గురువారం, జూన్ 02, 2011

నాయికలు-అక్షత

అక్షత కెనడా నుంచి ఇండియా వచ్చింది. ఆ ప్రయాణం ఆమె తన మూలాలని వెతుక్కుంటూ చేసింది కాదు. అయితేనేం? తన కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకుంది. అప్పటివరకూ ఆమెకి ఉన్నట్టే తెలియని తన మేనమామ కేశవని గురించి, ఊరికోసం, నదికోసం అతను పడ్డ తపన గురించీ, అతను ప్రాణప్రదంగా ప్రేమించిన బంగారి గురించీ చివరికి అనూహ్యంగా సంభవించిన అతని మరణాన్ని గురించి కూడా తెలుసుకుంది అక్షత, చంద్రలత నవల 'దృశ్యాదృశ్యం' లో ఒక ప్రధాన పాత్ర.

కెనడాలో స్థిరపడ్డ తెలుగు డాక్టర్ దంపతులు యశోద-సురేంద్రల ఏకైక సంతానం అక్షత. తల్లీ తండ్రీ ఇద్దరూ బిజీ కావడంతో ఆమె ఆలనా పాలనా అంతా దగ్గరుండి చూసుకున్నది ఆమె అమ్మమ్మ కౌసల్య. అమ్మమ్మ పెంపకంలో తెలుగు భాష మాత్రమే కాదు, సంస్కృతినీ వంట పట్టించుకుంది అక్షత. చదువవుతుండగానే భారీ నీటి పారుదల ప్రాజెక్టుల మీద పరిశోధన కోసం తన ప్రొఫెసర్ సూచన మేరకు అమ్మ పుట్టిన ఊరికి బయలుదేరుతుంది.

మామ పట్టాభి ఎంపీ. అత్తమ్మ వత్సల, వాళ్ళ ఇద్దరు పిల్లలు, వాళ్ళు చూపించే ఆదరాభిమానాలు చవిచూసిన అక్షత తన పని నిమిత్తం సిటీ నుంచి ఊరికి బయలుదేరుతుంది. తన తాతయ్య భూపాలయ్య కట్టించిన బంగ్లా ఏటి ఒడ్డున ఠీవిగా నిలబడి ఉంటుంది. ఆ ఇంటికి ఏకైక పెద్ద దిక్కు రాగవ్వ, ఇంటి మనిషిగా కలిసిపోయిన పనిమనిషి. రాగవ్వ మొదలు, ఊరి కరణం దశయ్య వరకూ అందరికీ అక్షతని చూడగానే అవ్యక్తమైన అనురాగం పుడుతుంది. దృశ్యంగా తమ కళ్ళెదుట స్థిర పడిన అక్షతలో వారికి అదృశ్యమైపోయిన కేశవ కనిపిస్తాడు.

రాగవ్వ నోటివెంట 'కేశవమామ' గురించి మొదటిసారిగా వింటుంది అక్షత. ఆ తర్వాత దశయ్యతో పాటు మరికొందరు సైతం అక్షతని చూస్తూనే కేశవని గుర్తు చేసుకోవడం ఆశ్చర్య పరుస్తుంది ఆమెని. అక్షత తల్లే కాదు, పెంచిన అమ్మమ్మ కూడా ఏనాడూ కేశవని గురించి చెప్పలేదు. అప్పటివరకూ అక్షత దృష్టిలో మామంటే పట్టాభి మాత్రమే. ఆ పెద్ద బంగ్లాలో అక్షత తను ఉండడానికి ఎంచుకున్న గది, అంతకు రెండు దశాబ్దాల క్రితం కేశవ వాడిందే కావడం యాదృచ్చికం. అనుకోకుండా కేశవ నోట్సులు, డైరీ అక్షత కంట పడతాయి.

ఓ పక్క నది గురించి, నదిమీద కట్టిన భారీ ప్రాజెక్టు గురించీ, ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన ఊరి జనాన్ని గురించీ తన 'స్టడీ' ని కొనసాగిస్తూనే, కేశవ నోట్సులు, డైరీ ద్వారా అతని గురించి తెలుసుకుంటూ ఉంటుంది అక్షత. సివిల్ ఇంజనీరింగ్ చదివిన కేశవ, తన స్వహస్తాలతో తన ఊరిని ముంపు ప్రాంతంగా మార్కు చేస్తాడు, ప్రభుత్వ ఇంజనీర్ హోదాలో. తనకి సమయం చిక్కినప్పుడల్లా రాగవ్వ, దశయ్యల నుంచి కేశవ సంగతులని చెప్పించుకుంటూ ఉంటుంది అక్షత. ఆనకట్ట కారణంగా నిర్వాసితులైన కుటుంబాల్లో ఓ కుటుంబానికి చెందిన శ్రీను, అక్షతకి సహాయకుడిగా ఉంటాడు.


మిద్దె పైనుంచి ఓ రాత్రి వేళ దూరంగా కనిపిస్తున్న మంటలని చూసి అవేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం మొదలవుతుంది అక్షతలో. రాగవ్వ వాటిని 'కొరివి దెయ్యాలు' అని కొట్టి పారేస్తుంది కానీ, అక్షత నమ్మదు. మర్నాడు శ్రీనుతో కలిసి లాంచీలో ప్రయాణం చేసి అటవీ ప్రాంతానికి వెళ్ళిన అక్షతకి, అడవి మధ్యలో నివాసం ఉంటున్న గిరిజనులు కనిపిస్తారు. తమ గూడెం ఎందుకు మునిగిందో వారికి తెలీదు. ఎక్కడికి వెళ్ళాలో అంతకన్నా తెలీదు. తమ అడవిలో తామే పరాయివారిగా బతుకుతున్న ఆ గిరిజనులని చూసి కదలిపోతుంది అక్షత.

అక్షతకి పట్టుదల ఎక్కువ. ఏదన్నా తలచిందంటే సాధించి తీరాల్సిందే. అయితే ఇందుకోసం ఎవర్నీ నొప్పించలేని మొహమాటం ఆమె సొంతం. మాట మన్ననకి పెట్టింది పేరు ఆమె. అందుకేనేమో ఆమె బిగించిన పెదవుల వెనుక ఉన్న పట్టుదలనీ, ఎంతో పరిణతితో ఆలోచిస్తూనే అంతలోనే చిన్నపిల్లగా మారిపోగలగడాన్నీ చూసినవాళ్ళంతా ఆమెలో తమ కేశవని చూసుకోగాలిగారు. ఒక్క రూపం మాత్రమే కాదు, గుణంలోనూ ఆమెది మేనమామ పోలికే.

కేశవ డైరీల ద్వారా యశోదని మెడిసిన్ చదివించడానికి అతను చేసిన పోరాటం, కుటుంబ సభ్యులని ఒప్పించిన తీరూ తెలుసుకున్న అక్షత తన తల్లిమీద కోపం తెచ్చుకుంటుంది, అన్న పట్ల కనీస కృతజ్ఞత చూపనందుకు. సిటీ నుంచి పట్టాభి, వత్సల పల్లెకి రావడంతో ఆ ఇంట్లో సందడి మొదలవుతుంది. పుస్తకాల్లో కనిపించే కేశవనీ, ఎదురుగా కనిపిస్తున్న పట్టాభినీ పోల్చి చూసుకుని తన మామలిద్దరూ భిన్న ధ్రువాలని తెలుసుకుంటుంది అక్షత. కేశవ ప్రేమించిన బంగారిని గురించి అతని అక్షరాల్లో చదివిన అక్షత, ఇటు బంగారి-వత్సలలనీ పోల్చే ప్రయత్నం చేస్తుంది.

రానురాను వత్సల ఓ అర్ధం కాని పజిల్లా మారిపోతూ ఉంటుంది అక్షతకి. యెంతో చక్కగా ఎంబ్రాయిడరీ చేయగల వత్సల, శకుంతల పటాన్ని రంగుదారాలతో కుట్టి, పూర్తైన పటాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకునే సున్నిత హృదయ. బింగన్న పురుగులని చంపినప్పుడు మాత్రమే వాటి అందమైన రెక్కలు దొరుకుతాయని తెలిసీ, ఆ రెక్కలతో తన చీర మీద నెమలికన్నులు ఎంబ్రాయిడరీ చేసుకోగల పాషాణ హృదయ కూడా. వత్సలే అర్ధం కావడం లేదనుకుంటే, రాగవ్వ వత్సలపై చూపించే ఆధిపత్యం అంతకన్నా అయోమయానికి గురిచేస్తుంది అక్షతని.

తను విసుక్కుంటున్నా అమ్మమ్మ కౌసల్య తనని విడవకుండా ఎందుకంత ప్రేమ చూపిందో, ఆ ఇంట్లో రాగవ్వ స్థానం ఏమిటో, కేశవ మామ బంగారి ఏమయ్యిందో, కేశవ అదృశ్యం కావడానికి కారణాలేమిటో ఒక్కొక్కటిగా తెలుస్తాయి అక్షతకి. చివరికి అంతటి పట్టాభీ ఆమె ముందు సంజాయిషీగా జరిగినదానిలో తన పాత్రని, అందుకు దారితీసిన పరిస్థితులని తలవంచుకుని చెబుతాడు. ఉద్యోగంలో ఇమడలేక బయటికి వచ్చిన కేశవ, నదిని రక్షించడం కోసం తయారు చేసిన ప్లాన్లు అక్షతకి దొరుకుతాయి. వాటిని ఆమె ఏం చేసిందన్నది నవల ముగింపు. అక్షతనీ, కేశవనీ, నదినీ వేరుచేసి చూడలేం. అక్షత, కేశవలతో పాటుగా, వత్సల, రాగవ్వలనీ మర్చిపోలేం.

4 కామెంట్‌లు:

  1. బలే వుందండీ కధ. మీరు చెప్పిన తీరుకేమో ఇంకా ఆసక్తి గా వుంది. బలే కధలు చెపుతారు మీరు. (మంచి వుద్దేశం తోనే అన్నానండి) :-)

    రిప్లయితొలగించండి
  2. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
    ఇట్లు నిర్వాహకులు

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగా చెప్పారు కథ. అబ్బో, ఎన్ని పాత్రలో. మొత్తానికి ఎప్పటిలాగే సస్పెన్స్ మెయింటైన్ చేసారు:(

    రిప్లయితొలగించండి
  4. @భావన: అర్ధమయ్యిందండీ :)) ..ధన్యవాదాలు.
    @ప్రవీణ్ శర్మ: ధన్యవాదాలండీ..
    @జయ: ఈ నవల చదువుతానని మీరెప్పుడో చెప్పిన జ్ఞాపకం.. తప్పక చదవండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి