తెలుగు నాట కమర్షియల్ నవలలు రాజ్యం చేస్తున్నకాలంలో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల 'బ్లఫ్ మాస్టర్.'
ఎదుటివారిని సులువుగా మోసం చేసి క్షణాల్లో లక్షలు సంపాదించగల మోసగాడు యాభయ్యేళ్ళ విషకంఠం, అతనికి అన్నివిధాలా సరిజోడు అయిన ప్రియురాలు పందొమ్మిదేళ్ళ విరిజ ల కథ ఇది. ఎన్నో నేరాలు చేసినా ఎప్పుడూ పోలీసులకి చిక్కని విషకంఠాన్ని ఎలాగైనా అరెస్టు చేసి తీరాలని పట్టుదలగా ఉన్న పోలీస్ అధికారి కృపాల్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలిగాడా లేదా అన్నది ఈ నవల
ముగింపు.
"మనిషిలో ఆశకన్నా దురాశ ఓ పాలు ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా భారతదేశ పరిస్థితి ఇలాగే ఉంది. న్యాయ సమ్మతంగా నెలకి ఐదారు వేల రూపాయలు వచ్చినా తృప్తి లేదు. బల్లకింద నించి ఇచ్చే చేతుల ద్వారా వచ్చే 'అదనపు వంద'ఆత్మతృప్తిని ఇవ్వని పరిస్థితి నేడు ఎదురవుతోంది. రూపాయి పెట్టుబడి పెట్టి నెల తర్వాత సంపాదించే పావలా కన్నా, పావలా పెట్టుబడితో మర్నాడు వచ్చే
రూపాయి మాత్రమె హుషారునిస్తోంది. యధా రాజా, తధా ప్రజ.." అన్న ప్రారంభ వాక్యాలతో మొదలయ్యే ఈనవల, మల్లాది రాసిన అన్ని నవలల్లాగే ఆసాంతమూ విడవకుండా చదివిస్తుంది.
కథానాయకుడు విషకంఠం చిన్న చిన్న మోసాలు చెయ్యడు. వందలు, వేలు కాదు అతను సంపాదించాలి అనుకునేది. లక్షలు సంపాదించాలి.. అది కూడా సులభంగా, ఎవరికీ చిక్కకుండా. అందుకే అతని టార్గెట్ బాగా డబ్బున్న వాళ్ళే అవుతారు..
వాళ్ళ బలహీనతలని ఎరగా వేసి తనకి కావాల్సింది సంపాదించుకుని మాయమైపోయే విషకంఠం, ఎక్కడో మరోచోట తేలి మరో రకం మోసానికి తెరతీస్తాడు. ఏ భాషనైనా తన మాతృభాష అనిపించేట్టు మాట్లాడడం, ప్రతిరోజూ దినపత్రికలు క్షుణ్ణంగా చదివి
వార్తల్లో నుంచి ఐడియాలు తీసుకోవడం, అత్యంత శ్రద్ధగా తన పధకం అమలుచేసి, అంతే జాగ్రత్తగా మాయమవ్వడం అతని పధ్ధతి.
నగల దుకాణానికి వెళ్లి డబ్బిచ్చి ఓ ఉంగరం కొనుక్కుని, విలువైన వజ్రాల నెక్లెస్ కొట్టేయడం, ఓ కంపెనీలో తక్కువ జీతానికి ఉద్యోగంలో చేరి తక్కువ సమయంలోనే పద్నాలుగు లక్షలు తెలివిగా మాయం చేయడం... అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడా పోలీసులకి దొరక్కపోవడం ఇదీ విషకంఠం ప్రత్యేకత. ఇలాంటి గూటి పక్షే విరిజ. ఒకరినొకరు మోసం చేసుకోబోయి, దొరికిపోయి, అటుపై
స్నేహితులు, ప్రేమికులు అయిపోతారు ఇద్దరూ. అప్పటివరకూ తన పథకాలని తనొక్కడే అమలు చేసుకున్న విషకంఠం, అటు తర్వాత విరిజని కూడా భాగస్వామిగా చేసుకుంటాడు.
తనకంటూ ఎవరూ లేని విషకంఠం తన సంపాదనని బంగారు బిస్కట్లుగా మార్చి జాగ్రత్తగా దాచుకుంటాడు. అతనా బిస్కట్లు ఎక్కడ దాచాడో తెలుసుకోవడం విరిజ లక్ష్యం. తన గురించి ఎన్నో విషయాలనీ, పథకాల అమలులో తీసుకునే శ్రద్దనీ పూసగుచ్చినట్టు చెప్పినా, బంగారు బిస్కట్ల విషయం మాత్రం రహస్యంగా ఉంచుతాడు. విషకంఠం గురించి బాగా తెలిసిన విరిజ తొందర పడదు. ఆ బంగారం తనకి దక్కక మానదని నమ్మకం ఆమెకి. అతని సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది విరిజ.
విషకంఠాన్ని పట్టుకోడాన్ని చాలెంజ్ గా తీసుకున్న పోలీసాఫీసర్ కృపాల్ ఎట్టకేలకి తన కృషిలో విజయం సాధించగలుగుతాడు. బంగారం రహస్యం విరిజకి చెప్పి జైలుకి వెడతాడు విషకంఠం. ఒకవేళ తను పోలీసులకి దొరికిపోతే విడిపించడానికి ఏం చేయాలో ముందుగానే ఆమెకి చెప్పి ఉంచుతాడు కూడా. ఇంతకీ విషకంఠం జైలు నుంచి బయట పడగలిగాడా? అతని శేషజీవితం ఎలా గడిచింది? దొరికిన
సంపదని విరిజ ఏం చేసింది? ఇత్యాది ప్రశ్నలకి సమాధానం ఇస్తూ ముగుస్తుందీ నవల. కొన్ని విదేశీ క్రైమ్ కథల ప్రభావం ఉన్నట్టనిపిస్తుంది. ('బ్లఫ్ మాస్టర్' ప్రింట్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేదు).
1990ల్లో అనుకుంటాను ఏదో ఒక వార పత్రికలో ధారావాహికగా వచ్చింది ఈ నవల. ఆ వారపత్రిక ఎక్కువ రోజులు ప్రచురణ కాలేదు కాని ఈ ధారావాహిక మొత్తం ప్రచురించినట్టు జ్ఞాపకం. దూరదర్శన్ లో అనుకుంటాను ధారావాహికగా ఒకటి రెండు భాగాలు చూసిన జ్ఞాపకం. విషకంఠంగా తనికెళ్ళ భరణి నటించారు.
రిప్లయితొలగించండిbagundi
రిప్లయితొలగించండిఈ నవలా విశ్లేషణ చూస్తుంటే Special 26 సినిమా గుర్తుకొస్తుంది సార్...ఎంతైనా మల్లాది ఎవర్ గ్రీన్ రైటర్...మంచి నవలను పరిచయం చేసారు...మల్లాది రాసే చాలా నవలలు సినిమాలకు అతికినట్టు సరిపొతాయి..
రిప్లయితొలగించండి@శివరామ ప్రసాద్ కప్పగంతు: భరణి ప్రధాన పాత్ర అని గుర్తుంది కానీ దూరదర్శన్/జెమిని అన్నది స్పష్టంగా గుర్తులేదండీ.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@నాగ శ్రీనివాస పేరి; ధన్యవాదాలండీ
@నవజీవన్: ఆ సినిమా చూడలేదండీ :( ...ధన్యవాదాలు..