ఆదివారం, ఆగస్టు 26, 2012

'కన్యాశుల్కం' కబుర్లు...

తెలుగు నాట సాంఘిక నాటకం అనగానే మొదట గుర్తొచ్చేది 'కన్యాశుల్కం.' గురజాడ అప్పారావు పంతులు గారి అపూర్వ సృష్టి. ఏళ్ళు గడుస్తున్నా కన్యాశుల్కాన్ని తలదన్నే నాటకం తెలుగునాట రాకపోవడం అన్నది, ఈనాటకం గొప్పదనమా లేక తర్వాతి తరాల్లోని రచయితల కృషిలో లోపమా అన్నది ఇప్పటికీ శేష ప్రశ్నే. 'కన్యాశుల్కం' సృష్టికర్త గురజాడ నూట యాభయ్యో జయంతి సందర్భంగా, ఈనాటకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శింప బడుతోంది, ఇప్పటి ప్రేక్షకులకి తగ్గట్టుగా క్లుప్తీకరింపబడి. హైదరాబాద్ కి చెందిన 'రసరంజని' చేస్తున్న ప్రయత్నం ఇది. 

'కన్యాశుల్కం' పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది గిరీశం. ఆ వెనుక మధురవాణి, రామప్పంతులూ, అగ్నిహోత్రావధాన్లూ, లుబ్దావధాన్లూ, ఇంకా మిగిలిన వాళ్ళందరూను. 'డామిట్! కథ అడ్డం తిరిగింది' (గిరీశం), 'తాంబోళం ఇచ్చేశాను, తన్నుకు చావండి' (అగ్నిహోత్రావధాన్లు), 'విద్య వంటి వస్తువు లేదు' (రామప్పంతులు), 'బుద్ధికి అసాధ్యం ఉందేమో కానీ, డబ్బుకి అసాధ్యం లేదు' (మధురవాణి)...ఇలా ఎన్నో సంభాషణలు ఇప్పటికీ జనం నాలుకమీద ఆడుతూ ఉంటాయి. బహుశా, ఇదే ఈ నాటకం విజయ రహస్యమేమో కూడా.

మొదట్లో ఇది ఎనిమిది గంటల నాటకం. తర్వాత, గురజాడే స్వయంగా పూనుకుని కొంత సంక్షిప్తం చేశారు. అయినప్పటికీ ప్రదర్శన నిడివి ఐదారు గంటలు. ఇప్పటివరకూ ఆరు తరాల నటులు వేలాది ప్రదర్శనలు ఇచ్చిన నాటకం ఇది. 'కన్యాశుల్కం' నాటకంలో వేషం వేసిన ప్రముఖుల జాబితా చాలా పెద్దది. తెలుగు రంగస్థలం అనగానే మొదట గుర్తొచ్చే స్థానం నరసింహారావు మధురవాణిగా అలరించారు. ఇక, 'కవిసామ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ ఎంతో మనసుపడి వేసిన వేషం రామప్పంతులు. అదికూడా, యాదృచ్చికంగా దొరికిన అవకాశం.


ఇప్పటి రోజుల్లో ఐదారు గంటల నాటకం అంటే ఆడే వాళ్ళకే కాదు, చూసే వాళ్లకి కూడా ఓపిక చాలని వ్యవహారం. కాలక్రమేణా కుదింపులు జరిగీ, జరిగీ ప్రస్తుతం రెండు గంటల నిడివిలో ప్రదర్శింప బడుతోంది. గిరీశం, బుచ్చమ్మని లేవదీసుకు పోయాడన్నసంగతి తెలిసి, ఆగ్రహంతో ఊగిపోయిన అగ్నిహోత్రావధాన్లు వెంకటేశాన్ని దండించడంతో అయిపోతుంది ప్రదర్శన. మధురవాణి ఇంట్లో పోలిశెట్టి బృందం పేకాట, కంటె కోసం మధురవాణి చేసే హంగామా, సారాయి దుకాణం, బైరాగి తత్వాలు, సౌజన్యారావు పంతుల్ని మధురవాణి కలుసుకోవడం...ఇవన్నీ పుస్తకంలో చదువుకోవాల్సిందే.

'యద్భావం తద్భవతి' అన్నది 'కన్యాశుల్కం' నాటకానికి బహుచక్కగా వర్తిస్తుంది. మనం ఏం చూడాలనుకుంటే అదే దొరుకుంతుంది ఈ నాటకంలో. "గిరీశం ఇచ్చిన లెక్చరు విన్న బండివాడు అడుగుతాడూ, 'సొరాజ్యం వస్తే మా ఊరి కనిస్టీబుకి బదిలీ అవుతుందా బాబయ్యా?'అని. అంటే, పోలీసుల హింస ఈనాటిది కాదు. కన్యాశుల్కం రాసిన రోజులనుంచీ ఉందని తెలుసుకోవాలి మనం," మానవహక్కుల గురించి ఉపన్యాసం ఇస్తూ, ప్రొఫెసర్ హరగోపాల్ వెలిబుచ్చిన అభిప్రాయమిది. ఇక, తెలుగు భాషోద్యమంలో చురుగ్గా ఉన్న ఏబీకే ప్రసాద్ ఓ సందర్భంలో ఏమన్నారంటే :"ఏదీ ఒక పర్యాయం అబ్బీ మీరూ ఇంగిలీషులో మాట్లాడండి నాయనా' అని గిరీశాన్ని అడుగుతుంది వెంకమ్మ. చదువురాని ఆ పల్లెటూరి గృహిణికి కూడా ఇంగ్లిష్ మీద ఎంత మోజు ఉందో అర్ధమవుతుంది!" 

రంగస్థల, సినీ నటుడూ, రచయితా గొల్లపూడి మారుతి రావుకి 'కన్యాశుల్కం' నాటకం అంటే మహా ఇష్టం. ఆమధ్య మాటీవీ కోసం తీసిన సీరియల్లో గిరీశం వేషం వేశారు కూడా. ఈ నాటకంలో మొట్టమొదటి డైలాగు 'సాయంకాలమైంది' ని తన నవలకి శీర్షికగా ఉంచారు గొల్లపూడి. సావిత్రీ, రామారావూ నటించిన 'కన్యాశుల్కం' సినిమా (హీరో పేరు ముందు రాయాలనే సంప్రదాయానికి మినహాయింపున్నకొన్ని సినిమాల్లో ఇదీ ఒకటి), గురజాడ వారి రచనని పెద్ద ఎత్తున తెలుగు వాళ్లకి దగ్గర చేసింది. అయితే, ఈ సినిమా కారణంగా "సినిమా చూసేశాం కదా, ఇక నాటకం చదవడానికి ఏముంది?" అనే ధోరణి ప్రబలడం విషాదం. దూరదర్శన్ లో జేవీ రమణమూర్తి 'గిరీశం,' శృతి 'మధురవాణి'గా పదమూడు వారాల సీరియల్ ప్రసారమయ్యింది, చాన్నాళ్ళ క్రితం.

తెలుగునాట మధురవాణి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పురాణం సుబ్రహ్మణ్య శర్మ అనేకానేకమంది ప్రముఖుల్ని మధురవాణి చేత ఊహాత్మక ఇంటర్యూలు చేయిస్తే, పెన్నేపల్లి గోపాలకృష్ణ ఏకంగా 'మధురవాణి ఊహాత్మక ఆత్మకథ' రాసేశారు. "ఏముందీ కన్యాశుల్కం? కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కులాలకి సంబంధించిన విషయం.. ఇప్పుడు ఏమాత్రం సమకాలీనం కాదు. అయినా ఊరికే నెత్తిన పెట్టుకుంటున్నారు," అన్నది 'కన్యాశుల్కం' మీద వినిపించే ప్రధాన విమర్శ. జనాదరణ లేని ఏ కళారూపమూ సుదీర్ఘ కాలం మనజాలదని, ఈ విమర్శకులకి గుర్తు చేయాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఇది కొత్త విషయం ఏమీ కాదు కదా. (ఫోటో కర్టెసీ: The Hindu)

8 కామెంట్‌లు:

  1. ఎన్ని సార్లు చదివేనో లెక్కలేదు. ఆఖరికి పుస్తకం చిరిగిపోయింది. కొత్తది దొరికితే కొనాలి.ఈ కన్యాశుల్కం మళ్ళీ రాబోతోందేమోనని నా అనుమానం.

    రిప్లయితొలగించండి
  2. హ్మ్! ఈ నాటకం నేను ఒకసారి రవీంద్రభారతి లో పొట్టి శ్రీరాములు university స్టూడెంట్స్ వేయగా చూసానండి . కానీ ఏమర్ధం అయ్యింది అని అడగకండి ఎందుకంటే అది నేను బాగా చిన్నప్పుడు :-) కానీ వాళ్ళు బాగా perform చేసారు అని విన్నట్లు గా మాత్రం గుర్తుంది నాకు :-)) అలాగే నేను మొదటి సారి చదినప్పుడు ఆ పోటో గరీపులు ఏంటో అర్ధం కాక తెగ బుర్ర బద్దలు కొట్టుకున్నా . ఇప్పుడు మాత్రం చాలా డైలాగులు అలా నాలుక పైన ఉంటాయి :-)

    రిప్లయితొలగించండి
  3. మంచి విషయాన్నీ పరిచయం చేశారు మురళి గారు. నాడు గురజాడ వారు రాసిన మాటలనే ఇప్పటికీ కొందరు వ్యంగ్య రచనల్లో వాడుతున్నారు... కనిస్టీబు, పుటిగ్రాఫు, లాంటి మాటలతో పాటు... గిరీశం డైలాగ్స్

    రిప్లయితొలగించండి
  4. "ఏళ్ళు గడుస్తున్నా కన్యాశుల్కాన్ని తలదన్నే నాటకం తెలుగునాట రాకపోవడం అన్నది, ఈనాటకం గొప్పదనమా లేక తర్వాతి తరాల్లోని రచయితల కృషిలో లోపమా అన్నది ఇప్పటికీ శేష ప్రశ్నే."

    నా వరకూ అది కన్యాశుల్కం గొప్పదనమే అంటాను. మీరన్నమాటే- "యద్భావం తద్భవతి" అన్నట్టు ఈ రోజుకీ అలరించగలగడం, ఏదో ఒక పాత్రతోనో, సన్నివేశంతోనో ఈ తరం పాఠకులను కూడా ఆకర్షించగలగడం కన్యాశుల్కం గొప్పదనం.

    మీ సమీక్షలో బాగా నచ్చినది. సినిమా, నాటకం చూసినా నాటకం చదవడానికేముంది అనుకోడానికి లేదని, చదవనివారిని ప్రోత్సహించిన విధానం. ఊహ మరింత అందంగా ఉంటుంది కదండీ. :)

    "రసరంజని" నటులు బాగున్నారు. పాత్రలకు న్యాయం జరిగినట్టే కనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  5. నేను చూడను బాబోయి అంటే వీల్లేదు నువ్వు చూడాల్సిందే అని చిన్నప్పుడు గట్టిగా మందలించి మరీ చూపెట్టారు మా అమ్మగారు ఈ కన్యాశుల్కం నాటకం ఆధారంగా తీసిన సినిమా.తరువాత ఎన్ని సార్లు చూసానో లెక్క లేదు. ముఖ్యంగా నాకు మదురవాణి పాత్రలో సావిత్రి నటన, ఆ పాత్రను మలిచిన తీరు చాలా చాలా ఇష్టం.మీ పోస్ట్ ద్వారా మళ్ళీ కన్యాశుల్కం నాటకాన్ని గుర్తు చేసారు. మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. "మధురవాణి" పాత్ర ఎప్పటికీ చిరస్మరణీయమే..

    రిప్లయితొలగించండి
  7. @కష్టేఫలే: కొత్త పుస్తకం దొరుకుతోందండీ ప్రింట్లో.. విశాలాంధ్ర వాళ్ళు, ఎమెస్కో వాళ్ళూ వేశారు. నిజమే..ఈ ఆడపిల్లు దొరకడం లేదన్న గొడవ చూస్తుంటే, కన్యాశుల్కం మళ్ళీ వచ్చే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది.. ధన్యవాదాలు.
    @శ్రావ్య వట్టికూటి: 'పొటిగరాపు'లండీ 'పొటిగరాపు'లు :-) ..ధన్యవాదాలు.
    @చక్రవర్తి: అవునండీ.. రోజూ ఎక్కడో అక్కడ, ఏదో రూపంలో వినిపిస్తూనే ఉంటాయ్.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. @కొత్తావకాయ: నిజమండీ.. చూసేశాం కదా అని చదవకుండా ఉండడం సరికాదు.. నిజానికిది ఓసారి చదివి పక్కన పెట్టేసే పుస్తకం కాదు కూడా... ధన్యవాదాలు...
    @జలతారు వెన్నెల: మంచి పని చేశారండీ మీ వాళ్ళు... ఆ రకంగా మీరు నాటకం చూడగలిగారు కదా.. ధన్యవాదాలు
    @పద్మార్పిత: అవునండీ.. మధురవాణి అనే కాదు, కన్యాశుల్కం మొత్తం చిరస్మరణీయమే.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి