సోమవారం, నవంబర్ 24, 2014

వాళ్ళు సైతం

ఉత్తరాంధ్ర జిల్లాలని అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుపాను బాధితులకి సహాయం అందించడం కోసం తెలుగు సినీ పరిశ్రమ పెద్ద ఎత్తున తరలి వస్తోందంటూ ప్రచారసాధనాలన్నీ హోరెత్తుతున్నాయి. 'మేము సైతం' పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించారనీ, సినీ తారలూ సాంకేతిక నిపుణులూ ప్రేక్షకులతో ఆడిపాడి, నిధులు సమకూర్చి ఆ మొత్తాన్ని ఉత్తరాంధ్ర పునర్నిర్మాణం కోసం వెచ్చించ బోతున్నారనీ ఆ వార్తల సారాంశం.

గడిచిన వందేళ్ళ కాలంలో సంభవించిన అతిపెద్ద తుపానుల్లో ఒకటైన హుద్ హుద్ కారణంగా ఉత్తరాంధ్ర కి జరిగిన నష్టం అపారం. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం నిధులు సమకూర్చే పరిస్థితిలో లేదు. ఒకవేళ, ప్రభుత్వమే ముందుకు వచ్చినా ఎన్ని నిధులూ చాలని పరిస్థితి. ఈ నేపధ్యంలో ప్రభుత్వంతో పాటు, పత్రికలూ ప్రజలనుంచి విరాళాలు సేకరిస్తున్నాయి. వీరికి తోడుగా ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ కూడా సాయం అందించడానికి ముందుకు వచ్చింది.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితుల్ని ఆదుకోవడం కోసం తెలుగు సినిమా పరిశ్రమ ముందుకి రావడం ఇదే తొలిసారి కాదు. దివిసీమ ఉప్పెన అనంతరం నాటి అగ్రనటులు ఎన్టీఆర్-ఏఎన్నార్ మిగిలిన నటీనటులతో కలిసి ఊరూరా తిరిగి జోలె పట్టి మరీ విరాళాలు సేకరించారు. ఆ కార్యక్రమానికి ప్రజలనుంచి వచ్చిన స్పందన చూశాకే ఎన్టీఆర్ కి మొదటిసారిగా రాజకీయ రంగప్రవేశాన్ని గురించి ఆలోచన వచ్చిందనే వాళ్ళూ ఉన్నారు.. అది వేరే సంగతి.

తర్వాత కూడా విపత్తులు సంభవించినప్పుడూ, వృద్ధ కళాకారుల సంక్షేమానికి అనీ సినిమా వాళ్ళు వినోద కార్యక్రమాలు, క్రికెట్ మ్యాచ్లు అడపాదడపా నిర్వహిస్తూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే, టీవీ ఛానళ్ళు విస్తరించాక ఈ తరహా కార్యక్రమాలు బాగా పెరిగినట్టే కనిపిస్తోంది. టిక్కెట్లు కొనుక్కుని వచ్చే ప్రేక్షకులతో పాటు, ఛానళ్ళ ద్వారా స్పాన్సర్షిప్ ఆదాయం కూడా వస్తూ ఉండడం, టీవీల ద్వారా కార్యక్రమం ఎక్కువమంది ప్రేక్షకులకి చేరుతూ ఉండడం సినిమా వాళ్ళని ఉత్సాహ పరుస్తున్నట్టుంది.

హుద్ హుద్ బాధితులకి సహాయక చర్యలు ప్రారంభం అవుతూనే విరాళాల ప్రకటనలు మొదలయ్యాయి. కొందరు సినిమా ప్రముఖులు విరాళాలు ప్రకటించారు, రూపాయివ్వని దర్శకనిర్మాత ఒకాయన "ఇంతేనా మీ విరాళాలు?" అని ప్రశ్నించాడు కూడా. ఇప్పుడు చెయ్యబోతున్న 'మేముసైతం' ని యావత్తు సినిమా పరిశ్రమా కలిసి నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో ఈనెల ముప్ఫైన జరగబోయే కార్యక్రమంలో ఖరీదైన టిక్కెట్లు కొనుక్కున్న ప్రేక్షకులు తారలతో ఆడిపాడొచ్చు. కలిసి భోజనం చేయొచ్చు.

ఈ 'మేముసైతం' ద్వారా సుమారు ఐదు నుంచి పదికోట్ల రూపాయలు సమీకరించవచ్చని ఓ అంచనా. విడిగా చూసినప్పుడు ఇది పెద్దమొత్తమే కానీ, చుక్కలనంటే తారల పారితోషికాలు, భారీ సినిమాల బడ్జెట్లు, కలెక్షన్లతో పోల్చినప్పుడు ఇదేమంత పెద్దమొత్తం అనిపించదు. పైగా, నిత్యం ఏదో ఒక చానల్లో కనిపిస్తున్న తారలకోసం ప్రత్యేకం భారీ మొత్తం చెల్లించి టిక్కెట్లు కొనేవాళ్ళు ఎంతమంది ఉంటారు అన్నది మరో ప్రశ్న. ఆశించిన స్థాయిలో స్పందన రానట్టయితే, ఊహించిన మొత్తం వసూలవ్వడమూ కష్టమే.

తెలుగు సినిమా పరిశ్రమ యావత్తూ పాల్గొనే కార్యక్రమం కాబట్టి, ఓ చిన్న లెక్క వేయాలనిపించింది. ఒక సినిమాకి వారివారి పారితోషికాలని, సినిమా కోసం పనిచేసే రోజులతో భాగించి ఒక్కరోజు ఆదాయాన్ని అంచనా వేసి, మొత్తం అందరి ఒకరోజు సంపాదననీ కూడితే ఎంత మొత్తం వస్తుంది? నాకైతే ఈ మొత్తం కచ్చితంగా 'మేముసైతం' ద్వారా వసూలయ్యే మొత్తంకన్నా ఎక్కువే తప్ప తక్కువ ఉండదని ఓ బలమైన నమ్మకం.

ఒకరోజు మొత్తం సినిమా షూటింగులన్నీ ఆపేసి, ఇప్పటికే హుద్ హుద్ బాధితుల కోసం ఏదో ఒక రూపంలో సాయం అందించిన ప్రజలనుంచే మళ్ళీ డబ్బు వసూలు చేసే కన్నా, సినిమా వారందరూ వాళ్ళ ఒకరోజు సంపాదనని సాయంగా ప్రకటించేస్తే మంచిదేమో కదా. దీనివల్ల సినిమా పరిశ్రమ ఒక విలువైన పనిదినాన్ని నష్టపోకుండా ఉంటుంది.. పరిశ్రమకి సీడెడ్ తర్వాత అత్యధిక ఆదాయాన్నిచ్చే వైజాగ్ కి సొంతడబ్బుని సాయంగా అందించామన్న తృప్తీ సినిమా వాళ్లకి మిగులుతుంది.

3 కామెంట్‌లు:

  1. మీరు మర్చిపోయారో మరోటో మరి. ఈ విరాళాలలో సామాన్య జనానికి అందేది ఎంతండీ? అందుకే ఇలాంటివి ఎన్నొచ్చి ఎంతమంది చేసినా ఒక్క పైసా కూడా ఇవ్వడం మంచిది కాదు. ఇవ్వాలనుకుంటే రామకృష్ణా మిషన్ కి వెళ్ళి ఇవ్వండి. వాళ్ళు ఒక్క పైసా పొల్లుపోకుండా ఖర్చు చేస్తారు జనాలకోసం. ప్రత్యక్షానుభవంతో చెప్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. If I am wrong I don't know but this is also profit programme for them or u can say another programme to make money.finally they give some amount to gov for the cause and we don't know how much it is spent to those victims.pupil had changed a lot and I think we can expect some thing from them

    రిప్లయితొలగించండి
  3. @DG: 'ఎంత?' అన్నది చేసే వాళ్ళని బట్టి మారిపోతూ ఉంటుందండీ. ఓ పేపర్ వాళ్ళు రెండు మూడేళ్లకే బీటలు తీసే భవంతులు కట్టించారు సేకరించిన సొమ్ముతో.. సినిమా వాళ్ళు ముఖ్యమంత్రికి ఇస్తూ ఉంటారు సహజంగా.. ముఖ్యమంత్రి దృష్టిలో పడ్డం చాలా ముఖ్యం కదా మరి.. ...ధన్యవాదాలు
    @swathi: రెమ్యూనరేషన్ తీసుకోకుండా రోజంతా నటిస్తున్నారు కాబట్టి, అదే వాళ్ళ కంట్రిబ్యూషన్ అనుకోవాలండీ.. ఇందులో కూడా మిగుల్చుకుంటారా?!! గమనించాలీసారి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి