అనుకోకుండా ఓ పెళ్లి రిసెప్షన్ కి వెళ్ళాల్సి వచ్చింది. ఇలాంటి వేడుకలు సాధ్యమైనంత వరకూ తప్పించుకుని ధన్యుణ్ణి అవుతూ ఉంటాను. తప్పనిసరి పలకరింపులూ, ప్లాస్టిక్ నవ్వులూ, వీటికి దూరంగా ఉండడంలో ఆనందం అనుభవిస్తే కానీ తెలీదు. వెళ్లి ఇబ్బంది పడడం కన్నా 'బిజీ' అని ఎక్స్ క్యూజెస్ చెప్పేయడం అలవాటైపోయింది. ఇందుకు శిక్షగానా అన్నట్టుగా ఒక్కోసారి నేను తప్పనిసరిగా వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకున్న చోట్లకి అనుకోని అవాంతరాల కారణంగా హాజరు కాలేకపోతున్నాను.
ఊహించినట్టుగానే వేదిక ధగద్ధగాయమానంగా మెరిసిపోతోంది. నిండు వేసవిలో కూడా సూట్లకీ, కోట్లకీ, కంచిలకీ, కాంజీవరాలకీ అస్సలు లోటన్నది కనిపించలేదు. స్త్రీమూర్తులంతా నడిచే నగల దుకాణాలని తలపింపజేయడంతో ఒక్కడినే వెళ్ళినందుకు హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. పొడుగాటి క్యూలో చివర్న నిలబడి ఎలాగోలా వేదికెక్కి, వరుణ్ణి అభినందించి (ఆఫ్కోర్స్, లోపల్లోపల బోల్డంత జాలిపడి) ఫోటోకి ఫోజిచ్చి ఆపై కిందకి దిగితే హోదాల వారీగా చిన్న చిన్న గుంపులు.
ఒక్కో గుంపునీ పరికించి చూస్తుండగానే ఉన్నట్టుండి 'బఫే' కోలాహలం మొదలయ్యింది. ఉన్న జనాన్ని కవర్ చేయాలంటే కనీసం మూడు నాలుగు కౌంటర్లు పెట్టాలి. కానీ అక్కడ ఉన్నది ఓకే ఒక్క కౌంటర్. చూస్తుండగానే కోట్లూ, కాంజీవరాలూ పళ్ళాలతో కౌంటర్ మీదకి దండెత్తాయి. మానవుడు ఎంతటి అత్యాశాజీవో వివరించి చెప్పడానికి ఆ ఒక్క దృశ్యాన్నీ ఉదాహరణగా చూపిస్తే చాలు. ఒక్కో ప్లేట్లోనూ కనీసం రెండు ప్లేట్లు పట్టే ఐటమ్స్ వడ్డించుకుని లాన్లో కూర్చుని తినడం మొదలు పెట్టారు గుంపులు గుంపులుగా. కృత్యదవస్థమీద నాకు సూప్ దొరికింది.
అతిధులంతా భోజనాల దగ్గరే ఉండడంతో వేదిక వెలవెల బోయింది. వధూవరులకి కొంచం తీరిక చిక్కడంతో తీరిగ్గా కబుర్లలో పడ్డారు. వధువు అలంకరించుకున్న హారంలో ఉన్నవి పచ్చలా, కెంపులా అన్న విషయం మీద తీవ్రంగా జరుగుతున్న చర్చ వద్దన్నా వినిపిస్తోంది లేడీస్ వైపునుంచి. కౌంటర్ దగ్గర రద్దీ అస్సలు తగ్గడం లేదు. కేటరింగ్ కుర్రాళ్ళు కూడా చేసేదేమీ లేక జరుగుతున్నది చూస్తూ ఉండిపోయారు. బల ప్రదర్శన కొనసాగుతోంది. ఐఐటీ అడ్మిషన్ల గురించి జరుగుతున్న చర్చలో పాల్గొనే ఆసక్తి లేకపోవడంతో, తిండి విషయాన్ని గురించి కొంచం సీరియస్గా ఆలోచించాను.
విడిగా ఓ టేబుల్ మీద ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ పెట్టారు. ఇంకా ఎవరి భోజనమూ పూర్తి కాకపోవడంతో అక్కడ అస్సలు రద్దీ లేదు. ఓ బౌల్ లో పళ్ళ ముక్కలు వేసి తెచ్చుకున్నా. యూఎస్ వీసాల మొదలు అపోలో సర్జరీల వరకూ ఎడతెగకుండా చర్చలు సాగుతున్నాయి. వింతేమిటంటే ఏ ఒక్కరూ మరొకరు చెప్పేది వినరు. ఎవరూ వినడం లేదని తెలిసి కూడా చెప్పేది ఆపరు. మెడికల్ కేర్ అన్నది ప్రెస్టేజ్ ఇష్యూ గా మారి చాలాకాలమే అయ్యింది కానీ, ఇప్పుడు మార్నింగ్ వాక్ కూడా అలాంటి హోదానే సంపాదించుకుందన్నది కొత్తగా తెలిసిన విషయం.
నేను పళ్ళ ముక్కలు పూర్తి చేసి ఐస్ క్రీమ్ వైపు వెళ్లేసరికి, నెమ్మదిగా అక్కడ రద్దీ మొదలైంది. ఐస్ క్రీమ్ చప్పరిస్తూ యదాలాపంగా బిన్ వైపు చూశాను. ఉసూరుమనిపించింది.. బిన్ లో వేసిన ప్రతి ప్లేటూ కనీసం సగం నుంచి మూడొంతులు నిండి ఉంది. ప్రతి బిన్ నూ ఇద్దరేసి కుర్రాళ్ళు కలిసి మోసుకెళ్ళి ఖాళీ చేసుకుని వస్తున్నారు. వచ్చిన వాళ్ళెవరూ తెలియక పడేశారని అనుకోలేం. చాలా వరకూ హై సొసైటీ పీపుల్ మరి. పోనీ రుచిగా లేవా అనుకుందామంటే ప్రతి ఒక్కరూ కౌంటర్ మీదకి మళ్ళీ మళ్ళీ దండెత్తారు.
పారేయడం కూడా ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయి ఉంటుందన్న జ్ఞానోదయం కలిగింది నాకు. బయటికి వస్తుండగా నన్ను ఆహ్వానించిన హోస్టు కనిపించారు, "హౌజ్ ద డినర్" అంటూ. "యా.. ఇట్స్ నైస్," అన్నాన్నేను హ్యాండ్ షేక్ ఇస్తూ.. ఆఫ్కోర్స్, పెదాలని చెవులవరకూ సాగదీసి నవ్వడం మర్చిపోలేదు.
:) బాగా చెప్పారు.
రిప్లయితొలగించండిsad but true
రిప్లయితొలగించండిtrue but sad
ఇప్పటి పెళ్ళి వేడుకల ని కళ్ళకి కట్టారు. నేను మీ టపాలు చాలా చదవాలి,ఒకేసారి ఇంత స్పీడందుకున్నారేమిటి :)?
రిప్లయితొలగించండిఇది చాలా దారుణం ... అహార పదార్ధాలను అలా ప్రెస్టీజ్ కోసం వ్యర్ధం చేయడం నిజంగానే చాలా దారుణం. లేని వాడు లేక ఏడుస్తుంటే ... ఉన్నవాడు తినలేక ఏడ్చాడంట అలా ఉంది వ్యవహారం
రిప్లయితొలగించండిమురళిగారు, పేరు గుర్తు లేదు కాని అదేదో స్వచ్చందసంస్థ గురించి ఒకసారి ఈనాడు లో చదివాను. వాళ్ళు ఇలా పెళ్ళిళ్ళలో పార్టీలలో మిగిలిన పదార్దాలను నిర్వాహకుల అనుమతితో పేద వాళ్ళకు చేరుస్తారుట....కనీసం వాళ్ళకు సమాచారం అందినా బాగుండేది.
రిప్లయితొలగించండిఅసలు బఫే పద్దతి ఉద్దేశ్యమే ఎవరకి కావలసినవి వాళ్ళు వడ్డించుకొని వేస్ట్ చేయకుండా ఉంటారని.
>>>పారేయడం కూడా ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయి >>>
రిప్లయితొలగించండినిజమండి. ప్లేట్ నీట్‌గా ఉండేలా తింటే తిండికి మొహం వాచిపోయి ప్లేట్ ఖాళీ చేసేశాం అన్నట్టు చూస్తున్నారు.
హ్మ్మ్.. మొత్తానికి అలా ఒక ఐస్ క్రీం తో, ఫ్రూట్స్ తో పెళ్లి విందు ముగించేసారు అనమాట. ఏంతైనా పాత రోజుల్లోని బంతి భోజనాలే బాగుంటాయి కదా మురళి గారు:)
రిప్లయితొలగించండిఅంతంత food పారెయ్యడం మాత్రం నిజంగా దారుణం. తినే అంతే పెట్టుకోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది.
I got this info in a mail. I don't know if it is true or not, but thought it might be useful.
రిప్లయితొలగించండిPlease CHECK WASTAGE OF FOOD
If you have a function/party at your home in India and food gets wasted, don't hesitate to call 1098 (only in India ) - Its not a Joke, This is the number of Child helpline.
They will come and collect the food. Please circulate this message which can help feed many children.
సింపుల్ గా పెళ్ళిళ్ళు చేసే పద్ధతి వస్తే బాగుండు. అటువంటి సమయాల్లోనైనా...కాస్త అనాధలను తృప్తి పరిస్తే బాగుండు. పెళ్ళి పందిళ్ళ బయట అడ్డుక్కునే వాళ్ళని చూస్తున్నప్పుడల్లా నాకెందుకో ఇలాగే అనిపిస్తూ ఉంటుంది మురళిగారు.
రిప్లయితొలగించండినిజమే మురళి గారూ,
రిప్లయితొలగించండిఇక ఆకేసి, పప్పేసి, అన్నంపెట్టి అని పిల్లలకి ఆటలు నేర్పించటం మానేసి పెళ్ళి కెళ్ళి, ప్లేట్ పట్టుకుని, క్యూ లో నుంచుని అని నేర్పించాలి.
ఈ మధ్య విందులన్నీ ఇల్లాగే ఉంటున్నాయి. స్థలాభావం వల్ల, వడ్డించే వారు లేక ఈ ఉత్తరాది సాంప్రదాయం మనమూ దిగుమతి చేసేస్కుని ఇప్పుడు ఇదే బావుందని కంటిన్యూ ఐపోతున్నాము. మీరన్నట్లు ఈ పద్ధతి లో తిన్న సంతృప్తి లేదు, వృధా ఎక్కువ.
శ్రీరాగ
@బీకే: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@రాజేంద్రకుమార్ దేవరపల్లి: అవునండీ.. అవును.. ధన్యవాదాలు.
@రిషి: ప్రత్యేకంగా కారణం ఏమీ లేదండీ.. కొంచం తీరిక దొరుకుతోంది, అంతే :)) ...ధన్యవాదాలు.
@అనాలిసిస్: కొన్ని కొన్ని అంతేనండీ.. ఏమీ చేయలేం.. చూసి బాధ పడడం తప్పించి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శ్రీ: వాడకుండా మిగిల్చినవి అయితే పంచడాన్ని గురించి ఆలోచించొచ్చండీ.. కానీ పళ్ళెంలో పెట్టుకుని నాలుగూ కలిపి పడేసినవి ఎవరికి పెట్టగలం?? ..ధన్యవాదాలు.
@శిశిర: ఇదో ట్రెండ్ అనుకోవాలండీ.. :( ..ధన్యవాదాలు.
@మనసుపలికే: బాధ్యతగా తినేవాళ్ళకైతే బఫేనే బెటరండీ. పారేయాలనుకునే వాళ్ళు ఎలా అయినా పడేస్తారు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జయ: బయటి యాచకుల పరిస్థితి మరీ దారుణం అండీ.. ఎప్పటికైనా పద్ధతిలో మార్పు వస్తుందేమో చూద్దాం.. ధన్యవాదాలు.
@సిరి: నిజమేనండీ.. పాత ఆటలు ఒక్కొక్కటీ మర్చిపోవాలి, కొత్తవి నేర్చుకోవాలి.. మార్పు తప్పదు కదా.. ధన్యవాదాలు.
@బ్రహ్మి: క్షమించాలి.. మీ వ్యాఖ్య స్పాం లోకి వెళ్ళిపోయింది.. వెలికి తీసేసరికి ఆలస్యం అయింది.. మీరు చెప్పిన సర్విస్ నగరాలకే పరిమితం అనుకుంటానండీ. అది కూడా, తినకుండా మిగిలిన పదార్ధాలు తీసుకుంటారు కానీ, విస్తళ్లలో మిగిలినవి కాదు కదా.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి