మంగళవారం, జనవరి 04, 2011

ఓ సంభాషణ...

గతవారం ఓ అత్యవసర ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ ప్రయాణం కోసం ఉపయోగించిన రకరకాల ప్రయాణ సాధనాల్లో టాక్సీ ఒకటి. రెండు గంటల పాటు సాగిన టాక్సీ ప్రయాణంలో డ్రైవర్ లక్ష్మణ్ తో సుదీర్ఘ సంభాషణ జరిగింది. ఎందుకో తెలీదు కానీ, ఆ ప్రయాణం, అతనితో జరిగిన సంభాషణ పదే పదే గుర్తొస్తున్నాయి. బహుశా అతను అందరిలా కాక కొంచం భిన్నంగా ఉండడం వల్ల కావొచ్చు.

చాలా ఏళ్ళ పాటు ఓ కాలేజీలో పనిచేసిన లక్ష్మణ్, కొన్ని నెలల క్రితం ఉద్యోగం మానేసి, బ్యాంకు లోనుతో టాక్సీ కొన్నారు. "చాలామంది నేనో మెట్టు దిగుతున్నాను అన్నారు సార్. నేను పట్టించుకోలేదు. కష్టపడి పని చేసి సంపాదించడం, మన అవసరాలు గడుపుకోడం ముఖ్యం. కాలేజీలో పనిచేయడం ఎక్కువా కాదు, కారు నడపడం తక్కువా కాదు," అని చెప్పినప్పుడు అతని మీద మంచి అభిప్రాయం ఏర్పడింది నాకు.

"ఖర్చులు పెరిగిపోతున్నాయి సార్.." అని తను అన్నప్పుడు "అవునండీ, ఐదొందల నోటు జేబులోనుంచి తీస్తే ఐదు నిమిషాల్లో ఖర్చైపోతోంది. కొన్నవేవీ కనిపించడం లేదు," అన్నాన్నేను. టాక్సీలో ఉన్నది మేమిద్దరమే. "మా వంద, మీ ఐదొందలు సమానం సార్," అన్నాడతను నవ్వుతూ. "కాయగూరల కన్నా నాన్వెజ్ కొనుక్కోడమే సులువుగా ఉంది," అంటూ కొనసాగించాడు. రోడ్డు అంతగా బాగోలేదు, ఒకటే గతుకులు. "అర్జెంట్ ఏమీలేదండీ.. నెమ్మదిగా వెళ్దాం .." నా మాట పూర్తయ్యిందో లేదో, "మీరు నన్ను స్పీడుగా నడపమన్నా నడపను సార్. రిస్కు తీసుకోను. ఎవరైనా ముసలాడివా అని ఎటకారం చేసినా నా పద్ధతి ఇదే," అన్న జవాబు వచ్చేసింది.

"పొట్ట వచ్చేస్తోంది సార్. రాత్రిపూట భోజనం మానేయమంటారా?" అని అడిగాడు తను. అంతలోనే "అంటే, భోజనం మానేసి చపాతీ లాంటిది తింటే.." అన్న కొనసాగింపు. "భోజనం మానకండి, కానీ తగ్గించండి. వీలైనంత త్వరగా తినేయండి. వీలయితే కొంచం నడవండి.." అంటూ డైటీషియన్ అవతారం ఎత్తబోయా. "చపాతీ ఎందుకు వద్దంటారు?" తను వదలలేదు. "మీరు చపాతీతో తినే దుంపల కూర వల్ల బరువు పెరుగుతారు. ఇంట్లో కాకుండా బయట హోటల్లో అయితే నూనె బాగా ఎక్కువ వాడతారు. దానివల్ల ఇతరత్రా హెల్త్ సమస్యలు రావొచ్చు.." అని వివరించాను.

రోడ్డు పక్కన పార్టీల జెండాలు కనిపించడంతో సంభాషణ రాజకీయాల వైపు మళ్ళింది. "మంచి పనులు చేసిన నాయకులు ఇద్దరే సార్. చంద్రబాబు, వైఎస్. చంద్రబాబు రోడ్లు బాగుచేశాడు," అంటూనే "ఇప్పుడు సోనియా జగన్ ని కాంగ్రెస్ లోకి పిలిచి ముఖ్యమంత్రిని చేస్తాను అందనుకోండి, అతను ఎలక్షన్లో గెలుస్తాడంటారా?" అని ప్రశ్న సంధించాడు. "రాజకీయాల్లో ఏమన్నా జరగొచ్చు కాబట్టి ఒకవేళ జరిగితే?" అని తన కొనసాగింపు. "గెలుస్తాడు" అన్నాను, రెండో ఆలోచన లేకుండా.

అత్యంత సహజంగానే సంభాషణ అవినీతి వైపుకి జరిగింది. "రాజకీయాలనే కాదు సార్. అన్నిచోట్లా అవినీతి పెరిగిపోయింది. నీతిగా బతికేవాళ్ళని చూసి అందరూ నవ్వే రోజులు వచ్చాయి. మనం నీతిగా ఉండాలా? అవినీతిగానా?" నేను ఆలోచనలో పడ్డాను. తనే కొనసాగించాడు.. "డబ్బు సంపాదించడమే ముఖ్యం అనుకుంటున్నారు సార్. ఏదో ఒకటి చేసి సంపాదించేస్తున్నారు. జనం కూడా ఎంత సంపాదించాడు అని ఆలోచిస్తున్నారే తప్ప ఎలా సంపాదించాడు అని ఆలోచించడం లేదు. ఎలా ఉంటే మంచిదా అనిపిస్తోంది.."

నేను నోరు తెరిచాను.. "ఎలా ఉండాలి అన్నది మనకి సంబంధించిన విషయం అండీ. నీతిగా ఉండాలా లేక ఎలా అయినా డబ్బు సంపాదించాలా అన్నది నిర్ణయించుకోవాల్సింది మనం. మనకి కావాల్సింది నీతిగా ఉండడం, అంతరాత్మకి సమాధానం చెప్పుకోవడం అయినప్పుడు, వేరెవరో డబ్బు సంపాదించేస్తున్నారని ఆలోచించడం అనవసరం. అలాకాకుండా, డబ్బే ప్రధానం అనుకున్నప్పుడు విలువల గురించిన ఆలోచన అనవసరం. చివరికి మన సంతృప్తి మనకి ముఖ్యం. మీరే చెప్పారు కదా, ఉద్యోగం మానేయడం గురించి ఎవరేమన్నా పట్టించుకోలేదని .."

ఇద్దరం ఎవరి ఆలోచనల్లో వాళ్ళం ఉన్నాం. అర్ధరాత్రి కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. అద్దం కొద్దిగా దించగానే చల్లగాలి పలకరించింది. ఉన్నట్టుండి అలుముకున్న నిశ్శబ్దం కొత్తగా అనిపించింది. "2012 కలియుగాంతం అంటున్నారు. నిజమేనా సార్?" అన్నాడు తను, నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ. ఈ ప్రశ్న చుట్టూ మిత్రులతో జరిగిన చర్చలు గుర్తొచ్చాయి. "అయితే మాత్రం ఏమవుతుందండీ?" అన్నాను. "అదేంటి సార్, అలా అంటారు? యుగాంతం అంటే..." తను మాటలకోసం వెతుక్కుంటున్నాడు.

"మనం తప్ప మిగిలిన ప్రపంచం యధావిధిగా ఉంటుందంటే మనం బాధ పడాలి. అలాకాకుండా, మిగిలిన ప్రపంచం అంతా తుడిచి పెట్టుకుపోయి మనం ఒక్కళ్ళమే మిగులుతామన్నా బెంగ పడాలి. ఒకవేళ యుగాంతమే జరిగినా నష్టం ఏముంది చెప్పండి? మనమూ ఉండం, ప్రపంచమూ ఉండదు. అంతే కదా.." అన్నాను. "నిజమే కదా సార్. నిజంగా జరిగినా మనం ఆపలేం. అయినా ఇలాంటి వార్తలు ఎందుకు వస్తాయంటారు?"

తక్కువ టైములో, యెంతో పరిచయస్తుడిలా మాట కలిపి ఎన్నో విషయాలు మాట్లాడిన అతణ్ణి గురించి ఆలోచనలో ఉన్నాన్నేను. గమ్యస్థానం వచ్చేసింది. "ముఖ్యమైన విషయాల నుంచి మన దృష్టి మరల్చడానికి. మనం మన సమస్యలని గురించి కాకుండా ఇతర విషయాలని గురించి ఆలోచించడానికి అయి ఉంటుంది. దీనివల్ల ఎవరికి లాభమో నేను మీకు చెప్పక్కర్లేదు కదా.." అన్నాను టాక్సీ దిగుతూ. తనతో కరచాలనం చేసి, విషెస్ చెప్పడం మరచిపోలేదు నేను.

13 కామెంట్‌లు:

  1. బాగుంది మీ సంభాషణ :) మీరు యుగాంతం గురించి చెప్పిన మాటలు నచ్చాయి.అంతే కదా! ప్రపంచంతో పాటు మనం. హ్మ్! కొన్ని పరిచయాలు అంతే.సమయం తక్కువైనా వారి ప్రభావం చాలా రోజులు ఉంటుంది :)

    రిప్లయితొలగించండి
  2. "మనం తప్ప మిగిలిన ప్రపంచం యధావిధిగా ఉంటుందంటే మనం బాధ పడాలి. అలాకాకుండా, మిగిలిన ప్రపంచం అంతా తుడిచి పెట్టుకుపోయి మనం ఒక్కళ్ళమే మిగులుతామన్నా బెంగ పడాలి. ఒకవేళ యుగాంతమే జరిగినా నష్టం ఏముంది చెప్పండి? మనమూ ఉండం, ప్రపంచమూ ఉండదు. అంతే కదా.." అన్నాను.

    I like this piece very much.

    రిప్లయితొలగించండి
  3. మీరు యుగాంతం గురించి చెప్పిన మాటలు చాలా బాగున్నాయండి.

    రిప్లయితొలగించండి
  4. @ఇందు: నిజమేనండీ.. ధన్యవాదాలు.
    @కృష్ణప్రియ: ధన్యవాదాలండీ..
    @రాధిక (నాని): ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  5. @సునీత: యుగాంతం గురించి నా అభిప్రాయం అదేనండీ.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  6. మురళి గారూ
    మీఇద్దరి సంభాషణ బాగుంది. యుగాంతం గురించి మీ అభిప్రాయం నాకు నచ్చింది. 94 లో అనుకుంటా, వైజాగ్ లో ఆయిల్ ఫ్యాక్టరీ (caltex) మీద పాకిస్తాన్ బాంబు వేస్తుందట, అందరమూ పోతాము అని పుకార్లు మొదలయ్యాయి. నా ఫ్రెండ్ విపరీతంగా భయపడింది. నేను ఇలాగె అనేదాన్ని, కుటుంబంలో అందరమూ ఒక్క సారే పోతే బాధ ఏముంది. కొందరు ఇక్కడ, కొందరు వేరే చోట ఉండి, అలా మిగిలి పోతే ఉన్నవాళ్ళు పోయినవాళ్ళ గురించి బాధ పడాలి కదా అనేదాన్ని.
    ఇక ప్రపంచమే లేకపోతే మనం ఒక్కరం మిగిలి ఏం చెయ్యాలి??
    పద్మవల్లి

    రిప్లయితొలగించండి
  7. మామూలు సంభాషణే ఐనా ఆసక్తిగా అనిపించింది....గోదావరి జిల్లాలవైపుకు వెళ్ళారా ఏంటి మురళిగారు ? ఓ ఇరవై రోజుల క్రితం నేనూ ఓ పదిరోజులు అక్కడే ఉన్నా....టాక్సీప్రయాణమే ...రోడ్లు చూస్తె నిజ్జంగా ఏడుపోచ్చేసిందంటే నమ్మండి...అరగంటలో వెళ్ళాల్సిన ప్రయాణం గంట రెండుగంటలు ! ఇక మన వంశీ గారి పసలపూడి వంతెనదగ్గరైతే మరీ దారుణం!చెరుకు ఫాక్టరీకి బళ్ళు ఎలా వెళ్తున్నాయో అర్ధం కాలేదు.ప్చ్ ....

    రిప్లయితొలగించండి
  8. మురళి గారు,

    అవినీతి గురించి మంచి మాట చెప్పారు. కానీ ఎందుకో ఒకో సారి ఇది మధ్య తరగతి విలువల మిధ్యా అనిపిస్తుంటుంది? ఎక్కువ మంది చేసేది తప్పవుతుందా? ఒకో సారి అసలు ఎలా నెగ్గుకు రాగలం యిలా అయితే అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  9. @పద్మవల్లి: నిజమేనండీ.. ఇలాంటి భయాలు అర్ధంలేనివనే అనిపిస్తాయి నాకు.. ధన్యవాదాలు.
    @పరిమళం: అవునండీ.. రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి.. ధన్యవాదాలు.
    @ఇద్దరు: మనం ఎలా ఉండాలన్న విషయంలో మనకి క్లారిటీ ఉంటే చాలు అనిపిస్తుందండీ నాకు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. టాక్సీడ్రైవర్ నాబోటీవాడే. కాబట్టి మీరు నాతో మాట్లాడేశారు. మరి నాకు ఆఅవకాశమెప్పుడో

    రిప్లయితొలగించండి
  11. @సుబ్రహ్మణ్య చైతన్య: బ్రేస్లెట్టో, చైనో పట్టుకుని వాకాడ బస్సెక్కేస్తానండీ.. సరేనా :-) ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి