మంగళవారం, డిసెంబర్ 23, 2014

పతంజలి లేని అలమండ-2

(మొదటిభాగం తరువాత...)

కారు చాలా నెమ్మదిగా కదులుతోంది. ఇంత చిన్న ఊళ్ళో ఓ  ఇంటిని పట్టుకోలేక పోవడం ఏమిటన్న  పట్టుదల పెరిగినట్టుంది శ్రీకాంత్ కి. రోడ్డుకి రెండు వైపులా పరిశీలిస్తూ తాపీగా డ్రైవ్ చేస్తున్నాడు. కుడి వైపుకి చూస్తే రోడ్డుకి ఆనుకుని ఉన్న బాగా పాతకాలం నాటి దేవాలయం. కొత్తగా సున్నం వేశారు కాబోలు తళతళా మెరిసిపోతోంది. చుట్టూ ప్రహరీ, మధ్యలో పెద్ద ఖాళీ స్థలం. పెద్దావిడ చెప్పిన సంతబయలు అదే!! ఆవరణలో ఓ పక్క రావి చెట్టు కనిపించింది. కళ్ళు సంతబయలుని చూస్తున్నాయి. మనసులో ఓ పక్క దొమ్మీ యుద్ధం సినిమా రీల్లాగా గిరగిరా తిరుగుతోంది. మరోపక్క పతంజలి ఇల్లు ఎలా ఉండబోతోందో అన్న ఆలోచనలు.


శ్రీకాంత్ కి కూడా కుతూహలం పెరిగినట్టుంది. రోడ్డుకి రెండువైపులా పాతకాలపు ఇళ్ళేమన్నా కనిపిస్తాయా అని శ్రద్ధగా గమనిస్తున్నాడు. పెద్దావిడ 'కుడి వైపున' అని స్పష్టంగా చెప్పింది కానీ, ఎడంవైపున ఓ శిధిలావస్థలో ఉన్న ఇల్లు కనిపించగానే కారాపమన్నాను. రోడ్డునానుకుని ఉన్న ఇల్లు బాగా పాడైపోయింది కానీ, వెనుకగా ఉన్న ఓ ఇల్లు వాసయోగ్యంగా ఉండడమే కాదు అక్కడ మనుషుల అలికిడి కూడా కనిపించింది. ఆ ఇంటివైపు గబగబా నడిచాను. రాజుల లోగిలని ఎవరూ చెప్పకుండానే అర్ధమైపోయింది. వీధరుగు నిండా టేకు మానులు, కొమ్మలు సైజుల ప్రకారం కోసినవి అమర్చి ఉన్నాయి. తలుపు తీసే ఉంది కానీ, గుమ్మానికి తెర వేలాడుతోంది. తెరవెనుక గచ్చునేల పాలు ఒలికిపోతే ఎత్తుకోగలిగేలా ఉంది.


"ఎవరండీ ఇంట్లో.."  నా గొంతు నాకే కొత్తగా వినిపించింది. "వస్తున్నా" అంటూ వినిపించింది లోపలినుంచి. ఆ మాటతో పాటే ఓ స్త్రీ నడిచి వస్తున్న నగల చప్పుడు. రాణివాసపు ఘోషా స్త్రీ.. నాతో మాట్లాడతారో లేదో అని సందేహిస్తూ ఉండగానే, నన్ను రక్షిస్తూ మా వాళ్ళు వచ్చేశారు. ఆవిడ తెరవెనుక నిలబడ్డారు. ఆడవాళ్ళ మధ్య సంభాషణ జరిగింది. శిధిలావస్థ లో ఉన్న ఇంటి పక్కన ఓ తోట ఉంది. ఆ తోటకి ఎదురుగా ఉన్న ప్రహరీ ఇల్లే పతంజలిది. రోడ్డు మీదకి ఇల్లు కనిపించదనీ, గేటు దాటి బాగా లోపలికి వెళ్లాలనీ చెబుతూనే, గేటుకి తాళం ఉంటుందని చెప్పారావిడ. మొన్నటి తుపానుకి (హుద్ హుద్) టేకు చెట్లన్నీ పడిపోయాయనీ, ముక్కలు కోయించి పెట్టామనీ కూడా చెప్పారు. "మీ పేరేవిటండీ" అన్న మావాళ్ళ ప్రశ్నకి "ఉప్పలపాటోరి కోడల్నమ్మా" అని మాత్రం జవాబిచ్చి, నగలు చప్పుడవుతూ ఉండగా ఇంట్లోకి వెళ్ళిపోయారు.


