ఏడేళ్ళ క్రితం.. అప్పుడే మొదలైన శీతాకాలపు సాయంకాలం కాలక్షేపంగా నడుస్తూ ఉండగా ఓ వాల్ పోస్టర్ ఆకర్షించింది నన్ను. 'ఆనంద్' అని సినిమా పేరు, మంచి కాఫీ లాంటి సినిమా అని క్యాప్షన్. గ్రామఫోన్ వింటూ పొగలొస్తున్న కాఫీ కప్పు పట్టుకున్న అమ్మాయి. ఎవరో కొత్త మొహం. పోస్టర్ కి ఓ చివర 'బ్రూ' వారి ప్రకటన. చూడగానే పోస్టర్ నచ్చేసింది. పైగా, సినిమా టైటిల్ కి పెట్టిన క్యాప్షన్ ఆధారంగా, స్పాన్సర్లని సంపాదించడం అన్న కాన్సెప్ట్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.
మర్నాడు థియేటర్లో జనం పెద్దగా లేరు. పక్కనే ఉన్న హాల్లో చిరంజీవి సినిమా 'శంకర్ దాదా ఎంబీబీఎస్' విజయవంతంగా ప్రదర్శింప బడుతోంది. ప్రారంభ సన్నివేశంలో చిన్న జెర్క్. సంభాషణలు పలికే తీరు మరీ కృతకంగా ఉంది. 'అందరూ కొత్త వాళ్ళు కదా' అని సరిపెట్టుకున్నాను. టైటిల్స్ అయిపోవడం, వెంటనే వచ్చే హీరోయిన్ ఇంట్లో సంగీతం క్లాస్ దృశ్యం. కళ్ళప్పగించేశాను. మొదటగా ఆకట్టుకున్నది ఫోటోగ్రఫి. తర్వాత నేపధ్య సంగీతం. ఆ తర్వాత దృశ్యం. ఇట్టే సినిమాలో లీనమైపోయాను. సంభాషణల తీరు అలాగే ఉంది.
చిన్నప్పుడే తల్లి తండ్రుల్నీ, అన్ననీ కోల్పోయిన అనాధ అమ్మాయి రూప (కమలినీ ముఖర్జీ) కి పెళ్లి నిశ్చయం అవుతుంది. వరుడు ఆమె ప్రేమించిన వాడే. గొప్పింటి వాడు. అతని తల్లి పెట్టే కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటుంది రూప. పెళ్ళయ్యాక ఆమె ఉద్యోగం చేయకూడదు, చీరలు మాత్రమే ధరించాలి, బాగా వంట చేయడం నేర్చుకోవాలి.. ఆ కండిషన్స్ ఆమెని కొద్దిగానూ, ఆమె స్నేహితులని కొంచం ఎక్కువగానూ ఇబ్బంది పెడతాయి. పెళ్లి పనులు జరుగుతూ ఉండగానే హీరో ఆనంద్ (రాజా) పరిచయం.
పెద్ద మిలియనీర్, ఫారిన్ లో చదువుకుంటున్నాడు. అతనికి పెళ్లి చేయాలని తల్లి ప్రయత్నం. హీరో చిరంజీవి కూతురి క్లాస్మేట్ వెంకటలక్ష్మిని పెళ్లిచూపులు చూసొచ్చాడు. ఫోటోగ్రఫీ, నేపధ్య సంగీతం ప్రతి సీన్లోనూ నచ్చేస్తున్నాయి. ఆనంద్-రూప ఎదురుపడే సందర్భంలో పాట మొదలైంది.. "యెదలో గానం.." నేపధ్యగీతం.. (ఇప్పటికీ నా ఫేవరేట్). రూప పెళ్ళికి ఆనంద్ తన తండ్రిని, కజిన్ నీ తీసుకుని వచ్చాడు. రూపకి వాళ్ళమ్మ చీర కట్టుకుని పెళ్లి పీటల మీద కూర్చోవాలని కోరిక. కాబోయే అత్తగారికి అది ఎంత మాత్రమూ ఇష్టం లేదు. చాలా ఆసక్తికరమైన సన్నివేశం. వెనకాల సీట్లో వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటుంటే 'ఎక్స్ క్యూజ్మీ' అని విసుగ్గా అరిచాను.
రూప పెళ్లి వద్దనుకుంది.. లోకం దృష్టిలో కేవలం చీర కోసం పెళ్లి వద్దనుకుంది. వామనుడు త్రివిక్రముడైనట్టుగా రూప మీద ఇష్టం క్షణ క్షణానికీ పెరిగిపోతోంది నాకు. సినిమా చూస్తున్న నాకే కాదు, సినిమాలో రూప నిర్ణయాన్ని కళ్ళారా చూసిన ఆనంద్ కి కూడా రూప నచ్చేసింది. అందుకే, ఫారిన్ ప్రయాణం వద్దనుకుని, రూప పక్కింట్లో ఓ పోర్షన్ లో అద్దెకి దిగాడు. తన పరపతి ఉపయోగించి రూప కంపెనీలోనే ఉద్యోగం సంపాదించాడు. ఇక ఇప్పుడు రూప తనని ప్రేమించేలా చేసుకోవడం ఆనంద్ వంతు.
రూపకి తనవారెవరూ లేరు. ఇటు ఆనంద్ ఇంట్లో చెప్పకుండా రూప ఇంట్లో దిగాడు. అయితే ఏం? చాలామంది స్నేహితులు ఉన్నారు వాళ్లకి. చిన్న పిల్లలు మొదలు బామ్మ వరకూ, ఆటో అబ్బాయి మొదలు పెట్ డాగ్స్ వరకూ.. పెళ్ళైతే వద్దని చెప్పేసింది కానీ, తర్వాత తన నిర్ణయం సరైనదేనా అని సందేహం రూపకి. తనని ఒంటరి దానిని చేసిన తన వాళ్ళని తల్చుకుని బాధ పడుతుంది. స్నేహితులే ఆమెకి అన్నీ అవుతారు. మామూలు మనిషిని చేసే ప్రయత్నం చేస్తారు. ఆనంద్ కి రూప మీద ఉన్న ఇష్టం కూడా తెలుసు వాళ్లకి. కానీ రూపని ఒప్పించే బాధ్యత తీసుకునే సాహసం చేయరు.
మరోపక్క రూప వద్దనుకున్న పెళ్ళికొడుకు ఆమెని ఎలా అయినా ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. సరిగ్గా ఇప్పుడే పరవాన్నంలో పంటికింద రాయిలా అనిపించే సన్నివేశం.. అతను రూపని బలాత్కరించ బోతుంటే ఆనంద్ వచ్చి ఆమెని రష్ కించడం.. సినిమా మొదలయ్యాక మొదటిసారి దర్శకుడి మీద కోపం వచ్చిన సన్నివేశం. ఇప్పటివరకూ వైవిధ్యభరితంగా తీసి, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆ రొటీన్ సన్నివేశాన్ని ఇరికించి హీరో గొప్పదనాన్ని ఇనుమడింప చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
కొన్ని సన్నివేశాల అనంతరం రూప ఆనంద్ ప్రేమని అర్ధం చేసుకుంది. కానీ వ్యక్తపరచలేదు. ఇద్దరిమధ్యా ఇగో క్లాష్. ఆనంద్ సహనం నశించింది. ఎవరికీ చెప్పకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు. మాటల కన్నా మౌనం, కలయిక కన్నా ఎడబాటూ బలంగా పనిచేసే సందర్భం. ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకున్నారు. అందరికీ ఆనందం. నిజంగానే మంచి కాఫీ తాగిన అనుభూతి. "ఇలాంటి సినిమా వచ్చి ఎన్నాళ్ళయ్యింది?" అన్న ప్రశ్న. ఫోన్ తీసి మిత్రులందరికీ సందేశాలు, సినిమా తప్పకుండా చూడమనీ, సినిమాలో తాజాదనం నచ్చి తీరుతుందనీ.
ఓ మిత్రుడికి పోస్టు చేసిన ఉత్తరంలో (ఉత్తరాలు పోస్టు చేసిన చివరి రోజులవి) హీరోయిన్ గురించి రాసిన వాక్యం "హీరోయిన్ కమలిని అందానికన్నా, అభినయానికే ఎక్కువ మార్కులు పడతాయి..." ఎందుకంటే, మొదటిసారి 'ఆనంద్' చూసినప్పుడు నాకు కమలిని అందగత్తె అనిపించలేదు. హీరో కన్నా పెద్దదానిలా అనిపించింది. "కొంచం స్లిమ్ అయితే చాలా బాగుండును" అనుకున్నాను. సహాయ నటుల్లో నాకు బాగా నచ్చింది రూప (తప్పిపోయిన) అత్తగారిగా చేసినావిడ. తర్వాత ఆవిడనోసారి కలిశాను కూడా. చాలా సౌమ్యురాలు అనిపించింది.
పాటలు, ఫైట్లు, కామెడీ ఇలా అన్నీ ప్యాకేజీలు చేసి, కాలిక్యులేషన్లు చేసీ కాకుండా కథకి తగ్గట్టు సన్నివేశాలు రాసుకోవడం, కొత్తవాళ్ళతో సినిమా కదా అని జనాకర్షణ కోసం 'ప్రత్యేక' గీతాలూ, స్కిన్ షోలూ ఇరికించక పోవడం, అన్నింటికీ మించి సినిమాని ఆరోగ్యకరంగా తీయడం నాకు నచ్చిన అంశాలు. చిన్న చిన్న లోపాలున్నా, తర్వాతి సినిమాకి దర్శకుడు వాటిని సరిచేసుకుంటాడులే అనుకున్నాను. మర్నాడు పేపర్ తిరగేస్తుంటే 'ఆనంద్' ప్రకటన చిన్నదీ, అందులో ఒక మొబైల్ నెంబరూ కనిపించాయి. "మంచి సినిమా తీసినందుకు అభినందనలు. దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి ఇలాంటి ఆరోగ్యకరమైన సినిమాలని ఆశిస్తున్నాం" అంటూ ఓ మెసేజ్ పంపాను. ఊహించని విధంగా, పావుగంట తర్వాత రిప్లై వచ్చింది. (ఇంకా ఉంది)
నాకు కూడా హీరోని గొప్పవాడిగా చూపించటానికి ఆ రేప్ సీన్ పెట్టటం నచ్చలేదు.
రిప్లయితొలగించండినిజమే, "ఆనంద్" కథ మొదట్లో చాలా నెమ్మదిగా నడుస్తుందండీ. మొదటిసారి చూసేటప్పుడు మొదటి పది నిమిషాలూ చూసి, ఇది సినీమానే కాదు అని తీర్మానించేసుకుని చూడటం వెంటనే ఆపేసాను. తరువాత ఎప్పుడు చూచినా ఈ మొదటి పది పదిహేను నిమిషాలూ జఱిపేసి చూస్తున్నాను. :)
రిప్లయితొలగించండిఅలాగే, రూప మొదటి స్నేహితుడు బలాత్కరించబోవటం అనే అంకం చాలా కృతకంగా ఉంది.
అబ్బ.. ఎంత మంచి సినిమా గురించి టపా రాస్తున్నారు..:) నాకు చాలా ఇష్టమైన చిత్రం. ముఖ్యంగా సంగీతం. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు. అద్భుతం..:)
రిప్లయితొలగించండికానీ మీ టపానే నాకు నచ్చలేదు..:P వచ్చిన రిప్లై ఏంటో చెప్పకుండా ఇలా అర్థాంతరంగా ఆపేస్తే ఎలా..;) తొందరగా చెప్పండి మురళి గారు, ప్లీజ్ ప్లీజ్..:))))
Very well written article :-)
రిప్లయితొలగించండిSEkhar khammmula sinimaalanTE naaku ishTam. andulOnU aanand sinimaa anTE inkaa inkaa ishTaM. Thanks for writing on Anand.
ఊ..
రిప్లయితొలగించండిమంచి సినిమా. కానీ కొన్ని చోట్ల డైలాగ్స్ మరీ "క్లాస్" గా ఉంటాయి!. ఉదా: ఆనంద్ అమ్మగా చేసినావిడ మాటలు.
రిప్లయితొలగించండి@సాధారణ పౌరుడు: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@రాఘవ: నేను మాత్రం ప్రారంభ దృశ్యాలతో సహా చూస్తానండీ.. అలవాటైపోయింది ఇప్పుడు.. ధన్యవాదాలు.
@మనసు పలికే: అంటే ఒక్క టపాగా కాకుండా విడి విడి భాగాలుగా రాస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఆపడం తప్పదండీ :)) ..రెండో భాగం చదివారు కదా.. జవాబు దొరికినట్టే మీకు... ..ధన్యవాదాలు.
@అవినేని భాస్కర్: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@Ruth: విన్నారన్న మాట!! ..ధన్యవాదాలండీ..
@Creative Oracle: మరి ఆవిడ పెద్ద బిజినెస్ టైకూన్ కదండీ.. ధన్యవాదాలు.