శనివారం, జులై 10, 2021

నాకు తెలిసిన కత్తి మహేశ్

ఆన్లైన్ ప్రపంచంలోకి నేను అడుగుపెట్టి దాదాపు పదమూడేళ్ళు. తొలినాళ్లనుంచీ నాకు తెలిసిన పేర్లలో ఒకటి కత్తి మహేశ్. ఆన్లైన్ ని ఆధారంగా చేసుకుని అటుపైన ఎత్తులకి ఎదిగిన అతికొద్ది మందిలో తనూ ఒకరు. మహేశ్ ఇక లేరన్న వార్త తెలియగానే అతని  తాలూకు జ్ఞాపకాలన్నీ మనసు లోపలి పొరలనుంచి ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. నాకు తెలిసిన మొదటి ఆన్లైన్ వేదిక 'నవతరంగం' అనే వెబ్ పత్రిక. అక్కడ సినిమా సమీక్షకుడు, విమర్శకుడు పాత్రల్లో మహేశ్ కనిపించారు. అక్కడి నుంచి నా రెండో అడుగు బ్లాగ్ ప్రపంచం. అక్కడ బ్లాగరుగానూ, వ్యాఖ్యాత గానూ మహేశ్ ప్రత్యక్షం. అటు 'నవతరంగం' లోనైనా, ఇటు 'పర్ణశాల'  బ్లాగులోనైనా తను రాసిన పోస్టుల కన్నా చేసిన కామెంట్లే చాలా ఎక్కువ. అవి కూడా ఎక్కువగా వివాదాలకి దారితీసే వ్యాఖ్యలే. 

మహేశ్ ధోరణి చూస్తున్నప్పుడల్లా ఓ రచయిత్రి తరచుగా గుర్తొచ్చే వారు. తొలినాళ్లలో సాధారణ రచనలే చేసిన ఆమె, వివాదాల ద్వారా ఎక్కువ పేరు సంపాదించుకోవచ్చునని తెలుసుకున్న తర్వాత తన ప్రతి రచనలోనూ ఓ వివాదం ఉండేలా చూసుకోవడం అలవాటు చేసుకున్నారు. పేరొచ్చిన ప్రతి వ్యక్తినీ, రచననీ తనదైన ధోరణిలో విమర్శించడం ద్వారా తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చేసుకోగలిగారు. అటుపైన 'మనోభావాల' వైపు దృష్టి సారించారు. పథకం ఫలించింది. ఆ రచనల కారణంగా మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళ తాలూకు ప్రతిస్పందనలతో ఆమెకి మరింత పేరొచ్చేసింది.  ఇంచుమించుగా మహేశ్ కూడా ఇదే స్ట్రాటజీని అమలుచేశారు. ఆయన లక్ష్యం పాపులర్ కావడమే అయి ఉంటే, చాలా తక్కువ కాలంలోనే దానిని సాధించేశారు. 

బ్లాగుల్లోనూ, అంతకన్నా ఎక్కువగా బజ్జులోనూ పేరు తెచ్చుకున్నారు మహేశ్. ఎక్కడ వివాదం ఉన్నా అక్కడ తను ఉండడం, తానున్న ప్రతి చోటా వివాదం ఉండడం ఆన్లైన్ వేదికని పంచుకున్న అందరికీ త్వరలోనే అలవాటైపోయింది. వాదనా పటిమ ద్వారా కన్నా, ఎక్కడ ఏ కార్డు వాడాలో బాగా తెలియడం మహేశ్ కి బాగా కలిసొచ్చిన విషయం. అవతలి వాళ్ళని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసేలా చేయడం, వాటి ఆధారంగా వివాదాన్ని మరింత పెంచడం, కొండొకచో వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టడం నిత్యకృత్యంగా ఉండేది. ఎందుకొచ్చిన గొడవ అని కొందరూ, అతని స్ట్రాటజీని అర్ధం చేసుకుని, మనమెందుకు సహకరించాలి?అనే ధోరణిలో మరికొందరు వాదనలకు దిగడం మానేశారు. సరిగ్గా అప్పుడే బ్లాగులు, బజ్జుని మించిన వేదిక దొరికింది మహేశ్ కి. ఫేస్బుక్ మాధ్యమం ద్వారా కొత్త వాదనలు, కొంగొత్త ప్రతివాదులు. 

పాపులారిటీని సంపాదించుకోడమే కాదు, దాన్ని ఛానలైజ్ చేసుకోవడంలోనూ తానే ముందుండి ఒరవడి పెట్టారు మహేశ్. 'క్రౌడ్ ఫండింగ్' ద్వారా సినిమా నిర్మాణం మొదలు పెట్టారు. తానే దర్శకుడు. సినిమా ఆడకపోయినా ఆ రంగంలో ఫుట్ హోల్డ్ దొరికింది. కార్యసాధకులకి అది చాలు. అంతలోనే టీవీ ఛానళ్లలో విమర్శకుడిగా మరో కొత్త అవతారం. సినిమా రంగంలో నిలదొక్కుకోడానికీ తనకి అచ్చొచ్చిన వివాదాలనే నమ్ముకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన సినిమా నటుడు పవన్ కళ్యాణ్ మీద కత్తి కట్టారు. ఫలితంగా, పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కత్తి మహేశ్ చిరపరిచితం అయిపోయారు. నటుడిగా అవకాశాలు రావడం మొదలైంది. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ కూడా పేరు జనంలో నానుతూ ఉండడం అన్నది ముఖ్యం - మంచిగానా, చెడ్డగానా అన్నది తర్వాత. 

నిజానికి మహేశ్ తర్వాతి అడుగు రాజకీయాలవైపే అనిపించింది. కులం, మతం లాంటి కార్డులని వ్యూహాత్మకంగా వాడడం, నిత్యం వివాదాల్లో ఉండేలా జాగ్రత్త పడడం చూసినప్పుడు త్వరలోనే ఇతన్ని ఏదో ఒక రాజకీయ పార్టీలో చూడబోతున్నాం అనుకున్నాను. రోడ్డు ప్రమాదం జరగకపోయి ఉంటే ఆ దిశగా అడుగులు పడి ఉండేవేమో. అతని వైద్య ఖర్చుల నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పదిహేడు లక్షల రూపాయల్ని ఆఘమేఘాల మీద కేటాయించడం చూసినప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి కాగానే ఇక రాజకీయాలే అనుకున్నాను. ("కత్తి మహేశ్ కోసం ప్రభుత్వం పదహారు ప్రాణాల్ని పణంగా పెట్టింది" అన్నారు మిత్రులొకరు - సహాయనిధి నుంచి సామాన్యులకి విడుదలయ్యే మొత్తం సగటున ఒక్కొక్కరికి లక్ష రూపాయలు). 

చాలా ఏళ్ళ క్రితం సంగతి - బ్లాగు మిత్రులొకరు కథ రాయడానికి ప్రయత్నిస్తూ డ్రాఫ్ట్ మెయిల్ చేశారు. కథ బాగుంది కానీ, కులాల ప్రస్తావన ఉంది. "కులాల గురించి తీసేస్తే కథలో ఫ్లేవర్ ఉండదు. ఉంచితే కత్తి మహేశ్ గారు కత్తి తీసుకుని వస్తారేమో అని అనుమానంగా ఉంది" అన్నది వారి సందేహం. ఆన్లైన్ వేదిక మీద కత్తి మహేశ్ చూపించిన ప్రభావానికి ఇదో చిన్న ఉదాహరణ. తనకేం కావాలో, కావాల్సిన దానిని ఎలా సాధించుకోవాలో చాలా స్పష్టంగా తెలిసిన మనిషి మహేశ్. తన బలాలు, బలహీనతల మీద కూడా మొదటినుంచీ స్పష్టమైన అవగాహన ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ పదమూడేళ్లలో అతను సాధించింది తక్కువేమీ కాదు. తన అడుగులు మాత్రమే కాదు, మరణం కూడా 'సెన్సేషనల్' వార్తే ఇవాళ.  జీవించి ఉంటే మరింత సాధించే వారేమో కూడా. ఎందుకంటే తనకి మార్గం కన్నా, లక్ష్యం ముఖ్యం. 

(ఆత్మల మీద మహేశ్ కి నమ్మకం లేదు, తన కుటుంబానికీ, మిత్రులకీ సానుభూతి). 

9 కామెంట్‌లు:

  1. నా బ్లాగ్ ప్రస్థానం అనుకోకుండానే ౨౦౦౭ నవంబర్ ౩౦ న జరిగింది.(ఇరవై రెండో యేటా) అందుకు గల కారణం ౨౦౦౦ సం. లో నేను మొదలుపెట్టిన డయిరి కాస్త కవితల డయిరి కావటము. ఓ సారి భోరున వర్షం కురిసినపుడు అందులో ఆ డయిరి తడిసిపోవటం.. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ ౧౯౭౨ లో కట్టటం మొదలు పెట్టారుట.. అందులోను అపుడు మేము సెక్టర్ ౧ లో ఉండటం వలన అవి బాగా శిథిలమై పోవటం మూలానా వర్షపు నీరు ఇంకిపోయేది.. (ఈ నాటికి ౫౦ ఏళ్ళు పూర్తయ్యే ఉంటుంది లేండి..) అంచేత వాటిని బ్లాగ్ లో ఆర్కైవ్ చేసుకోవచ్చనే ఉద్దేశ్యం తో..

    ఇహ సిని ప్రముఖులంటారా.. తొట్టెంపూడి వేణు (మళ్ళి మళ్ళి చూడాలి [విశాఖ స్టీల్ టౌన్షిప్ సెక్టరూ ౨ షాపింగ్ కాంప్లెక్స్]), కమల్ హాసన్ (శుభ సంకల్పం [విశాఖ స్టీల్ జెనెరల్ హాస్పిటల్, సెక్టర్ ౬]), వెంకటేశ్ దగ్గుబాటి (సాహసవీరుడు సాగరకన్య [విశాఖ స్టీల్ టౌన్షిప్ సెక్టర్ ౫ బస్ స్టాప్), బాలకృష్ణ నందమూరి (సమర సింహా రెడ్డి [విశాఖ స్టిల్ టౌన్షిప్ సెక్టర్ ౯ షాపింగ్ కాంప్లెక్స్]), ప్రభాస్ ఉప్పలపాట (వర్షం [సూర్యదేవర, శివ కేశవ రుద్రేశ్వర వేయి స్థంబాల గుడి, బ్రాహ్మణవాడ, వరంగల్]), రామ్ పోతినేని (నేనూ.. శైలజ [సియమార్ సెంట్రల్, రెసపువానిపాలెం, విశాఖపట్నం]), నవీన్ బాబు ఘంట అలియాస్ నాని (నిన్ను కోరి [హవా మహల్, బీచ్ రోడ్, విశాఖపట్నం]) గార్లను ఆయా షూటింగుల లోకేషన్లలో చూశాను.

    కత్తి మహేశ్ గురించిన విషయాలు ఏదైనా సినిమ రిలిజ్ ఐనపుడు, లేదా కత్తి కటార్ వర్తల్లో మాత్రమే తెలుసు, మురళి గారు

    రిప్లయితొలగించండి
  2. Very good assessment of Kathi Mahesh మురళి గారు.

    కత్తి మహేష్ సినిమా విశ్లేషణలు బాగుండేవి. Though a talented person, he failed to adopt a balanced approach. He could have been a good film critic and political analyst. Instead he lost way due to skewed approach.

    రిప్లయితొలగించండి
  3. కత్తి మహేష్ మేధావే గానీ ఆలోచనలను సరైన దారిలో వినియోగించలేక పోయాడా అని అనుమానం వస్తుంటుంది. అతని ఆలోచనా సరళి మీద వేరెవరి ప్రభావం ఏమైనా ఉండిందేమో తెలియదు మరి. పైన “బుచికి” గారు ఆంగ్లంలో కరక్ట్ గా చెప్పారు.

    సరే, ఏమైనప్పటికీ, ఇంత పిన్న వయసులోనే దాటిపోవడం, దాటిపోయిన పద్ధతి దురదృష్టకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి 🙏.

    “బుచికి” గారు అజ్ఞాతవాసం నుండి తిరిగి బ్లాగులోకానికి వచ్చినందుకు సంతోషం. మీ బ్లాగులో కూడా మళ్ళీ వ్రాయడం మొదలు పెడతారని ఆశిస్తాను.

    రిప్లయితొలగించండి
  4. కత్తి మహేష్ రాముణ్ణి తిట్టటం పొరపాటున చెయ్యలేదే!అతనే కాదు అటువంటివాళ్ళు అందరూ "మీ ఎదురుగా మేము మీ దేవుళ్ళని తిట్టినా మీరు మమ్మల్ని ఏమీ పీకలేరు." అని హిందువుల మీదకి ఒక చాలెంజి విసురుతున్నారు.

    ఏం!తను పెద్ద పులుగడిగిన ముత్యం అయినట్టు రాముణ్ణి దగుల్బాజీ అన్నవాడు నిజంగానే దగుల్బాజీ పని చేసిన తన తల్లిని గురించి ప్రశ్నలు అడిగినప్పుడు "మీరు వ్యక్తిగత విషయాలు టచ్ చేస్తున్నారు" అని చెప్పి ఎందుకు పారిపోయాడు?మరి, పవన్ కల్యాణ్ గురించి తను టచ్ చేసినవి వ్యక్తిగత విషయాలు కావా!

    వాళ్ళకి తెలియక చేస్తున్నారు,కూర్చోబెట్టి వివేకం నేర్పుదాం అని చెప్పగలరా ఇప్పుడు హిందువుల్ని ఆడిపోసుకుంటున్న వాహినీ వారి పెద్దమనుషులు - ఒట్టిది,మాస్ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ అయిన వ్యక్తికి తను ఎలా మాట్లాడితే ఎదటివారిలో ఎలాంటి స్పందన వస్తుందో తెలియదా?

    హిందువులు ఎర్రిపప్పలు అనుకుంటున్నారు.తనకి తన తల్లిని ఎదటివాళ్ళు తప్పు పడితే నెప్పి పుడుతుంది,కానీ తను రాముణ్ణి తిడితే హిందువులకి నెప్పి పుట్టకూడదు - పైన తను రెచ్చగొడితే రెచ్చిపోయిన హిందువులు పోట్లాటకి వచ్చి నిలదీస్తే అది SC/ST attrocity కింద నేరం అయిపోతుంది.

    ఒకడు పోతే మరొకడు వస్తున్నాడు.ఎవడికి వాడు ప్రపంచంలో జరుగుతున దోపిడీలలో కెల్లా ఘోరమైన దోపిడీ తనకీ తన కులానికీ జరిగినట్టు మొదటి దశలో ఏడుపులతో మొదలుపెట్టి ఫ్యన్లనీ ఫాలోయర్లనీ ఆర్మీనీ పెంచుకుని చివరి దశలో హిందువుల్లోనూ ముస్లిముల్లోనూ క్రైస్తవుల్లోనూ ఉన్న ఉద్రేకపరుల్ని రెచ్చగొట్టి గొడవలు రేపుతూ డబ్బులు సంపాదించటం అనే కొత్త వృత్తిని కనుకున్నారు.మళ్ళీ మళ్ళీ జరుగుతున్న మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కే తంతులా జరుగుతున్న ఈ సన్నివేశాలు వక్తలు అప్పటికప్పుడు ఆవేశపడి మాట్లాడితున్నట్టు అనిపించినప్పటికీ అనుకోకుండా జరుగుతున్నవి కావు - కొన్ని మిలియన్ల పెట్టుబడితో నడుస్తున్న క్రైస్తవ అనుకూల వర్గాల మతమార్పిడి వ్యాపార వ్యూహం.

    రిప్లయితొలగించండి
  5. katti meeda post ante ikkada kuda 100+ comments, lots of debate expect chesaa :), Disappointed ;)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీకలా అనిపించిందంటే, దానికి కారణం మహేష్ గారి ఇమేజ్ కావొచ్చండీ.. ధన్యవాదాలు..

      తొలగించండి