కొందరు రచయితలకి సంబంధించి కొన్నికొన్ని
ఫిర్యాదులు అలా ఉండిపోతాయి. వీటిలో చాలా ఫిర్యాదులకి కారణం ఆయా రచయితలో లేక
వారి రచనలో అవుతాయి. కానీ, పాలగుమ్మి పద్మరాజు విషయానికి వచ్చేసరికి
మాత్రం, ఆ కారణం పాఠకులు. ఎందుకంటే, పద్మరాజు విషయంలో ఫిర్యాదు ఆయనకి
రావలసినంత పేరు రాలేదని!! కథ, నవల, నాటకం, కవిత్వం, వ్యాసాల రచన, సినిమా
స్క్రిప్టు, గీత రచన, దర్శకత్వ బాధ్యతలు.. ఇలా ఎన్నెన్నో పనులని సవ్యసాచిలా
నిర్వహించి, చాలా పనులకి తనపేరు తనే దాచేసుకుని మరొకరి పేరు వేసుకోనిచ్చి,
తెలుగు వారికి చదివి తీరవలసిన సాహిత్యాన్ని మిగిల్చి కీర్తి శేషులయ్యారు
పద్మరాజు.
జయదేవుని అష్టపది 'ప్రియే.. చారుశీలే..' లో
కొన్ని పంక్తుల్ని 'పలికితే చాలు నీ పలువరుస వెన్నెలలు.. కలికి నా ఎడద
చీకటుల పోద్రోలు..' 'కౌగిలిని నలుగనీ.. పలుగాట్ల సిలుగనీ.. గాటంపు సుఖము
నాకటులైన కలుగనీ..' అంటూ అలవోకగా తెనిగించడం పద్మరాజు ప్రతిభకి కేవలం ఓ
అతిచిన్న తార్కాణం. తెలుగు కవిత్వాన్ని ఇష్టపడే వారందరూ మొదట తలిచేపేరు
దేవులపల్లి కృష్ణశాస్త్రిది. ఆ కృష్ణశాస్త్రి అభిమాన కవి, రచయితా పాలగుమ్మి
పద్మరాజు!! "ఇతని వద్దనే, ఇతని ప్రక్కనున్నపుడే, నేను చిన్నవాడనుగా నాకు నేనే కనిపిస్తాను," అన్నారు కృష్ణశాస్త్రి. పద్మరాజు కవిత్వాన్ని గురించి చెప్పడానికి ఇంతకన్నా మరో మాట
అవసరం లేదు బహుశా.
తెలుగు కథ అనగానే మొదట తలచుకోవాల్సిన
పేర్లలో ఉండి తీరవలసిన పేరు పాలగుమ్మి పద్మరాజు. చాలా కథల్ని 'పా.ప' అనే
పొట్టి పేరుతో రాశారు. కేవలం ఓ 'గాలివాన' ఓ 'పడవ ప్రయాణం' ఓ 'ఉద్వేగాలు'
మాత్రమే కాదు, మానవ మనస్తత్వాన్ని కథావస్తువుగా చేసుకుని ఎన్నో లోతైన,
గొప్పవైన కథలల్లారు పద్మరాజు. కథ చదవడం పూర్తి చేసిన చాలా సేపటి వరకూ, ఆ కథ
తాలూకు భావ సంచలనం నుంచి పాఠకుడు బయటికి రాలేనివిధంగా ఉంటాయి పద్మరాజు కథలు.
అందుకే, ఈయన సంకలనంలో కథలన్నీ ఏకబిగిన చదవడం అన్నది సాధ్యం కాని పని. ప్రతి
కథా మళ్ళీ మళ్ళీ చదివించేదే, చదవాల్సిందే.
పద్మరాజు నవలల్లో
ముందుగా చెప్పుకోవాల్సింది 'రామరాజ్యానికి రహదారి' గురించి. భారత స్వతంత్ర
పోరాటం నేపధ్యంలో సాగే కథ. ఎన్నోపాత్రలు. రకరకాల మనస్తత్వాలు. నవలలో కథని
ఒక్కో పాత్ర చేత కొంచం కొంచం చెప్పించారు పద్మరాజు. స్వతంత్ర పోరాటంలో
భాగంగా జరిగిన ఉద్యమాలు, వాటి వెనుక రాజకీయాలు, రెండు మూడు దశాబ్దాల కాలంలో
ఓ పల్లెటూళ్ళో వచ్చిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ మార్పులు.. వీటన్నింటినీ
నిశితంగా చిత్రించిన నవల ఇది. 'ఓడ్ హౌస్' తరహా హాస్యం 'బతికిన కాలేజీ' లో
కనిపిస్తుంది. ఇక, 'నల్లరేగడి' అయితే అచ్చంగా సినిమా కథే. సినిమా కూడా
వచ్చింది, ఈ నవల ఆధారంగా. 'భక్త శబరి' స్క్రిప్టు పద్మరాజుదే.
'మేఘసందేశం'
తో సహా ఎన్నో సినిమాలకి దాసరి నారాయణరావు దగ్గర పనిచేశారు పద్మరాజు. ఆ
సినిమాల కోసం రాసిన పాటల్లో ఆయన పేరుతొ వెలుగు చూసినవి కేవలం కొన్ని
మాత్రమే. 'మేఘ సందేశం' లో ఎన్నో ఫ్రేముల వెనుక పద్మరాజు కృషి ఉంది.
మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు లోకేషన్ల ఎంపిక వరకూ ఆయన తలకెత్తుకోని బాధ్యత
లేదు. కానీ, టైటిల్స్ లో ఒక్క 'పద్యాలు' కి మాత్రమే ఆయన పేరు కనిపిస్తుంది.
'శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్' లో 'రాకోయీ అనుకోని అతిథీ..' రాసిన
పద్మరాజే 'బుచ్చిబాబు' కోసం 'సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి..' రాశారు!!
ఇక, ఇతరత్రా పేర్లతో చలామణీ అయిన పాటల లెక్క తేలకపోవచ్చు ఎప్పటికీ.
పద్మరాజు
రచనలు ఏమీ చదవని వాళ్ళు చాలా సులువుగా అనేయగలిగే మాట "ఇంగ్లీష్ నుంచి కాపీ
కొట్టాడు" అని. ఇది ఎంతటి అపవాదో తెలుసుకోడానికి ఒకటే మార్గం, పద్మరాజు
రచనలన్నీ చదవడం. ఏదన్నా విదేశీ కథో, నాటకమో చదివినప్పుడు తనకి 'ఫ్లాష్'
అయ్యే ఆలోచనతో పాటే, ఆ ఆలోచనకి నేటివిటీని అద్దడాన్ని పూర్తి చేస్తారు
పద్మరాజు. గత నాలుగైదు ఏళ్ళుగా పద్మరాజు సాహిత్యాన్ని పునర్ముద్రిస్తున్న
విశాలాంధ్ర పుస్తకాలయం ప్రచురించిన 'పాలగుమ్మి పద్మరాజు రచనలు-4' లో
వ్యాసాలు, కవితలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 'రోజువారీ ఊహలు' పేరిట ఉన్న
డైరీ పేజీలని చదివితే పద్మరాజు రచనలు ఎలా పుట్టాయో అర్ధమవుతుంది. (పేజీలు
198, వెల రూ. 100)
విదేశీ నవలల్నీ, కథల్నీ తనదైన శైలిలో
అనువదించారు పద్మరాజు. 'చచ్చిపోయిన మనిషి' నవల ఓ ఉదాహరణ. 'చచ్చి సాధించాడు'
అనే డిటెక్టివ్ నవల, 'రెండవ అశోకుడి మూన్నాళ్ళ పాలన' అనే వ్యంగ్య నవల కూడా
ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 'రెండవ అశోకుడి..' నవల రాజకీయాల మీద
సెటైర్. ఏళ్ళు గడిచినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదన్న విషయాన్ని
చెప్పకనే చెబుతుంది. ప్రాధమిక విద్యాభ్యాసం లోనే పద్య రచన ప్రారంభించిన
పద్మరాజు, చివరి రోజుల వరకూ రచనని విడిచిపెట్టలేదు. తన అరవై ఎనిమిదో ఏట
హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు. ఇవాల్టి నుంచి పద్మరాజు 'శతజయంతి'
సంవత్సరం ఆరంభం. పాలగుమ్మి పద్మరాజు సమగ్ర సాహిత్యం ఇంతవరకూ వెలుగు
చూడకపోవడం పాఠకుల దురదృష్టం. కార్య నిర్వహణకి ఈ ఏడాదిని మించిన తరుణం
మరొకటి ఉండబోదు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయని ఆశిస్తూ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి