చిన్నప్పటినుంచీ చదువుని ఎంతగానో ప్రేమించిన 'శక్తి శేషాద్రి' పెద్దయ్యాక పెద్ద లాయర్ కావాలనుకుంది. తను చదివే కాన్వెంట్ స్కూల్లో చదువుతో పాటు, ఆటపాటల్లోనూ ముందుంటూ స్టూడెంట్ పీపుల్ లీడర్ గా ఎన్నికైంది. అంతే కాదు, పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రం మొత్తానికి ప్రధమ స్థానంలో నిలిచింది. కాలేజీలో చేరే క్షణం కోసం ఎదురుచూస్తున్న శక్తి నెత్తిన "నువ్వింక చదవబోవడం లేదు" అంటూ ఓ బండరాయి వేస్తుంది ఆమె తల్లి రంగనాయకి, పెద్దగా పేరు లేని సినీ నటి. భర్త చనిపోయాక ఎంత కష్టపడి తన పిల్లలిద్దరినీ (శక్తి, ఆమె తమ్ముడు శ్రీకాంత్) పెంచుకొచ్చిందీ వివరంగా చెబుతుంది.
పదిహేనేళ్ల శక్తికి తల్లి చెప్పేవేవీ పూర్తిగా బుర్రకెక్కవు. ఆమెకి అర్ధమయిందల్లా బాగా చదువుకోవాలనే తన కోరిక ఇక తీరదని. కొంత వాదన తర్వాత అయిష్టంగానే సినిమా షూటింగ్ కి బయలుదేరుతుంది. తనకి ఉన్న కాంటాక్ట్స్ సాయంతో కూతురికి ఓ సినిమాలో నాయికగా అవకాశం ఇప్పిస్తుంది రంగనాయకి. స్వతహాగా సిగ్గరి, ఉన్నదున్నట్టు మాట్లాడే తత్త్వం కలదీ అయిన శక్తికి ఆ సినిమా వాతావరణం ఎంత ఇబ్బంది కలిగిస్తుందంటే, ఆ షూటింగ్ పూర్తయ్యాక మరే సినిమానీ ఒప్పుకోకూడదని బలంగా నిర్ణయించుకుంటుంది. సినిమాకి సంపాదించుకున్న పారితోషికంతో కాలేజీలో చేరొచ్చన్న ఆశా లేకపోలేదు. అయితే తల్లి ఆలోచనలు పూర్తిగా వేరు. తను ఓడిన చోటే కూతురు గెలవాలి అన్నది రంగనాయకి పట్టుదల.
సినిమాలు చేయనని తల్లికి గట్టిగా చెప్పిన శక్తి తన మాటని తనే వెనక్కి తీసుకుంటుంది. తన అభిమాన హీరో జీఎమ్మార్ స్వయంగా ఇంటికొచ్చి కథానాయికగా అవకాశం ఇచ్చినప్పుడు మిగిలిన ఆలోచనల్ని (ఆ మాటకొస్తే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని) మర్చిపోతుంది శక్తి. అందమైన, తెలివైన శక్తి తక్కువకాలంలోనే అగ్ర నాయికగా అవతరిస్తుంది. ఒక్క జీఎమ్మార్ తోనే ఇరవై ఎనిమిది సినిమాల్లో జోడీ కడుతుంది. అయితే, సినిమా వాతావరణం ఆమెని ఏమీ మార్చలేదు. ఉన్నదున్నట్టు మాట్లాడే తన వైఖరితో ఎన్నో సమస్యలు తెచ్చుకుంది. పెళ్లి చేసుకుని తనకంటూ ఓ కుటుంబ జీవితం ఏర్పాటు చేసుకోవాలన్న కోరికనూ తీర్చుకోలేక పోయింది. కథానాయికగా తెరమరుగయ్యాక, తనకి ఏమాత్రం ఇష్టం లేని మరో రంగం రాజకీయాల్లోకి ప్రవేశించింది, కేవలం జీఎమ్మార్ కారణంగా. అతడి మరణానంతరం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగింది శక్తి శేషాద్రి.
కథ వింటుంటేనే తెలుస్తోంది కదా, శక్తి శేషాద్రి ఒక కల్పిత పాత్ర కాదు, అందరికీ బాగా తెలిసిన ఒకనాటి కథానాయిక మరియు దక్షిణాది రాష్ట్రపు మాజీ ముఖ్యమంత్రి అని. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్, మరో దర్శకుడు ప్రశాంత్ మురుగేశన్ తో కలిసి తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'క్వీన్' లో నాయిక శక్తి శేషాద్రి. అనిత శివరామకృష్ణన్ రాసిన 'క్వీన్' పుస్తకం ఈ వెబ్ సిరీస్ కి ఆధారం. టైటిల్ పాత్రలో మొత్తం ముగ్గురు నటించారు. పద్నాలుగు నుంచి పదహారేళ్ళ శక్తి గా అనిక, పదిహేడు నుంచి ఇరవై ఏడేళ్ల శక్తిగా అంజనా జయప్రకాశ్, అటుపైన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శక్తివంతమైన మహిళా నేత శక్తి శేషాద్రి గా రమ్యకృష్ణ వాళ్ళకిచ్చిన పాత్రల్లో జీవించారు అనడమే సబబు.
ఓవర్ ది టాప్ (ఓటీటీ ) మీడియా సర్వీస్ ప్లాట్ఫామ్ మీద ఎమెక్స్ ప్లేయర్ స్ట్రీమింగ్ సర్వీసెస్ సంస్థ తమిళంలో నిర్మించి, తెలుగు సహా దక్షిణాది భాషల్లోకి, హిందీ లోకీ అనువదించి విడుదల చేసింది ఈ 'క్వీన్' ని. ప్రస్తుతం తొలి సీజన్ లో పదకొండు ఎపిసోడ్లు (ఒక్కొక్కటీ నలభై నుంచి యాభై ఐదు నిమిషాలు నిడివున్నవి) అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి స్ట్రీమింగ్ ఉచితమే. ఒక టీవీ వ్యాఖ్యాత నడివయసు శక్తి శేషాద్రిని ఆమె ఇల్లు 'రంగ నిలయం'లో ఇంటర్యూ చేయడంతో మొదలయ్యే ఈ సీజన్ మొత్తం శక్తి శేషాద్రి తన గతాన్ని ఇంటర్యూలో వివరించడం అనే పద్ధతిలో సాగి, జీఎమ్మార్ మరణం తర్వాత శక్తి రాజకీయ ప్రవేశం జరిగిన తీరు చెప్పి ఇంటర్యూని ముగించడంతో ముగుస్తుంది.
"నిజానికి అసలు కథ అప్పుడే మొదలయ్యింది" అన్న శక్తి శేషాద్రి డైలాగ్ రెండో సీజన్ కి చక్కని పునాది ఏర్పాటు చేసింది. తొలి రెండు ఎపిసోడ్లు కొద్దిపాటి సాగతీతగా (గౌతమ్ మీనన్ మార్కు) అనిపించినా మూడో ఎపిసోడ్ నుంచీ కథనం వేగం అందుకుంది. ముఖ్యంగా మూడో ఎపిసోడ్ కథ, చిత్రించిన విధానం కూడా చిరకాలం గుర్తుండిపోయేలా ఉన్నాయి. శక్తి శేషాద్రిగా వేసిన ముగ్గురూ పోటీ పడి నటించినా, అంజనా జయప్రకాశ్ కి కొంచం ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నా, ఎక్కువ మార్కులు గెలుచుకునేది మాత్రం అనికానే. బాల్యపు అమాయకత్వాన్ని, యవ్వనపు తెలిసీతెలియనితనాన్ని ఎక్కడా అతి అనిపించని విధంగా అభినయించింది. ఇల్లు, బడి, స్నేహితురాలి ఇల్లు, సినిమా అనే నాలుగు వేర్వేరు ప్రపంచాల్లో జరిగే కథలో శక్తిగా ఇమిడిపోయింది.
ఇక, అంజనా జయప్రకాశ్ అయితే అచ్చమైన సినిమా హీరోయిన్. తనకన్నా వయసులోనూ, హోదాలోనూ బాగా పెద్దవాడైన జీఎమ్మార్ తో ప్రేమలో పడే టీనేజ్ అమ్మాయి మొదలు, చిన్న వయసులోనే ఎక్కువ ఎదురు దెబ్బలు తిని రాటుదేలి తనదైన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా సంతరించుకున్న శక్తి శేషాద్రిని కళ్ళముందు ఉంచింది. మెచ్యూర్డ్ శక్తి శేషాద్రి పాత్రకి రమ్యకృష్ణని ఎంచుకోవడం దర్శకుడి విజయం. విడిపోయిన చాలా ఏళ్ళ తర్వాత జీఎమ్మార్, శక్తి శేషాద్రిని వెతుక్కుంటూ ఆమె ఇంటికి వచ్చే సన్నివేశం, జీఎమ్మార్ మరణం తర్వాత జరిగే పరిణామాలు.. ఇవి రమ్యకృష్ణలోని అనుభవశాలి అయిన నటికి సవాలు విసిరే సన్నివేశాలు. కొంత 'నీలాంబరి' (రజనీకాంత్ 'నరసింహ') మార్కు కనిపించినా, వాటిని చక్కగా పండించింది రమ్యకృష్ణ.
మిగిలిన నటీనటుల్లో జీఎమ్మార్ గా ఇంద్రజిత్ సుకుమారన్, చిన్నప్పటి శక్తి తల్లిగా సోనియా అగర్వాల్ (బృందావన్ కాలనీ నాయిక), సినీ కథానాయిక శక్తి తల్లిగా తులసి (శంకరాభరణం) గుర్తుండిపోయేలా తమ పాత్రల్ని పోషించారు. వీళ్ళే కాదు జీఎమ్మార్ భార్య జనని, సహాయకుడు ప్రదీపన్, రాజకీయాల్లోకి వచ్చిన శక్తి కి సహాయకురాలిగా చేరిన సూర్యకళ.. ఇలా ప్రతి పాత్రకీ ఓ ఐడెంటిటీ ఉంది. చిత్రీకరణ విషయానికి వస్తే, భారీ బడ్జెట్ సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా ఖర్చు చేశారు. పెట్టిన ఖర్చంతా తెరమీద కనిపించింది కూడా. యాభై ఏళ్ళ క్రితం నాటి వాతావరణాన్ని సృష్టించడం మొదలు, అప్పటి దుస్తులు, ఇళ్ళు, వాహనాలు.. ఇలా వింటేజ్ ప్రాపర్టీస్ ఎన్నింటినో ఉపయోగించారు. నేపధ్య సంగీతం కూడా సినిమాకి ఎక్కడా తగ్గలేదు. (కీలక సన్నివేశాల్లో వినిపించిన ఒక ట్యూన్ ఇళయరాజా 'ఆకాశం ఏనాటిదో' పాటని జ్ఞాపకం చేసింది).
సంభాషణలు ఎంత జాగ్రత్తగా రాశారంటే, శక్తి ఇంటర్యూలో చెప్పే ఒక్కో డైలాగు వెంటనే వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో సన్నివేశాలకి లింక్ చేసేట్టుగా ఉంటుంది. తెలుగు అనువాదం అంత బాగా కుదరలేదు కానీ, ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ పెట్టుకుని తమిళంలో చూడడం బాగుంది. మొదటి సీజన్ లో పూర్తైన కథ ప్రకారం చూసినప్పుడు, రెండో సీజన్ మొత్తం రమ్య భుజాల మీదే ఉందన్నది నిజం. (ఛానల్ వారి ఇంటర్యూ ముగిసింది కాబట్టి, ఆ సీజన్ ని ఎలా మొదలు పెడతారో చూడాలి). మొత్తం మీద చూసినప్పుడు, శక్తి శేషాద్రిని పోలిన పాత్రల్లో త్వరలోనే వెండితెరమీద కనిపించబోతున్న నిత్యా మీనన్, కంగనా రనౌత్ లకి రమ్యకృష్ణ సవాల్ విసిరినట్టే అనిపించింది. 'క్వీన్' తొలి సీజన్ లో పదకొండు ఎపిసోడ్లూ చూశాక, ఈ ఇంటర్యూ చూడడం బాగుంటుంది, మిస్సవ్వకండి.
ఈ సిరీస్ రిలీజ్ అయిన దగ్గర నుండీ చూద్దామనుకుంటున్నాను కాని వీలుపడడం లేదండీ.. మీ సమీక్ష చదివాక ప్రయారిటీ లిస్ట్ లో మరికొంత పైకి జరిపాను. త్వరలో చూడాలి. ఎప్పటిలానే మీ శైలిలో కథ చెప్పిన తీరు సమీక్షించిన తీరు చాలా బావున్నాయ్.
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: నేను బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు చూశానండి.. మిమ్మల్ని నిరాశ పరచదు. ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఇంతకీ తెలుగు డైరెక్టర్ గౌతమ్ రెడ్డి పాత్ర ఎవరిది నిజ జీవితంలో....తెలిస్తే చెప్పగలరు.
రిప్లయితొలగించండిగౌతమ్ రెడ్డి కాదండి, చైతన్య రెడ్డి. అలనాటి అందాల నటుణ్ణి దర్శకుడిగా మార్చారని విన్నాను. ధన్యవాదాలు..
తొలగించండిSorry చైతన్యరెడ్డి. శోభన్ బాబుతో మంచి సాన్నిహిత్యం ఉండేదని చదివాను. అయ్యుండొచ్చు.
రిప్లయితొలగించండినేను అలమేలు లాగే ఆలోచించాను. బహుశా అందుకే శక్తి తలైవిగా మారబోతున్న చివరి రెండు ఎపిసోడ్లు చాలారోజులు చూడాలనిపించలేదు. కొన్ని వన్ వే లు జీవితంలో తప్పవనుకుంటా.
రిప్లయితొలగించండిఅలమేలుకే కాదండి, శక్తి శేషాద్రి ఓ నిర్ణయం తీసుకునేలా చేయగల శక్తి సూర్యకళ కి కూడా లేదు. నాలుగో/ఐదో ఎపిసోడ్ లో శక్తి చెప్పినట్టు - ఆమెని నిర్దేశించగలిగే వాళ్ళు ఇద్దరే.. తల్లి, జీఎమ్మార్. చరిత్ర తెలుసు కాబట్టి, దర్శకుడు ఆ చరిత్రని ఎలా చెప్పి ఉంటాడా అన్న ఉత్సుకతతో అన్ని ఎపిసోడ్లూ విడవకుండా చూసేశాను నేను. ..ధన్యవాదాలు.
తొలగించండిపదకొండు ఎపిసోడ్లు చూడడానికి చాలా సమయమే తీసుకున్నాను. గౌతం గారు చాలా బాగా ప్రెజెంట్ చేసారు.ఆయన సినిమా తీస్తే ఇంతబాగా వచ్చేది కాదు. నటీ నటులు సరిగ్గా కుదిరారు.జయలలిత గారి గురించి మరింత బాగా తెలుసుకున్నాను.
రిప్లయితొలగించండిఅఖరి ఎపిసోడ్ లో రమ్యకృష్ణ నటన, కోపం ... బాగా కనెక్ట్ అయ్యాను. చైతన్య రెడ్డితో పెళ్ళిని ఎందుకు చెడగొట్టారో ఇంకా అర్ధం కాలేదు. మీరేమయినా చెప్పగలరా ?
సినిమా అయితే ఇంత నిడివి ఉండదు కదండీ. మహా అయితే రెండున్నర గంటలు స్క్రీన్ టైం. అందులో మళ్ళీ కమర్షియల్ ఎలిమెంట్స్ అని సినిమావాళ్లు అనుకునేవి (పాటలు, ఫైట్లు, కామెడీ ట్రాక్ వగయిరా) కలపాలి. ఈ కథని ఇలా తీయడమే సబబు అనిపించింది నాకు. చైతన్యతో పెళ్లి జరక్కుండా జీఎమ్మార్ అడ్డం పడ్డాడని చివరి ఎపిసోడ్లో ప్రదీపన్ చేత చెప్పించారు కదా (జీఎమ్మార్ అంతిమ యాత్ర సీన్ లో శక్తి-ప్రదీపన్ ల మధ్య జరిగే సన్నివేశం మరోసారి చూడండి, మ్యూజిక్ మరీ లౌడ్ అవ్వడం వల్ల డైలాగుల్లో స్పష్టత కొంచం తగ్గింది). నేనైతే రెండో సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాను. ..ధన్యవాదాలు.
తొలగించండి