నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి
కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రజలకి తమ దేశభక్తిని
చాటుకోడానికి మునుపెన్నడూ లేని రీతిలో అవకాశాలిస్తోంది. గడిచిన ఏడాది
కాలంలో చీపురు పట్టడం, యోగా చేయడం 'దేశభక్తి' గా బాగా చెలామణి అయ్యాయి. ఈ
జాబితాలోకి తాజాగా వచ్చి చేరిన విషయం 'గివిటప్.' అంటే మరేమీలేదు, ఎల్పీజీ
రీఫిల్ సిలిండర్లపై ప్రభుత్వం ఇస్తున్న రాయితీని వినియోగదారులు స్వచ్చందంగా
వదులుకోవడం. 'స్వచ్చ భారత్' 'యోగా' లని మించి ఈ 'గివిటప్' కి ప్రభుత్వం
ప్రచారం చేసినా, దేశభక్తులనుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది.
ప్రభుత్వ
గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా సబ్సిడీ సిలిండర్లు వాడుతున్న పదిహేను
కోట్ల కుటుంబాల్లోనూ కేవలం ఆరు లక్షల కుటుంబాలు మాత్రమే ఇప్పటివరకూ సబ్సిడీ
వదులుకోడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చాయి. అనగా, నూటికి కేవలం 0.35 శాతం
వినియోగదారులు మాత్రమే గివిటప్ పత్రాలపై సంతకాలు చేశారు. కొత్త ప్రభుత్వం
వచ్చి ఏడాది గడిచేసరికి ప్రజల్లో దేశభక్తి ఉన్నట్టుండి తగ్గిపోయిందా?
తండోపతండాలుగా చీపుర్లు పట్టినవాళ్ళు, తెలతెల్లని కుర్తా పైజమాల్లో
యోగాసనాలు వేసినవాళ్ళూ ఇప్పుడెందుకు మిన్నకుండిపోతున్నారు??
ఎందుకంటే,
స్వచ్ఛ భారత్, యోగాసనాలూ బొత్తిగా ఖర్చు లేని పనులు. గివిటప్ ఏమో
ప్రభుత్వం నుంచి ఇన్నాళ్ళుగా హక్కుభుక్తంగా వస్తున్న సబ్సిడీని ఎప్పటికీ
వదిలేసుకోవడం. తేడా లేదూ మరి? ప్రభుత్వం టీవీలో చూపిస్తున్న ప్రకటనల
ప్రకారం, మార్కెట్ ధరకి సిలిండర్ కొనుక్కోగలిగిన వాళ్ళందరూ సబ్సిడీని
వదిలేసుకుంటే, ఇప్పటికీ కట్టెలపొయ్యి మీద వంట చేసుకుంటున్న అనేకమంది
పేదవాళ్ళకి ప్రభుత్వం వంట గ్యాస్ పంపిణీ చేయగలుగుతుంది. మదర్ సెంటిమెంట్
జోడించి చేసిన ఆకర్షణీయమైన ప్రకటనలు అన్ని చానళ్ళలోనూ ప్రైమ్ టైం లో
ప్రత్యక్షం అవుతున్నాయి. ప్రచారం కోసం పెద్ద ఎత్తునే ఖర్చు
చేస్తున్నట్టున్నారు.
ఈ 'గివిటప్' ని గురించి మా మిత్రుల
మధ్య కొంత చర్చ జరిగింది. కేంద్ర మంత్రులు, అధికారులు, అన్ని రాష్ట్రాల
ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరి చేతా
మొదట 'గివిటప్' మీద సంతకాలు చేయించి, అటుపై ప్రజల్లోకి వచ్చి ఉంటే
బాగుండేది అన్నది ఒక అభిప్రాయం. నాకిందులో న్యాయం కనిపించింది. ఎందుకంటే,
వాళ్ళందరూ కూడా సబ్సిడీ అవసరం లేని వాళ్ళే. వీళ్ళతో పాటు, కార్పొరేట్లు,
సినిమా తారలనీ ఈ జాబితాలో చేర్చవచ్చు. 'స్వచ్చ భారత్' లో చీపురు పట్టి
టీవీల్లోనూ, పేపర్లలోనూ కనిపించారు కదా మనకి.
మంత్రులు,
ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్లకి వస్తున్న అన్ని రాయితీలనీ వదిలేసుకుని అప్పుడు
'గివిటప్' కోసం ప్రజల్ని అడగాలన్నది మరో అభిప్రాయం. ఇది కొంచం అడ్వాన్సుడు
గా ఉంది. రాయితీలు వదులుకోడమే దేశభక్తి అయినప్పుడు, గౌరవ ప్రజా
ప్రతినిధులందరూ దేశ భక్తులు అయి ఉండాలని ఆశించడంలో తప్పు లేదు కదా. కానీ, ఓ
పక్క ఈ 'గివిటప్' ప్రచారం నడుస్తున్న సమయంలోనే ఎంపీల జీతభత్యాలు,
కేంటీన్లో ఆహార పదార్ధాలపై రాయితీ మరియు పార్లమెంటు భవనంలో స్మోకింగ్ జోన్
తదితర ముఖ్యాతి ముఖ్యమైన సమస్యల మీద చర్చలు జరిగాయి. ప్రజలకి మాత్రం
దేశభక్తి ఉంటే చాలునేమో మరి.
చమురు ఉత్పత్తులన్నింటి పైనా
ప్రభుత్వం పన్నుల్ని పూర్తిగా ఎత్తివేసి, లేదూ కనీసం సగానికి తగ్గించి
అప్పుడు 'గివిటప్' కోసం పిలుపు ఇస్తే బావుండేది అన్నది ఇంకో అభిప్రాయం.
ఇదికూడా మరీ తీసి పారేయాల్సిందేమీ కాదు. ఎందుకంటే ఆయిల్, నేచురల్ గ్యాస్ ల
అసలు ధర కన్నా వాటిపై ప్రభుత్వం వేస్తున్న పన్నుల మొత్తమే ఎక్కువ. పన్నులు
తొలగిస్తే గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ అవసరం లేకుండానే అందరికీ అందుబాటులోకి
వచ్చే వీలుందిట! అసలు ఎన్నికల వాగ్దానంలో చెప్పినట్టు విదేశీ బ్యాంకుల్లో
ఉన్న నల్లధనం మొత్తం తెచ్చేస్తే, ప్రజలందరికీ పెట్రోలూ, గ్యాసూ ఉచితంగా
సరఫరా చెయ్యొచ్చు అన్నది ఓ మిత్రుడి వాదన. 'ఏమో గుర్రం ఎగరా వచ్చు'
అనుకోవాలి ప్రస్తుతానికి. ఇంతకీ, గ్యాస్ సిలిండర్లపై రాయితీని వదిలేద్దామా?
Good article, makes sense.
రిప్లయితొలగించండిఆరు లక్షలమంది దేశభక్తులు ఉన్నారని చదివితేనే దేశభక్తి ఉప్పొంగుతోంది కానీ మా వీధులు శుభ్రపడి,మా రోడ్లు బాగుపడి,మా వీధి చివర చెత్త కనిపించకుండా ఏర్పాట్లు చేసేవరకూ నేను మాత్రం సబ్సిడీ వదులుకోను. "స్వచ్చ భారత్" అమలు జరిగితే సబ్సిడీ వదులుకోవడమే కాదు ప్రధాని సహాయ నిధికి విరాళం కూడా ఇస్తా !
రిప్లయితొలగించండినీది కాకపోతే తాటిపట్టుమీద ఎదురుగా డేకమన్నాట్ట వెనకటికెవడో అలా ఉంది ప్రభుత్వ వ్యవహారం (మా ఇంట్లో అందుకే శుభ్రంగా ఇండక్షన్ ప్లేట్ వాడుతున్నాం ఈ గొడవ లేకుండా)
రిప్లయితొలగించండినాకు పొలిటీషియన్స్ నుండి మొదలు పెట్టాలనే ఆర్గ్యుమెంట్ నచ్చింది మురళి గారు.. నాదీ అదేమాట. సబ్సిడీలు వదులుకోగలిగినవాళ్ళలో వాళ్ళే ముందుంటారు. రికార్డులకి దొరికేది మొదట ఉద్యోగస్తులే కాబట్టి ఇన్కమ్ టాక్స్ బేస్ చేస్కుని ఇదికూడా తొందరలో బలవంతంగా రుద్దుతారేమోననిపిస్తుంది.
రిప్లయితొలగించండిఅదో ఎత్తైతే గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు గ్యాస్ బుక్ చేయడానికి ఉపయోగించే ఐవీఅర్ లో జీరో కి ఈ గివిటప్ ఆప్షన్ అసోసియేట్ చేయడం కూడా ఒక విధమైన చీటింగే.. ఐవీఆర్ సరిగా ఉపయోగించడమ్ రానివాళ్ళు పొరపాటున నొక్కేసి ఇబ్బందులు పడుతున్నట్లుగా వార్తలు చూశాను నేను..
లేదు, నేను అస్సలు వదలను. నాకు కాస్త దేశభక్తి తక్కువనుకుంటా మురళిగారు:)
రిప్లయితొలగించండిmundu parlament canteen lo subsidy vadulukomanadi apudu manam gas subsidy vadileddam
రిప్లయితొలగించండిDear sir,
రిప్లయితొలగించండిFirst ask our Mps to leave their subsidy at parlament canteen, then we can leave gas subsidy
యేడాదికి లక్షలాది రూపాయల పన్నులు కడుతున్నాము. అవన్నీ ఎంతమంది పేదలకి మేలు చేసాయో లెక్కలు చెపితే సబ్సిడీ వదిలేసుకుంటాము.
రిప్లయితొలగించండి@శ్రీదేవి: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@నీహారిక: హహహా.. 'స్వచ్చ భారత్' అమలు జరిగితే.. జనం నెమ్మదిగా మర్చిపోయారండీ ఆ ప్రోగ్రాం ని.. టీవీ వాళ్ళు రోజూ చూపించరు కాబట్టి సెలబ్రిటీలూ మర్చిపోయారు.. ధన్యవాదాలు.
@శ్రీనివాస్ పప్పు: ఇండక్షన్ అంటే కరెంటు బిల్లు ఓ రేంజిలో వస్తుందేమో కదండీ మరి.. ..ధన్యవాదాలు..
@వేణూ శ్రీకాంత్: 'ఇన్కం టాక్స్ బేస్ చేసుకుని..' అవునండీ, ఈమాట బాగా వినిపిస్తోంది.. చూడాలి, ఏం చేస్తారో.. ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జయ: హమ్మయ్య.. మీరూ ఉన్నారు కదా :) ..ధన్యవాదాలండీ..
@ప్రభాకర్: వాళ్ళు సబ్సిడీలు వదులుకుంటే ఇంత చర్చ ఉండదు కదండీ.. ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@బోనగిరి: అయ్యో, అవన్నీ 'సంక్షేమ' కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్నారండీ.. ..ధన్యవాదాలు..