలు వస్తూ ఉంటాయి. టీవీ ఛానళ్ళు చర్చా కార్యక్రమాలతో సహా
చేయగలిగినవన్నీ చేస్తూ ఉంటాయి. ఈ అంశం చుట్టూ కథ అల్లుకుని సినిమా తీయవచ్చు
అన్న ఆలోచన తెలుగు సినిమా పరిశ్రమకి ఇన్నాళ్ళకి వచ్చింది. గీత రచయిత కృష్ణ
చైతన్య కథ రాసుకుని, దర్శకత్వం వహించిన సినిమా ఇది.
పేదరికం అంటే ఏమిటో తెలియని మల్టీ మిలియనీర్ రాణాప్రతాప్ జయదేవ్ (నారా
రోహిత్) కథ ఇది. నిలువెల్లా డబ్బున్నప్పుడు కొన్ని కొన్ని క్వాలిటీలు వాటికవే
వచ్చేస్తాయి. మరికొన్ని లక్షణాలకి డబ్బు ఉండడం, లేకపోవడంతో సంబంధం ఉండదు.
పుట్టుకతో వచ్చే లక్షణాలివి. కారణం ఏదైనప్పటికీ, జయదేవ్ కి ఉన్న క్వాలిటీ
'ఇగో.' తనని ఎవరన్నా ఏమన్నా అంటే బదులు తీర్చేసుకోవలసిందే. ఎంతటి వారినైనా
ఉపేక్షించేది లేదు. ఈ ఉపేక్షించక పోవడం వెనుక డబ్బు ఇచ్చిన దన్ను ఉంది.
కావాల్సింది క్షణాల మీద చేసి పెట్టే పరివారమూ ఉంది.
ఈ కారణంగానే,
ఎస్పీ పరమహంస (ఆహుతి ప్రసాద్) తో ఇగో క్లాష్ వచ్చినప్పుడు, అతనికి జవాబు
చెప్పడం కోసం యాభై లక్షలు ఖర్చు చేసి ఎస్సై పోస్టు కొనుక్కుంటాడు జయదేవ్.
ఎస్పీకి పక్కలో బల్లెంగా మారాలనుకున్న వాడు కాస్తా, అనుకోకుండా ఎంపీ అసురగణ
దుర్గా ప్రసాద్ (రావు రమేష్) తో కయ్యం పెట్టుకుంటాడు. దుర్గాప్రసాద్, అతని
అనుచరగణం సాగిస్తున్న దమనకాండ కారణంగా కొల్లేరు ప్రాంతంలో పేదవాళ్ళకి
ఎదురవుతున్న కష్ట నష్టాలు చూసి చలించిపోయిన జయదేవ్ ఉద్యోగాన్ని సీరియస్ గా
తీసుకోవడం మొదలుపెడతాడు. కేంద్ర మంత్రి కావాలన్న దుర్గా ప్రసాద్ కోరిక
చివరినిమిషంలో తీరకుండా పోతుంది, కేవలం జయదేవ్ కారణంగా.
ఇక
అక్కడినుంచీ దుర్గాప్రసాద్-జయదేవ్ ల మధ్య మొదలైన ప్రత్యక్ష పోరు ఎలా
కొనసాగింది, ఎక్కడ ముగిసింది అన్నది సినిమా ముగింపు. ఏ ఎస్పీ కారణంగా తను
పోలీసు ఉద్యోగానికి వచ్చాడో, అదే ఎస్పీ కూతురు (విశాఖ సింగ్, తొలిపరిచయం)
తో జయదేవ్ ప్రేమలో పడడం, డ్యూయట్లు పాడుకోవడం ఈ సీరియస్ సినిమాలో కొంత
ఆటవిడుపు. చాలా రోజుల తర్వాత సీనియర్ నటులు తాళ్ళూరి రామేశ్వరి, గొల్లపూడి
మారుతిరావులతో పాటు పరుచూరి, అజయ్ లకి గుర్తుండిపోయే పాత్రలు దొరికాయి. అలాగే, హాస్య నటులు సత్య,
ప్రవీణ్ లకి కూడా. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పోసాని కృష్ణమురళి
పోషించిన ' సిల్క్' పాత్రని. పోసాని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీని
దృష్టిలో పెట్టుకుని ఈ పాత్రని రాసుకున్నారు అనిపించింది.
ప్రధాన
పాత్రలు పోషించిన నారా రోహిత్, రావు రమేష్ పోటాపోటీగా నటించారు. 'బాణం'
తర్వాత నేను చూసిన రోహిత్ సినిమా ఇదే. కనీసం ఓ పది కేజీలు బరువు తగ్గకపొతే
కేరక్టర్ ఆర్టిస్ట్ గా ప్రమోషన్ వచ్చేసే అవకాశాలు పుష్కలంగా
కనిపిస్తున్నాయి. "కుర్రాడు బొద్దుగా ఉన్నాడు" అని ఓ పాత్ర చేతి పలికించి
హీరో శరీరాకృతిని జస్టిఫై చేసే ప్రయత్నం చేశారు కానీ, వారసుల మధ్యే
విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో రోహిత్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా
ఉంది. రావు రమేష్ ఎంపీ పాత్రని మరికొంత అండర్ ప్లే చేయగలడనిపించింది, గత
చిత్రాలని గుర్తు చేసుకున్నప్పుడు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో మరీ 'లౌడ్'
గా చేసిన భావన. ఆహుతి ప్రసాద్ పాత్ర చిత్రణ నిరాశ పరిచింది. ఆ పాత్ర
మరికొంత బలంగా ఉంటుందని ఆశించాను.
హీరోని ఎలివేట్ చేయడమే
లక్ష్యంగా రాసుకున్న కథ కావడం వల్ల చాలాచోట్ల నేల విడిచి సాముచేసింది.
లాజిక్ ని పక్కన పెట్టాల్సిన సన్నివేశాల సంఖ్య పెరిగిపోయింది. సాంకేతిక
విభాగాల్లో సన్నీ సంగీతం, అరవిందన్ పీ గాంధీ ఛాయాగ్రహణం చెప్పుకోవాల్సిన
అంశాలు. దర్శకుడు కృష్ణచైతన్య కథ కన్నా ఎక్కువగా సంభాషణలే
నమ్ముకున్నాడనిపించింది. డైలాగులు కొటేషన్లని తలపించాయి. అయితే, వరుసగా
కొటేషన్లు వినాల్సి రావడమూ ఒక్కోసారి ఇబ్బందే. 'చెట్టుకింద ప్లీడర్' లో
అలెక్స్ నీ, 'గీతాంజలి' లో ఫోన్ సీన్ నీ చాలా తెలివిగా వాడుకున్నారీ
సినిమాలో. హీరోగారి 'చెట్టు' పేరు మరీ అన్నిసార్లు చెప్పక్కర్లేదేమో అనిపించింది. ఎడిటర్ కి మరికాస్త పనిపెంచి కనీసం ఓ ఇరవై నిమిషాల సినిమాని
ట్రిమ్ చేసి ఉంటే మరింత బావుండేది. వైవిధ్య భరితమైన సినిమాలు కోరుకునే
వాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా ఇది.
(ఈ సినిమాని రికమెండ్ చేసిన మిత్రులు వేణూ శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు)
వావ్ పర్ఫెక్ట్ రివ్యూ మురళి గారు.. చాలా బాగా రాశారు.
రిప్లయితొలగించండిఅలెక్స్ ఈజ్ ప్రెట్టీ క్లియర్ కానీ ఫ్లాష్ లా మెరిసి వెళ్ళిపోయే గీతాంజలి సీన్ ని కూడా భలే క్యాచ్ చేశారుగా :-) నేనూ భలే తెలివిగా వాడుకున్నాడు అని నవ్వుకున్నాను :-)
@వేణూ శ్రీకాంత్: మీరు చెప్పకపోతే ఓ మంచి సినిమా మిస్ అయ్యేవాడినండీ.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి