గురువారం, సెప్టెంబర్ 28, 2023

ఎమ్మెస్ స్వామినాథన్ ...

తమిళ దేశాన్ని తలచుకోగానే గుర్తొచ్చే ఇద్దరు ఎమ్మెస్ లలో రెండోవారు ఎమ్మెస్ స్వామినాథన్ వెళ్లిపోయారు. స్వామినాథన్ అనగానే గుర్తొచ్చే మొదటి/ఏకైక విషయం హరిత విప్లవం. నార్మన్ బొర్లాగ్ తో కలిసి స్వామినాథన్ చేసిన పరిశోధనలు, నాటి ప్రభుత్వ సాయంతో క్షేత్ర స్థాయిలో ఆ పరిశోధనలని అమలు చేసిన తీరు, వాటి ఫలితంగా అప్పటివరకు ఆహార ధాన్యాల కొరతని అనుభవించిన భారత దేశం క్రమంగా మిగులు నిలవలని పెంచుకుంటూ వచ్చే దిశగా ఎదగడం ఇవన్నీ గుర్తొస్తాయి. వీటితో పాటే పీఎల్-480 ఒప్పందం, దాని తాలూకు చీకటి కోణమైన 'కాంగ్రెస్ గడ్డి' లాంటి కలుపు మొక్కలూ జ్ఞాపకం వచ్చి తీరతాయి. స్వామినాథన్ కి నివాళి అర్పించే ముందు ఆ సంగతులన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి.

స్వతంత్రం వచ్చిన తొలి దశాబ్దాలలో భారతదేశం ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య ఆహారం. పెరుగుతున్న జనాభాకి, సంప్రదాయబద్ధంగా సాగుతున్న వ్యవసాయం నుంచి వస్తున్న ఫలసాయానికీ మధ్య దూరం అంతకంతకీ పెరిగిపోవడంతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది.తక్షణ పరిష్కారంగా అంతర్జాతీయంగా అందే సాయం మీద దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఆ కృషి ఫలించి, అమెరికా తిండి గింజల ఎగుమతికి అంగీకరించింది తన పీఎల్-480 కార్యక్రమంలో భాగంగా. అమెరికా నుంచి దిగుమతులు వచ్చే నాటికి భారత దేశంలో తిండి గింజలు మాత్రమే కాదు, విత్తనాలకీ కొరత వచ్చింది. దిగుమతుల్లో వచ్చిన గింజలనే విత్తనాలుగా నాటింది నాటి రైతాంగం. దీనివల్ల జరిగిన దుష్పరిణామం పేరు 'పార్తీనియం.' స్థానికంగా 'వయ్యారి భామ' అనే అందమైన పేరున్న ఈ కలుపు మొక్కకి తెలుగు రైతులు పెట్టిన మరో పేరు 'కాంగ్రెస్ గడ్డి.'

వేగంగా వ్యాపించే కలుపుమొక్క పార్తీనియం. ఈ మొక్క ఒక్కసారి మొలిచిందంటే మరి చంపేందుకు వీలుండదు. మొదలంటా నరికినా, తగలబెట్టినా కూడా మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది. ఉబ్బస వ్యాధి గ్రస్తులతో పాటు పాడి పశువులకీ ఈ మొక్క ప్రాణాంతకం. "ఈ కాంగిరేస్సూ పోదు, కాంగిరేసు గడ్డీ పోదు" అని తిట్టుకునే వాళ్ళు రైతులు (బీజేపీ నాయకులు 'కాంగ్రెస్ ముక్త భారత్' అని నినదించినప్పుడల్లా నాకు గుర్తొచ్చే మాట ఇదే). ఈ పార్తీనియం విత్తనాల వెనుక అమెరికా కుట్ర కోణం ఉందని చాలామందే నమ్మారు. ఇది ఒక కారణం అయితే, ఏటా కొత్త దాతలని వెతుక్కోవాల్సి రావడం, సాయం అందుకోడం వల్ల అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ మసకబారడం లాంటి మరిన్ని కారణాలు భారత ప్రభుత్వాన్ని 'తిండి గింజల స్వయం సమృద్ధి' వైపు గట్టిగా ఆలోచించేలా చేసింది. ఫలితమే హరిత విప్లవం. ఈ హరిత విప్లవ పితామహుల్లో ముఖ్యులు, వ్యవసాయ శాస్త్రవేత్త, డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్.


సినీ నటుడు శోభన్ బాబు పేరు మీద ప్రచారంలో ఉన్న కొటేషన్ "రానురాను మనుషులు పెరుగుతారు తప్ప భూమి పెరగదు". ఇది రియల్ ఎస్టేట్ కి మాత్రమే కాదు, వ్యవసాయానికి కూడా వర్తిస్తుంది. నిజానికి మొదట వర్తించేది వ్యవసాయానికే . కూడు తర్వాతే కదా గూడు. హరిత విప్లవం లక్ష్యం వ్యవసాయ యోగ్యమైన భూమిలోనే అధిక దిగుబడులు సాధించడం. మేలైన విత్తనాల కోసం పరిశోధనల మొదలు, ఎరువులు, పురుగు మందులు దేశీయంగా తయారు చేసి రైతులకి అందుబాటులో ఉంచడం వరకూ హరిత విప్లవంలో భాగమే. వీటి ఫలితంగా అప్పటివరకూ ఏటా ఒక పంట మాత్రమే పండిన భూముల్లో రెండు మూడు పంటలు పండించడం మొదలయ్యింది. మరో పక్క సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యి మరింత భూమి వ్యవసాయ యోగ్యమయ్యింది. ఫలితంగా తిండి గింజల స్వయం సమృద్ధి సాధ్య పడింది.

'ఆహార ధాన్యాల కోసం ఇప్పటికీ విదేశాల మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఉండి ఉంటే?' అన్న ప్రశ్న వేసుకుంటే చాలు హరిత విప్లవం ప్రాముఖ్యత అర్ధమై, అందుకోసం కృషి చేసిన వారి మీద గౌరవం కలుగుతుంది. నిజమే, ఈ విప్లవం కారణంగా వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం గణనీయంగా పెరిగింది. వీటి వల్ల, ఈ రసాయనాలని తయారు చేసే ఫ్యాక్టరీల వల్లా వాతావరణ కాలుష్యం పెరిగింది. అయితే, ఈ కీడు కన్నా జరిగిన పెద్ద మేలు ఏమిటంటే, ఆకలి చావుల బారి నుంచి దేశం రక్షింపబడింది. అంతర్జాతీయంగా తలెత్తుకుని నిలబడ గలిగింది. లోపాలున్నప్పటికీ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇప్పటికీ సబ్సిడీ ధరలకి ఆహార ధాన్యాలని పేదలకి అందించగలుగుతోంది.

శ్వేత విప్లవం వెనుక ఉన్న వర్గీస్ కురియన్ ని, హరిత విప్లవ సారధి మంకొంబు సాంబశివన్ స్వామినాథన్ ని ఒక్కసారైనా కలవాలి అనుకున్న రోజులున్నాయి. కురియన్ విషయంలో ఏమీ కలిసిరాలేదు కానీ, స్వామినాథన్ చెన్నైలో తన పేరుమీదే నడుపుతున్న ఫౌండేషన్ లో రెండు రోజులు గడిపే అవకాశం వచ్చింది, ఎనిమిదేళ్ల క్రితం. నేను అక్కడ ఉన్న సమయంలో ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. స్వామినాథన్ ని కలవలేకపోతేనేం, ఆ సంస్థ పనితీరుని, క్రమశిక్షణనీ చూసిన తర్వాత స్వామినాథన్ వ్యక్తిత్వాన్ని గురించి, క్రమశిక్షణ గురించీ ఓ అంచనా వచ్చింది. 'హరిత విప్లవం' తర్వాత దశగా 'సతత హరిత విప్లవం' (ఎవర్ గ్రీన్ రివల్యూషన్) తీసుకురావాలని, 'అందరికీ ఆహారం' నుంచి 'అందరికీ బలవర్ధకమైన ఆహారం' వైపుగా వ్యవసాయ రంగ ప్రయాణం సాగాలని కోరుకున్నారు స్వామినాథన్. ఆ కోరిక నెరవేరడమే ఆయనకి అసలైన నివాళి.

5 కామెంట్‌లు:

  1. నేనెప్పుడూ వారిని చూడలేదు కానీ వారి దగ్గర చదువుకున్న నా మిత్రులు వారిని గురించి ఎంతో ప్రియంగా మాట్లాడుతుంటే విన్నాను. యుగపురుషులు పుడుతూ ఉంటారు వారిపని వారుచేసి నిష్క్రమిస్తూ ఉంటారు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    రిప్లయితొలగించండి
  2. స్వతంత్రం వచ్చిన కొత్తలో ఆహార కొరతకు మూలకారణం సరిగ్గా గ్రహించలేదేమో అనిపిస్తుంది నాకు. వందల సంవత్సరాల పరాయి పాలనలో దేశం నిర్వీర్యమైపోయిన వైనం ఆ కరువుకాటకాల కు కారణం అని చదివాను. ఉద్దేశపూర్వకంగా రైతులని ఆహారపంటల నుంచి దూరం చేసి వాణిజ్య పంటల వైపు మళ్లించి, విపరీతమైన పన్నుల విధింపు కారణంగా రైతులు తేరుకోలేని విధంగా దెబ్బతిన్నారు. అందులోంచి పుట్టుకొచ్చిందే తీవ్రమైన కరువు.

    ఆ విషయం వెలుగులోకి తేకుండా, ఇతరదేశాల మీద ఆధారపడటం మొదలెట్టటం, సాంప్రదాయ వ్యవసాయానికి అశనిపాతమైంది. అక్కడి నుంచి ప్రకృతి ప్రసాదించిన సహజ విత్తనాల అదృశ్యం మొదలైంది. వాటి స్థానంలో ఫ్యాక్టరీ విత్తనాలు మొలకెత్తాయి. ఆ బీజాలతో ప్రారంభమైన విదేశీ వాణిజ్య వ్యవస్థ సాంప్రదాయ వ్యవసాయాన్ని భూతంలా మింగేసింది. ఆహారం విషమయింది. భూమాత నిర్వీర్యమైంది. సాంప్రదాయ రైతు కుటుంబాలు వలసలు మొదలెట్టి కార్పొరేట్ కంపెనీల్లో హౌసెకీపింగ్ అవతారమెత్తారు. సరిదిద్దుకోలేని పొరపాటుగా మారింది.

    భగవంతుడు ఈ జగత్తుని ఎన్నో నియమాల రూపంలో ఆవహించి ఉన్నాడని వ్యవసాయం, వైద్యం, వివాహం, ఇలా అన్ని అన్ని భారతీయ వ్యవస్థలు ఆ నియమాలకు భంగం వాటిల్లకుండా ఉండే విధంగా పవిత్రంగా రూపొందించారు..మార్పులు అవసరమైనా సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు భంగం వాటిల్లకుండా సాంకేతికతను ఉపయోగించి ఉంటే మరింత బాగుండేదేమో.

    వందన శివ అని, ఓ మహిళా కార్యకర్త సాంప్రదాయ వ్యవసాయాన్ని కాపాడటానికి అమెరికా సంస్థ monato పై పెద్ద యుద్ధమే చేసారు. vandana shiva - decolonizing the global economy అనే యూట్యూబ్ వీడియో లో చూడొచ్చు.

    ఏ సమయానికి ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. హరిః ఓం.

    ఓం శాంతి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. >>ఏ సమయానికి ఏది జరగాలో అది జరిగి తీరుతుంది.హరిః ఓం.
      ఓం శాంతి.

      హరి.S.బాబు
      చాలా బాగా చెప్పారు.కరువుల గురించి మీరు చెప్పిందే నిజం.కురియన్, స్వామినాధన్ లాంటివాళ్ళు సమస్యని పక్కదారి పట్టించారు.అసలైన పరిష్కారం వందన శివ లాంటివాళ్ళు చూపిస్తున్నారు.

      శివోహం!

      తొలగించండి