కమర్షియల్ హంగులని కాక కథలని మాత్రమే నమ్ముకున్న నవతరం దర్శకులు
స్క్రీన్ ప్లే ప్రాధాన్యతని బాగా అర్ధం చేసుకున్నట్టే కనిపిస్తోంది, ఈ
మధ్య వస్తున్న కొన్ని సినిమాలు చూస్తుంటే. కథనంతో ప్రేక్షకులని కట్టి
పడేయాలన్న సూత్రాన్ని నమ్ముకున్న తాజా సినిమా 'నాని జెంటిల్ మన్.'
పోస్టర్స్ లో 'జెంటిల్ మన్' అని మాత్రమే కనిపిస్తోంది కదా అనకండి. 'అతః
కుంజరః' టైపులో పైన ఇంగ్లీష్ లో నాని అని ఉంటుంది చూడండి. సెన్సార్
సర్టిఫికెట్ లో మాత్రం మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంది టైటిల్. సహజ నక్షత్రం
నాని కథానాయకుడిగా నటించిన డబుల్ ఫోటో సినిమా ఇది. ఇంతకీ ఇతగాడు కథా
నాయకుడా లేక ప్రతి నాయకుడా అన్నది వెండితెర మీద చూడాలి.
కోటీశ్వరుల
ఇంటి బిడ్డ ఐశ్వర్య (సురభి), విజువల్ గ్రాఫిక్స్ ఎక్సపర్ట్ మరియు బహుముఖ
ప్రజ్ఞాశాలి కేథరీన్ (నివేదా థామస్) ఓ ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో పక్క పక్క
సీట్లలో కూర్చుని ప్రయాణం చేస్తూ, టైం కిల్ చేయడం కోసం ఒకరి కథలు ఒకరికి
చెప్పుకుని అటుపై ప్రాణ స్నేహితురాళ్ళు అయిపోతారు. కేథరీన్ గౌతమ్ తో
ప్రేమలో పడితే, ఐశ్వర్య పెద్దలు కుదిర్చిన వరుడు జయరాంతో కలిసి కోడై కెనాల్
వెళ్లి అప్పుడతణ్ణి ప్రేమించడం మొదలుపెడుతుంది. ఐశ్వర్య ని రిసీవ్
చేసుకోడానికి విమానాశ్రయానికి వస్తాడు జయరాం. అచ్చూ గౌతమ్ లాగే ఉన్న
జయరాంని చూసి అయోమయంలో పడుతుంది కేథరీన్. ఆగలేక నేరుగా గౌతమ్ ఇంటికే
వెళ్తుంది కూడా. అక్కడ గౌతమ్ గురించి ఆమెకి తెలిసిన ఓ నిజం కథని మలుపు
తిప్పి ప్రేక్షకులకి విశ్రాంతినిచ్చి, రెండోసగంలో పూర్తిగా కేథరీన్ కథగా
మారిపోతుంది.
ఆర్. డేవిడ్ నాథన్ కథకి విస్తరణ చేసి, సంభాషణలు
రాసుకుని, దర్శకత్వం చేశారు ఇంద్రగంటి మోహనకృష్ణ. గౌతమ్ గానూ, జయరాం గానూ
కనిపించిన నాని రెండు పాత్రల్లో వేరియేషన్ ని చక్కగా చూపించాడు. పూర్తి
స్థాయిలో విలన్ పాత్ర దొరికితే పోషించి మెప్పించే సామర్ధ్యం ఉందని
నిరూపించుకున్నాడు. నానితో సమంగా సినిమాని మోసిన నివేదా థామస్ చాలా
ఫ్రేముల్లో ప్రియమణి-మీరా జాస్మిన్ లని జమిలిగా గుర్తు చేసింది. మరో నాయిక
సురభికి, నివేదతో పోల్చినప్పుడు నటించడానికి పెద్దగా అవకాశం లేకపోయినా,
ఉన్నంతలో ఎక్కడా లోపం చెయ్యలేదు. మిగిలిన వారిలో రోహిణి, శ్రీముఖి, అవసరాల
శ్రీనివాస్ లకి మంచి పాత్రలు దొరికాయి. వెన్నెల కిషోర్ పాత్ర అసంపూర్తిగా
అనిపించింది. ప్రగతి, రమాప్రభలవి మరీ సెట్ ప్రాపర్టీ లాంటి పాత్రలు.
సాంకేతిక
విభాగాల్లో చాలా బాగా అనిపించినవి కెమెరా (పి.జి. విందా), సంగీతం
(మణిశర్మ) మరియు ఎడిటింగ్ (మార్తాండ్ కె. వెంకటేష్). ఎన్నో సినిమాల్లో
చూసేసిన కోడై కెనాల్ ని కూడా కొత్తగా చూపించారు విందా. చాలా రోజుల తర్వాత వినిపించిన మణిశర్మ పాటల కన్నా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో తన మేజిక్ చూపించారు. తొలిసగం ఆహ్లాదంగానూ, రెండో సగం ఉత్కంఠ భరితంగానూ సాగే సినిమా మూడ్ ని నేపధ్య సంగీతం బాగా ఎలివేట్ చేసింది.
ఎక్కడా విసుగు కలగక పోవడం, ఏ సన్నివేశం అనవసరం అనిపించక పోవడంలో ఎడిటర్
పాత్ర చాలానే ఉందనిపించింది. కథనంలో ఉత్కంఠ వల్ల రెండో సగంలో వచ్చే పబ్ సాంగ్ ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడాల్సి వచ్చింది. (అప్పటికి ముగింపుని ఊహించినప్పటికీ, కథ ఆ ముగింపుకి ఎలా చేరుతుందో చూడాలన్న కుతూహలం పెరిగింది).
ముందుగా
చెప్పుకున్నట్టుగా ఇది కథ కన్నా స్క్రీన్ ప్లే ని బాగా నమ్ముకున్న సినిమా.
కథనం మీద చేసిన కృషి వృధా పోలేదు. రెండు ప్రేమకథలని నడపడం లోనూ కొత్తదనం
కోసం రిస్కు చేయకుండా, నలిగిన పంథాలోనే వెళ్లారు. ఈ ప్రేమకథలో వేసిన బలమైన
పునాది రెండో సగాన్ని ఎక్కడా ఆసక్తి సడలని విధంగా నడపడానికి సాయపడింది.
తెరమీద మిస్టరీ మొదలవ్వగానే ప్రేక్షకులు కనిపించిన ప్రతి పాత్రనీ
అనుమానించడం సహజం. అయితే, హీరోని కూడా అనుమానించేలా సాగిన కథనం ముగింపు మీద ఆసక్తిని బాగా పెంచింది.
నివేద రోహిణిని రెండోసారి కలుసుకునే సన్నివేశం, మోహన కృష్ణ బెస్ట్ సీన్స్
లో ఒకటవుతుంది. మేధావుల సంగతెలా ఉన్నా, సగటు ప్రేక్షకులకి నచ్చే సినిమా
'పైసా వసూల్' సినిమా ఇది.
సహజ నక్షత్రం.....కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్
రిప్లయితొలగించండికొడైకెనాల్ ని మాత్రం చాలా బాగా చూపించారు...బింగో
మిగతాదంతా సేం టు సేం (మీది గోదారే మాది గోదారే)
బాగా రాశారండీ.. నాక్కూడా నచ్చిందీ సినిమా.
రిప్లయితొలగించండిమా బాబు రెండు సార్లు ఈ సినిమా చూసాడంటేనే ఎంత బాగుందో అర్థమైంది. మీ వివరణ చూసాక వెంటనే సినిమా చూడలనిపిస్తున్నది. సహజ నక్షత్రం పద ప్రయోగం బాగుంది.
రిప్లయితొలగించండిసహజ నక్షత్రం... వావ్
రిప్లయితొలగించండి@శ్రీనివాస్ పప్పు: బిరుదుని అనువదించే ప్రయత్నం అండీ :)) ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: రొటీన్ కి భిన్నమయిన ప్రయత్నం చేశారండీ.. ధన్యవాదాలు
@సుమతి చూరుకంటి: తప్పక చూడండి.. ఈ మధ్య వఛ్చిన వాటిలో టైం తెలియని విధంగా సాగిపోయిన సినిమా.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@పురాణపండ ఫణి: హహ్హా.. ధన్యవాదాలండీ..