ఎదురు చూడగా చూడగా ఎట్టకేలకి మేఘం మనసు కరిగింది.. వర్షం కురిసింది.. మామూలుగా కాదు.. నింగీ నేలా ఏకమయ్యేంత వాన కురుస్తోంది. హమ్మయ్య.. కొన్ని సమస్యలకి పరిష్కారం దొరికింది. ముందుగా వాతావరణం చల్లబడింది. వానల పుణ్యమా అని కూరగాయల పంట మొదలవుతుంది కాబట్టి వాటి ధరలు కొంచం తగ్గొచ్చు. గడ్డి మొలుస్తుంది కాబట్టి పాలకి సమస్య ఉండకపోవచ్చు. రైతుల అదృష్టం బాగుంటే పంటలు బాగానే పండొచ్చు.
మనం ఆశాజీవులం కాబట్టి భవిష్యత్తుని ఎప్పుడూ పచ్చగానే ఊహించుకుంటాం. మరి వర్తమానం సంగతేమిటి? వర్షం కురవడం వల్ల ఏం జరిగింది? ఎప్పుడూ ఏం జరుగుతుందో అదే జరిగింది. మహానగరాలు (?) మొదలు చిన్న చిన్న పట్టణాల వరకు రోడ్లన్నీ మునిగిపోయాయి. పేపర్ల భాషలో లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. ఇక్కడ రెండు సమస్యలు. బాధితులకి తాత్కాలిక ఉపశమనం, సమస్యకి శాశ్వత పరిష్కారం. రెండూ రాజకీయాల చుట్టూ తిరిగే సమస్యలే.
మా ఊళ్ళో ఏటా వినాయక చవితి టైముకి గోదారి రావడం మామూలే. ('వరదలు' అన్నది పేపర్లు, రేడియో, టీవీల వాళ్ళ భాష, మేమెప్పుడూ గోదారొచ్చింది అనే అంటాం, అంటున్నాం) గోదారికి బాగా కోపం వచ్చినప్పుడు లంక గ్రామాలు మునిగిపోతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళని ఒడ్డుకి తీసుకొచ్చి స్కూళ్ళలోనూ అక్కడా ఉంచి, భోజనాలూ అవీ చూసి, గోదారి తగ్గాక పంపిస్తూ ఉంటారు సర్కారు వాళ్ళు. ప్రతిసారీ వాళ్ళది ఒకటే గొడవ, కొందరిని (అంటే ఫలానా పార్టీకి వోటేసే వాళ్ళని) బాగా చూస్తున్నారు, ఇంకొందరిని చూడడం లేదు అని. దాన్నే రాజకీయం అంటారని తర్వాత తెలిసింది.
ఇదిగో ఇప్పుడు వానలకి కూడా అదే రాజకీయం. ప్రభుత్వం వాళ్ళిచ్చే సాయం కొంత మందికే అందుతోందనీ, చాలా మందికి అందడం లేదనీ. చోటామోటా నాయకుల మొదలు బడా నేతల వరకూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోడం. రెండు రోజులు ఎండలు కాస్తే వాన తాలూకు బురద ఎండిపోతుంది.. ఈ తిట్ల బురద మాత్రం ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. సరే.. వాళ్ళకది నిత్యకృత్యం.. విషయం ఇది కాకపోతే మరొకటి. మనం అసలు సమస్య గురించి ఆలోచిద్దాం.
ఇప్పుడంటే కొంచం పెద్ద వానలు పడ్డాయి కాబట్టి రోడ్లు మునిగి పోయాయంటే అర్ధం చేసుకోవచ్చు. మామూలుగా చిన్న చినుకు పడితేనే నీళ్ళన్నీ రోడ్డు మీద ఉంటాయి మనకి. ఇంక మురికి వాడల పరిస్తితి చెప్పక్కర్లేదు.. వాళ్ళని నీళ్ళలోనుంచి బయటికి తేడానికి పడవల మీద వెళ్ళాల్సిందే. హరప్పా, మొహెంజుదారో నాగరికతల్లో ప్రజలు డ్రైనేజి వ్యవస్థ మీద బోలెడంత శ్రద్ధ చూపించారు.. చాలా అభివృద్ధి చెందేశాక అలాంటి వాటి గురించి ఆలోచించడం మనకెంత సిగ్గు చేటు?
అసలు మన మురుగు నీటి డ్రైనేజీ లే ఉండాల్సిన సైజులో సగం ఉంటాయి.. ఆక్రమణలూ అవీ పోగా మిగిలిన డ్రైనేజీ లు పాపం ఎప్పుడో తప్ప మనల్ని ఇబ్బంది పెట్టవు. వర్షం కురిస్తే ఆ నీళ్ళకి వేరే దిక్కు లేదు, డ్రైనేజీ లో కలవాల్సిందే. చెరువులు, కుంటలూ ఇళ్ళ స్థలాలుగా రూపాంతరం చెందేశాయి. అసలే అంతంత మాత్రం డ్రైనేజీలు కొత్తగా నీళ్ళు వచ్చి చేరితే పొంగి పొర్లక ఏం చేస్తాయి? 'పల్లమెరగడం' నీటి ధర్మం కాబట్టి, మనుషులు ధర్మం తప్పినా ప్రకృతి ధర్మం తప్పదు కాబట్టి, ఈ నీళ్ళన్నీ పల్లపు ప్రాంతాలకి పోటెత్తుతాయి.
కంటింజెంసీ ఫండ్స్ తో తాత్కాలిక ఉపశమనాలు చేసి, శాశ్వత పరిష్కారానికి నిధుల కోసం ప్రపంచ బ్యాంకుకి ఓ ఉత్తరం రాయడం తో ప్రభుత్వ బాధ్యత పూర్తవుతుంది. మరి మన బాధ్యత? డ్రైనేజీ లు పొంగడంలో మన తప్పేమీ లేదా? కాల్చేసిన సిగరెట్టు ముక్క నుంచి, ఇంట్లో మిగిలిపోయిన అన్నం వరకూ ఏది పారేయాలన్నా మనకి మొదట కనిపించేది డ్రైనేజీ నే కదా? పైగా ఈ చెత్తా చెదారాన్నంతా ప్లాస్టిక్ సంచుల్లో మూటకట్టి మరీ పారేస్తాం. అడిగేంత ధైర్యం ఎవరికి?
ఎవరు చేసింది వాళ్ళే అనుభవించాలని కదా మన కర్మ సిద్ధాంతం చెబుతోంది.. అది వోటు వేసో, వెయ్యకో నాయకులని ఎన్నుకోవడమే కావొచ్చు.. లేదా చెత్తతో డ్రైనేజీ లు నింపడమే కావొచ్చు.. పర్యవసానాలు అనుభవించాల్సింది మనమే.. దీనికి వర్షాన్ని నిందిస్తే ఎలా?
అన్నిటికంటే పెద్ద కామెడీ వర్షాకాలం లో నే రోడ్లు తవ్వాలి, డ్రైనేజి పనులు చెపట్టాలి అని మన ఎం.సి.హెచ్ వాళ్ళకి తోచటం. వర్షం పడ్డ రోజు బయటకి రావటం అంటే చుక్కలు కనిపిస్తున్నాయి, కానీ ఎమి చెయ్యగలం మేరా భారత్ మహాన్ అనుకుంటూ బ్రతికెయ్యటమే
రిప్లయితొలగించండిమీ అభిప్రాయంతో డిట్టో అనటం తప్ప .......
రిప్లయితొలగించండివానను గురించి హర్షంతొ మొదలైన మీ టపా డ్రైనేజి వ్యవస్థ మీదా,ప్రభుత్వ నిర్లక్యం మీదా బాగానే ఉరిమిందండోయ్...
రిప్లయితొలగించండిఆర్ట్ స్టూడెంట్ నవటం వల్ల హరప్పా,మొహంజదారోల డ్రైనేజీ వ్యవస్థ గురించిన వివరాలు నాకు బాగానే తెలుసు.వాళ్ళది చాలా పటిస్ఠమైన,planned system.
ఇక చెత్త పారవేసే విషయానికి వస్తే,నేను మాత్రం కర్వేపాకుతో సహా మొత్తం చెత్తను కవర్లో కట్టి చెత్త డబ్బాలో మాత్రమే పారవేస్తానండి.ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ జూట్ బ్యాగ్లనే వాడతాను.
చాలా బాగా చెప్పారు..మనం చేసింది మనమే అనుభవించాలి.
రిప్లయితొలగించండిఅందుకనే నగరాల్లో వర్షం కురవడాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నా మధ్యక్షా. ఇది ప్రతిపక్షాల కుట్ర తప్ప వేరు కాదు.
రిప్లయితొలగించండి@కొత్తపాళీ గారు:
రిప్లయితొలగించండిమా కడపలో వర్షాలు అంత ఎక్కువ పడవు.. కాబట్టి మిగతా నగరాల్లో ఎక్కడా పడకూడదని వరుణదేవుడికి మనవి చేస్తున్నాము అధ్యక్షా! :))
(సన్నబియ్యం దొరక్క ముతకబియ్యం తింటున్నానన్న YSRకి ప్యారడీ)
పర్యవసానాలు అనుభవించాల్సింది మనమే..
రిప్లయితొలగించండిఅందుకే....అనుభవించాము!
అనుభవిస్తున్నాము!
అనుభవిస్తాము!
ఇప్పుడు వానలో ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళే ధైర్యం చేయలేక....ఇదిగోండి అనుభవిస్తున్నాం ఇక్కడే ఇంకో రెండు గంటలు.
రిప్లయితొలగించండికొత్తపాళీ గారితో ఏకీభవిస్తున్నా! :-)
రిప్లయితొలగించండిఅయ్యయ్యో, అదేంటండి- మొన్నమొన్ననే కదా 'నీ రాకకొసం' అని ఎంతో పరితపించారు. మీ చెలిని ఎంతో వేడుకొన్నారు, ఎవ్వరికైనా కనిపిస్తే మీకు చెప్పమని ఎంతో అల్లాడిపోయారు. ఇప్పుడేంటండి ఇలా మాట్లాడుతున్నారు. అయ్యో రామా ! మీ చెలివొస్తే ఫలితం ఇంత తీవ్రంగా ఉంటుందని మరచిపోయారా.
రిప్లయితొలగించండిజయగారు.....పిలిచిన వెంటనే వస్తే పర్యవసానం ఇలా ఉంటుందని తెలిసే ఇంత ఆలస్యంగా వచ్చిందేమో కదండీ:)
రిప్లయితొలగించండికొత్తపాళీ గారి తో నేనూ డిట్టో !
రిప్లయితొలగించండిఅయినా వర్షాలకి బుద్ధి లేదు. అవి కురవాల్సిన పల్లెల్లో కురవకుండా - జాగా లేని పట్టణాల్లోనీ, నగరాల్లోనీ కురవడం దేనికి ? మేఘ మధనం లాగా (అవి పని చేస్తాయనుకుంటే) నగరాల మీద మేఘాలు కమ్ముకోగానే వాట్ని పల్లెల వైపుకి తరిమికొట్టాలి. అంత సాంకేతిక పరిజ్ఞానం మనం సాధించేదాకా (డ్రైనైజీల కోసం ఆక్రమణల్ని, రియల్ ఎస్టేట్లనీ ఖాళీ చేయించడం కన్నా ఇదే సులువు) నేను ఇంకోటి ఆలోచించడానికి ఒప్పుకోను. అంతే !
వర్షం!!!వాన!!!జల్లు!!!
రిప్లయితొలగించండిఈ సంవత్సరం వీటి కోసం ఎన్ని రోజులు వేచిఉన్నమో చెప్పలేము.ఇప్పుడేమో ఎప్పుడు తగ్గుతుంది రా బాబు ఈ వర్షం అని అనిపిస్తుంది.తొలకరి జల్లులలో తడవాలని చాలా కోరికగా ఉండేది...కాని ఒక్కసారిగా వచ్చిన ఈ తుఫానుకి నా ప్రమేయం లేకుండానే ౩ సార్లు తడిచాను...బాగా జలుబు చేసింది... :(
మీ వర్ణన చాలా బాగుంది...మేము కూడా గోదారోచ్చింది అనే అంటాము...మా వూరు కూడా గోదారి ఒడ్డుననే ఉంది మరి...
@లక్ష్మి: మునిసిపాలిటీ వాళ్ళ లీలలు దేవుడికి కూడా అర్ధం కావండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సునీత: ధన్యవాదాలు.
@తృష్ణ: హరప్పా కాలంలో ప్రజలు డ్రైనేజి అవసరాన్ని గుర్తించారండీ.. కానీ ఇప్పుడు మనం ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదనిపిస్తోంది.. మీ జాగ్రత్తకి, ఎకో-ఫ్రెండ్లీ బ్యాగులు వాడుతున్నందుకూ అభినందనలు. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
@ప్రణీత స్వాతి: ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@కొత్తపాళీ: మరి కుట్రని ఎదుర్కోడానికైనా ఏదో ఒకటి చెయ్యాలి కదండీ?? ..ధన్యవాదాలు.
@మేధ: మీ పేరడీ సూపరు.. ధన్యవాదాలు.
@పద్మార్పిత: ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@సృజన: ధన్యవాదాలు
@సుజాత: :-) :-) ధన్యవాదాలు
@జయ: తప్పు మన దగ్గర పెట్టుకుని తననేమీ అనొద్దూ అంటున్నానండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@Sujata: ఈ ఆలోచనేదో బాగుందండీ.. ధన్యవాదాలు
@హను: సీజన్ లో వచ్చే మొదటి వానలో తడవకూడదండీ.. రెండు మూడు వానలు పడ్డాక తడవొచ్చు.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.. ధన్యవాదాలు.
"ఎవరు చేసింది వాళ్ళే అనుభవించాలని కదా మన కర్మ సిద్ధాంతం చెబుతోంది.. అది వోటు వేసో, వెయ్యకో నాయకులని ఎన్నుకోవడమే కావొచ్చు.. లేదా చెత్తతో డ్రైనేజీ లు నింపడమే కావొచ్చు.. పర్యవసానాలు అనుభవించాల్సింది మనమే.. దీనికి వర్షాన్ని నిందిస్తే ఎలా?"
రిప్లయితొలగించండిమహ బాగా చెప్పారు. ఈ ఒక్క సంగతే కాదండీ..మనం అనుభవిస్తున్న చాలా సమస్యలకి చాలావరకు మనమే కారణం. అది అందరూ గుర్తించి, మార్పు అనేది మన దగ్గర నుంచే మొదలవ్వాలి. అప్పటిదాకా ఇంతే.. విషయం ఏదయినా చేసుకున్న ఖర్మలు అనుభవించక తప్పదు.
అన్నట్టు.. మేం కూడా 'గోదారొచ్చింది' అనే అంటామండీ.. పైన హను కూడా చెప్పాడుగా ;)
@మధురవాణి: అవునండి.. హను చెప్పారు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి