"ప్రియమైన సీత గారికి, ధూపాటి హరిబాబు వ్రాయునది..." ఏమిటిది? ఓ
కుర్రాడు తన స్నేహితురాలికి రాస్తున్న ఉత్తరమా లేక ప్రియుడు ప్రేయసికి
రాస్తున్న ప్రేమలేఖా? ఇంతకుమించి ఆలోచన ముందుకు వెళ్ళదు. వెళ్తే ఎలా
ఉంటుంది అన్న ప్రశ్నకి సమాధానం 'కంచె' సినిమా. నూట ఇరవై ఐదు నిమిషాల
స్క్రీన్ టైం లో ఏ ఒక్క నిమిషాన్నీ వృధా చేయకుండా, ఒక్క క్షణం కూడా
ప్రేక్షకులకి తల పక్కకి తిప్పే అవకాశం ఇవ్వని విధంగా, అత్యంత పగడ్బందీగా
క్రిష్ తీసిన సినిమా ఇది.
'గమ్యం,' 'వేదం' చూసిన తర్వాత
క్రిష్ మీద పెరిగిన అంచనాలు ఒక పక్కా, షూటింగ్ దశ నుంచీ పోస్ట్-ప్రొడక్షన్
వరకూ సినిమా తాలూకు వివరాలన్నీ తెలుస్తూ ఉండడం మరో పక్కా 'కంచె' మీద
ఆసక్తిని పెంచాయి. మొదటి రోజే వినిపించిన 'సినిమా బాగుంది' అన్న టాక్
సంతోషం కలిగించినా, చూడ్డానికి మాత్రం రెండు రోజులు ఆగాల్సి వచ్చింది.
కంటికి ఇంపైన కెమెరా పనితనం, సన్నివేశాలకి సరిగ్గా సరిపోయే సంగీతం,
అక్కడక్కడా 'కాస్త నాటకీయత' వినిపించినా గుర్తుండిపోయే సంభాషణలు,
అన్నింటినీ మించి పాత్రల పరిధుల మేరకు మాత్రమే నటించిన నటీనటులు... 'కంచె'
కథతో పాటుగా గుర్తొచ్చేవివన్నీ.
రెండో ప్రపంచ యుద్ధ
కాలంనాటి ఒక ఊరి కథనీ, యుద్ధంలో పాల్గొన్న ఒక బెటాలియన్ కథనీ కలిపి అల్లిన
కథ 'కంచె.' రెండు కథలనీ సమాంతరంగా నడపడమే కాదు, ఒక్కో భాగాన్నీ సరిగ్గా
ఎక్కడ ఆపాలో అక్కడే ఆపి, రెండో కథలో భాగాన్ని సరిగ్గా అతికే విధంగా జతచేసి
చివరివరకూ ప్రేక్షకుల ఆసక్తి సడలని విధంగా కథనాన్ని నడపడం - స్క్రీన్ ప్లే -
ఇది మొదటి విజయం. 'గమ్యం' తర్వాత క్రిష్ మెరిపించిన స్క్రీన్ ప్లే 'కంచె'
దనే చెప్పాలి. పాత్రలకి తగ్గట్టుగా నటీనటుల్ని ఎంచుకోవడం (వీళ్ళు తప్ప
మరొకరు సరిపోరు అనిపించే విధంగా) వాళ్ళ నుంచి కథకి కావలసినంత మాత్రమే నటనని
రాబట్టుకోడం (గొల్లపూడి చేత కూడా అండర్ ప్లే చేయించడం!!) క్రిష్ రెండో
విజయం.
యుద్ధ కథని పండితపామర జనరంజకంగా చెప్పాలంటే సరైన
సంభాషణలు అత్యవసరం. ప్రేమకథ తో తనని తాను నిరూపించుకున్న సాయి మాధవ్
బుర్రా తక్కువ మాటల్లో ఎక్కువ కథని చెప్పారు. (రెండు మూడు సన్నివేశాల్లో
'డైలాగులు మరి కొంచం సటిల్ గా ఉంటే బాగుండు' అనిపించిన మాట నిజం) హీరో
మిత్రుడి చేత కోట్ చేయించిన 'శ్రీనివాసరావు' కవితా పంక్తుల్ని
శ్రీనివాసరావు ఎవరో తెలియని వాళ్ళు బాగా ఆస్వాదిస్తే, తెలిసినవాళ్ళు 'ఈ కథా
కాలం నాటికి ఈ కవిత వెలుగు చూసిందా?' లాంటి సందిగ్దావస్థ లోకి వెళ్ళారు
(స్వానుభవం!).
పీరియడ్ మూవీ కి ప్రాణం సంగీతం. చిరంతన్ భట్ తనకప్పగించిన పనికి పూర్తి న్యాయం చేశాడు. సన్నివేశాలకి తగ్గట్టుగా నేపధ్య సంగీతాన్ని, నిశ్శబ్దాన్నీ అందించాడు. జ్ఞానశేఖర్ కెమెరా, సూరజ్ ఎడిటింగ్ లని గురించి ప్రస్తావించకపోతే ఎలా? ఒక్కమాటలో చెప్పాలంటే, కెమెరా కంటికి ఇంపుగానూ, ఎడిటింగ్ సమతూకంగానూ ఉన్నాయి.
వర్గ వైరుధ్యాలు కథా వస్తువయినప్పుడు ఏదో ఒక వర్గాన్ని ఎంతోకొంత నొప్పించక
తప్పదు. కానైతే క్రిష్ 'నొప్పించక తానొవ్వక' పద్ధతిలో కథ నడుపుకుని
వచ్చేశాడు. "నేను కమర్షియల్ దర్శకుణ్ణి మొర్రో" అని ఊరికే అంటున్నాడా మరి!
మెగా
ఫామిలీ కుర్రాడు వరుణ్ తేజ్ హరిబాబు పాత్రలో మెప్పించగా, స్నేహితుడి
పాత్రలో అవసరాల శ్రీనివాస్ కొన్ని సన్నివేశాల్లో పోటీ పడ్డాడు. వరుణ్ ముఖం
లో ప్లస్ పాయింట్ (కళ్ళు) ని కెమెరా బాగా కేప్చర్ చేసింది. కథానాయిక సీతగా
వేసిన ప్రగ్యా జైస్వాల్ కి నటించేందుకు అవకాశం ఉన్న పాత్ర.
పోస్ట్-ప్రొడక్షన్ టైంలో మిత్రులొకరు 'హీరోయిన్ కి చేయడానికి పెద్దగా ఏమీ
లేదు.. హీరో సెంట్రిక్ మూవీ' అని చెప్పడంతో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకుండా
వెళ్లాను. ప్రాధాన్యత ఉన్న పాత్రకి ఆ అమ్మాయి న్యాయం చేసింది. డిజైనర్
చీరలకి బదులుగా, ఏంటిక్ లుక్ ఉండే చీరలు కడితే మరింత బాగుండేది.
చిత్రీకరణ
విషయంలో తీసుకున్న జాగ్రత్తలు అడుగడుగునా తెరమీద కనిపించాయి. ముఖ్యంగా
డెబ్భై ఎనభై ఏళ్ళ నాటి గ్రామీణ వాతావరణ చిత్రణ, కరెంట్ తీగలు కూడా కనిపించని ఊరు, పాత్రల ఆహార్యం, పీరియడ్ ని గుర్తుచేసేవిధంగా సంభాషణలు ఇవన్నీ చిత్ర బృందం తీసుకున్న జాగ్రత్తని చెప్పకనే చెబుతాయి.
సింగీతం శ్రీనివాస రావు, షావుకారు జానకి చిన్న పాత్రల్లో మెరిశారు. హీరో
తల్లి పాత్ర ఎవరన్నా సీనియర్ నటి చేత చేయించి ఉంటే బాగుండేది అనిపించింది. మొత్తంగా చూసినప్పుడు మెచ్చవలసిన ప్రయత్నం. వైవిధ్య భరితమైన సినిమాలు ఇష్టపడే వాళ్ళు మిస్ కాకూడని సినిమా ఇది.
శ్రీశ్రీ గారి కవిత్వాన్ని కాపీలు తీసి మరీ పంచుకున్నారని తెలుసు ముప్పైల్లోనే!
రిప్లయితొలగించండిదేశం ఆవల సైన్యంలో ఉన్నోళ్ళకి ఆ రోజుల్లో అలాంటి కవితలు చదూకోటం ఒక వ్యాపకం అనుకోవచ్చు. చలం కూడా ప్రస్తావనకొచ్చారు కదా. నాకీ సినిమాలో నచ్చిన అంశం "ఆశ" అని పేరుగల పాప, ఆ పాప కోసం జరిగిన సంఘటనలు.
హీరోయిన్ కొత్తమ్మాయిలా అస్సలు అనిపించలేదెందుకో.
సాహిత్యం వినపడి, కనపడే సినిమాలు భలే ఉంటాయసలు.
మగవాళ్ళు చీరల గురించి పట్టించుకుంటారా ఏమన్నానా అనుకునేదాన్ని, ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో కూడా చెప్పేస్తున్నారు బాబోయ్ !
రిప్లయితొలగించండిరెహమాన్ గారు స్మైలీ కాకుండా కమెంట్ వ్రాయడం మరో ఆశ్చర్యార్ధకం !? కంచె చూడాల్సిందే :)
చాలా ఏళ్ళ తరువాత ఒక సినిమాని చూశాక, డిస్క్ రాగానే తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. :)
రిప్లయితొలగించండిసాయిమాధవ్ మాటలు "మళ్ళీ మళ్ళీ.." తో పోల్చుకుంటే వెయ్యిరెట్లు నచ్చేశాయండీ. కళ్ళకీ, మనసుకీ కూడా హాయిగా అనిపించిన సినిమా. మీ రివ్యూ ఎప్పట్లానే బావుంది. :)
@నీహారిక: టిక్కెట్ కి న్యాయం చేయాలి కదండీ మరి :) ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@కంచె: కీలక సన్నివేశాల్లో నాటకీయత వినిపించిందండీ డైలాగుల్లో.. 'మళ్ళీ మళ్ళీ...' పూర్తిగా డిఫరెంట్ జానర్ కదా మరి.. ధన్యవాదాలు..
ఊరెళ్ళడానికి ముందే సినిమా చూసి ఇమాణం ఎక్కానన్నమాట అదీ సంగతి
రిప్లయితొలగించండి@శ్రీనివాస్ పప్పు: 'మెగా' వారసుడికి ఆశీస్సులు అందించేశారన్నమాట అయితే :) ..ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి