అనగనగా ఓ రాజు. అతనికి ఏడుగురు కొడుకులు. ఏడుగురూ
వేటకి వెళ్లి ఏడు చేపలు తెచ్చారు.. తర్వాత ఏమైంది అన్నది ఒకప్పటి 'చందమామ'
కథ. ఇప్పటికి వస్తే, అనగనగా ఓ రచయిత.. అతగాడు ఏక కాలంలో ఒకటి కాదు, రెండు
కాదు.. ఏకంగా ఏడు కథలు రాసేస్తాడు. ఈ ఏడు కథలతో పాటు అతగాడి కథ ఏ తీరం
చేరింది అన్నదే 'చందమామ కథలు,' ఇవాళే విడుదలైన సరికొత్త తెలుగు సినిమా.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో, బి. చాణక్య నిర్మించిన చిన్న సినిమా.
చాలా
చాలా రోజుల తర్వాత థియేటర్ కి వెళ్లి సినిమా చూశాను. ట్రైలర్స్, పోస్టర్స్
చూశాక ఎందుకో కానీ, ఈ సినిమా చూడాలని బాగా అనిపించింది. సినిమాలో ఎనిమిది
కథలు ఉంటాయి అని ముందుగానే తెలియడం వల్ల సిద్ధపడే వెళ్లాను. ఓ రచయిత కథతో
మొదలైన సినిమా, తర్వాత అతను రాస్తున్న ఒక్కో కథనీ పరిచయం చేస్తూ, రచయిత
కథలో ఓ మలుపు వచ్చేసరికి 'విశ్రాంతి' కి చేరింది. అన్ని కథలూ ముగింపుకి
చేర్చి, 'శుభం' కార్డు వేశారు.
ఒకప్పుడు
బాగా బతికి, ఉన్నట్టుండి డిమాండ్ పడిపోయిన ఒక మోడల్ (మంచు
లక్ష్మి),ముప్ఫయ్యేళ్ళు వస్తున్నా పెళ్లి కావడం లేదని బెంగ పడే సాఫ్ట్వేర్
ఇంజినీర్ (కృష్ణుడు).. వీళ్ళందరితో పాటు తనకో గూడు ఏర్పాటు చేసుకోవాలని కల
కనే ఓ బిచ్చగాడు.. వీళ్ళవి మరో రకం కథలు. ఈ కథలు రాసే రచయిత జీవితంలోకి
అనూహ్యంగా వచ్చి పడిన ఓ సమస్య. ఈ ఎనిమిది కథల్నీ 135 నిమిషాల స్క్రీన్ టైం లో ప్రేక్షకులకి పరిచయం చేసి, అన్ని కథలకీ ముగింపులు ఇచ్చాడు దర్శకుడు.
ముందుగా
చెప్పుకున్నట్టుగా కథలన్నీ బాగా నలిగినవే. మోడల్ కథ 'పేజ్ త్రీ' సినిమాని,
బిచ్చగాడి కథ 'పుష్పక విమానము' సినిమానీ గుర్తు చేస్తాయి. నరేష్-ఆమనిల కథ, మిగిలిన
ప్రేమకథలదీ అదే దారి. టేకింగ్ పరంగా చూసినప్పుడు, మణిరత్నం 'యువ' క్రిష్
'వేదం' సినిమాలు గుర్తొచ్చాయి. అయితే, ఆ రెండు సినిమాల్లోనూ మూడేసి కథలైతే,
ఇక్కడ ఏకంగా ఎనిమిది కథలు. ఒక్కో కథకీ దొరికిన సగటు స్క్రీన్ టైం పదహారు
నిమిషాలు. మొదటి సగంలో కేరక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి, ఒక్కో కథకీ ఒక్కో
ముడి వేసి, రెండో సగంలో ఆ ముళ్ళని విప్పాడు దర్శకుడు.
ఇన్ని
కథలు చెప్పినా అక్కడక్కడా సాగతీత అన్న భావన కలిగిందీ అంటే, స్క్రీన్ ప్లే
మీద మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని అర్ధం. ఒకటి రెండు కథల్ని
తగ్గించి, మిగిలిన వాటిని ప్రెజెంట్ చేయడంలో కొత్తదనానికి ప్రయత్నం చేసి
ఉంటే బావుండేది. ఫోటోగ్రఫీ ఎంత బావుందో, నేపధ్య సంగీతం అంతగా నిరాశ
పరిచింది. మిక్కీ తన పాత పాటల ట్యూన్స్ ని నేపధ్య సంగీతానికి వాడేశాడు,
ఆట్టే శ్రమ పడకుండా. ఫలితం, చూస్తున్న సినిమాతో పాటు చూసేసిన సినిమాలు కూడా
గుర్తు రావడం.. మొత్తం మీద ఇదో మంచి ప్రయత్నం. రొటీన్ కి భిన్నంగా ఉండే
సినిమాలు ఇష్ట పడేవాళ్ళు, భారీ అంచనాలు లేకుండా చూసి రావొచ్చు.
రివ్యూ బాగుంది మురళి గారు :-) మొన్న సినిమా చూస్తూ మిక్కీ మ్యూజిక్ గురించి ఒకరి ట్వీట్ "ఎంతైనా మిక్కీ పాట మీద నిలబడే మనిషి.. సినిమా సినిమాకి పాట మార్చేయడం తనకి ఇష్టముండదు" అని :-)
రిప్లయితొలగించండిహ... హ... బాగా చెప్పారు
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: హహహా.. ఎవరో కానీ నిజం ట్వీటారు.. నిజంగానే పాట మీద నిలబడే మనిషి!! ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@వెంకటేశ్వర రావు: ధన్యవాదాలండీ..