శనివారం, ఫిబ్రవరి 27, 2010

అలా అన్నాడు శాస్త్రి

మానవ నైజాన్ని ఎత్తి చూపడం లో ఒక్కో రచయితదీ ఒక్కో శైలి. గోదారొడ్డున జరిగే కథల్ని తనే మనకి స్వయంగా చెబుతున్న అనుభూతి కలిగించే విధంగా అక్షరీకరించే వంశీ మానవ నైజాన్ని ఇతివృత్తంగా తీసుకుని కథ రాస్తే..? "అరె.. అచ్చం వీళ్ళు మనకి తారసపడ్డ మనుషుల్లాగే ఉన్నారే!!" అనిపించక మానదు, వంశీ రాసిన కొన్ని కథల్లో పాత్రలని చూసినప్పుడు. ఆ కొన్ని కథల్లో ఒకటి 'అలా అన్నాడు శాస్త్రి.'

గోదారొడ్డున పల్లెటూరు. ఆ పల్లెటూళ్ళో కొందరు యువకుల స్నేహ బృందం. ఆ బృంద సభ్యుడు శాస్త్రి. పుస్తకాలంటే విపరీతమైన పిచ్చి. కనిపించిన ప్రతి పుస్తకాన్నీ విడిచి పెట్టకుండా చదువుతాడు. 'పుస్తకాలని ఎంచుకుని చదవడం' అన్నది శాస్త్రికి నచ్చని పని. ఆంధ్ర మహా భారతం నుంచి అంబడిపూడి వాళ్ళ పుస్తకాల వరకూ కాదేదీ చదవడానికి అనర్హం శాస్త్రికి.

పాఠకుడు ముదిరి కవో, రచయితో లేక రెండూనో అవ్వడం చాలామంది విషయంలో జరిగే అత్యంత సహజమైన పరిణామం. శాస్త్రి విషయంలో కూడా జరిగింది అదే. పుస్తకాలు చదివి చదివి అలవోకగా కవితలు అల్లడం మొదలు పెడతాడు. మిత్రులెవ్వరూ అతని కవితలని సీరియస్ గా తీసుకోరు. పైగా రాసినవి సరి చేసుకోమనీ, ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలనీ సలహాలూ, సూచనలూ ఇస్తూ ఉంటారు.

కేవలం తన కవితలని అందరికీ చదివి వినిపించడం మాత్రమే కాకుండా మరో కొత్త పని మొదలు పెడతాడు శాస్త్రి. ఆ ఊళ్ళో ఉండే ఒక పాక హోటల్లో బయట ఉంటే నల్ల బోర్డు మీద ఆవేల్టి 'స్పెషల్స్' రాయగా మిగిలిన చోటులో ప్రతి రోజూ ఒక కవిత రాస్తూ ఉంటాడు. చదివిన వాళ్ళు చదువుతారు, చదవని వాళ్ళు చదవరు. మొత్తం మీద ఎవరూ పెద్దగా పట్టించుకోరు.

పొరుగునే ఉన్న దాక్షారం భీమేశ్వరుడి గుడిలో తను రాసిన 'ఆట కదరా శివా' సంపుటాన్ని చదవడం కోసం వస్తాడు సిని నటుడు, రచయిత తనికెళ్ళ భరణి. అనుకోకుండా కాఫీ హోటల్ బోర్డు మీదున్న కవిత చదివి, రాసింది ఎవరని ఎంక్వైరీలు మొదలు పెడతాడు. భరణి ని కలుస్తాడు శాస్త్రి. సాహిత్యాన్ని గురించి మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ. భరణి ద్వారా సినిమా పాటలు రాసే అవకాశం వస్తుంది శాస్త్రికి.

శాస్త్రి పాటలు రాసిన మొదటి సినిమా 'శ్రీ చరణం' బాగా ఆడడంతో 'శ్రీ చరణం' శాస్త్రి గా మారతాడు, అంతే కాదు అనతికాలంలోనే బిజీ గీత రచయితగా మారతాడు. తమ ఊరి వాడు సినిమా రంగంలో అంత పెద్ద పేరు తెచ్చుకోడం చూసి అతనికి సన్మానం చేయాలని సంకల్పిస్తారు మిత్రులు. ఊళ్ళో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అతనికి ఆతిధ్యం ఇవ్వడానికీ, అతనితో కలిసి కూర్చుని మందు పుచ్చుకోడానికీ పోటీలు పడతారు.

చెప్పిన ప్రకారం ఊరికి వస్తాడు శాస్త్రి. మైక్ లో శాస్త్రి రాసిన సినిమా పాటలే వస్తూ ఉంటాయి. కార్యక్రమం మొదలవుతుంది, యువ కవుల కవితాగానంతో. ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కొత్తగా కవితలు రాయడం మొదలు పెట్టిన వాళ్ళు యెంతో ఉత్సాహంగా వస్తారు. సిని కవి గారికి తమ కవితలు వినిపించాలని. శాస్త్రి ఆసక్తి గా వింటాడు, కానీ జనం వినరు. కనీసం చప్పట్లు కొట్టరు.

కొందరు యువ కవులు కవితలు చదివాక, శాస్త్రి మైకు ముందుకి వస్తాడు. ఓ కవిత చదువుతాడు. జనం చెవులు రిక్కించి వింటారు. బ్రహ్మాండమైన స్పందన. చప్పట్ల హోరు. సరిగ్గా అప్పుడు ఆ మహా జనం అంతా ఉలిక్కిపడే మాటొకటి చెబుతాడు శాస్త్రి. తను కవితలు రాసిన తొలి రోజులని గుర్తు చేసుకుంటాడు. మిత్రులతో సహా అందరూ సిగ్గు పడేలా ఉంటాయతని మాటలు. ఇంతకీ శాస్త్రి ఏమన్నాడో తెలియాలంటే 'ఆనాటి వాన చినుకులు' సంకలనం లో ఉన్న 'అలా అన్నాడు శాస్త్రి' కథ చదివితేనే బాగుంటుంది. (నాకీ కథని గుర్తు చేసిన లలిత గారికి థాంకులు.)

13 కామెంట్‌లు:

  1. నేనొప్ప నేనొల్ల మురళి గారూ,మీరు వంశీ పుస్తకాలూ,లలిత గారు "భరణి" పుస్తకాలన్నీ బాకీ పడ్డారు నాకు అంతే.

    రిప్లయితొలగించండి
  2. ఇతివృత్తం ఆసక్తికరంగా ఉంది. వంశీ ఎలా ప్రజంట్ చేసి ఉంటారో ఊహించగలను. నా లిస్ట్ కు మరో పుస్తకాన్ని జత పరిచారు :-)

    రిప్లయితొలగించండి
  3. ఆనాటి వాన చినుకులు ..నాకు చాలా ఇష్టమైన పుస్తకం.."బొత్తిగా అర్ధం కాని మనిషి, ఆనాటి వాన చినుకులు, ఆకుపచ్చని జ్ఞాపకం, శిల, అలా అన్నాడు శాస్త్రి.... ", ఇలా అన్నీ మంచి కధలే.
    కధలు చదువుతున్నంతసేపూ మనమూ ఆ కొండల్లో కోనల్లో తిరుగుతూ, జలపాతాల్లో తడుస్తూ, గోదారమ్మ వడిలో పరవశిస్తూ..ఓహ్..అద్భుతం. గోదారమ్మ అందాల్ని మన కళ్ళెదుట నిలిపే పుస్తకం.
    అద్భుతంగా సాగిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి "ముందు మాట" ఈ పుస్తకానికి మరో ప్రత్యేకత. నా దగ్గరున్న పుస్తకం బహుమతిగా ఇచ్చేశాను. మళ్ళీ కొనుక్కోవాలి.

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగుందండి ఈ కథ. శాస్త్రి ఏమని ఉంటాడో ఊహించటం పెద్ద కష్టం కాదు. కాని, ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసిన విషయం. మంచి కథ పరిచయం చేసారు. ఎంతైనా, మీకు గోదావరి పక్షపాతం కాస్త ఎక్కువేనండి. మిమ్మల్ని ఈ మాట అనాలని చాలా రోజులనుంచి ఎదురుచూస్తున్నాను.JK:)

    రిప్లయితొలగించండి
  5. ఇంతకీ ఈ కధ సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించే కదా.

    రిప్లయితొలగించండి
  6. మురళిగారూ మంచి కధని పరిచయం చేసారండీ .
    ఈ సంకలనంలో నాకు నచ్చిన ఇతర కధలు , ' బాచి ' , యానాం ఏటిగట్టుమీద ' . ఆ కధల్లో పాత్రలు నన్ను చాన్నాళ్ళు వెంటాడాయి .
    శాస్తి ఏమన్నాడో నే చెప్పెస్తా అందరికీ కధ చదవటం కుదరదు కదా పాపం . ( మీరు కోప్పడ్డా సరే )
    " అయ్యా! రాసినవాడు చిన్నవాడయినా, పెద్దవాడయినాసరే, ఎవరు రాశారు అని గాకుండా ఏం రాశారు అని చూడండి. ఆలోచించండి స్పందించండి. అప్పుడు మాట్లాడండి....." ఏ కాలాననికయినా సరిపోయే మాటలు . మనకి ( బ్లాగులకి) కూడా వర్తిస్తాయి . ఆ ...ఇప్పుడు కోప్పడండి !

    రిప్లయితొలగించండి
  7. ఆశక్తికరంగా ఉంది మీ పరిచయం. ఎప్పుడెప్పుడు చదవాలా అనిపించేడట్టు.

    వంశీ చాలా పుస్తాకాలు రాశారా ?? మీ దగ్గర ఆయన కలెక్షన్ మొత్తం ఉన్నట్టు ఉంది.

    నేను తెప్పించుకోవాలి త్వరగా.

    రిప్లయితొలగించండి
  8. మంచి కథను పరిచయం చేసిన మీకు ...మీకు గుర్తు చేసిన లలిత గారికి బోలెడుథాంకులు.

    రిప్లయితొలగించండి
  9. బాగా రాసారు... బాగుంది ఇతివ్రుతం.... ప్రయత్నిస్తాను... ఆ పుస్తకాన్ని.. పట్టుకోవడానికి.....చదవడానికి

    రిప్లయితొలగించండి
  10. @శ్రీనివాస్ పప్పు: తప్పకుండానండీ.. మీరు ఫోటోలు పెట్టిన ఊళ్ళన్నీ నాకు చూపించాలి మరి!! ..ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: 'ఆనాటి వానచినుకులు' తప్పక చదవండి.. అధిక శాతం మంచి కథలు ఉన్న సంకలనం.. ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి; సీరియల్ రాత్రులు, ది ఎండ్, నల్ల సుశీల, యానాం ఏటి గట్టు మీద.. వీటిని వదిలేశారేమండి?? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @జయ: "ఎంతైనా, మీకు గోదావరి పక్షపాతం కాస్త ఎక్కువేనండి.." మీరనడమూ, నేను కాదనడమూనా?? కానివ్వండి :-) ..ధన్యవాదాలు.
    @బోనగిరి: కాదండీ.. ఇది ఊహాత్మక కథ.. కాకపొతే తనికెళ్ళ భరణి పాత్రని ప్రవేశ పెట్టాడు వంశీ.. ధన్యవాదాలు.
    @లలిత: కోప్పడ్డానికి కొత్తపాళీ గారున్నారు కాబట్టి, నేనేం మాట్లాడడం లేదండీ :-) :-) .. మీరు ఇంకేం పుస్తకాలు చదివారో అప్పుడప్పుడూ మీ బ్లాగులో రాస్తూ ఉంటే, నేను వాటి జోలికి రాకుండా ఉంటాను :-) :-) ముగింపు చెప్పేస్తే చదవాలనుకునే వాళ్లకి ఆసక్తి తగ్గిపోతుంది కదండీ, అందుకే చెప్పకపోవడం.. అదన్నమాట.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @వాసు: వంశీవి ఆరు నవలలూ, రెండు కథల సంకలనాలూ, ఒక వెండితెర నవలా ప్రస్తుతం ప్రింట్ లో ఉన్నాయండీ.. రావాల్సిన పుస్తకాలు మరికొన్ని ఉన్నాయి. వీటిలో 'ఆనాటి వానచినుకులు' 'మా పసలపూడి కథలు' తప్పక చదవాల్సినవి. వివరాలు www.emescobooks.com లో దొరుకుతాయండి.. ధన్యవాదాలు.
    @పరిమళం: 'ముగింపు చెప్పిన లలితగారికి' అని చదువుకున్నానండీ.. ధన్యవాదాలు.
    @శ్రీకర్ బాబు: తప్పక చదవండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. మీ పోస్టు చూసి నేనీ పుస్తకం కొన్నానోచ్! :-)

    రిప్లయితొలగించండి