మంగళవారం, జూన్ 13, 2017

అమీ తుమీ

బాగా హిట్టైన సినిమాని ప్రేక్షకులు చాలా రోజులపాటు గుర్తుపెట్టుకుంటారు - సినిమాని మాత్రమే కాదు, సినిమాకి పని చేసిన వాళ్ళని కూడా. తొమ్మిదేళ్ల క్రితం విడుదలైన 'అష్టా చమ్మా' ప్రేక్షకుల అభిమానంతో పాటు, అవార్డులనీ గెలుచుకుంది. ఆ సినిమా దర్శకుడు, అదే పంధాలో తీసిన తాజా చిత్రం 'అమీ తుమీ.' ఇది కూడా మూడు జంటల కథే.. ('అష్టా చమ్మా' లో భరణి-హేమ జంటని మర్చిపోయారా ఏవిటి?). ఇది కూడా కథని కాక, కథనాన్ని, కామెడీని నమ్ముకుని తీసిన సినిమానే. ఇంకా చెప్పాలంటే నలిగిన కథకి, తనకి అలవాటైన ఫార్ములాని జతచేసి, ఇంద్రగంటి మోహనకృష్ణ తనమార్కు సంభాషణలతో ఆసాంతమూ హాయిగా నడిపించేసిన సినిమా.

హైదరాబాద్ లో ఉండే అపర కోటీశ్వరుడు జనార్దనానికి (తనికెళ్ళ భరణి) ఓ కొడుకు (అవసరాల శ్రీనివాస్), కూతురు (ఈషా). తన హోదాని ఏమాత్రం మర్చిపోని జనార్దనానికి కూతురు ఓ సేల్స్ మేనేజర్ తో (అడివి శేష్) తో ప్రేమలో పడడం అస్సలు నచ్చదు. ఇది చాలదన్నట్టు, తన వ్యాపార శత్రువు గంగాధరం కూతురు మాయ (అదితి)తో  తన కొడుకు పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని తెలియడంతో పుండు మీద కారం రాసినట్టు ఉంటుంది. ఇది పని కాదని, కూతురికి విశాఖపట్నం 'చిలిపి' ఫామిలీ కి చెందిన శ్రీ చిలిపి (వెన్నెల కిషోర్) తో పెళ్లి నిశ్చయం చేసేస్తాడు. ఇటు శ్రీ చిలిపి తండ్రి కూడా అమ్మాయి ఎలా ఉన్నా ఓకే చేసేయమని చెప్పి మరీ కొడుకుని హైదరాబాద్ పంపిస్తాడు.

ఇష్టం లేని పెళ్లిని తప్పించుకుని నచ్చిన వాడిని చేసుకోడానికి జనార్దనం కూతురు ఏం చేసింది, నన్ గా మారిపోవాలనుకున్న అన్నగారి గర్ల్ ఫ్రెండు మాయ మనసు మార్చి, వాళ్ళ పెళ్ళికి మార్గం చూపించింది అన్నవాటితో పాటు, శ్రీ చిలిపి కథ ఏ మలుపు తిరిగిందన్నది ఈ చిన్న సినిమా ముగింపు. అవును, బడ్జెట్, నిడివి ప్రకారంగా కూడా ఇది చిన్న సినిమానే. అలవాటైన కన్ఫ్యూజింగ్ కామెడీనే. అయితే, ప్రేక్షకులకి ఎక్కడా విసుగు రాకుండా కథని నడిపించిన ఘనత మాత్రం దర్శకుడిదే. దర్శకుడిగా కన్నా, మాటల రచయితగా మోహనకృష్ణ ఎక్కువ కష్ట పడినట్టు అనిపించింది సినిమా చూస్తున్నంతసేపూ.


అవడానికి అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి ప్రధాన తారాగణం అయినప్పటికి కథంతా తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్యామలాదేవి (జనార్దనం ఇంట్లో పనమ్మాయి కుమారి) చుట్టూనే తిరుగుతుంది. కథ నడక 'అష్టా చమ్మా' ని గుర్తు చేస్తూ ఉండగానే, మధ్య మధ్యలో ఆ సినిమాని గుర్తు చేసేలా కొన్ని డైలాగులు ('పేరులో వైబ్రేషన్స్' లాంటివి) సన్నివేశాలు (వంకాయ కాల్చడం) చేర్చారు. 'అష్టా చమ్మా' మూలకథ ఓ. హెన్రీ దయితే (క్రెడిట్ ఇచ్చారు), ఈ సినిమా మూల కథ ఎస్వీ కృష్ణారెడ్డిది (క్రెడిట్ ఇవ్వలేదు). జనార్దనం ఇంట్లో శ్రీ చిలిపి ప్రవేశించినప్పటి నుంచీ 'వినోదం' సినిమా వద్దన్నా గుర్తొస్తూనే ఉంటుంది.

ఆంధ్ర ప్రాంత నటులచేత తెలంగాణ మాండలీకం, తెలంగాణ ప్రాంతానికి చెందిన వెన్నెల కిషోర్ తో విశాఖ మాండలీకం మాట్లాడించడం మోహనకృష్ణ చేసిన ప్రయోగం. నటీనటులందరూ సంభాషణలు పలకడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కథలో చిక్కదనం లేకపోవడం అన్న బలహీనతని సంభాషణలతో అధిగమించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే, డైలాగుల్లో చాలా వరకు మల్టిప్లెక్స్ ప్రేక్షకులకి మాత్రమే అర్ధమయ్యేవిగా ఉన్నాయి. పాటలు మంచి అసెట్ అయ్యే అవకాశం ఉన్నా, ఒక డ్యూయెట్ తో కలిపి మొత్తం రెండే పాటలతో సరిపెట్టేశారు. లాజిక్ ల జోలికి వెళ్లకుండా రెండు గంటలపాటు హాయిగా నవ్వుకోడానికి చూడదగ్గ సినిమా ఇది. నేనైతే, మోహనకృష్ణ నుంచి మరికొంచం ఆశించాను.

4 కామెంట్‌లు:

  1. ఈ సినిమా గురించి మిత్రులు వేణూ శ్రీకాంత్ గారి టపా ఇక్కడ:
    http://venusrikanth.blogspot.in/2017/06/blog-post.html

    రిప్లయితొలగించండి
  2. SV Krishna Reddy: అదేమిటి, కథకి మూలం ఎవరో ఐరిష్ రచయిత నాటకం అని ఇంద్రగంటి పదే పదే చెప్పారు కదా. సినిమా టైటిల్స్ లో వేశారట - నేను గమనించలేదు కానీ ఒక రివ్యూ లో చదివాను. నాకు వినోదం గుర్తు రాలేదు ఇంతకీ, మీరు రాసింది చదివేదాక :)

    రిప్లయితొలగించండి
  3. యాస గురించి మీ అబ్సర్వేషన్ బాగుంది మురళి గారు.. నైస్ రివ్యూ.. అవునండీ కథ గురించి తెలియగానే నేను వినోదంకి కనెక్ట్ అయ్యాను. బహుశా ఆ సినిమా మీద ఉన్న అభిమానం కూడా కారణమై ఉండచ్చు.

    రిప్లయితొలగించండి
  4. @ఎస్: అవునా!! ఐరిష్ రచయిత గురించి నేను గమనించలేదండీ.. బహుశా మోహనకృష్ణ కన్నా ముందుగా కృష్ణారెడ్డి స్ఫూర్తి పొందారేమో :) ..ధన్యవాదాలు
    @వేణూ శ్రీకాంత్: నిజమేనండీ.. 'వినోదం' ఎప్పుడు చూసినా బాగుంటుంది.. మరీముఖ్యంగా 'కార్మిక నాయకుడు సింగారం' ...ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి