బుధవారం, మార్చి 06, 2013

రాజీవలోచన

నలుపు తెలుపు సినిమా తెరమీద కదులుతూ ఉంటుంది.. ఉన్నట్టుండి ఆమె ప్రత్యక్షమవుతుంది. మన కళ్ళు మన మాట వినవు. మిగిలిన దృశ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, కేవలం ఆమెని మాత్రమే చూస్తాం అంటాయి. అలాగని ఆమెని అద్భుతమైన సౌందర్య రాసి అనలేం.. ఎందుకంటే, ఆమెని మించిన అందగత్తెలు తెలుగు తెరమీదే ఎందరో ఉన్నారు. అయితే, ఆ అందగత్తెలని మించినది ఏదో ఆమె దగ్గర ఉంది. అది ఆకర్షణ. ఆకర్షించే గుణం పుష్కలంగా ఉన్న ఆ తార పేరు రాజ సులోచన. అసలు పేరు రాజీవలోచన. ఆ కళ్ళని చూసే పెట్టి ఉంటారాపేరు.

డెబ్భై ఎనిమిదేళ్ళ రాజ సులోచన ఇక లేరు అన్న వార్త తెలిసినప్పటినుంచీ, ఏ పని చేస్తున్నా ఆమె నటించిన సినిమాలు, మరీముఖ్యంగా వాటిలో పాటలు గుర్తొస్తూనే ఉన్నాయి నిన్నటి నుంచీ. పదేపదే గుర్తొస్తున్న పాటయితే 'రాజమకుటం' సినిమాలో లీల పాడిన 'సడిసేయకో గాలి...' తెలుగుభాషలో ఉన్న అత్యంత అందమైన మాటలని ఏర్చి కూర్చి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆ పాటని రాస్తే, అంతే అందంగా ఆ పాటని పాడారు పి.లీల. తెరమీద సాత్వికాభినయం రాజసులోచనది.

అంతటి ఎన్టీ రామారావూ చొక్కా లేకుండా ఆమె ఒడిలో పడుకున్నా, మహిళా ప్రేక్షకుల చూపుని సైతం తనవైపు తిప్పుకునే నటనని ప్రదర్శించారు రాజసులోచన. 'చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే...' అన్నప్పుడు అనునయాన్నీ, ఆదేశించడాన్నీ ఏకకాలంలో అభినయించారు ఆమె, అది కూడా కేవలం కనుపాపల కదలికలతో. అలాగే 'నిదుర చెదిరిందంటే నేనూరుకోనే..' 'విరుల వీవన పూని విసిరిపోరాదే...' అన్నప్పుడు ప్రత్యేకంగా చూడాలి ఆమెని.


స్త్రీత్వం కన్నా, పురుషత్వం పాలు కొంచం ఎక్కువగా అనిపించే మూర్తి రాజసులోచనది. అందుకే కాబోలు, అంజలీ పిక్చర్స్ వారి 'సువర్ణ సుందరి' సినిమాలో పాత్ర ఆమెకి అతికినట్టు సరిపోయింది. హీరో నాగేశ్వర రావు ఓ శాపం కారణంగా స్త్రీ గా మారిపోవాలి, కథ ప్రకారం. ఆ స్త్రీ వేషం రాజసులోచనది. ఆ సినిమాలో అంజలీదేవి తర్వాత ఆకట్టుకునే మరో నటి రాజసులోచనే. సినిమా భాషలో చెప్పాలంటే ఆ పాత్ర 'టైలర్ మేడ్' అయ్యింది ఆమెకి. నృత్యంలో ఆమెకి ఉన్న అభినివేశాన్ని ప్రేక్షకులకి చూపే అవకాశమూ దొరికింది.

'రావె రాణీ... రాధా రావే... రాధ నీవే... కృష్ణుడ నేనే... రమ్యమైన శారద రాత్రి... రాసలీల వేళ ఇదే...' ఈ పాట నాకు నచ్చడానికి కారణం బహుశా ఆ పాటకి అభినయించింది రాజసులోచన కావడమేనేమో అనిపిస్తుంది నాకు. 'శాంతి నివాసం' సినిమాలోది ఈ పాట. ఇలాంటిదే మరో పాట 'ఖైదీ కన్నయ్య' లో 'తియతీయని మాటలతో తీస్తారు సుమా గోతులు.. నమ్మవద్దు...' రాజసులోచనలో ఉండే గ్రేస్ ఆమె నటననీ, పాటలనీ గుర్తు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకునేలా చేసింది అనిపిస్తుంది.

పరభాషల్లోనూ రాణించిన తెలుగు నటి రాజసులోచన. కన్నడంతో మొదలు పెట్టి, అటుపై తెలుగులో తనని తాను నిరూపించుకుని, తమిళ సినిమాల పైనా తనదైన ముద్ర వేసిన నటి ఆమె. అందం లోనూ అభినయంలోనూ గట్టి పోటీ ఉన్న ఆరోజుల్లో తనదైన ముద్రని వేసుకోవడం మామూలు విషయం కాదు. తెలుగు తెరమీద తెలుగుదనం తో పాటు, తెలుగు నటీమణులూ కరువైపోతున్న కాలం ఇది. రాజసులోచన లాంటి వాళ్ళు మన కోసం, తర్వాతి తరాల కోసం మిగిలించి వెళ్ళిన సంపద మరేదో కాదు, వాళ్ళు నటించిన సినిమాలు. అవి ఎటూ చిరంజీవులే కాబట్టి... వారందరూ కూడా చిరంజీవులే..

3 కామెంట్‌లు:

  1. "రాజసులోచన లాంటి వాళ్ళు మన కోసం, తర్వాతి తరాల కోసం మిగిలించి వెళ్ళిన సంపద మరేదో కాదు, వాళ్ళు నటించిన సినిమాలు. అవి ఎటూ చిరంజీవులే కాబట్టి... వారందరూ కూడా చిరంజీవులే.."

    TRUE

    రిప్లయితొలగించండి
  2. పొగడ పొన్నల పువ్వుల వీడా..
    పూల వీటిలో తుమ్మెదున్నాడా..

    రాజసులోచన అనగానే నాకు గుర్తొచ్చేపాట ఇది.
    అందానికి, ఆకర్షణకి ఉన్న తేడా సుస్పష్టంగా కనిపిస్తుంది కొందరు నటీమణులను చూస్తే.. నిజం! పురుషత్వం పాళ్ళు కొంచెం ఎక్కువ - సువర్ణసుందరి.. మంచి పరిశీలన! చివరి వాక్యం తళుక్కున మెరిసింది. మంచి టపా!

    రిప్లయితొలగించండి
  3. @తులసి: ధన్యవాదాలండీ..

    @కొత్తావకాయ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి