మా చిన్నప్పుడు కోనసీమ నుంచి కాకినాడ వెళ్లాలంటే ఓ రోజు పని. అమలాపురం మీదుగా బస్సులో ఎదుర్లంక వెళ్లి, అక్కడ రేవు దాటి, యానాం వెళ్లి, అక్కడినుంచి మళ్ళీ బస్సు పట్టుకుని కాకినాడ వెళ్లడం దగ్గర దారి. కాకపొతే అంచె బస్సులు, పడవ వరసగా దొరికెయ్యాలి. ఎక్కడ ఆలస్యం అయినా మొత్తం ప్రయాణ సమయం పెరుగుతూ పోతుంది. లేదూ అంటే రావులపాలెం వెళ్లి, అక్కడి నుంచి అప్పుడప్పుడూ ఉండే కాకినాడ ప్యాసింజర్ బస్సు పట్టుకుంటే పడుతూ లేస్తూ నాలుగైదు గంటల్లో కాకినాడ చేరేవాళ్ళం. కలక్టరేట్లోనో ఇంకేదైనా ఆఫీసు లోనో పనంటే వెళ్లినవాళ్ళు పనిపూర్తి చేసుకుని అదే రోజు తిరిగి రావడం కల్ల. అక్కడ ఉండిపోవడం అంటే, బంధుమిత్రులెవరన్నా ఉంటే పర్లేదు కానీ, లేకపోలే తిండి, లాడ్జీ ఖర్చులు తడిసిమోపెడు. ధ్రువీకరణ పత్రంలో (కులం/ఆదాయం/నివాసం) తప్పులు సవరింపజేసుకోడానికో, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ లో పేరు నమోదుకో, అప్డేటుకో మిత్రులు తరచూ ప్రయాణం అవుతూ ఉండేవారు, శ్రమనీ, ఖర్చునీ తట్టుకుని నిట్టూరుస్తూ.
ఇప్పుడూ దూరం తగ్గలేదు కానీ, ప్రయాణ వేగం కాస్త పెరిగింది. ఎదుర్లంక-యానాం ల మధ్య వృద్ధ గౌతమి మీద బ్రిడ్జీ రావడం తో నేరుగా అమలాపురం-కాకినాడ బస్సులు తిరుగుతున్నాయి. రావులపాలెం వరకూ రోడ్డు అని భ్రమించే లాంటిది ఒకటి ఉంటుంది కానీ, అక్కడి నుంచీ పర్లేదు. అయినప్పటికీ మొత్తం ప్రయాణం మూడు నాలుగు గంటలు పైగా పడుతోంది.పాలనలో ఆన్లైన్ విప్లవం వచ్చేసినప్పటికీ ప్రత్యక్షంగా హాజరైతే తప్ప పూర్తికాని పనులు ఇప్పుడూ ఎక్కువే. ఏదో ఒక పని నిమిత్తం ప్రయాణం తప్పదు. జిల్లాలోకెల్లా ఉన్న పెద్ద ధర్మాసుపత్రిలో వైద్యం కోసం చేరేవాళ్ళు, వాళ్ళకి తోడుగానో, చూడ్డానికో వెళ్లేవాళ్ల సంఖ్యా ఎక్కువే. ప్రయాణం మరీ సుఖంగా ఏమీ ఉండదు. కాకపోతే, వెళ్లిన పని పూర్తయితే అర్ధరాత్రైనా అదే రోజు ఇంటికి తిరిగి రావొచ్చనే భరోసా ఉంది. చేతిలో మోటార్ సైకిల్ ఉంటే ప్రయాణం మరికొంచం సులువు. కారున్న వాళ్ళకి ఎటూ ఎక్కడైనా దూరాలు భారాలు కాదు కదా.
దాదాపు పది పన్నెండేళ్ల క్రితం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ పుట్టకమునుపు, బ్యూరోక్రసీలో ఉన్న ఓ మిత్రుడి ఉవాచ: "మీ జిల్లాని మూడు జిల్లాలుగా చెయ్యచ్చు. ఉత్తరాదిలో ఎక్కడా ఇంత పెద్ద పెద్ద జిల్లాలు లేవు. జిల్లా చిన్నదైతే ప్రజలకే కాదు, అధికారులకి కూడా సుఖం. పనిమీద కొంచం ఎక్కువ శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుంది". ఆ మాట నేను కాదనలేదు కానీ, మరీ 'మూడు జిల్లాలు' అవసరం లేదేమో అనిపించింది. అప్పటికే 'కోనసీమ ప్రత్యేక జిల్లా' అనే నినాదం ఉండుండీ వినిపిస్తూ ఉండేది. అసలు జీఎంసీ బాలయోగి అకాల మరణం పాలయ్యి ఉండకపోతే, తన అధికారాలు ఉపయోగించి ఎప్పుడో కోనసీమని ప్రత్యేక జిల్లా చేసేసి ఉండేవారని నమ్మే వాళ్ళు ఎందరో ఉన్నారు మా ప్రాంతంలో. "రెండు జిల్లాలు చాలేమో" అన్నాను. "జనసాంద్రత, విస్తీర్ణం దృష్ట్యా మాత్రమే కాదు, ఇక్కడున్న వనరుల్ని దృష్టిలో పెట్టుకున్నా మూడు జిల్లాలైతేనే ఏవన్నా అభివృద్ధికి అవకాశం ఉంటుంది" అన్నప్పుడు, ఇంకేమీ జవాబు చెప్పకుండా వినేసి ఊరుకున్నా, "జరిగే పని కాదులే" అనుకుంటూ.
Google Image |
అప్పుడే కాదు, మొన్నామధ్య రాష్ట్ర ప్రభుత్వం 'జిల్లాల పునర్వ్యవస్తీకరణ-కొత్త జిల్లాల ఏర్పాటు' ప్రకటించినప్పుడు కూడా "బోల్డన్ని చిక్కులొస్తాయి, అయినప్పుడు కదా" అనే అనుకున్నాను. కానీ, అత్యంత ఆశ్చర్యకరంగా అనుకున్న సమయానికే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోయింది. పదమూడల్లా ఇరవయ్యారు జిల్లాలయ్యాయి. మా కోనసీమకి ప్రత్యేక జిల్లా హోదా వచ్చేయడమే కాదు, నాటి నా మిత్రుడి మాటని నిజం చేస్తూ తూర్పుగోదావరి మూడు జిల్లాలుగా పునర్వ్యవస్తీకరింపబడింది. ప్రభుత్వ విభాగాలతో బొత్తిగా అవసరం పడని వాళ్ళకో, 'అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతాయి' అనుకునే వాళ్ళకో ఇదేమీ పెద్ద విషయం కాదు కానీ, కలెక్టరేట్ల చుట్టూ నిత్యం చెప్పులరిగేలా తిరిగే వేలాది మందికి ఇది తీపి కబురు. జిల్లా కలెక్టరే మేజిస్ట్రేట్ కూడా అవ్వడం, భూ తగాదాలు లాంటివి ప్రత్యక్ష హాజరుతో తప్ప పరిష్కారం కానివి కావడం వల్ల గ్రామాల్లో ఉండే వాళ్ళకి, వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరక్క తప్పదు, ఎందుకో అందుకు. సదరు కార్యాలయం అక్కడెక్కడో కాక, దగ్గర ఉండడం అన్నది చాలా పెద్ద ఊరట.
గతంతో పోల్చినప్పుడు రెండూ బై మూడో వంతు పని భారం తగ్గింది కాబట్టి కొత్త జిల్లాల కలెక్టర్లకి అభివృద్ధి మీద దృష్టి పెట్టే సమయమూ, వీలూ చిక్కొచ్చుననే ఆశ ఒకటి ఉంది. ఇక్కడ అభివృద్ధి అంటే ఫ్లై వోవరూ, హైటెక్ సిటీ నిర్మాణాలు కాదు, చేయగలిగే వాళ్ళకి యేటి పొడవునా చేతినిండా పని, కడుపు నిండా తిండీ దొరికేలా చేయడం. వనరులన్నీ ఉండి కూడా, ఈ విషయంలో వెనకపడ్డానికి కారణం రాజకీయ నాయకులకి చిత్తశుద్ధి కొరవడడం ఓ కారణం అయితే, శ్రద్ధ పెట్టాల్సిన ఉన్నతాధికారులకి తగినంత సమయం చేతిలో లేకపోవడం ఇంకో కారణం. వనరుల సద్వినియోగం మీద దృష్టి పెట్టగలిగే అధికారులు కలెక్టర్లుగా వస్తే, జీవనోపాధి సమస్య కొంతవరకైనా పరిష్కారం అవ్వకపోదనిపిస్తోంది. వ్యవస్థలో ఉన్న సమస్త లోపాలూ ఈ ఒక్క నిర్ణయంతో సరిద్దిబడిపోతాయన్న అత్యాశ అయితే లేదు. కొందరు ప్రచారం చేస్తున్నట్టుగా ఈ కొత్త జిల్లాల ఏర్పాటు సర్వరోగ నివారిణి కాదు. అదే సమయంలో మరికొందరు చెబుతున్నట్టుగా ఎందుకూ పనికిరాని నిర్ణయమూ కాదు.
జిల్లా కేంద్రం అంటే కలెక్టరాఫీసు, ఎస్పీ ఆఫీసు, ముఖ్యమైన ఆధికారుల కార్యాలయాలతో పాటుగా జిల్లా ఆస్పత్రి కూడా ఉంటుంది. సాధారణంగా ఈ ఆస్పత్రిలో అన్ని వైద్య విభాగాలూ, అన్ని రకాల అనారోగ్యాలకీ వైద్యసేవలు అందించేవిగా ఉండాలి. ప్రస్తుతం ప్రకటించిన కొత్త జిల్లా కేంద్రాలలో చాలాచోట్ల ఏరియా ఆస్పత్రులున్నాయి. అయితే, వాటిలో సేవలు, సౌకర్యాలు పరిమితం. వీటిని జిల్లా ఆసుపత్రులుగా అప్ గ్రేడ్ చేసి, అవసరమైన వైద్యుల్ని, పరికరాల్ని సిద్ధం చేయాలి. ప్రయివేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా విస్తరించినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది రోగులు ఇప్పటికీ ధర్మాసుపత్రుల మీదే ఆధారపడ్డారు. ప్రయివేటు ఆస్పత్రులో దొరికే వైద్యం ఖరీదైనది కావడం ఇందుకు ముఖ్య కారణం. పాలనా కార్యాలయాల ఏర్పాటుతో పాటుగా దృష్టి పెట్టాల్సిన అంశం ఇది. లెక్కపెడితే, ఇప్పటికీ జిల్లా కేంద్రాలకి ఇతరత్రా పనుల నిమిత్తం వెళ్లే వారి సంఖ్యతో సరిసమంగా ప్రభుత్వ వైద్యం కోసం వెళ్లేవారి సంఖ్యా ఉంటోంది. ఈ ఏర్పాటు చేసినప్పుడే కొత్త జిల్లాల ఏర్పాటు పరిపూర్ణమవుతుంది.
ఎన్నికల వాగ్దానం..నిలబెట్టుకున్నారు.ఎప్పుడో జరగాల్సింది కోవిడ్ పుణ్యమాని వాయిదాపడింది అని విన్నాను.
రిప్లయితొలగించండిమొత్తానికి జరిగిందండీ.. ధన్యవాదాలు
తొలగించండిబాలయోగి ఉన్నప్పుడు అమలాపురం - రావులపాలెం రోడ్డంటే ఒక నేషనల్ హైవే లా ఉండేది . ఇపుడు ఆ రోడ్డు ప్రయాణం ఇప్పుడు ఒక ప్రసహనం లా మారింది.. ఇది రోడ్డా అనిపించేలా ఉంది ప్రస్తుతం
రిప్లయితొలగించండితర్వాత ఎవరూ ఆ రోడ్డుని పట్టించుకోలేదండీ.. అప్పుడు వేసిన రోడ్డే ఇప్పటికీ.. ..ధన్యవాదాలు..
తొలగించండికొత్త జిల్లాల చిన్న సైజు వలన ప్రగతి సులువవుతుందనే మీ ఆశాభావం ఫలిస్తుందని ఆశిద్దాం. థీరెటికల్ గా అవకాశం ఉండచ్చు లెండి.
రిప్లయితొలగించండికోనసీమ జ్ఞాపకాలను తట్టి లేపారు, థాంక్స్.
అవునూ, పాత రోజుల్లో కాకినాడ వెళ్ళడానికి మీరు ఎదుర్లంక వద్ద రేవు దాటేవారా? మేము అదే అమలాపురం నుండి బస్సులో ముక్తేశ్వరం వెళ్ళి, అక్కడ గోదావరి దాటి అవతలి గట్టునున్న కోటిపల్లి లో కాకినాడ బస్సు ఎక్కేవాళ్ళం. మరి దీనికన్నా ఎదుర్లంక రూటు ఏమయినా దగ్గరవుతుందంటారా?
రావులపాలెం వెళ్ళి “కాకినాడ పాసెంజర్ బస్సు” పట్టుకోవడమా? మరి రావులపాలెం దగ్గర కూడా గోదావరి నది ఉందిగా? 1969 ప్రాంతాల నాటికి గానీ రావులపాలెం బ్రిడ్జి ఏర్పడలేదు. మరి మీరు చెప్పేది ఎప్పటి ముచ్చట? (అలాగే కోనసీమలో మీ ఊరు పేరేమిటో కాస్త ఇసుంటా వచ్చి మెల్లిగా నా చెవిలో - అంటే ఇమెయిల్ లో అని భావం - చెబుదురూ … మీకు అభ్యంతరం లేకపోతేనే సుమండీ 🙂. మీరు చెబుతున్న కోనసీమ-కాకినాడ రూట్ల గురించిన time reference మీద నాకు మరింత స్పష్టత రావడానికి పనికొస్తుంది ఆ చిన్న సమాచారం 🙂. కోనసీమ గురించి నా జ్ఞాపకాలయితే 1960 దశకం మొదటి సగానికి చెందినవి లెండి).
ఎస్, ఉమ్మడి తూగోజి ని రెండు చేస్తే చాలేమో అని నాకూ అనిపించింది. మరి మూడు సంఖ్య అంటే కాస్త ఎక్కువ మక్కువేమో?
సిద్ధాంతం బ్రిడ్జ్ ఏ సంవత్సరంలో కట్టారు? చించినాడ బ్రిజ్ కట్టిన తరువాత కూడా కొంత కాలం అమలాపురం-భీమవరం బస్సులు సిద్ధాంతం మీదుగానే వెళ్ళేవి.
తొలగించండి@విన్నకోట నరసింహారావు: చెవిలో ఎందుకు లెండి :) రాజోలు దీవిలో కుగ్రామం మాది. 'ఫ్రెంచి యానాం' మీదుగా ఎందుకంటే, అది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి పన్నులు తక్కువ, వస్తువులు చవకగా దొరికేవి (ముఖ్యంగా ఫ్యాన్లు వగయిరా) అందుకోసమూ, ఇతరేతర కారణాలకీ కూడా (ఫ్రెంచి మద్యం) ఆ దారి కోరుకునే వారు, ముఖ్యంగా ఒంటరి బాటసారులు. గుళ్ళు, గోపురాలూ చూసుకునే ఫ్యామిలీ ట్రిప్ అయితే ముక్తేశ్వరం రూటే.. ధన్యవాదాలండీ..
తొలగించండి@Unknown: సిద్ధాంతం బ్రిడ్జి పాతది, చించినాడ బ్రిడ్జి కొత్తదీనండీ.. ఆతర్వాత తాజాగా గన్నవరం అక్విడెక్టు పక్కన కొత్త బ్రిడ్జి కట్టారు.. అమలాపురం-భీమవరం బస్సులు ఇప్పటికీ రెండు రూట్ల లోనూ తిరుగుతున్నట్టున్నాయండీ.. ధన్యవాదాలు..
My parents worked in Razole and Tatipaka from 2002 to 2006. At that time there was bridge at Chinchinada but boats used to ferry passengers at Bodasakurru. - Praveen
తొలగించండి