బుధవారం, అక్టోబర్ 14, 2009

పడమటి సంధ్యారాగం

ఉద్యోగం కోసం సొంత ఊరినీ, దేశాన్నీ వదిలి కుటుంబంతో సహా పరాయి దేశానికి వలస వెళ్ళిన తొలితరం భారతీయుడి కథే 'పడమటి సంధ్యారాగం' సినిమా. చిన్నప్పటి నుంచీ అలవాటైన పద్ధతులను, ఆచారాలనూ వదులుకోలేక, వెళ్ళిన దేశం తాలూకు సంప్రదాయాలను అలవాటు చేసుకోలేక ఓ మధ్య వయస్సు వ్యక్తి పడే ఆవేదనను తనదైన శైలిలో హాస్యస్ఫోరకంగా చిత్రీకరించారు దర్శక రచయిత జంధ్యాల. ప్రవాసాంధ్రుడు గుమ్మలూరి శాస్త్రి సినిమాని నిర్మించడమే కాక ప్రధాన పాత్రనూ రక్తి కట్టించారు.

సదాచార సంపన్నుడైన ఆదినారాయణ (గుమ్మలూరి శాస్త్రి) ఉద్యోగం కోసం అమెరికా బయలుదేరతాడు, తన భార్యనీ, టీనేజ్ కూతురు సంధ్య (విజయశాంతి) నీ తీసుకుని. ఆదినారాయణ తమ్ముడు రవి అన్నగారికోసం ఒక ఉద్యోగం చూస్తాడు. తనకి ఉన్న రెండు ఇళ్ళలో ఒకదాన్నీ కేటాయిస్తాడు. సంప్రదాయ బద్ధంగా పెరిగిన సంధ్య పెద్దగా చదువుకోలేదు. ఆ ఇంటికి ఎదురిళ్ళలో ఉండే అమెరికా కుర్రాడు క్రిస్ (టాం) నీగ్రో రోనాల్డ్ (ఇప్పటి ప్రముఖ డ్రమ్మర్ శివమణి) లకి సంధ్యతో స్నేహం కుదురుతుంది.

కూతురు అలా నల్లవాడితోనూ, తెల్లవాడితోనూ స్నేహం చేయడం ఇష్టం ఉండదు ఆదినారాయణకి. సంధ్య స్నేహాన్ని తల్లి అభ్యంతర పెట్టదు. ఒక శుభ ముహూర్తాన అబ్బాయిలిద్దరూ సంధ్యకి ప్రపోజ్ చేస్తారు. క్రిస్ కి 'ఎస్' చెబుతుంది సంధ్య. సరిగ్గా అప్పుడే అమెరికా లో స్థిర పడ్డ ఒక తెలుగు డాక్టరుతో సంధ్యకి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాడు ఆదినారాయణ. పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయి సాయంతో క్రిస్ ని కలుసుకుని దూరంగా పారిపోతుంది సంధ్య. కూతురి మతాంతర వివాహాన్ని అంగీకరించక తప్పదు ఆదినారాయణకి.

కథంతా ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో నడుస్తుంది. ఆదినారాయణ మరణ వార్త తెలిసి, నడివయసు లో ఉన్న సంధ్య, క్రిస్ తో కలిసి అంత్యక్రియలకోసం ఇండియా రావడం తో కథ మొదలవుతుంది. కొడుకులు లేని ఆదినారాయణకి అల్లుడు క్రిస్ అంతిమ సంస్కారం చేయడం, సినిమా ప్రారంభ సన్నివేశం. తన ఐదేళ్ళ వయసులోనే తాతయ్యతో పాటు ఇండియా కి వచ్చేసిన సంధ్య-క్రిస్ ల కూతురు అనిత, 'అంతిమ సంస్కారం చేసే అర్హత నీకేం ఉంది?' అని క్రిస్ ని కోపంగా ప్రశ్నించడంతో కూతురికి తన గతం చెబుతుంది సంధ్య.

కథ తాలూకు సీరియస్ నెస్ ని ఏమాత్రం చెడగొట్ట కుండా, సినిమాని ఆసాంతమూ హాస్యరస భరితంగా రూపు దిద్దడం లో జంధ్యాల ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యపాత్రల్లో నటించిన ప్రవాస భారతీయుల్లో కొందరు సరిగా నటించలేకపోయినా డైలాగుల్లో విరుపులు, మెరుపుల ద్వారా ఆ లోపాన్ని చాలా వరకు కవర్ చేశాడు దర్శకుడు. అమెరికా జీవితంలో కష్టసుఖాలు, ముఖ్యంగా కొత్తగా ఆ దేశం వెళ్ళే వాళ్లకి ఎదురయ్యే ఇబ్బందులని చిన్న చిన్న సన్నివేశాల ద్వారా నవ్విస్తూ చెప్పాడు.

ముగింపు సన్నివేశంలో 'మతం' గురించి విజయశాంతి ఆవేశంగా చెప్పే పొడవైన డైలాగు వినగానే 'సప్తపది' క్లైమాక్స్ లో వర్ణ వ్యవస్థ గురించి జే.వి. సోమయాజులు చెప్పిన డైలాగు గుర్తొస్తుంది. (ఆ సినిమాకి కూడా రచన జంధ్యాలే) విజయశాంతి మినహా ప్రముఖ నటులెవ్వరూ లేరు. ప్రారంభ, ముగింపు సన్నివేశాల్లో ఆహార్యంలో పెద్దరికం కుదరకపోయినా అమెరికా సన్నివేశాల్లో అమాయకత్వం కలబోసిన పాత్రలో విజయశాంతి మెప్పించింది. తర్వాత చెప్పుకోవాల్సింది గుమ్మలూరి శాస్త్రి గురించి. తిండిపోతు 'గణపతి' కామెడీ ట్రాక్ పూర్తిగా జంధ్యాల మార్కులో ఉంటుంది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చడం, పాటలు పాడడంతో పాటు 'లైఫ్ ఈజ్ షాబీ' అనే తమాషా పాటను రాశారు కూడా.. కేవలం ఈ పాటలో మాత్రమే విజయశాంతి వెస్ట్రన్ వేర్ లో కనిపిస్తుంది. సంప్రదాయ సంగీతాన్నీ, వెస్టర్న్ మ్యూజిక్ ని కలబోసి నేపధ్య సంగీతాన్నీ అందించారు బాలు. నాలుగు పాటలూ చెప్పుకోదగ్గవే.. నాకు 'ముద్దుగారే యశోద.. ' పాట అంతే ప్రత్యేకమైన ఇష్టం. ముఖ్యంగా ఈ పాట చిత్రీకరణ. 'పిబరే రామరసం' కీర్తన ని కనీసం ఏడాదికి ఒకసారి శ్రీరామనవమి రోజునైనా తలచుకొని వాళ్ళు అరుదు. ఇక 'ఈ తూరుపు..' పాటలో నాయికా నాయకులు పరుగులు పెడుతూనే ఉంటారు.

ఈ సినిమా వచ్చింది 1986 లో. కథ అప్పటికి ఇరవయ్యేళ్ళ క్రితం జరిగింది (అని విజయశాంతి చెబుతుంది) కథలో ప్రస్తావించిన అంశాలు, అంటే రెండు భిన్న సంస్కృతుల మధ్య ఘర్షణ, పుట్టిన దేశాన్నీ అక్కడి సంస్కృతినీ మర్చిపోలేక పోవడం, కొత్త చోట ఇమడలేక పోవడం వగైరా లన్నీ ఈ నాలుగు దశాబ్దాలలోనూ ఏమైనా మారాయా? అని సందేహం నాకు. భూగోళానికి అవతలి వైపున ఉన్న బ్లాగ్మిత్రులు మళ్ళీ ఒకసారి ఈ సినిమా చూసి తమ ప్రస్తుత అనుభవాలని జోడించి టపాలు రాస్తే బాగుంటుందేమో..

35 కామెంట్‌లు:

  1. ఇవ్వాల్టి రోజున అమెరికా జీవితాలు ఎలా ఉన్నాయో బ్లాగ్మిత్రులు రాయాలి.
    మంచిసినిమా సోదరా!! జంధ్యాలకు ఓ జై. గుమ్మలూరి శాస్త్రి గారికి జై. ఇంతమంచి సినిమాని గుర్తుచేసినందుకు మురళికి జై.

    రిప్లయితొలగించండి
  2. hi muraligaru,
    మీ పోస్ట్ చదవానండి .చాల బాగుంది. సినిమాలో హాస్యం ఎన్ని సార్లు చుసిన విసుగనిపించదు.ఇంక విదేశాల్లో ముఖ్యంగా పండుగాల్లప్పుడు మన దేశాన్ని మిస్ అవ్వతాము.పండగ ఈ ఆదివారమో వస్తే తప్ప పండగ లానే వుండదు.ఆ సినిమాలో చుపించినట్టే ఇప్పుడు వుంది.

    రిప్లయితొలగించండి
  3. మీరు వీటిని www.navatarangam.com లో పెడితే మా లాంటి సినిమా పిచోల్లకు మంచి విందు కదా ....

    రిప్లయితొలగించండి
  4. ఈ సినిమా నాకెందుకో అప్పట్లో పిచ్చ పిచ్చగా నచ్చింది. మంచి రివ్యూ

    రిప్లయితొలగించండి
  5. హహ ....శాస్త్రి గారికి తమ్ముడు డ్రెస్ లు సెలెక్ట్ చేసినప్పుడు దృశ్యం కళ్ళ ముందుకొస్తే చాలు పొట్ట చెక్కలై పోతుంది.ఆయన తిట్లూ ...గృహప్రవేశ దృశ్యం ...అన్నీ కళ్ళముందుకు తెచ్చారు థాంక్స్ !

    రిప్లయితొలగించండి
  6. నాకు చాల చాల నచ్చిన సినిమా ...మే ఆవకాయ్ యు ఐస్ క్రీం .....తెగ విని పాడేస్కునేదాన్ని..మంచి సినిమా గుర్తుచేశారు .భలే తవ్వుకోస్తారు ఎక్కడ ఎక్కడివో ....

    రిప్లయితొలగించండి
  7. చాలా మంచి సినిమా. ముఖ్యంగా విదేశీయులకు భారతీయ సంప్రదాయాల పట్ల ఉన్న అభిమానం, గౌరవం ఈ చిత్రంలో చాలా గొప్పగా చూపించారు. చాలా మంచి రివ్యూ. భారత దేశానికి విదేశాలలో, ఏ కాలమైన ప్రత్యేక స్థానం తప్పకుండా ఉంటుంది. అదే మన సంస్కృతి గొప్పతనం.

    రిప్లయితొలగించండి
  8. విజయశాంతి అంటే మగరాయుడిలా పాంటేసుకుని విలన్లని షేకాడించే పాత్రలకే పరిమితం అనుకున్నోళ్లకి ఈ సినిమా చూపించాలి :-)

    కొంత ట్రివియా:

    ఈ సినిమాలో గుమ్మలూరి శాస్త్రికి డబ్బింగ్ చెప్పింది సుత్తి వీరభద్రరావు.

    ఓ సన్నివేశంలో అతిధి పాత్రలో సుత్తి వేలు కనిపిస్తాడు (ఆ రకంగా, ఇందులో ఇద్దరు ప్రముఖ నటీనటులు ఉన్నారు)

    ఇందులో హీరోగా వేసిన టామ్ అసలు పేరు థామస్ జేన్ (Thomas Jane). అతనికి ఇదే మొదటి సినిమా. ఆ తర్వాతి కాలంలో అతను హాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా ఎదిగాడు; Deep Blue See, Under Suspicion, The Original Sin, The Mist, Dreamcatcher, Face/Off వంటి హిట్ చిత్రాల్లో నటించాడు.

    రిప్లయితొలగించండి
  9. నాకు ఈ సినిమా భలే నచ్చుతుంది..ముఖ్యంగా 'పిబరే రామ రసం' పాడుకుంటే మనకు తెలీకుండానే భక్తి ఆవహించేస్తుందండీ..ఆ తర్వాత అమెరికా బేస్ చేసుకుని కొన్ని సినిమాలు వచ్చినా వాటికి దీనంత పాపులారిటీ రాలేదనుకుంటా.
    ఇప్పటి వాళ్ళల్లో ఎక్కువమందికి(ముఖ్యంగా ఉద్యోగాల ద్వారా వెళ్ళేవాళ్ళకి) అక్కడ ఇమడలేకపోవటం అన్న సమస్యే లేదని నా ఉద్దేశం. మొదట్లో కొద్దిగా ఆ ఫీలింగ్ ఉన్నా అకౌంట్లో డాలర్లు పడేసరికి ఎలాంటివాడైనా ఓ నెలకే అడ్జెస్ట్ అయిపోతారు(ఇది అక్కడికెళ్ళిన నా కొలీగ్స్ చాలామంది అన్నారు). మనవాళ్ళకి ఎలాగు ఆదినారాయణకి ఉన్నంత చాదస్తం, కట్టుబాట్లు లేకపోవటం కూడా ఒక ప్లస్సే.

    రిప్లయితొలగించండి
  10. ఈ సినిమా ఆ రోజుల్లోనే (అంటే అమెరికా రాక ముందే) నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో ఇప్పుడు స్పష్టంగా గుర్తు లేదు.
    అమెరికాలో ప్రవాస భారతీయుల జీవితం ఏవన్నా మారిందా అంటే .. దీనికి స్పష్టమైన క్లుప్తమైన జవాబు లేదు. ఆ పరిణామం ఒక జీవితమంత సంక్లిష్టమైనదే.

    రిప్లయితొలగించండి
  11. నేను ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు వచ్చింది సినిమా, అప్పట్లో ఇంత అమెరికా గోల లేదు అప్పుడప్పుడే బాగా పుంజుకుంటోంది. చూసి ఎంత అబ్బురపడిపోయామో ఆ A & P షాప్ లు (అవి న్యూజెర్సీ పక్క వుంటాయనుకుంటా) ఆ రోడ్ లు సైంట్ లూయీస్ లోని పెద్ద ఆర్చ్ కూడా చూపిస్తారు కదా పాట లో. అవి అన్ని చూసి అబ్బుర పడి పోయాము, వేలు ఇండియా కు అమెరికా కూ తేడా చెప్పిన సీన్ తలుచుకుంటే నవ్వు వస్తుంది. గుమ్మలూరి శాస్త్రి గారు (వాషింగ్టన్ లో వుంటారు ఈ సంస్కృతి సాహిత్యాలంటే చాలా ఇష్టం, తరువాత కూడా ఇక్కడ అమెరికా అక్కడ ఇండియా ఇంకా కొన్ని ప్రవాసాంధ్ర సినిమాలలో నటించారు ఆయన) ఇంకా ఇక్కడి వాళ్ళు ఎందరో... ఇక్కడికి వచ్చాక చూసినప్పుడో లేక ఏదో పాంప్లెట్ లలో చూసినప్పుడూ ఈయనే కదా పడమటి సంధ్యా రాగం లో ఆయన అనుకునే వాళ్ళము. ఎంత సునిశితమైన హాస్యం, వ్యంగ్యం జంధ్యాల గారికి. "నల్ల వాళ్ళు వస్తే వాళ్ళకు మనం అంటే అక్కసు అని, తెల్ల వాళ్ళు వస్తే వాళ్ళకు మనం అంటే చిన్నచూపు" అని గుమ్మలూరి గారి తో చెప్పించి సగటు ఇండియన్ మనస్తత్వాన్ని ఆవిష్కరించారు కదా.
    అన్నట్లు నేను గణపతి ని కూడా చూసేనండోయ్.. జంధ్యాల గారు చెప్పినంత ఈజీ గా ఎవ్వరు ఇక్కడ అమెరికా అబ్బాయి లు కాని అమ్మయిలు కాని పెళ్ళి కి అంత తొందర గా కమిట్ అవ్వటం నేను ఐతే చూడలేదు. మరి 60 ల లో కూడా అలా లేదు అనుకుంటా. అంటే సినిమా అంత సేపు పొడిగించలేక అలా తీసేరేమో లే ఆయన. నల్ల వాళ్ళకుండే సహజమైన ఎమోషనల్ మనస్తత్వాన్ని బాగా చూపించేరు. నేను అమెరికా వచ్చాక పెద్ద సిటీ లలో ఎప్పుడు లేను సబర్బ్ (అంటే మన ఫక్తు పల్లెటూళ్ళు అనుకోండి) ల లోనే వుండటం వలన ఇక్కడి జీవితం నాకు చాలానే నచ్చింది ఆ సినిమాలో చెప్పినట్లు వసుధైక కుటుంబాలతో కలిసి. :-)

    రిప్లయితొలగించండి
  12. నాకు బాగా నచ్చిన సినిమాలలో ఇది ఒకటి. నాకు తెలిసి నేను మొదటిసారి అమెరికాని చూసింది ఈ సినిమాలోనే. ఈ సినిమా చూసాకే నాకు అమెరికా మీద మనసు కలిగింది ఒకసారి వెళ్ళాలని. ఈ సినిమాలో గృహ ప్రవేశ సన్నివేశంలో ఆ విశాలమైన కాలనీలో ఇల్లు చూసాక అబ్బ అమెరికాలో ఇండ్లు అంత విశాలంగా ఉంటాయా అని ఆశర్యపోయాను.
    ఇంకా ఈ సినిమాలో కామెడి అయితే సూపరో సూపర్. ఎన్ని సార్లు చూసినా చాలా ఆహ్లాదంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  13. ఆ సినిమాలో గుమ్మలూరి శాస్త్రి నటన నాకు నచ్చింది. ఒక సీనులో అక్కడి పద్ధతులు, సంస్కృతి వగైరాల పట్ల తన వ్యతిరేకతను, ఆవేదనను అదోరకమైన - నిర్వేదంగా, నిరాసక్తంగా, ఉద్వేగరహితంగా - చెబుతాడు, చాలా చక్కగా చేసాడక్కడ.

    "ముఖ్యపాత్రల్లో నటించిన ప్రవాస భారతీయుల్లో కొందరు సరిగా నటించలేకపోయినా డైలాగుల్లో విరుపులు, మెరుపుల ద్వారా ఆ లోపాన్ని చాలా వరకు కవర్ చేశాడు" - ఔనౌను!

    నాకీ సినిమాలో అస్సలు నచ్చని అంశం -ఆ తిండిపోతు గణపతి హాస్యం! :)

    అన్నట్టు శాస్త్రిగారి గొంతు ఆయనదేనా?

    రిప్లయితొలగించండి
  14. మంచి సినిమా గుర్తు చేశారు మురళి గారు. అమెరికా లో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్ళిన ఆర్కెస్ట్రా టీం తో ఈ సినిమా లోని "పిబరే రామ రసం.." పాట అమెరికాలోనే రికార్డ్ చేశారుట. ఇలా ఇతరదేశం లో పాటల రికార్డింగ్ జరుపుకున్న చిత్రం ఇదే అంటారు.

    ఒక తిండిపోతుకి ఐస్ క్రీం షాప్ ఉండటం అనే ఐడియా జంధ్యాల గారికే చెల్లింది :-) గణపతి తండ్రి ని "కులాసా?" అని పలకరిస్తే ఆయన "ఆ!! కు..లాసే.. అంటే కుమారుని వల్ల లాసు.." అని విరవడం ఫక్కున నవ్విస్తుంది. ఇంకా గుమ్మలూరి శాస్త్రి గారి సన్నివేశాలు అన్నీ వందశాతం నవ్విస్తాయి.

    నాకు "ఈ తూరుపు ఆ పశ్చిమం.." పాట బాగ నచ్చుతుంది. బాలు గారు రాసిన ఇంగ్లీష్ పాట "లైఫ్ ఈజ్ షాబీ.." లిరిక్స్ చాలా తమాషాగా ఉంటాయి.

    రిప్లయితొలగించండి
  15. late commer has come....(బెంచ్ ఎక్కాలా?)
    నిన్న రాత్రి బాగా లేట్గా చూసాను కానీ సరిగ్గా చదవలేదు హడావుడిలో...
    జంధ్యాల గారి మరో మంచి సినిమా...
    "ముద్దుగారే..", "పిభరే.." రెండు బాగుంటాయి..నాక్కూడా "ముద్దుగారే యశోద.." ఇష్టం.పాటలో ఆ బుల్లి అమెరికన్ బాబు భలే ముద్దుగా ఉంటాడు.

    ఈ సినిమా ప్రొడ్యూసర్స్ గుమ్మలూరి శాస్త్రి, మీ అబ్దుల్లా గార్లు కలిసి "మరో పడమటి సంధ్యారాగం" అనే సినిమా మొదలుపెట్టారు,కాని అది పూర్తవ్వలేదనుకుంటా...
    జంధ్యాల మార్క్ తిట్లు కూడా ఈ సినిమాలో బాగా కనిపిస్తాయి..."ముష్టి వెధవ, అంట్ల వెధవ, పింజారీ కుంక, అడ్డ గాడిద, నెల తక్కువ కుంక,...etc etc..(మిగతావి రాయటానికి బాగోవు)

    ఇక విభిన్న సంస్కృతుల్లో ఘర్షణ ఇప్పటికీ వుంది కానీ ఇక్కడనుంచి వెళ్ళిన "చాలా మంది" నాకు తెలిసినవాళ్ళు అక్కడ నుంచి "రావాలని అనుకోకపోవటం" నాకు తెలిసిన విషయం. మీరడిగిన నాలుగు దశాబ్దాలలో నాకు కనబడిన మార్పు అది.

    రిప్లయితొలగించండి
  16. hats off for ur review on a ever green film.

    hats off to actors, director and every one.

    రిప్లయితొలగించండి
  17. ఈ సినిమా నా ఆల్టైమ్ ఫేవరైట్. ఆ సినిమాలో "లైఫ్ ఈజ్ షాబీ, వితవుట్ యూ బేబీ" అన్న పాట స్వయానా బాలు గారు రాసి, పాడారు. (మ్యూజిక్ కూడా బాలు యే అని అనుమానం).అప్పట్లో విజయశాంతిని వల్గారిటీ కొంచెం కూడా లేకుండా అత్యంత రొమాంటిక్ గా చూపించిన సినిమా ఇదే.

    రిప్లయితొలగించండి
  18. చదువరి గారు,
    శాస్త్రి గారికి డబ్బింగ్ చెప్పింది గురువుగారు జంధ్యాల గారే.

    రిప్లయితొలగించండి
  19. రవి గారు ఈ సినిమాకి మ్యూజిక్ బాలు గారే
    చదువరి గారు, బ్లాగాగ్ని గారు,
    గుమ్మలూరి శాస్త్రి గారి పాత్ర కి డబ్బింగ్ చెప్పింది సుత్తి వీరభద్రరావు గారు. శాస్త్రి గారి ఆహార్యం ఎంత సరిగ్గా సరిపోయింది అంటే టీవీ లో మొదటి సారి ఈ సినిమా లోని లాంగ్ షాట్ సీన్స్ చూసిన నేను ఓ క్షణం ఈ పాత్ర వేసింది వీరభద్రరావు గారే అనుకున్నాను.

    చిత్రమేమిటంటే చూపులు కలిసిన శుభవేళ అనుకుంటాను సుత్తి వీరభద్రరావు గారి చివరి సినిమా. అందులో వీరభద్ర రావు గారి పాత్రకి జంధ్యాల గారు డబ్బింగ్ చెప్పారు.

    రిప్లయితొలగించండి
  20. మంచి మూవీ గుర్తు చేసారు.
    నాకు గణపతి పాత్ర చాల ఇష్టం ఈ మూవీ లో

    రిప్లయితొలగించండి
  21. చదువరి గారూ -
    తిండిపోతు గణపతి! నేను చాలాసార్లు చూసాను ఇతన్ని ఫార్మింగ్టన్ హిల్స్, 10 West Mile Rd లో.

    అబ్రకదబ్ర - ఈ సినిమాలో గుమ్మలూరి శాస్త్రికి డబ్బింగ్ చెప్పింది సుత్తి వీరభద్రరావు.
    బ్లాగాగ్ని - శాస్త్రి గారికి డబ్బింగ్ చెప్పింది గురువుగారు జంధ్యాల గారే.

    ఏది కరకట్టు?

    రిప్లయితొలగించండి
  22. @భాస్కర్ రామరాజు: ధన్యవాదాలు.
    @స్వాతి మాధవ్: సినిమా మరో సారి చూసి ఒక టపా రాయండి.. ధన్యవాదాలు.
    @విజయక్రాంతి: 'నవతరంగం' కి నేను రాస్తూనే ఉంటానండి.. బ్లాగు సైడ్ బార్ లో ఉన్నాయి చూడండి, అక్కడ వచ్చిన టపాలు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. @భాస్కర్ రామిరెడ్డి: ఎందుకై ఉంటుందండి? :):) ..ధన్యవాదాలు.
    @పరిమళం: 'గృహ ప్రవేశం' మొత్తం సినిమాకే హైలైట్ అండి.. ధన్యవాదాలు.
    @చిన్ని: ఎక్కడా తవ్వలేదండీ.. నా డీవీడీ కలెక్షన్ :):) .. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  24. @లక్ష్మి: అవునండీ, మంచి పాట.. ధన్యవాదాలు.
    @జయ: నిజమేనండీ.. ధన్యవాదాలు.
    @అబ్రకదబ్ర: పాపం.. 'కర్తవ్యం' కి ముందు పేంట్లు, ఫైట్లు లేవండీ.. 'లేడీ అమితాబ్' అనిపించుకోక ముందు చాలా మంచి పాత్రలు చేసింది.. ట్రివియా బాగుంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. @శేఖర్ పెద్దగోపు: చాదస్తం విషయం లో మీరు చెప్పింది నిజమే.. బహుశా డాలర్లు కూడా నిజమే కావొచ్చు.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: నాకెందుకో మీకీ సినిమా నచ్చదు అనిపించింది.. బాగానే గెస్ చేశా.. ధన్యవాదాలు.
    @భావన; పెళ్లి విషయం లో మీరు చెప్పింది నిజం.. బహుశా సినిమా నిడివి దృష్టిలో పెట్టుకుని అలా చేసి ఉంటారు.. నల్ల వాళ్ళ మనస్తత్వం నిజంగా బాగా చూపించారు.. ఆ తల్లీ కొడుకుల అనుబంధం భలేగా ఉంటుంది.. సగటు ఇండియన్ మనస్తత్వాన్ని హాస్య రస భరితంగా చెప్పడం జంధ్యాల శైలి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. @శ్రీనివాస్ చింతకింది: మీరే కాదండీ.. చాలా మంది తెలుగు వాళ్ళు 'అమెరికా' ని మొదటిసారి చూసి ఉంటారు, ఈ సినిమాలో.. ధన్యవాదాలు.
    @చదువరి: శాస్త్రి గారి గొంతు వీరభద్ర రావు గారిడా, జంధ్యాల గారిడా అన్న చర్చ మొదలయిందండి.. సినిమా మళ్ళీ చూశాను.. నాకు వీర భద్రరావు గారి గొంతులాగే అనిపించింది.. గణపతి జంధ్యాల మార్కు హాస్యం.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: 'గణపతి' కి డబ్బింగ్ శుభలేఖ సుధాకర్, తండ్రికి పొట్టి ప్రసాద్ అని నా సందేహం.. ఏమంటారు? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. @తృష్ణ: మీరు లేటెస్ట్ గా వచ్చారండీ :):) నాకు తెలిసి రావడానికి ఆరాట పడే వాళ్ళు కూడా కొందరు ఉన్నారండీ.. మొత్తం మీద చూస్తే రావాలనుకునే వాళ్ళు తక్కువే.. ధన్యవాదాలు.
    @మోహన వంశీ: ధన్యవాదాలు.
    @రవి: మ్యూజిక్ బాలూనేనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. @బ్లాగాగ్ని: గొంతు వినడం కోసమే మళ్ళీ చూస్తే వీరభద్ర రావు గారి గొంతు అనిపించిందండీv.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: వీరభద్ర రావు- జంధ్యాల గురించి కొత్త విషయం చెప్పారు..
    @మా ఊరు: ధన్యవాదాలు.
    @భాస్కర్ రామరాజు; సుత్తి వీరభద్ర రావు అనే నేనూ అనుకుంటున్నా.. ఎవరైనా ఏమన్నా చెబుతారేమో చూడాలి..

    రిప్లయితొలగించండి
  29. hi murali garu ,
    miru rasinataravta naku inkamei rayalo tleiayteldandi.ant amiru rasesaruga!

    రిప్లయితొలగించండి
  30. ఈ సినిమాకు ముందు అమెరికా అమ్మాయి అనే సినిమా వచ్చింది. అది కూడా బాగా హిట్టయ్యింది.
    ఇక విజయశాంతి ఇంత అందంగా, ముద్దుగా బహుశా మరే సినిమాలోనూ ఉండదు.
    అది జంధ్యాల గొప్పతనమా? మన సంప్రదాయం గొప్పతనమా?

    రిప్లయితొలగించండి
  31. @స్వాతి మాధవ్: మీ అమెరికా అనుభవాలు కొన్ని రాశారు కదా.. మిగిలినవి కూడా రాయండి.. ధన్యవాదాలు.
    @బోనగిరి: మీ ప్రశ్నకి సమాధానం 'రెండూను' .. 'అమెరికా అమ్మాయి' నేను కూడా చూశానండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  32. నాకు విపరీతంగా నచ్చే సినిమాల్లో ఇదొకటి. హాస్యాన్నీ, వ్యంగాన్నీ, సందేశాన్నీ, ఏదీ మోతాదు మించకుండా కలగలపి తీశారు జంధ్యాలగారు. తమ్ముడిపాత్ర ద్వారా అతను మాటలను వింటున్నప్పుడల్లా చాలా సంతోషమనిపిస్తుంది.

    ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది "లేచున్నుండి కాలంతో పరిగెట్టటమే అని".
    ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇక్కడ. పెద్దగా మార్పు లేదు.

    రిప్లయితొలగించండి
  33. నాకు అమెరికా రావాలన్న ఆలోచన అప్పటికి లేదు కనుక ఆ చూసిన ఆసక్తి వేరు, ఇప్పుడు మీ సమీక్ష చదివితే కాస్త ఆలోచన కలిగింది. మేము సిడ్నీలో వున్నప్పుడు ఒకరి ముగ్గురమ్మాయిలు ఆస్ట్రేలియన్లని చేసుకున్నారు.వాళ్ళు ఉపనయనం తో సహా వేదం నేర్చుకుని పూజలు అవీ చేసేవారు. అలాగే ఇక్కడ అన్ని రకాల దేశాంతర వివాహాలు కనిపిస్తాయి. ఈ మధ్యనే నన్నొకరు అడిగారు మీ పిల్లలకి ఇలా అంగీకరిస్తారా అని. సమాధానం కాలం చెప్పాలి. నా పిల్లలకి మన సంస్కృతి, సాంప్రదాయం లోని నాకు సరైన వివరణ అంది నాకు నచ్చిన విషయాలే వాళ్ళకి చెప్తుంటాను. అలాగే ఇక్కడి వారిలో కూడా వున్న విలువలు, వ్యక్తిత్వం, నిబద్దత, స్వేఛ్ఛ నచ్చుతాయి. మా పిల్లలు ఎన్నో రకాల దేశ, మతాల వారితొ కలుస్తారు. కనుక మరి కొన్ని ఏళ్లలో మీకొక కథ నేనే వ్రాసిస్తాను. అప్పటికి మీరు జంధ్యాల గారి పాత్రలో వుంటే నేనొక విజయశాంతిని కాగలను. క్రొత్త కథ క్రొత్త దర్శకత్వం.:)

    రిప్లయితొలగించండి
  34. @భవాని: చాలా సీరియస్ విషయాలని హాస్య ధోరణి లో చెప్పారండి.. హోమియోపతి మందులా అన్నమాట.. అది బాగా నచ్చుతుంది నాకు.. ధన్యవాదాలు.
    @ఉష: "కనుక మరి కొన్ని ఏళ్లలో మీకొక కథ నేనే వ్రాసిస్తాను. అప్పటికి మీరు జంధ్యాల గారి పాత్రలో వుంటే నేనొక విజయశాంతిని కాగలను. క్రొత్త కథ క్రొత్త దర్శకత్వం.:)" ..మీ శైలిలో మరొక పజిల్.. నేను జంధ్యాల పాత్రలో.. ఇప్పటికైతే అలాంటి సూచనలేవీ కనిపించడం లేదండి.. చూద్దాం.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి