'పెసరట్లు పలు విధములు...' అంటూ టపా మొదలు పెడితే జరిగేవి రెండు.. మొదటిది, చదివే వారి ముఖంలో చిరునవ్వైతే, రెండోది వారి నోట్లో ఊరే లాలాజలం. 'ఏమని పాడుదునో ఈ వేళా...' అని మధురగాయని పి. సుశీల తన కెరీర్ తొలినాళ్ళలో పాడినట్టుగా, ఏమని చెప్పుదునో పెసరట్టు గురించీ అనుకున్నా కానీ, ఇలా టపా మొదలు పెడుతూనే ఎన్నో కబుర్లు మేమున్నాం అంటూ
గుర్తొచ్చేస్తున్నాయి. షాపు నుంచి తెచ్చుకున్న పెసల్లో రాళ్ళూ, రప్పలూ ఏరుకుని, ఓ సారి కడిగేసి, అటుపై నీళ్ళలో నానబోసేసి.. బాగా నానాక ఓ చిన్న అల్లంముక్క జతచేసి జారుగా పిండి రుబ్బి పక్కన పెట్టేసుకుంటే పెసరట్టు మహాయజ్ఞం లో మొదటి అంకం పూర్తయినట్టే.
పెసరట్టు అంటూ అనుకున్నాక, కేవలం సాదా పెసరట్టుతో సరిపెట్టుకునే ప్రాణాలు కావు కదా మనవి.. అందుకన్జెప్పన్జెప్పేసి ఉల్లి పాయలు, అల్లం, పచ్చి మిర్చీ సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకుంటాం. సరిగ్గా ఇదే సమయంలో 'ఆ చేత్తోనే కాస్త ఉప్మా కలియబెట్టెయ్య రాదూ' అని ఆత్మారాముడో, సీతో వినీ వినిపించనట్టు మూలుగుతారు. 'అదెంత పని కనుకా' అనిపించి తీరుతుంది.
పావుగంటలో ఉప్మా రెడీ అవ్వనే అవుతుంది. పెనం పొయ్యి మీదకి ఎక్కించి, బాగా వేడెక్కనిచ్చి కాసిన్ని నీళ్ళు జల్లి చూసుకుని, వేడి సరిపోతుంది అనిపించగానే ఉప్పు కలిపిన పెసరపిండితో అట్టు పోసేసి, అటుపై కొంచం జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లి, పచ్చి మిర్చి ముక్కలూ ఒకదాని తర్వాత ఒకటో, అన్నీ కలిపేసో మన ఓపికని బట్టి జల్లేస్తాం కదా.. ఇక్కడితో రెండో అంకం పరిసమాప్తం.
సగం కాలిన అట్టు చుట్టూనూ, మధ్యలోనూ నెయ్యో నూనో చల్లేసి, అట్టు సుతలు పైకి లేస్తున్నాయనగా ఓ గరిటెడు ఉప్మా అట్టు మధ్యలో పెట్టేసి, మన చెయ్యి తిరగడాన్ని బట్టి రెండు మడతలో, మూడు మడతలో వేసేసి అల్లప్పచ్చడి, కొబ్బరి పచ్చడి ఉన్న ప్లేట్లోకి బదలాయించేశామంటే పెసరట్టు వంటకం పూర్తైపోయినట్టే. పెనం, పిండీ సిద్ధంగా ఉన్నాయి.. మొదటి అట్టు వాసన ముక్కుకి తగలడంతోనే కనీసం నాలుగైదు అట్లన్నా కావాల్సిందే అని కడుపు ఆదేశాలు జారీ చేసేస్తుంది.. కాబట్టి అట్టు వెనుక అట్టు.. అట్టు పై అట్టు... అట్లా అట్ల వంటకం కొనసాగుతుందన్నమాట. పేరు పెసరట్టే అయినా వండడంలో ఎవరి పధ్ధతి వాళ్ళది. మా గోదారి సైడు పెసలు నానబెట్టి వేసే అట్టునే, అలా తూర్పుకి వెళ్లేసరికి పెసరపప్పు నానబెట్టి రుబ్బిన పిండితో వేస్తారు. ('మిథునం' సినిమా
కోసం (బుచ్చి) లక్ష్మి చేత తనికెళ్ళ భరణి వేయించిన అట్టు జ్ఞాపకం వచ్చిందా?!)
దోశని పల్చగా, క్రిస్పీ గా తినడానికి ఇష్టపడే ప్రాణులు సైతం పెసరట్టు దగ్గరికి వచ్చేసరికి 'ఎలా ఉన్నా సరే' అనేస్తారు. అవును మరి,
పెసరట్టు పల్చగా ఉన్నా, మందంగా ఉన్నా రుచే. ఉల్లి పచ్చి మిర్చి వగయిరాలతో పాటు వేయించిన జీడిపప్పు పలుకులు పెసరట్టు మీద జల్లి, కనీసం నాలుగు చట్నీలతో వడ్డిస్తే ఆ పెసరట్టు పేరు 'ఎమ్మెల్యే' పెసరట్టు. మందంగా వేసిన పెసరట్టుతో 'పెసరట్టు కూర' అని చేస్తారు. పెసరట్టు ముక్కలని పోపులో వేసేసి, చింతపండు రసం కూడా పోస్తారు పైన.. ఏ ఇల్లాలో ఉదయం మిగిలిపోయిన పెసరట్లతో ఈ కూర సృష్టించి ఉంటుంది బహుశా.. కేవలం కూర కోసమని పెసరట్లు చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. కొంతమంది కొన్ని వంటల్లో స్పెషల్. ముళ్ళపూడి వారి 'కోతికొమ్మచ్చి' లో చాలాసార్లు 'భట్టు గారి పెసరట్టు' గురించి చదివాకా, దాన్ని ఎలాగైనా రుచి చూడాలన్న కోరిక కలిగింది. కానైతే, సదరు భట్టు గారు హోటలు నడపడం లేదు, ఆకాశవాణి నుంచి పించను పుచ్చుకుంటున్నారు అని తెలియడంతో ఆశ వదిలేసుకున్నాను.
కేవలం పెసరట్టు వల్లే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫలహారశాలలు, అవి నడిపే బాబాయిల కథలు కోకొల్లలు. వంశీ పసలపూడి కథల్లో 'అచ్యుతం' గుర్తున్నాడా? గోదారొడ్డున పాక హోటల్లో రోజూ కుంచెడు పెసలు నానబోసి వేసే అట్లని గంటల్లో అమ్మేసే 'అమృత హస్తు'డు!! మిగిలిన వంటల గురించి రాసినట్టే, పెసరట్ల గురించి కూడా చాలా ప్రత్యేకంగా, రుచి చూసి తీరాలి అనిపించేలా రాశాడు. 'దిగువ గోదారి కథ'ల్లో రాసిన ధనలక్ష్మి పెసరట్లనైతే నేను రుచి చూడగలిగాను.. ధనలక్ష్మి అంటే వండే ఆవిడ పేరు కాదు, ఎమ్మెల్యే పెసరట్టు లాగే 'ధనలక్ష్మి పెసరట్టు' అన్నమాట. అరిచెయ్యి మందాన, అరిచెయ్యి వెడల్పులో మాత్రమే ఉండే ఈ పెసరట్టు మీద అల్లం, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలతో పాటు నానబెట్టిన పెసరపప్పు (వడపప్పు) కూడా జల్లుతారు బాగా. ఒక్కక్కరూ కనీసం నాలుగైదు పెసరట్లకి తక్కువ కాకుండా తినేయగలరు, అసలు తిన్నట్టే తెలియకుండా. వీటిని ఉప్మాతోను, ఉప్మా లేకుండానూ కూడా తినొచ్చు. వంశీ 'కోడిగుడ్డు పెసరట్టు' గురించి కూడా చెప్పాడు కానీ, ఇప్పటి వరకూ ఎక్కడా తారసపడలేదు ఆ వంటకం.
ఎటూ సాహిత్యం-పెసరట్టు టాపిక్ వచ్చింది కాబట్టి, కథకుడు జ్యేష్ఠ విషయం కూడా మాట్లాడేసుకుందాం. కొత్త పెళ్ళికొడుకు జ్యేష్ఠ అత్తారింటికి వెళ్తే, అత్తగారు అల్లుడికి పెసరట్టు చేసిపెట్టారు. తినేశాక, "పెసరట్టు ఎలా చేస్తారండీ?" అని మర్యాద చెడకుండా అత్తగారిని అడిగాడు అల్లుడు. "పెసలు, వాటితో బాటు కరకర రాడానికి ఓ గుప్పెడు బియ్యం నానబోసి, బాగా నానాక రుబ్బుకుంటాం అండీ" అని అత్తగారు వివరిస్తూ ఉండగా అడ్డుపడి, "మరి రాళ్ళు ఎన్ని వేస్తారండీ?" అని అంతే మర్యాదగా అడిగారట అల్లుడుగారు.. పాపం,
అత్తగారు సిగ్గుపడిపోయారట. జ్యేష్ఠ స్మారక వ్యాసావళిలో ఇంద్రగంటి జానకీబాల గారని జ్ఞాపకం, ఈ కబురు పంచుకున్నారు. పెసలు నానబోసే ముందే రాళ్ళు లేకుండా చూసుకోడం ఇందుకే అన్నమాట. కొత్తల్లుడి ముందు అత్తగారికి అవమాన భారం
లేకపోయేది కదా పాపం.
ఇక పెసరట్టు కాల్చడంలో కూడా ఎవరి పధ్ధతి వాళ్ళది. మాకు తెలిసిన ఒకావిడ, వేడి పెనం మీద పెసరపిండిని గరిటెతో పోసి, అట్టు మాత్రం తన చేత్తోనే తిప్పుతారు. అట్లు చాలా పల్చగా కరకర్లాడుతూ వస్తాయి. దోశ పిండిని నిలవ చేసినట్టుగా పెసర పిండిని నిలవ చేయడం కుదరదు. రుచి తేడా కొట్టేస్తుంది.. కొంచం పులుపు తగిలినా పెసరట్టు తినలేం. అందువల్ల, పెసరట్టుకి నిలవ పిండి
కన్నా తాజాగా రుబ్బిన పిండి శ్రేష్టం!! (అప్పదాసు గారి బజ్జి పచ్చడి గుర్తొచ్చిందా ఎవరికైనా?) ఎప్పుడైనా దోశ ని చట్నీ డామినేట్ చేసే అవకాశం ఉంది.. కానీ పెసరట్టు ముందు మాత్రం చట్నీ పప్పులేవీ ఉడకవు. ఎంత రుచికరమైన చట్నీ అయినా సరే, పెసరట్టు ముందు వెలవెలబోవాల్సిందే. అలాగే, పెసరట్టు తినడానికి నిర్దిష్టమైన సమయం అంటూ లేదు.. అనగా, బ్రేక్ఫాస్ట్ గా మాత్రమే పనికొస్తుంది లాంటి శషభిషలు ఏవీ లేవన్న మాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని కావాలంటే అన్నీ తినేయచ్చు.
మామూలుగా టిఫిను పుచ్చుకున్నాక కాఫీయో, టీవో సేవించడం రివాజు. అదే పెసరట్టు తిన్నాక అయితే, వీటికి బదులుగా పల్చటి మజ్జిగ పుచ్చుకుంటే (వీలయితే నిమ్మరసం పిండింది) రెండు మూడు గంటలన్నా గడవక ముందే కడుపు ఆకలితో
కణకణ మంటుంది. ఇల్లేరమ్మ వాళ్ళ అమ్మలాంటి తెలివైన ఇల్లాళ్ళు ఆదివారం పొద్దున్నే పెసరట్టుప్మా టిఫిన్ పని పెట్టుకుంటారు. అప్పుడైతే ఎక్కువ వంటకాలు చెయ్యకుండానే మధ్యాహ్నం బోయినాలు కానిచ్చేయవచ్చు కదా.. మామూలు పెసరట్టు కన్నా, ఉప్మాతో కలిసిన పెసరట్టు కొంచం బరువుగానే అనిపిస్తుంది మరి. అదేవిటో, పెసరట్టు కబుర్లు మాత్రం ఎన్ని చెప్పుకున్నా బరువుగా అస్సలు
అనిపించవు.. ఆ భరోసాతోనే ఈ పోస్టు పబ్లిష్ చేసేస్తున్నా... (గూగులిచ్చిన ఫోటో)
బాగుందండి
రిప్లయితొలగించండిమిధునంలో కాఫీ దండకం లాగ ఇది మీ పెసరట్టుదండకం అన్నమాట వచనరూపంలో.. బాగున్నాయి అండి మీ పెసరట్టు కబుర్లు.. ఈ సారి మా అమ్మ గారితో పెసరట్టు కూర చేయించుకుంటాను .... :-)
రిప్లయితొలగించండిkumms :-)
రిప్లయితొలగించండిnice post on pesarrattu.
రిప్లయితొలగించండిఅబ్బా ఇంతలా పెసరట్టును గుర్తుచేసేసి ఇలా కష్టపెట్టేస్తే ఎలా మురళీజీ... ఇప్పుడర్జంట్ గా ఉప్మాపెసరట్టాకలి వేస్తుంది నాకు :-) చాలా బాగా రాశారండీ.
రిప్లయితొలగించండి:-)
రిప్లయితొలగించండిAdbhutahaa...
రిప్లయితొలగించండిఈరోజు కార్తీక సోమవారం ఉపవాసం ... కరెక్ట్ గా ఈరోజు చదివా ఈ పోస్టు.. ప్చ్ లాభం లేదు...రేపు కుమ్మేయ్యల్సిందే.. స్వయం పాకం అంటే కొంచెం కష్టం కాబట్టి రేపు పొద్దున్నే హోటల్ కి పోయి రెండు ఉప్మాపెసరేయ్... పోస్ట్ మాత్రం అద్భుతః
రిప్లయితొలగించండిపెసరట్టు బాగా వేశారండీ. జీడి"పలుకులు" కూడా దట్టించారేమో నెమలికన్ను-మురళీపాకం అదిరింది.
రిప్లయితొలగించండిపెసరట్టు పోస్టు బావుంది మురళిగారు :)
రిప్లయితొలగించండిభలే
రిప్లయితొలగించండి@రాధిక (నాని): ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@నాగ శ్రీనివాస : చేయించుకున్నారా ఇంతకీ? :) ధన్యవాదాలు..
@కృష్ణ పాలకొల్లు: థాంక్స్ :)
@స్వాతి: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@వేణు శ్రీకాంత్ : అంటే మరీ.. అదీ.. అబదా.. :)) ధన్యవాదాలండీ..
@శిశిర: :))
@చక్రవర్తి : ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@శ్రీనివాస రావు కామరాజు: ఉపవాసం పూటా చదివారా అయితే.. ధన్యవాదాలండీ..
@పవన్ సంతోష్: పెసరట్టు కదండీ.. ఎన్ని వేసినా ఇంకా తెమ్మంటుంది :)) ..ధన్యవాదాలు..
@శ్రీధర్. దు: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@నారాయణ స్వామి: ధన్యవాదాలండీ..
మురళి గారూ..మీ "పెసరాయ్" చదువుతుంటే ఎప్పుడో చదివిన ఓ కధ గ్నాపకం వచ్చిందండీ..అందులో ఓ పెళ్లీడొచ్చిన పిల్ల. తండ్రి సంబంధాలు వెతుకుతూ ఉంటాడు.అయితే చిక్కంతా ఎక్కడంటే పిల్ల తండ్రి పెసర(ట్టు)భక్తుడు.(నెలకి ముఫ్ఫై సార్లు పెసరట్లు చెయ్యలేక అతగాడి ఇల్లాలు పడే బాధ..పెసరట్టంటే ఆవిడకి పుట్టుకొచ్చిన విరక్తీ ప్రస్తుతం అప్రస్తుతం) అంచేత తనకి అల్లుడయ్యేవాడు కూడా తనలాంటి పెసరప్రియుడే అయి ఉండాలన్నది ఆతగాడి ఫక్తు నిర్ణయం. పెసరట్టుని ఇష్టంగా తినేవాడు కావాలనుకుంటే పర్లేదు...బోలెడంతమంది దొరుకుతారు. కాని తండ్రికి అలా పనికిరాదు. అతని దృష్టిలో "పెసరట్టు" తినడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్లేట్లో పెసరట్టు కనిపించగానే ముందు దాని వైపు పరవశంగా..భక్తిగా చూడటం..తర్వాత ఎక్కడ అయిపోతుందో అన్నట్టు చిన్న చిన్న ముక్కలు (మరీ చిన్నవి కాదులెండి) చేసుకుని ప్రతి ముక్క తాలూకు రుచినీ పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ నిశ్శబ్దంగా అరమోడ్పుకళ్లతో తినడం..ఇత్యాదులన్నీ పాటించకుండా పెసరట్టుని తినేవాడు అతని దృష్టిలో "పెసరాంతకుడే". అంచేత ఆ పిచ్చి తండ్రి కూతుర్ని పెళ్లాడతానని వచ్చిన ప్రతివాడికీ పెళ్లిచూపుల్లో పెళ్లాం (తన) చేత పెసరట్లు వేయించి పెడుతూ..వాటిని ఎడాపెడా తినే విధానం చూడగానే వచ్చినవాళ్లని వీధిలోకి తగిలేస్తూ ఉంటాడు.ఓ సారి ఓ పెళ్లికొడుకు..పెళ్లిచూపుల్లో పెసరట్టు చూడగానే.."పెసరట్టా..నాకు చాలా ఇష్టమండీ..ఎకాయెకీ మూడేసి పెసరట్లు దొంతరగా చుట్టూకుని లాగించేస్తాను" అన్న పాపానికి వాణ్ణి కొట్టినంత పని చేస్తాడు కూడా...!
రిప్లయితొలగించండిమురళి గారూ...నాక్కూడా ఎంతో ఇష్టమైన పెసరట్టు మీద ఒట్టండీ...ఆ కధ నాకు ఇంతవరకే గుర్తుంది.(గుర్తున్న మేరకు నా సొంత భాషలో..డవిలాగుల్లో రాశాను) మరేం బాధపడకండి..ఆ తండ్రికి మంచి పెసరట్టులాంటి అల్లుడే దొరికుంటాడు..:)
@గాయత్రి లక్ష్మి: ఆ కథ పేరు 'సహస్ర పెసరోదయ వ్రతం' అనీ, 'రచన' లో చదివినట్టూ జ్ఞాపకం అండీ.. అతని పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు రోజూ పెసరట్టు తినలేక "ఇడ్లీ ఖరీదా అమ్మా?" అని అడుగుతారు కూడా.. మొత్తానికి మంచి కథ గుర్తు చేశారు.. ధన్యవాదాలు!!
రిప్లయితొలగించండి