మొన్నొక రోజు పి. లీల, జిక్కి పాడిన కొన్ని పాత పాటల కోసం గూగులింగ్ చేస్తున్నా.. దొరికిన కొన్ని ట్రాకుల వివరాలు చూసినప్పుడు భలే ఆశ్చర్యం వేసింది. అదే పాట, అదే ట్యూను.. కానీ పాడింది మాత్రం కొత్త గాయనులు. అంతే టీవీ ప్రోగ్రాములలో పాడినట్టుగానే పాత పాటలు పాడి రికార్డులు విడుదల చేశారన్న మాట. ఇప్పుడు మనం షాపులకి వెళ్తే ఫలానా గాయకుడు/గాయని పాడిన ఒరిజినల్ పాట కావాలి అని ప్రత్యేకంగా అడగాలన్న మాట.
మనకి ఘంటసాల ఒక్కడే.. కానీ ఆంధ్రదేశంలో ఘంటసాలలా పాడే వాళ్ళు వందలమంది ఉన్నారు. వాళ్ళలో చాలా మంది సినిమాల్లో పాడాలని ప్రయత్నించారు.. కానీ బాలు ఒక్కడే సక్సెస్ అయ్యాడు.. తన టాలెంట్ తో పాటు, ఘంటసాలని అనుకరించక పోవడమూ ఇందుకు కారణం. బాలు ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యాక, బాలులా పాడే వాళ్ళు వందలు, వేలు తయారయ్యారు. వీళ్ళెవరూ బాలు అంత పేరు తెచ్చుకోలేక పోయారు. బాలులా పాడడానికి బాలు ఉండగా, వీళ్ళంతా ఎందుకు?
మన అభిమాన గాయనీ గాయకులు పాడిన పాటలు మనం ఆస్వాదిస్తాం. అందుకు కారణం వాళ్ళ గొంతు. వయసు ప్రభావం వల్ల వాళ్ళు మునుపటిలా పాడలేక పోయినా, వారి మీద అభిమానంతో వినగలం.. కానీ అవే పాటలని వేరొకరు అనుకరిస్తుంటే భరించడం కొంచం కష్టమే. పాటల పోటీలు ఇందుకు మినహాయింపు. ఎందుకంటే బహుశా అక్కడ పోటీలో పాల్గొన్న గాయకుడు/గాయని ఆ పాటని అసలు గాయకులు పాడినట్టు పాడగలిగారా లేదా అన్నది మాత్రమే చూస్తాం కాబట్టి.
సాహిత్యం ఈ అనుకరణ కి మినహాయింపు కాదు. ఒక రచయిత/ రచయిత్రి పాపులర్ కాగానే ఇక ఔత్సాహిక రచయిత (త్రు)లందరూ ఆ పాపులర్ రచనలని అనుకరించడం మొదలు పెడతారు. యద్దనపూడి సులోచనారాణి, యండమూరి వీరేంద్రనాథ్ ల రచనలకి వచ్చిన అనుకరణలు ఇందుకు ఉదాహరణలు. సహజంగానే ఈ అనుకరణ రచనలు ప్రజల ఆదరణ పొందలేక పోయాయి. ఒరిజినల్ కి ఉన్న విలువ, గౌరవం నకలుకి ఎందుకు ఉంటుంది?
'కాళిదాసు కవిత్వం కొంత.. నా పైత్యం మరికొంత' అని ఒక వాడుక. రీమిక్స్ పాటలు చెవిన పడ్డప్పుడల్లా నాకీమాట గుర్తొస్తుంది. ఒరిజినల్ పాటని అలా బతకనివ్వకుండా సంగీతాన్నీ, సాహిత్యాన్నీ కూడా ఖూనీ చేసి రీమిక్స్ పేరుతో మార్కెట్లోకి వదులుతున్నారు. పాత తరం గాయనీ గాయకుల్లో చాలామంది ఈ రీమిక్స్ లని వ్యతిరేకించారు. ఒక పాట నచ్చినప్పుడు దానిని యధాతధంగా వాడుకోవచ్చు కదా? దానికి ఈ మార్పులు, చేర్పులు ఎందుకు? నిజంగా అంత టాలెంటే ఉంటే ఆ పాత పాటని తలదన్నే విధంగా ఓ సరికొత్త పాటని సృజించ వచ్చు కదా?
సంగీతమైనా, సాహిత్యమైనా దానిని అనుకరించే వాళ్లకి అభిరుచి, టాలెంట్ బొత్తిగా లేదని అనుకోలేం. ఒరిజినల్ ని ఎంచుకోడంలో వాళ్ళ అభిరుచి, దానిని మార్చే ప్రయత్నంలో వాళ్ళ టాలెంట్ తెలుస్తున్నాయి. ఒక్కోసారి తమ ప్రతిసృష్టి అసలు సృష్టిని మరిపించాలన్న తాపత్రయమూ కనిపిస్తోంది. వీళ్ళ సామర్ధ్యాన్ని అనుకరణ కోసం వృధా చేస్తున్నారు కదా అనిపించకా మానదు. ఒరిజినల్ కి ఉన్న విలువ అనుకరణకి ఉండదని వీళ్ళకి తెలియదనుకోవాలా? కాపీ చేయడం కోసం పడుతున్న శ్రమని మరో మెట్టు పెంచి, బుర్రకి పదును పెడితే మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా..
"వీళ్ళ సామర్ధ్యాన్ని అనుకరణ కోసం వృధా చేస్తున్నారుకదా అనిపించక మానదు ...ఒరిజినల్ కి వున్నా విలువ అనుకరణకి వుండదని వీళ్ళకి తెలియదు అనుకోవాలా ? " చాలా బాగా చెప్పారండీ.....పేరడిల పేరిట వికృత సాహిత్యం అతి తెలివో ...అజ్ఞానమో ...ప్చ్ .
రిప్లయితొలగించండిమంచి టపా...
రిప్లయితొలగించండిఈ రోజు ఆంధ్ర దేశంలో వందలమంది టాలెంట్ ఉండి పాడేవాళ్ళు ఉన్నా సినిమాల్లో పాడేందుకు మళ్ళీ పరభాషా గాయకులనే( ఓ శ్రేయాఘోషల్ నో లేక కార్తీక్ నో) తీసుకోడానికి కారణం ఎక్కువ మంది వాయిస్ అనుకరణలా ఉండటం, సొంత గొంతు లేకపోవటమే. అయితే నాకు తెలిసి ఈ అనుకరణ ఏ కొద్ది మందికి తప్పించి మొదట్లో నేర్చుకుంటున్నప్పుడు సింగర్స్ అందరికీ అనుభవమే అయివుంటుందనుకుంటా. ఎస్.పీ శైలజ గారు 'జాతర' అనే సినిమాలో 'మాఘ మాస వేళలో..' అనే పాట మీరు విన్నట్టయితే సుశీల గారిని అనుకరిస్తున్నట్టు ఉంటుంది. ఆవిడే ఏదో షోలో చెప్పారు...తను మొదట్లో సుశీలగారిని బాగా అనుకరించేవారట. సో ఒక దశ వరకు ఈ అనుకరణ తప్పదేమో!! సునీత గారి 'ఈ వేళలో నీవూ..'సాంగ్ కి, మొన్నటి 'అందంగా లేనా..' సాంగ్ కి ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి..
ఇప్పుడిప్పుడే పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిలో సొంత గొంతుక కలిగిన కొద్దిమంది సింగర్స్ గీతా మాధురీ లాంటి వారు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు.
నిజమేనండి...కొన్ని రీ-మిక్సులు బానే ఉంటాయి కాని కొన్ని అస్సలు వినలేము.ఒరిజినల్ పాట ను ఖూనీ చేసేస్తూ ఉంటారు...కానీ ఇది రీ-మిక్సుల కాలం.చాలావరకూ నేటి యువతకి ఇవే తప్ప ఒరిజినల్ పాటలసలు తెలిస్తేగా..?!
రిప్లయితొలగించండిరీమిక్స్ లతో ఒక గోల ఐతే, వాటి మీద తీసే వీడియో లు మరీ దారుణం. చక్కటి సాహిత్యం ఉన్న పాత పాటలను వికారం కలిగించే ఆహార్యంతో, అవతారాలతో, భంగిమలతో సర్వనాశనం చేస్తున్నారు. "ఓహో బస్తీ దొరసానీ బాగ ముస్తాబయ్యింది" అని సావిత్రి గారి పాట ఉంటుంది, ఆ పాట వింటూంటే ఒక కొత్త పెళ్ళి కూతురు చూపించే బిడియం, పెదవి విరుపులు, ఉత్తుత్తి అలకలూ అన్నీ కళ్ళ ముందు అలా అలవోకగా మెదులుతాయి, దాని స్మిత రీమిక్స్ చేసి పైన నేను చెప్పినట్టు వీడియో రిలీస్ చేసింది, అది చూసి నాకు వెళ్ళి ఆమె పీక నొక్కాలి అన్నంత కోపం వచ్చింది, ఎవరు ఏమనుకున్నా సరే. మంచి అంశాన్ని స్పృశించారు బాగుంది
రిప్లయితొలగించండినాకు రిమిక్స్ వి౦టు౦టే బలవ౦త౦గా నా చెవిలో చిన్నప్పుడు వద్దనా వినకు౦డా ప్రతి శనివార౦ నూనె పోసేనప్పుడు కల్గిన పీలి౦గ్ కల్గుతు౦ది.
రిప్లయితొలగించండిఅసలు అసలే ...నకీలి నకీలే !!!బాగా రాసారు..ఇ౦క చూసుకుని వినాలి ఆ పాతమధురాలు.
అనుకరణ -- మాములు గా పాడితే పర్వాలేదు అందులో అనవసరమైన విరుపులు, చాలా అనవసరమైన హొయ లు చూస్తే నాకైతే లక్ష్మి గారన్నట్లు వెళ్ళి పీక నొక్కాలి అనిపిస్తుంటుంది ఒక్కోసారి.. మొన్నెప్పుడో మా ఫ్రెండ్స్ ఏదో రీ మిక్స్ సీడీ తెచ్చారు అందులో "మబ్బే మసకేసింది లే" పాట వింటుంటే అబ్బ ఎందుకులే... అసలే ఈ మధ్య న నాకు బీ పీ వస్తున్నట్లు వుంది అని జనాల వువాచ. మీకు బలే బలే ఆలోచనలు వస్తాయి మురళి పోస్ట్ రాయటానికి.... ఇవి అన్ని మాకూ రోజూ ఎదురవుతుంటాయి... కాని ఇంత చక్క గా వ్యక్తీకరించటం మాత్రం మీకే చెల్లు..
రిప్లయితొలగించండిలక్ష్మిగారూ ముందెళ్ళి ఆ పనిచూడండీ. మీకే ప్రోబ్లెం లేకుండా నేను చూసుకుంటాను . అధిష్టానం నా మాటకాదను. నాకిష్టమైనపాట " సన్నజాజీపడకా .....మంచెకాడాపడకా......." ఈ పాటనికూడా ఆవిడే ఖూనీ చేసింది
రిప్లయితొలగించండినాస్నేహితుల్లో చాలామంది అనేమాట "బాలుకన్నా బాగాపాడేవాళ్లు కొన్నివందలమంది ఉన్నారు. తొక్కేశాడు" వాళ్లుగొప్ప అనుకరణలేగానీ సొంతగాత్రాన్ని పలికించలలేరురా అంటే వినిపించుకోరు. బహుశా అందువల్లేనేమో మనోకూడా మంచిగాయకుడు అనిపించుకున్నాడే గానీ గొప్పగాయకుడూ కాలేకపోయాడు. అతనుపాడిన పాటల్లో చాలవరకు బాలుఖాతాలోకి వెళ్లిపోయాయి. ఒకవేళ అతనికన్నా బాగాపాడే గాయకుడు ఉంటే వదులుకునేందుకు దర్శక నిర్మాతలు ఏమైనా వెధవలా.
రిప్లయితొలగించండి>>ఎందుకంటే బహుశా అక్కడ పోటీలో పాల్గొన్న గాయకుడు/గాయని ఆ పాటని అసలు గాయకులు పాడినట్టు పాడగలిగారా లేదా అన్నది మాత్రమే చూస్తాం కాబట్టి.
రిప్లయితొలగించండిబ్రదర్, తెలుగు ప్రోగ్రాములు చూసి నాలుగేళ్ళైంది కాబట్తి అక్కడిదేశాకాలమాన పరీస్థితులు పెద్దగా అవగాహన లేదు [పోటీలి గట్ర]. నాకు జి వస్తుంది. సరెగమప తప్పక చూస్తా. పిల్లలు పాతపాటైన కొత్త పాటైనా, సుర్ తప్పకుండా, తమదైన స్టైల్లో పాడినవాళ్ళే గెలుస్తున్నారు.
నిన్న ఆశాభోస్లే వచ్చింది గెస్ట్గా, ఓ పిల్ల ఆశా హిట్ పాటపాడింది. ఆశా లేచి నుంచుని ఏమందంటే - నువ్వు నన్ను అనుకరించకుండా నీ స్టైల్లో సుర్ తో పాడావు అని.
ఇక సినిమాల్లో పాట్టానికి ఛాన్స్ రావడం మోరె ఏ పొలిటికల్ తాన్ ఎనీ.
మీరన్నట్టు ఆ నాటి మధురాలని చేతనైతే డిజిటైజ్ చెయ్యాలికానీ రిమిక్స్ చేసి అవమానించకూడాదు.
మంచి అంశాన్ని స్పృశించారు బాగుంది!
రిప్లయితొలగించండిమీకు బలే బలే ఆలోచనలు వస్తాయి మురళి పోస్ట్ రాయటానికి...???
గుడ్ పాయింట్. కొన్ని సంవత్సరాల క్రితం కిశోర్ గారి పాటలు అన్నీ మంచివి ఒకే క్యాసెట్ లో దొరికాయి కదా అని సంతోషం గా కొని ఇంటికొచ్చి విన్నాక తెలిసింది అనుకరణ అని. క్షణం ఆలశ్యం చేయకుండా రిటర్న్ చేయడానికి ప్రయత్నిస్తే తీసుకోలా. అయినా నాకీ దరిద్రం వద్దు అని వాడి మొహాన కొట్టేసి వచ్చా. అప్పటి నుండే జాగ్రత్తగా చూడటం అలవాటయింది.
రిప్లయితొలగించండిఅనుకరణ ఒక్కటే ఐతే ఫరవాలేదు కానీ ఈ రీమిక్సులని (కొన్నింటిని)భరించడం కొంచెం కష్టం గానే ఉంది ! మీరు పోస్ట్ రాయడానికి టాపిక్ కోసం అస్సలు వెతకక్కర్లేదు ఎందుకంటే నెమలికన్ను మీ ఓపెన్ డైరీ కదా ! మాతో పంచుకుంటున్నందుకు థాంక్స్ !
రిప్లయితొలగించండి>> ఒక పాట నచ్చినప్పుడు దానిని యధాతధంగా వాడుకోవచ్చు కదా? దానికి ఈ మార్పులు, చేర్పులు ఎందుకు?
రిప్లయితొలగించండిMurali, well said. I hate remix.
@చిన్ని: 'పేరడీల పేరిట వికృత సాహిత్యం...' అది ఆయా 'రచయితల' సంస్కారానికి సంబంధిన విషయం అండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శేఖర్ పెద్దగోపు: నిజమేనండి.. కొత్త టాలెంట్ ని వెలికి తీయడంలో టాలెంట్ షో లు పెద్ద పాత్రనే పోషిస్తున్నాయి.. ఏ రంగంలో అయినా విజయం సాధించాలంటే 'తనదైన ముద్ర' అవసరం.. ధన్యవాదాలు.
@తృష్ణ: ఒరిజినల్ ని ధ్వంసం చేయడాన్ని మాత్రం సమర్దించ లేము కదండీ... ధన్యవాదాలు.
@లక్ష్మి: ఎవరూ ఏమీ అనుకోరండి.. పైగా అభినందిస్తారు కూడా.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సుభద్ర: అవునండీ.. జాగ్రత్తపడాలి.. ధన్యవాదాలు.
@భావన: మీరు చెప్పిన పాత నేనూ విన్నానండి, ఎఫ్ఫెం లో.. పూర్తిగా వినలేక స్టేషన్ మార్చేశా.. ధన్యవాదాలు.
@లలిత: నాదీ మీ మాటే.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సుబ్రహ్మణ్య చైతన్య: నిజమేనండీ.. మనో బాలూ ప్రభావం నుంచి బయట పడితే మరిన్ని మంచి పాటలు పాడ గలిగేవాడు. మీరన్నట్టు టాలెంట్ దొరికితే మనవాళ్ళు వదులుకోరు కదా.. ధన్యవాదాలు.
@భాస్కర్ రామరాజు: నిజమే.. రీమిక్స్ అంటే ఒరిజినల్ ని అవమానించడమే.. ధన్యవాదాలు.
@సునీత: ఏమిటోనండి.. అలా వచ్చేస్తూ ఉంటాయ్ ఆలోచనలు.. బ్లాగు ఉన్నది రాసుకోడానికే కదా అని రాసేస్తూ ఉంటా :-) .. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: మీరూ బాధితులే అన్న మాట... కవర్ మీదే తెలిసేలా రాస్తే కావలసిన వాళ్ళే కొనుక్కుంటారు.. ఇలా మోసం చేయడం ఎందుకు చెప్పండి? ..ధన్యవాదాలు.
@పరిమళం: కొంచం కాదండీ.. భరించడం చాలా కష్టంగా ఉంది.. ధన్యవాదాలు.
@భాస్కర రామిరెడ్డి: ధన్యవాదాలు.
నిజమేనండి ఈ రిమిక్స్ లు భరించడము కష్టం గానే వుంది. మంచి మంచి పాత పాటలన్నీ ఘోరంగా తయారు చేస్తున్నారు .
రిప్లయితొలగించండి@మాలాకుమార్: నాకైతే ఒక్కోసారి 'రీమిక్స్' లకి వ్యతిరేకంగా ఏదైనా చట్టం వస్తే బాగుండు అనిపిస్తుందండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఅందరూ చాలా బాగా చెప్పారండి..మీ అందరి మాటే నా మాట..మీ అందరూ స్పందించిన తీరే నా స్పందన కూడా.
రిప్లయితొలగించండి@ప్రణీత స్వాతి: అందరికీ చెప్పిన మాటే మీకూను :-) ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి