సోమవారం, మార్చి 07, 2022

ప్రేమలేఖ రాశా ...

సినిమా కథానాయకుడిదో, నాయికదో (అసలు) పేరునో, నాయకుడి ఇంటిపేరునో పాట సాహిత్యంలో ఔచిత్యం చెడకుండా చొప్పించడం వేటూరికి ఓ సరదా. తనకి నచ్చిన సినిమా వ్యక్తుల ప్రస్తావనలో ఉంటూంటాయి. తరచి చూస్తే చాలా ఉదాహరణలే కనిపిస్తాయి తన సినిమా సాహిత్యంలో. 'ముత్యమంత ముద్దు' (1989) సినిమా కోసం రాసిన ఓ డ్యూయెట్ పల్లవిలో ఆ సినిమా సంగీత దర్శకుడు 'హంసలేఖ' పేరునీ, చరణంలో  మాటల మాంత్రికుడు పింగళి నాగేంద్రరావు పేరునీ అలవోకగా చేర్చారు.

ప్రేమలేఖ రాశా .. నీకంది ఉంటదీ..
పూల బాణమేశా .. ఎదకంది ఉంటదీ..

పూలబాణం తగిలి ఎద కంది ఉంటది.. వేసిన పూలబాణం ఎదకి అంది ఉంటది.. ముచ్చటైన శ్లేష.

నీటి వెన్నెల .. వేడెక్కుతున్నదీ..
పిల్ల గాలికే .. పిచ్చెక్కుతున్నదీ..

'నీటి వెన్నెల' అనేది కవి ప్రయోగంలా అనిపిస్తోంది. శరదృతువులో చంద్రుడు నీళ్లతో కడిగినట్టుగా చల్లగానూ, స్పష్టంగానూ ఉంటాడని కదా పూర్వకవుల ఉవాచ.

మాఘమాసమా .. వేడెక్కుతున్నదీ..
మల్లె గాలికే .. వెర్రెక్కుతున్నదీ..
వస్తే ..గిస్తే ..వలచీ .. వందనాలు చేసుకుంట..

నిజానికి మాఘమాసం మల్లెలమాసం కాదు. త్వరపడి పూసిన పూలనుంచి అతనికి మల్లెగాలి తగిలిందో, లేక ఆ ఋతువులో పూసే ఇంకేదైనా రకపు మల్లెగాలి సోకిందోమరి.. వేడీ, వెర్రీ తగ్గాలంటే ఆమె రావాలి.. వస్తే వలచి, వందనాలు చేసుకుంటాడట.

హంసలేఖ పంపా నీకంది ఉంటదీ..
పూలపక్క వేశా అది వేచి ఉంటదీ..

దమయంతి పంపిన హంసలేఖ మాత్రమే కాలేదు, సినిమా సంగీత దర్శకుడు హంసలేఖ కూడా గుర్తు రావాల్సిందే..

ఆడ సొగసు ఎక్కడుందొ చెప్పనా ..
అందమైన పొడుపు కథలు విప్పనా..
కోడెగాడి మనసు తీరు చెప్పనా ..
కొంగుచాటు కృష్ణ కథలు విప్పనా..

ఇద్దరికీ ఒకరిగురించి మరొకరికి బాగానే తెలుసు, ప్రేమలో ఉన్నారు కదా మరి.

సత్యభామ అలకలన్ని పలకరింతలే ..
అన్నాడు ముక్కుతిమ్మన..
మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలో ..
అన్నాడు భక్త పోతన..

అతడు 'పారిజాతాపహరణం' కోట్ చేస్తే, నేనేం తక్కువ తినలేదంటూ ఆమె పోతనామాత్యుడి  'భాగవతం' ప్రస్తావించింది..

వలచి వస్తినే వసంతమాడవే ..
సరసమాడినా క్షమించలేనురా..
కృష్ణా ..గోదారుల్లో .. ఏది బెస్టొ చెప్పమంట..

వసంతమాడేందుకు ఆమెకి ఇంకా ఏదో అభ్యంతరం ఉండడం అతనికి నచ్చలేదు.. తను దూకెయ్యడానికి  కృష్ణ, గోదారి నదుల్లో ఏది బెస్టో చెప్పమని ఆమెని బెదిరిస్తున్నాడు.

మాఘమాస వెన్నెలెంత వెచ్చనా ..
మంచి వాడివైతె నిన్ను మెచ్చనా..
పంటకెదుగుతున్న పైరు పచ్చనా ..
పైట కొంగు జారకుండ నిలుచునా..

మాటకు మాట అనుకోవడంలో ఎవరూ తగ్గడం లేదు, రెండో వారిని తగ్గించడమూ లేదు.

సినీమాల కథలు వింటె చిత్తు కానులే ..
చాలించు నీ కథాకళీ..
ఆడవారి మాటకు అర్థాలె వేరులే ..
అన్నాడు గ్రేటు పింగళీ..

ఆమె సినిమాల ప్రస్తావన తేగానే అతడు గ్రేటు పింగళిని జ్ణాపకం చేసుకున్నాడు. వేటూరి అభిమాన సినీ కవుల్లో పింగళి నాగేంద్రరావు ఒకరు.

అష్ట పదులతో అలాగ కొట్టకూ ..
ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే..
నుయ్యో గొయ్యో  ఏదో అడ్డదారి చూసుకుంట..

ఇంకా ఆమె ప్రసన్నం కాకపోవడంతో నుయ్యో, గొయ్యో చూసుకుంటానని బెదిరింపుకి దిగాడు.. ఇదంతా ప్రణయ కలహంలో భాగమే...

నిజానికిది ట్యూనుకి రాసిన పాట. 'ముత్యమంత ముద్దు' కి ఏడాది ముందు కన్నడలో వచ్చిన 'అంజాద గండు' సినిమాకి తానే చేసిన ట్యూన్ 'ఆకారదల్లి గులాబి రంగిదే' ని యధాతధంగా వాడేశారు ఈ పాటకి. డిస్కోశాంతి, కొండచిలువతో నర్తించిన రొమాంటిక్ హారర్ నృత్య గీతమిది. ఎక్కడా కిట్టింపులు అవసరం లేకుండా, ట్యూనుకి సరిగ్గా సరిపోయేలా యుగళగీతాన్ని అల్లేశారు వేటూరి. జానకి, బాలూలు పోటీపడి పాడేశారు. రీమేక్ సినిమాల ద్వారా ఎక్కువ పేరు తెచ్చుకున్న దర్శకుడు రవిరాజా పినిశెట్టి, యండమూరి నవల 'థ్రిల్లర్' ఆధారంగా తీసిన సినిమా ఇది. సింపుల్ లొకేషన్లో, సింపుల్ స్టెప్స్ తో కంపోజ్ చేసిన పాట వినడానికే కాదు, చూడ్డానికీ బాగుంటుంది. చిత్ర నాయికానాయకులు సీత, రాజేంద్ర ప్రసాద్ అభినయించారు.

9 కామెంట్‌లు:

  1. పాత జ్ఞాపకాలకి మీ రిచ్చే మృదువైన సన్నటి పట్టు చాపులు మీ విశ్లేషణలు.

    రిప్లయితొలగించండి
  2. అవి సన్నటి జరీ పట్టు చాపులు .

    రిప్లయితొలగించండి
  3. బాగుందండి మీ విశ్లేషణ. నాకిష్టమైన పాట.నెనర్లు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంగీతం, సాహిత్యం, గానం అన్నీ బాగా కుదిరిన పాటల్లో ఒకటండీ.. అన్నట్టు ఇదే ట్యూన్ లో తమిళ పాట కూడా ఉంది, మనో-చిత్ర పాడారు.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  4. కృష్ణా గోదావరి లో ఏది బెస్ట్ ?
    Krishna is the best 👍
    (F2 లో మేహరిన్ స్టైల్ లో)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాపం, ఆ హీరో దూకడానికి ఏది బెస్టు అని అడుగుతున్నాడండీ.. అందుక్కూడా కృష్ణ బెస్ట్ అంటారా? :) ..ధన్యవాదాలు.. 

      తొలగించండి
    2. ఆవిడది కృష్ణా జిల్లా అయ్యుంటుంది, మురళి గారు 🙂🙂.

      తొలగించండి
    3. పుట్టింటి నదిని పొగిడారు.మెట్టింటి వాళ్ళు మెచ్చరు కదా!వాళ్ళ కసలే ప్రాంతం పిచ్చి ఎక్కువ.

      తొలగించండి