తెలంగాణ పల్లె జీవితాలను తెలుగు కథల్లో విస్తారంగా చిత్రించిన కథకుడు పెద్దింటి అశోక్ కుమార్ నుంచి వచ్చిన తాజా కథా సంకలనం 'గుండెలో వాన.' ఈ సంకలనంలో ఉన్న మొత్తం ఇరవై కథలు 2006-2019 మధ్య కాలంలో వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 'ప్రాణం ఖరీదు వంద ఒంటెలు' లాంటి ప్రామిసింగ్ కథలు రాసిన పెద్దింటి నవలలు, సినిమా సంభాషణలు కూడా రచించారు. బడి వాతావరణం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య బోధన, వ్యవసాయ సంక్షోభం, అతి సామాన్యుల జీవితాలు, మీడియా పోకడలు లాంటి భిన్న ఇతివృత్తాలతో రాసిన కథలున్నాయి ఈ సంకలనంలో. ఒకే ఇతివృత్తంతో రాసిన కథలు కూడా వేటికవే ప్రత్యేకంగా నిలబడడం, కొన్ని కథలు మళ్ళీ చదివించేవిగా ఉండడం ఈ సంకలనం ప్రత్యేకత.
వృత్తి రీత్యా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడైన అశోక్ కుమార్ బడి చదువులని ఇతివృత్తంగా తీసుకుని రాసిన ఐదు కథలున్నాయి ఈ సంకలనంలో. 'చుక్కలు రాని ఆకాశం' కథ డ్రాపవుట్స్ కి కారణాలని విశ్లేషిస్తే, 'ఆనాటి వానచినుకులు' కథ మూతపడబోతున్న తన పాఠశాలని నిలబెట్టుకోడం కోసం ఓ ఉపాధ్యాయిని పడే ఆవేదనని చిత్రించింది. చిరకాలం నమ్మిన విలువల్ని ఒక్కసారిగా పక్కన పెట్టించేవి ఏవిటో చెప్పకనే చెప్పే కథ 'దారిచూపిన వాడు' కాగా, ప్రభుత్వ ఉపాధ్యాయుల గురించి సమాజంలో ఉన్న అభిప్రాయాలకి - సరిగా చదువు చెప్పరు, బడి సమయాన్ని ఇతరత్రా వ్యాపకాలకి, వ్యాపారాలకి వెచ్చిస్తారు - తగినట్టుగా ఉండే పాత్రని చిత్రించిన కథ 'పురుగు'. ఇక, 'ఆకలి' కథ ఓ ఉపాధ్యాయుడి సుదీర్ఘ రైలు ప్రయాణమే ఆయినా, అసలు కథ వజ్రమ్మ ది. అసలీ కథకి 'వజ్రమ్మ' అని పేరు పెడితే బాగుండేది. గుర్తుండి పోయే కథ ఇది.
తెలంగాణ పల్లెల్లో వ్యవసాయ సంక్షోభాన్ని చిత్రించిన కథలు రెండు - 'గుండెలో వాన' 'జలగండం'. ఈ రెండు కథల్లోనూ వ్యవసాయ సమస్యల్ని ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా ప్రస్తావించడం మంచి ఎత్తుగడ. ఓ టైలర్ షాపులో మొదలయ్యే కథ 'గుండెలో వాన'. చాలా మామూలుగా మొదలై, కుతూహలాన్ని పెంచుతూ కొనసాగి ఊహించని ముగింపుకి చేరుతుంది. వ్యవసాయం ఇతివృత్తంగా వచ్చిన మంచికథల్లో ఒకటిగా నిలబడుతుంది. 'జలగండం' కథ ఓ రచయితని వెతుక్కుంటూ వచ్చిన ఓ పాఠకురాలు తన మనవడికి జలగండం తప్పించే మార్గం చెప్పమని అడగడంతో మొదలై ఆమె కథని పొరలుపొరలుగా చెబుతుంది. మాతృత్వం ఇతివృత్తంగా వచ్చిన రెండు కథల్లో మొదటిది 'ఈ పాప(o) ఎవరిది' ముగింపు మరో కథకి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఉపన్యాసాన్ని చదివించే కథగా మారిస్తే అది 'ప్లాసెంటా' అవుతుంది.
మీడియా చేస్తున్న అతిని చిత్రించిన మూడు కథల్లో మొదటిది 'చీమా చీమా ఎందుకు పుట్టావ్?' బ్రేకింగ్ న్యూసులు మీద సెటైర్. 'ఇప్పుడే అందిన వార్త' కూడా సెటైరే అయినప్పటికీ, నీటిపారుదల ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలని కొంచం లోతుగా చర్చించింది. 'మూడోకన్ను' కాస్త పాత కథలా అనిపిస్తుంది. పేదల జీవితాల చుట్టూ అల్లిన 'కొన్ని చేపలు... ఒక గాలం' 'ఆట' కథలు ఆసాంతమూ ఆపకుండా చదివిస్తాయి. 'కొన్ని చేపలు..' కథలో కాస్త ఉపన్యాస ధోరణిలో ఉన్నా, 'ఆట' మాత్రం చివరికంటా ఆసక్తిగా చదివిస్తుంది. 'బిందెడు నీళ్లు' కథ క్లైమాక్స్ ట్విస్ట్ మీద నమ్మకంతో రాసినట్టున్నారు కానీ, నిరాశని కలిగిస్తుంది. ఇలాంటి నిరాశనే ఇచ్చే మరో కథ 'స్కావెంజర్'. రచయిత న్యూట్రల్ గా ఉంటూ కథ నడపలేని ఇతివృత్తాల్లో ఇదీ ఒకటి.
కాలంతో పాటు మనుషుల ఆలోచనల్లో మార్పులు వస్తాయంటారు కానీ, అందుకు మినహాయింపులుంటాయని చెప్పే కథ 'నింద'. మిగిలిన వాటిలో 'మరమనిషి' 'తీపిచావు' కథలు చదవడం మొదలుపెట్టగానే ముగింపుని ఊహించగలిగేవి. 'తీపిచావు' కథనం ఆసక్తికరం. ఇక, 'దగడు' ఆద్యంతం ఆసక్తిగా సాగిన కథ. కథ నడిపేందుకు వ్యావహారిక భాషనీ, సంభాషణలకి తెలంగాణ మాండలికాన్ని ఉపయోగించారు. విస్తృతంగా వాడుకలో లేని కొన్ని పదాలకి ఫుట్ నోట్స్ లో అర్ధాలు ఇచ్చి ఉంటే బాగుండేది. కవర్ పేజీ డిజైన్, నాణ్యత చాలా బాగున్నాయి. శిరంశెట్టి కాంతారావు రాసిన ముందుమాటలో చాలా కథల్ని ముగింపులతో సహా పరామర్శించారు (స్పాయిలర్ అలెర్ట్ లేదు). ఈ ముందుమాటని కథలు పూర్తిచేశాక చదవడం మంచిది. అన్వీక్షికి ప్రచురించిన ఈ 224 పేజీల పుస్తకం వెల రూ. 200. పుస్తకాల షాపుల్లోనూ, ఆన్‌లైన్‌లోనూ కొనుక్కోవచ్చు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి