ముందుగా ఓ ఒప్పుకోలు. 'చందమామ కథలు,' 'గుంటూర్ టాకీస్'
లాంటి వైవిద్యభరితమైన సినిమాలు తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, యాంగ్రీ
యంగ్మన్ రాజశేఖర్ హీరోగా సినిమా చేయబోతున్నాడు అనగానే, "అయ్యో, ఇదేంటీ"
అనుకున్నాను. గత కొన్నేళ్లుగా, కథ ఏదైనా, దర్శకుడు ఎవరైనా రాజశేఖర్ చేసిన
సినిమాలన్నీ దాదాపు ఒకే మూసలో ఉండడమే ఇందుకు కారణం. అయితే, కథలో బలం
ఉన్నప్పుడూ, చెప్పదలచిన విషయం మీద స్పష్టత ఉన్నప్పుడూ హీరో ఎవరైనా సరే,
దర్శకుడు హీరోని ఒప్పించి కథకి అనుగుణంగా నటింపజేసుకో గలడని తన తాజా చిత్రం
'పీఎస్వీ గరుడవేగ' తో నిరూపించారు ప్రవీణ్.
ఈ సినిమా
గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, తెలుగు నటీనటులు హాలీవుడ్ యాక్షన్
థ్రిల్లర్ లో నటించినట్టుగా ఉంది. సామాన్య ప్రేక్షకులకి పెద్దగా తెలియని,
ఎక్కువమందికి ఆసక్తి కలిగించని మైనింగ్, సాఫ్ట్వేర్ హ్యాకింగ్, నేషనల్
ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్నైయ్యే) లాంటి సబ్జెక్టులన్నింటినీ కలగలిపి
కుటుంబకథనీ, రాజకీయాలనీ జోడించి ఆద్యంతం ఆసక్తిగా చిత్రించిన సినిమా ఇది.
ఎప్పుడూ సీక్రెట్ ఆపరేషన్స్ లో పనిచేసే ఎన్నైయ్యే అధికారి శేఖర్ (రాజశేఖర్)
సాధారణ డ్రగ్స్ కేసుగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి తీగలాగేకొద్దీ కదిలిన
డొంక, ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే ఇబ్బందులు ఒక థ్రిల్లర్ సినిమాని చూసిన
అనునుభూతిని కలిగించాయి.
మరోపక్క అతని తీరుతో విసిగిపోయి విడాకులు
కోరుతున్న భార్య,శేఖర్ విచారణ జరుపుతున్న కేసు కారణంగా క్షణక్షణం మారే
రాజకీయ పరిస్థితులు. బ్రేకింగ్ న్యూస్ కోసం శేఖర్ టీం వెంటపడే
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, అసలు ఈ టీం మెంబర్లకే విలన్ గ్యాంగ్ తో
సంబంధాలు ఉన్నాయేమో అనిపించేలాంటి సన్నివేశాలు.. ఇలా రాస్తుంటే చదవడం కాస్త
కంఫ్యూజింగ్ గా ఉంటుంది కానీ, మొత్తం సినిమాని ఎక్కడా కన్ఫ్యూజన్ కి తావు
లేకుండా, కథ తాలూకు ఒక్కో ముడినీ విప్పుకుంటూ, సస్పెన్స్ చివరికంటా ఉండేలా
జాగ్రత్త పడుతూ, సామాన్య ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా చిత్రించడం దర్శకుడి
ప్రతిభే.
పోలీస్ పాత్రలు రాజశేఖర్ కి కొత్త కాదు. కానీ
ఇందులో ఇటు పోలీసుగానూ, అటు ఫ్యామిలీ మ్యాన్ గానూ రెండు డిఫరెంట్ షేడ్స్
ఉన్న పాత్ర. ఈ పాత్రని పండించడానికి రాజశేఖర్ అనుభవం బాగా ఉపయోగానికి
వచ్చింది. అయితే, వయసుని దాచే ప్రయత్నం మాత్రం సఫలం కాలేదు. మరీ ఐదేళ్ల
పిల్లాడికి తండ్రిగా కాకుండా, మిడిల్ ఏజ్డ్ కాప్ గా ఆ పాత్రని తీర్చి
దిద్ది, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఇచ్చి ఉంటే శేఖర్ పాత్ర మరింత గంభీరంగా
ఉండి ఉండేది అనిపించింది. వయసుని లెక్క చేయకుండా, స్టెంట్స్ వేయించుకున్నాక
కూడా రిస్కీ సినిమాని తీయడమే కాక, రిస్కీ షాట్స్ లోనూ నటించాడు రాజశేఖర్.
అయితే, ఈ రిస్కీ సన్నివేశాలు కథకి అవసరం మాత్రమే కాదు, ఆయువుపట్లు కూడా.
సినిమాలో
రెండు డాక్టర్ పాత్రలు - ఫ్యామిలీ కౌన్సెలింగ్ చేసే డాక్టర్ పాత్రలో అలీ,
కేన్సర్ స్పెషలిస్టు గా థర్టీ ఇయర్స్ పృద్వీ. దర్శకుడు ఈ రెండు పాత్రలనీ
రాసుకుని, చిత్రించిన తీరు నిరాశ పరిచింది. ఒకానొక దశలో 'పూర్ టేస్ట్' అని
కూడా అనిపించేసింది. డాక్టర్లు ఇద్దరూ కూడా హీరోని 'సర్' అని సంబోధిస్తే,
అంత పెద్ద అధికారీ కూడా నేరస్తులతో మాట్లాడినట్టు 'నువ్వు' అనే మాట్లాడతాడు
ఇద్దరితోనూ. 'సెన్సిబిల్ పర్సన్' అని ఎస్టాబ్లిష్ చేయదలచుకున్న పాత్ర చేత
దర్శకుడు ఇలా ఎందుకు నటింపజేశాడు అన్నది ప్రశ్న. పోలీసుల్ని హైలైట్
చేయాలంటే డాక్టర్లని కించపరచాల్సిన అవసరం లేదు కదా.
మరో
ఇబ్బంది సినిమా నిడివి. యాక్షన్ ప్యాక్డ్ సినిమా అలా కొనసాగుతూ ఉంటే అందులో
లీనమై చూస్తున్నంత సేపూ బాగుంటుంది కానీ, పూర్తయ్యాక మెదడుకి కలిగిన శ్రమ
ఎంతటిదో తెలుస్తుంది. ఈ ఒక్క కారణానికి, ఓ పావుగంట నిడివి తగ్గిస్తే
బాగుండేది అనిపించింది. తగ్గించి ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్ గా ఉండేది
కూడా. సన్నీ లియోన్ ప్రత్యేక గీతం వల్ల కథకి ఒరిగింది ఏమీ లేదుకానీ,
సినేమాకిమాత్రం బాగానే ప్లస్ అయినట్టు అనిపించింది, ఆ పాట అవుతూనే లేచి
వెళ్ళిపోయిన కొందరు ప్రేక్షకుల్ని చూసినప్పుడు. మొత్తం మీద, 'పీఎస్వీ
గరుడవేగ' కి ఇద్దరు హీరోలు. నిర్మాత, కథానాయకుడు డాక్టర్ రాజశేఖర్,
దర్శకుడు ప్రవీణ్ సత్తారు. రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమాలు ఇష్టపడే
వాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా.
రొటీన్ కాని సినిమా గురించి మెచ్చుకోళ్ళు వినడం బాగుంది. థియేటర్లో మాత్రమే చూడదగ్గ ఎలిమెంట్స్ ఉన్నాయో లేక టీవిలో చూడవచ్చో ఎవరూ చెప్పలేదు.
రిప్లయితొలగించండిNice review - Krishna
రిప్లయితొలగించండిSir, FIDA review kosam waiting ikkada
రిప్లయితొలగించండి@లక్ష్మీదేవి దేశాయి: థియేటర్లో చూస్తే బాగుంటుందండీ.. కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ టీవీలో అంత బాగా కనిపించవనుకుంటా.. ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@కృష్ణ: ధన్యవాదాలండీ
@అడబాల: ఆ సినిమా నేను చూడలేదండీ :(