వచ్చేశాం పతంజలి ఇంటికి. గుండె గొంతుకులోన కొట్టాడడం అంటే ఇదేనా? లోపలేదో విస్పోటనం లాంటిది జరుగుతోంది. ఏవిటీ ఉద్వేగం? కళ్ళలోనుంచి నీళ్ళెందుకు రావు?? ప్రహరీ గోడకి ఓ పెద్ద ఇనుపగేటు. ఆ గేటుకి తాళం. లోపలంతా జీబురు జీబురుగా.. కళ్ళు చికిలించుకుని బాగా లోపలికి చూస్తే దూరంగా, ఠీవిగా నిలబడ్డ పాతకాలం నాటి ఇల్లు. కొంత భాగం కూలిపోవడం తెలుస్తోంది. ఆవరణంతా పెద్ద పెద్ద చెట్లు. ఎక్కువగా మావిడి చెట్లే. వాటి రాలిన ఆకులతో పాటు, బాగా పెరిగిపోయిన గడ్డి నేలని కమ్మేసింది. "నేను ఆ తరంలో పుట్టాను" అని ఓ తరమంతా గర్వంగా చెప్పుకోగలిగే రచయిత తన బాల్యాన్ని గడిపింది ఇక్కడేనా?! నిజంగా ఇది పతంజలి ఇల్లేనా?? నా ఆలోచనల్లో నేనుండగానే కర్ర సాయంతో రోడ్డు మీద నడిచి వెళ్తున్న ఓ వృద్ధుడు మమ్మల్ని చూసి ఆగాడు. గోపాల్రాజు డాక్టర్ గారిల్లు చూడ్డానికి వచ్చామని శ్రీకాంత్ చెప్పాడతనికి.


"నానార్రైతుని.. తవరెవరూ?" తన చూపుడు వేలితో శ్రీకాంత్ పొట్టలో పొడుస్తూ అడిగాడా వృద్ధుడు. అది చూడగానే, "నువ్వెవరవోయీ? సేనాపతి అరసవిల్లివా.. రొంగలి అమ్మన్నవా లేక బిత్తిరి సోవులువా?" అని అడగాలనిపించింది. కానీ, "నానార్రైతుని" అని చాలా స్పష్టంగా ఆ ఇంటి మీద తన హక్కుని ప్రకటించుకుని, జవాబివ్వాల్సిన బాధ్యతని మా మీద పెట్టేశాడు కదా. "మీ రైతు 'మీరెవరు?' అని అడుగుతున్నాడు. ఏమని చెప్పాలి పతంజలి బాబూ? కనీసం 'రాజుల లోగిళ్ళు' అన్నా పూర్తి చేయకుండా జాతి యావత్తుకీ అన్యాయం చేసి వెళ్ళిపోయిన పతంజలికి పాఠకులం అని చెప్పాలా? చెప్పినా మీ రైతుకి అర్ధమవుతుందా??"  ...అక్కడికీ గొంతు పెగుల్చుకుని "మావు పతంజలి బావు చేయితులం" అన్నాను కానీ, నా మాట నాకే కొత్తగా వినిపించింది. ఇంతకీ ఆ రైతుకి వినిపించదట. ఆ మాటే శ్రీకాంత్ కి చెప్పి కర్ర తాటించుకుంటూ వెళ్ళిపోయాడు.


ఎదురుగా పతంజలి ఇల్లు. లోపలి వెళ్ళడానికి అడ్డుగా గేటుకి పెద్ద తాళం. ఏవిటి సాధనం? మేం ముఖాలు చూసుకుంటూ ఉండగా, "నేను ఫోటోలు తీసి పట్టుకొస్తా" అంటూ ఓ ఫోన్ అందుకుని చెంగున గోడ దూకేశాడు శ్రీకాంత్. అతగాడి ఉత్సాహం చూసి మాకు ముచ్చటేసింది కానీ, మా సంగతేవిటి? ఇంతదూరం వచ్చింది గేటుకున్న తాళం చూసి వెళ్లడానికా? గేటు వెనుకున్న సన్నాకుల మావిడిచెట్లు చూడగానే "పయిటేల" వాటికింద నిద్ర చేసే వీరబొబ్బిలి గుర్తొచ్చింది. అంతలోనే, ఓ రాత్రివేళ దివాణంలో ప్రవేశించిన దొంగాడికి అదే బొబ్బిలి కందా ఇంటికి దారి చూపించి, పోలుగు పిట్టల మాంసం కూరలో తన వాటా అడిగి పుచ్చుకున్న సంగతీ జ్ఞాపకం వచ్చేసింది. వెతికితే దివాణంలోకి ఏదో ఒక దొంగదారి దొరక్క పోతుందా?? ఉత్సాహంగా చుట్టూ చూస్తే ఓ చోట గోడ కూలిపోతే, ఒకదానిమీద ఒకటిగా రాళ్ళు అమర్చి ఖాళీని పూడ్చడం కనిపించింది. రాసోరింట్లోకి దారి దొరికేసింది!!


ఆ సాయంత్రం వేళ.. ఎండుటాకులు కాళ్ళకింద చప్పుడు చేస్తున్నాయి. దూరంగా కీచురాళ్ళ రొద వినిపిస్తోంది. ఆకులలముల చాటున పురుగూ పుట్రా ఉండొచ్చన్న జాగ్రత్త ఓ పక్కా, పతంజలి లోగిట్లో నడుస్తున్నానన్న భావన మరోపక్కా. ఎంత పెద్ద లోగిలసలు?! 'సీతమ్మ లోగిట్లో' కథ జరిగింది ఇక్కడేనా? ఒక్కో అడుగూ ముందుకు పడుతున్న కొద్దీ ఇల్లు మరింత దగ్గరగా వస్తోంది. సాక్షాత్తూ వాళ్ళ రైతే చెప్పినా సందేహమే, నిజంగా ఇది పతంజలి ఇల్లేనా?? అపనమ్మకం కాదు, ఆశ్చర్యం. ఫకీర్రాజు, చిట్టెమ్మ, మీర్జా పెదబాబు, అరసవిల్లి, వంటరాజు, గోపాత్రుడు, దుంపల దత్తుడు, ఈటె సూరి, కజ్జపు అప్పారావు, లగుడు ముత్తేల్ నాయుడు, పిల్లికళ్ళ సూరి, పాకలపాటి రంగరాజు మేష్టారు.. ఒక్కరనేమిటి? పతంజలి సృష్టించిన పాత్రలన్నీ సజీవులై ఆ ఆవరణలో తిరుగుతున్న భావన.


ముందు భాగం పైకప్పు కూలిపోయింది. నేలమీద మట్టిని తొలగిస్తే కొవ్వు గచ్చు మెరుస్తూ కనిపించింది. లోపల ఏ గదికీ తాళాల్లేవు. కొన్ని తలుపులైతే విరిగి పడిపోయాయి కూడా. తుపాను ప్రభావం కాబోలు. ఒక్కో గదినీ చూస్తుంటే మాటలకందని భావాలేవో సుళ్ళు తిరుగుతున్నాయి. ఫోటోలు తీసుకుంటూ, ఏ గది ఏమై ఉంటుందో ఊహించుకుంటూ ఉండగా.. చెదలు పట్టేసిన ఓ పుస్తకం మా వాళ్ళ కంట పడింది. పరీక్షగా చూస్తే తెలిసింది, అది 'రీడర్స్ డైజెస్ట్' అని. నిస్సంశయంగా ఇది పతంజలి ఇల్లే అనిపించిందా క్షణంలో. మండువా లోగిలి నిండా పిచ్చి మొక్కలు మొలిచిపోయి ఉన్నాయి. వాస్తు ప్రకారం ఆలోచించి, ఏ గదిని ఎందుకోసం వాడి ఉంటారో ఊహిస్తున్నాడు శ్రీకాంత్. "అప్పటి ఇల్లు కాబట్టండి.. కలపకెక్కడా చిన్న చెద కూడా లేదు చూడండి" అంటూ తను ఉత్సాహ పడుతూ మమ్మల్ని ఉత్సాహ పరుస్తున్నాడు.


రెండు చెక్క కుర్చీలు, ఓ చెక్క పెట్టి, ఓ పింగాణీ కాఫీ కప్పూ దుమ్ము కొట్టుకుపోయి కనిపించాయి. కందా ఇంట్లో గోడకి పుట్టపర్తి సాయిబాబా ఫోటో వేలాడుతోంది. ఓ పెద్దగదిని చెక్కలతో పార్టిషన్ చేసినట్టు తెలుస్తోంది. ఏమాత్రం ఆదరణ లేకపోయినా ఎంత మొండిగా నిలబడిందో కదా ఈ ఇల్లు అనిపించింది చూస్తుంటే. పతంజలిని జ్ఞాపకం చేసుకుంటూ ఇల్లంతా మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉండగా "ఈ పతంజలి ఏ విదేశంలోనో పుట్టి ఉంటే అతని పుట్టిల్లు మ్యూజియం గానూ, అతని ఊరు యాత్రా స్థలిగానూ మారి ఉండేవి కదా" అనిపించింది. "ఎక్కువరోజులుండదండి ఈ ఇల్లు" అని శ్రీకాంత్ అంటూ ఉంటే, వినడానికి బాధగా అనిపించింది. కానీ నిజం, ఇంకొంచం ఆలస్యం చేసి ఉంటే ఇల్లు పూర్తిగా శిధిలం అయిపోయి ఉండేదేమో. పతంజలి ఉండగా వచ్చి ఉంటే? "వాళ్ళు పిచ్చి వాళ్ళమ్మా" అని తన తల్లికి చెప్పి ఉండేవాడేమో, మాగురించి కూడా. వెనక్కి వెనక్కి చూసుకుంటూ లోగిలి బయటికి వస్తూ ఉండగా "ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టండి" అన్నాడు శ్రీకాంత్.

(అయిపోయింది)

25 కామెంట్‌లు:

  1. ఏడుపొచ్చిందండి! మన దేశం లో రచయితలకి ఇదే సన్మానం.. :(

    రిప్లయితొలగించండి
  2. మురళిగారు,

    పతంజలి ఇంటి కోసం మీ అన్వేషణ ఎంతో ఆసక్తిగా రాశారు. ఎక్కడా అతిశయోక్తులకి తావివ్వకుండా (పతంజలిపై అభిమానాన్ని ప్రతి వాక్యంలో కనబరుస్తూ), పతంజలి సృష్టించిన పాత్రలతో కలబోసిన ఈ పోస్ట్ చదువుతుంటే చాలా చాలా ఆనందం కలిగింది. ఈ పోస్టుతో నాలాంటి పతంజలి అభిమానులు మీకు ఋణపడిపొయ్యారు. చక్కటి ఫొటోలు తీసిన శ్రీకాంత్‌గారికి కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  3. నిజమే ... పతంజలి ఏ విదేశంలోనో పుట్టి ఉంటే అతని పుట్టిల్లు మ్యూజియం గానూ, అతని ఊరు యాత్రా స్థలిగానూ మారి ఉండేవి కదా"

    మీతో పాటూ మాకు కూడా వారి వూరు,ఇల్లు, చూపించినందుకు థాంక్సండీ..

    రిప్లయితొలగించండి
  4. ఇదంతా చదవడానికి గంట పైగా పట్టింది. ఉబికి వచ్చే కన్నీళ్ళు అక్షరాలని కనబడనిస్తే కదా ?

    రిప్లయితొలగించండి
  5. చెప్పడానికేమీ లేదండీ,భారద్దేశం కర్మభూమి,
    ఇలాంటి రచయితల పాలిట ఖర్మభూమి అనాలేమో

    రిప్లయితొలగించండి
  6. జిలేబీ గారేనా ఈ ప్రశ్న అడిగింది ? లేక వారి ప్రశ్నలో ఏదైనా గూఢార్ధం ఉందా?

    రిప్లయితొలగించండి
  7. అమెరికాలో ఓ చిన్న ఊరిలో (ఆక్స్ ఫర్డ్, మిసిసిపి రాష్ట్రం) ప్రఖ్యాత అమెరికన్ రచయిత విలియం ఫాక్నర్ గారు నివసించిన ఇంటిని మ్యూజియంగా భద్రపరిచారు (నేను దర్శించాను). దీన్ని యూనివర్సిటీ ఆఫ్ మిసిసిపి వారు నిర్వహిస్తున్నారు. అటువంటి సత్కార్యం మన రచయితల విషయంలో ఎందుకు చెయ్యలేకపోతున్నామో?

    రిప్లయితొలగించండి
  8. అలమండలో లేకపోతేనేం.. మీ ప్రతీ అక్షరంలోనూ కనిపించారండీ పతంజలి. మరొక్క మాట మాట్లాడినా ఈ అనుభూతి పలచనైపోతుందేమో అనిపిస్తోంది. ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  9. ఇలాంటి ప్రదేశాలు మీ కళ్ళతో చూడడం ఎంత బాగుంటుందో మురళీ జీ.. థాంక్స్ ఫర్ ద పోస్ట్.

    రిప్లయితొలగించండి
  10. సెలవు రోజు ను గడపటానికి పతంజలి ని మించినది ఏముంది అని పొద్దున లేవగానే పతంజలి సాహిత్యం ముందు వేసుకున్నాను.... బహుశా నూట ఒకటో సారి అనుకుంటా.... అని మా ఆవిడ గునుగుతున్నా పట్టించుకోకుండా చదివాను... కాకతాళీయమే కావాచ్చు.... మీ బ్లాగ్ ఇప్పుడే చూశాను... బాగుంది.. సార్.... ఇంతకీ మీకు ఎదురైన వృద్దుడు గోపాత్రుడు ఏమో చూసుకున్నారా.... ఎందుకంటే కొంచెం వయసు తక్కువ మనిషి అతడే అనుకుంటా....

    రిప్లయితొలగించండి
  11. మీరు రాసింది చాలా బాగుంది మురళీ గారూ. వాస్తవ పరిస్థితి బాధాకరంగా అనిపించింది.

    రిప్లయితొలగించండి
  12. మీ ఈ అన్వేషణలలో 'మీవాళ్ళ' సపోర్ట్ అభినందనీయమండీ.

    రిప్లయితొలగించండి
  13. @శర్మ: అవునండీ, ఇదే సన్మానం :( ..ధన్యవాదాలు
    @వై.వి. రమణ: అలమండని తల్చుకున్న ప్రతిసారీ మేము శ్రీకాంత్ ని కూడా తలచుకుంటున్నామండీ.. అతను మాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేశాడనిపించింది.. ..ధన్యవాదాలు.
    @రాజ్యలక్ష్మి: మరీ ఆలస్యం చేయకుండా చూసి వచ్చేసినందుకు మాకు సంతోషం అండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @రావు ఎస్. లక్కరాజు: ధన్యవాదాలండీ..
    @పంతుల జోగారావ్: రాయడానికి నాక్కూడా చాలా టైం పట్టిందండీ.. ..ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: అంతేనండీ.. మరోమాట లేదు.. ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @జిలేబి: ఓ 'తెలుగు' రచయిత అండీ.. ధన్యవాదాలు.
    @విన్నకోట నరసింహారావు: విజయనగరం వాళ్ళు వెంట పడగా పడగా 'గురజాడ' ఇంటిని భద్ర పరిచారండీ.. మిగిలినవాటిలో పడిపోయినవి పడిపోగా ఉన్నవి నేడో రేపో అన్నట్టుగా ఉన్నాయి.. "సాంస్కృతికం" అంటే సినిమా ఒక్కటే అయిపోతోంది రానురానూ.. ..ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: పతంజలిని తన అక్షరాలలోనే చూసుకోవాలండీ.. మిగిలినవి అవేకదా మనకి.. ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
    @కిరణ్ కుమార్: గోపాత్రుడు వైద్యుడు కదండీ.. వైద్యుడిగా చెలామణి అవ్వడానికి వైద్యమే రానవసరం లేదని నిరూపించిన పెద పాత్రుడి ముద్దుల కొడుకు.. మరి మాక్కనిపించినతనేమో రైతు.. జీవితావసరాలు ఎంతటి వాళ్ళనైనా ఎక్కడో ఓ చోట రాజీ పడేలా చేస్తాయనడానికి పతంజలి జీవితం కూడా ఓ ఉదాహరణ అండీ.. అంతే.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  17. @దంతులూరి కిషోర్ వర్మ: వాస్తవం ఎప్పుడూ చేదుగానే ఉంటుందండీ ఎందుకో :( ..ధన్యవాదాలు.
    @శిశిర: నిజమండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  18. ఆ గోడల్లో పతంజలి దెయ్యం తన ఆత్మకథ వినిపించడం లేదా? :)

    అనుభూతి ఓ యాత్ర అయితే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టించారు. యాత్రా వర్ణన వరకూ మీ ప్రతీ స్పందనా ఎంతో ఉద్వేగాన్ని కలిగించింది.

    కొన్ని విషయాల గురించి మాట్లాడకుండా ఉండడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది.

    రిప్లయితొలగించండి
  19. @పురాణపండ ఫణి: నేను వంటని మాత్రమే (రుచి) చూశాను.. బహుశా మీరు వంటగదిని కూడా చూసి ఉంటారనిపించింది మీ వ్యాఖ్య చూశాక.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  20. emi rayalo, asalu spandinchaalo vaddo,mixed feelings with kantlo bhashpaalato.
    baagaa selavichharu.thanks

    రిప్లయితొలగించండి
  21. @రాజేశ్వరి అచ్యుత్: వెళ్లినప్పటి అనుభూతి అలాంటిదండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  22. @రాజేశ్వరి అచ్యుత్: జీమైల్ సెట్టింగ్స్ లో 'ఇన్పుట్ టూల్స్ సెట్టింగ్స్' కి వెళ్లి తెలుగు సెలక్ట్ చేసుకోండి.. ఇంగ్లీష్ కీబోర్డ్ ఉపయోగించి తెలుగు టైపు చేయొచ్చు..

    రిప్లయితొలగించండి