బుధవారం, మార్చి 23, 2011

వేలుపిళ్లై

ఇవాల్టి నా దినచర్య ముందుగా ప్లాన్ చేసుకున్నట్టుగా కాక, చేయగలిగినన్ని మార్పులతో సాగింది. ఇందుకు కారణం ఓ పుస్తకం. సి. రామచంద్ర రావు కథా సంకలనం 'వేలుపిళ్ళై' కొత్త ప్రింట్ మార్కెట్లోకి వచ్చిందన్న వార్త ఉదయాన్నే తెలియడంతో, షాపు తెరిచే వేళ వరకూ ఆత్రంగా ఎదురుచూశాను. ఇక పుస్తకం చేత చిక్కాక, పక్కకి పెట్టగలిగినన్ని పనుల్ని పక్కన పెట్టి, వీలైనంత సమయాన్ని పుస్తకం కోసం కేటాయించీ, ఇప్పుడే ఈ పుస్తకం చదవడం పూర్తి చేశాను.

సుమారు రెండేళ్ళ క్రితం, మిత్రులొకరు 'తెలుగు కథకి జేజే!' అనే కథా సంకలనాన్ని బహూకరించారు నాకు. తిరుపతికి చెందిన సాకం నాగరాజు సారధ్యంలో వచ్చిన ఈ సంకలంలో నన్ను అమితంగా ఆకట్టుకున్న కథల్లో ఒకటి 'గాళిదేవరు.' అప్పటినుంచీ ఆ రచయిత గురించి తెలుసుకోవాలనీ, ఆయన రాసిన ఇతర కథలు చదవాలనీ చేస్తున్న ప్రయత్నాలు ఇన్నాళ్ళకి ఫలించాయి. గడిచిన నాలుగున్నర దశాబ్దాలలో రామచంద్రరావు రాసినవి కేవలం తొమ్మిది కథలు. అయితేనేం? ప్రతి కథా దేనికదే ప్రత్యేకమైనది.

నిజానికి, ఒకే రచయిత/రచయిత్రి కథల సంకలనం 'అన్ని కథలూ' చాలా బాగుండే అవకాశం లేదు. కనీసం కొన్ని కథలైనా పర్లేదనో, బాలేదనో అనిపిస్తాయి. పేరొందిన సంకలనాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే, నావరకు అలాంటి మినహాయింపు పొందిన సంకలనం ఈ 'వేలుపిళ్లై.' ఈ ఘనత రచయితదే. తొమ్మిది కథల్లో ఏ ఒక్క కథా నన్ను నిరాశ పరచలేదు మరి.

తొమ్మిదింటిలోనూ, ఐదు కథలకి నేపధ్యం పొరుగు రాష్ట్రాలలోని టీ ఎస్టేట్లే. రచయిత సుదీర్ఘ కాలం ఎస్టేట్ మేనేజర్ గా పనిచేసి ఉండడం ఇందుకు కారణం కావొచ్చు. అయితేనేం, ప్రకృతి వర్ణనల మొదలు మానవ మనస్తత్వ చిత్రణ వరకూ ఎక్కడా పునరుక్తి కనిపించదు. మొదటికథ 'వేలుపిళ్లై' స్త్రీ-పురుష సంబంధాల నేపధ్యంలో సాగితే రెండో కథ 'నల్లతోలు' -- పేరులో చెప్పినట్టుగానే - జాత్యహంకారం కథా వస్తువుగా తీసుకున్నది.

మనిషి-జంతువు-సెంటిమెంట్లు ఇతివృత్తంగా రాసిన కథ 'ఏనుగుల రాయి' కాగా, ఆలుమగల అనుబంధంలో మరో కోణాన్ని చూపించే కథ 'టెన్నిస్ టోర్నమెంట్.' 'ఉద్యోగం,' 'ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ,' 'కంపెనీ లీజ్' 'క్లబ్ నైట్' కథలన్నీ మానవ మనస్తత్వాన్ని అనేక కోణాల్లో చూపించేవే. నిజానికి ఈ కథల్ని ఇలా ఒక్క వాక్యంలో సూత్రీకరించడం కుదరని పని.

ఒక్కో కథ చదవడం పూర్తి చేయగానే, ఆ కథ కోసం రచయిత జరిపిన కృషి, పరిశీలన పాఠకులని అచ్చెరువొందించక మానవు. 'ఏనుగుల రాయి' కథనే తీసుకుంటే ... "మొదట ఏనుగుల రాయిని చూసినప్పుడు గుర్తు పట్టలేదు కడకరై. అడివంతా తిప్పి చివరకి ప్రతి రాత్రీ తనని ఏనుగులు అక్కడికి తీసుకు వెళ్లేసరికి అనుమానం కలిగింది. ఎన్నో రోజులు రాయి వెనకాలే నక్కి చూశాడు. రాతి చుట్టూ ప్రదేశాన్ని చక్కగా చదును చేసుకున్నాయి ఏనుగులు.

అక్కడ పడుకుని కూడా తెచ్చుకున్న కొద్ది ఆకులనీ రెమ్మల్నీ సావకాశంగా మెలిపెట్టి నోట్లో తోసుకునేవి. ఆడ ఏనుగులు చిన్న పిల్లలకి పాలు గుడిపేవి. పిల్లలు తొండం నోటికి అడ్డం రాకుండా పైకి ఎత్తిపెట్టి నోటితో పొదుగుని కరచిపెట్టుకుని తాగేవి. తిండి అయిన తర్వాత ఏనుగులు ఆడుకునేవి. ఒక్కొక్కప్పుడు పోట్లాడుకునేవి. కొన్ని ప్రేమకలాపం సాగించేవి. ఎక్కువ అలిసిపోయినప్పుడు రాతికి ఆనుకుని శరీరాన్ని తోముకునేవి..." ....ఎంత ఓర్పు, పరిశీలన అవసరం ఇది రాయడానికి!! అంతేకాదు, ఈ కథలో కీలక మలుపులకి కారణం ఏనుగుల మనస్తత్వమే.

ఎస్టేట్ జీవితాన్ని గురించి 'క్లబ్ నైట్' కథలో ఓ పాత్ర ఇలా అంటుంది: "బయట కొండలూ, పచ్చటి టీ, కాఫీ తోటలూ, స్వచ్చమైన గాలి అన్నీ ఉన్నాయి నిజమే. కాని వాటిమధ్య పని చెయ్యటానికి తోటి మనుష్యులతో స్పందించాల్సిందే కదా? పెద్దా చిన్నా తారతమ్యాలూ, స్పర్ధలూ, కావేషాలూ, నటనలూ, ఆశ్రిత పక్షపాతాలూ అన్ని చోట్లా ఉన్నట్టే ఇక్కడ కూడా అదే మోతాదులో తాండవిస్తూ ఉంటాయి. వీటి గొడవలో ప్రకృతి నైర్మల్యాన్ని పట్టించుకునే వ్యవధి ఎక్కడ ఉంటుంది?"

'ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ' కథ నేను గతంలో ఎప్పుడో చదివినట్టు జ్ఞాపకం వచ్చింది. ఎప్పుడు ఎక్కడ చదివానో గుర్తు రావడం లేదు. కథలతో పాటుగా ముళ్ళపూడి వెంకటరమణ (తాజా ముద్రణ కోసం), నండూరి రామమోహన రావు (తొలి ముద్రణ కోసం, 1964 లో) రాసిన ముందు మాటలూ చదవాల్సినవే. 'గాళిదేవరు' కథని గురించి బ్లాగులో రాసినప్పుడు "మంచి కథ గురించి చెప్పి, ఆ కథని రాసిన వారి గురించి చెప్పకపోతే ఎలా?" అంటూ కోప్పడ్డ, తాజా ప్రచురణ గురించి కబురందించిన బ్లాగ్మిత్రులు జంపాల చౌదరి గారికి కృతజ్ఞతలు. ('వేలుపిళ్లై' విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 119, వెల రూ. 55, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

10 కామెంట్‌లు:

  1. I think that Ramachandra Rao played tennis. Long ago, there were rumours in Loyola College, Madras that he defeated R. Krishnan once.

    రిప్లయితొలగించండి
  2. sorry, no time to post in Telugu....but hats off to your sincere interest in telugu lit. can you please let me have access to your library (if you are in hyd)? it'd be a great privilage !

    -Ruth.

    రిప్లయితొలగించండి
  3. మురళి గారు రాసేయండి. మీ ఇష్టం...ఎన్ని పుస్తకాల రివ్యూ లైనా రాసేయండి. మా కాలేజ్ తెలుగు డిపార్ట్మెంట్ లైబ్రరీ లో మీరు చెప్పిన చాలా బుక్సే ఉన్నాయని కనుక్కున్నాను.మా తెలుగోళ్ళు ఇలా అన్నీ కొనేస్తున్నారని నాకు తెలీదు. ఫండ్స్ చాలా ఉన్నాయి కదా మేడం అని నవ్వేసింది మా లైబ్రేరియన్. చూసుకోండి ఇంక అన్నీ ఒక్కొక్కటే చదివేస్తాను. ఇంక పని లేని రోజులొస్తున్నాయిగా మాకు:) మీ సొంత లైబ్రరీ మాకెలాగూ దొరకదు కదా.

    రిప్లయితొలగించండి
  4. @కార్తిక్: ధన్యవాదాలండీ.
    @ప్రణీత స్వాతి: తగ్గించమంటారా? :-) ..ధన్యవాదాలండీ..
    @గద్దె స్వరూప్: అవునండీ, ఈయన మహేష్ భూపతి కి బాబాయ్ అవుతారుట.. పుస్తకంలో ఉంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. @శ్యాం: అక్కడే చదివి ఉండొచ్చునండీ.. ధన్యవాదాలు.
    @రూత్: నేను హైదరాబాద్ లో ఉండి ఉంటే మిమ్మల్ని తప్పక ఆహ్వానించి ఉండేవాడినండీ, అప్పుడు మీరు "ఇంతేనా మీ లైబ్రరీ?" అని అడిగి ఉండేవాళ్ళు :-) ..ధన్యవాదాలు.
    @జయ: ఎంత అదృష్టవంతులు!! చదివి ఊరుకోకుండా, టపాలు రాస్తూ ఉండండి మరి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. @బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి