'ఒక శతాబ్దిలో వచ్చిన సుమారు రెండు వందల స్వీయ చరిత్రలలో ఉత్తమోత్తమ రచన' అంటూ ప్రకాశకులు ఇచ్చిన ఉపశీర్షిక అక్షర సత్యమన్న అనుభవం కలుగుతుంది, మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్ర ఆత్మకథ 'హంపీ నుంచి హరప్పా దాక' చదవడం పూర్తి చేయగానే. ఐదువందల ఆరుపేజీల ఈ గ్రంధంలో తన జీవితంలో జరిగిన సంఘటనల్లో కేవలం మూడో వంతును మాత్రమే అక్షరబద్ధం చేయగలిగానన్న రచయిత ముందుమాటలో ఏమాత్రమూ అతిశయోక్తి కనిపించదు కూడా.
'ఆంధ్రప్రభ' వారపత్రిక లో సీరియల్ గా వచ్చిన ఈ రచనను అజోవిభో కందాళం ఫౌండేషన్ 1997 లో ప్రచురించింది. ఐదేళ్ళ తర్వాత కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందుకుందీ రచన. హంపీకి సమీపంలోని కమలాపురం రామచంద్ర స్వస్థలం. జన్మించింది సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబంలో. చదివింది సంస్కృతం, అనుసరించింది గాంధీమార్గం. తెలుగు, తమిళ, కన్నడ, సంస్కృత, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం మరికొన్ని భాషలతో పరిచయం. జీవికకోసం ఎన్నో ఉద్యోగాలు చేసినా తనని తాను 'భాషా సేవకుడి' గానే గుర్తించుకున్నారు రామచంద్ర, చివరివరకూ.
హంపీ నగర చరిత్రతో మొదలు పెట్టిన ఈ ఆత్మకథ చదవడం మొదలు పెట్టాక, పేజీలు అలవోకగా తిరిగిపోతాయి. బసివి నాగమ్మ గురించి చెప్పినా, పాములతో సహవాసాన్ని చెప్పినా, నీటి ఎద్దడిని వర్ణించినా, పన్నారాజుని పరిచయం చేసినా రామచంద్రునిది ఓ ప్రత్యేకమైన శైలి అని అర్ధం చేసుకోడానికి ఎన్నో పేజీలు చదవనవసరం లేదు. ఆనాటి ఆచార వ్యవహారాలూ, కుటుంబ సంప్రదాయాలూ, సాంఘిక ఆర్ధిక పరిస్థితులూ ఇవన్నీ తెలుసుకుంటూ ముందుకు సాగితే రామచంద్ర విద్యాభ్యాసానికి సంబంధించిన జ్ఞాపకాలు మొదలవుతాయి.
స్వాతంత్రోద్యమం ఊపందుకున్న ఆకాలంలో కుర్రవాడిని ఇంగ్లీష్ చదువు చదివించాలా, సంస్కృతం చదివించాలా అన్న విషయంలో చాలా పెద్ద చర్చే జరిగింది ఆ ఇంట్లో. ఇంగ్లీష్ చదువుకి ఆటంకాలు రావడం, సంస్కృతం చెప్పించాలన్న తాతగారి మాట నెగ్గడంతో దూరపు బంధువు శేషాచార్యులు గారి దగ్గర 'భయం భయంగా సంస్కృతం చదువు' మొదలయ్యింది. కొన్ని చిత్రమైన అనుభవాల అనంతరం ఆ చదువు చదవలేనని రామచంద్ర ఖరాఖండీగా చెప్పేయడంతో, అనేగొందిలోని మరో బంధువుల ఇంత అతణ్ణి ఉంచి చదువు కొనసాగేలా చేశారు కుటుంబ సభ్యులు.
బాల్యం తాలూకు చాపల్యాలు, నోరూరించే ఉల్లిపాయ పకోడీలు రుచి చూడడం కోసం ఇంట్లో దొంగతనం చేయడం, పాలకోవా బిళ్ళల కోసం బయట చేసిన మరో దొంగతనం వంటి జ్ఞాపకాలు చదువరులని పేజీల వెంట పరుగులు పెట్టిస్తాయి. ప్రేమాదరాలు ఎక్కువైనా భరించడం కష్టమే అంటారు రామచంద్ర. బంధువుల ఇంట చదువు ఎంత బాగున్నా, తిరుపతి సంస్కృత కళాశాలలో చదువుని గురించి బంధువుల కుర్రవాడి ద్వారా విని ఉండడంతో అక్కడ చేరాలన్న తాపత్రయం మొదలు కావడం, కుటుంబం నుంచి మద్దతు దొరకడం జరిగిపోతుంది.
రామచంద్ర పై గాంధీజీ ప్రభావం ఎంత ఉందన్నడానికి ఈ పుస్తకమే ఉదాహరణ. పుస్తకం చదువుతుండగా మహాత్ముడి 'సత్యశోధన' గుర్తొచ్చిన సందర్భాలు ఎన్నో. ముఖ్యంగా తన బలహీనతలని నిజాయితీగా ఒప్పుకోవడం, యవ్వనాకర్షణలు వాటి తాలూకు పరిణామాలని దాచకుండా రాయడం వంటివి. తన తల్లితో రామచంద్రకి ఉన్న అనుబంధం కూడా ప్రత్యేకమైనది. తన తొలి యవ్వనపు ఆకర్షణలని సైతం తల్లితో చర్చించి, ప్రాయశ్చిత్తానికి ప్రయత్నించడం పఠితలని అబ్బురపరుస్తుంది.
చదువుకోసం ఇల్లు విడిచిన ముహూర్తం ఎలాంటిదో కానీ ఆపై సంచార జీవితాన్నే గడిపారు రామచంద్ర. సహాయనిరాకరణ లో పాల్గొని జైలు జీవితాన్నీ రుచి చూశారు. అంతటి గాంధేయవాదీ జైలు జీవితం తర్వాత అతివాదులని సమర్ధించడం, అతివాద కార్యకలాపాల్లో స్వయంగా పాల్గొనడం ఒక వైచిత్రి అనే చెప్పాలి. జైలు కారణంగా చదువు నెల్లూరికి, అటుపై మద్రాసుకీ మారడం అక్కడో కుట్ర కేసులో ఇరుక్కోవడం, కుటుంబం నుంచి ఎలాంటి మద్దతూ దొరక్క పోవడం..ఇలా ప్రతి అధ్యాయమూ ఓ సస్పెన్స్ నవలని తలపిస్తుంది.
తిరుమల రామచంద్ర జీవితంలో ఆయనకి తారసపడ్డ మహామహుల జాబితాకి అంతు లేదు. ఆయనతో వారి సాన్నిహిత్యమూ గొప్పదే. తన తొలినాటి గురువు మొదలు తనకి తారసపడ్డ వ్యక్తులందరి పేర్లూ గుర్తు పెట్టుకోవడం (డైరీ రాసే అలవాటు లేకపోయినా) ఆయన అపూర్వ జ్ఞాపక శక్తికి నిదర్శనం. మద్రాసు ఓరియంటల్ కాలేజీలో తాళపత్ర గ్రంధాలని పరిష్కరించడం మొదలు, లాహోర్ విశ్వవిద్యాలయం లో పనిచేయడం, అటుపై సైన్యంలో హవల్దారుగా పనిచేసి ఆ తర్వాత పత్రికా రంగానికి మళ్లడం వరకూ రామచంద్ర జీవితం ఊహించని మలుపులు తిరిగింది. (ఊహించనివి జరగడమే కదా జీవితం అంటే)
సైన్యంలో ఉద్యోగాన్ని విడిచి తిరిగి వస్తూ, హరప్పా నగరాన్ని చూడడాన్ని ఆయన వర్ణించిన తీరు చదివితే మనం స్వయంగా ఆ నగరాన్ని చూసిన అనుభూతికి లోనవుతాం. మొత్తం పుస్తకాన్ని అరవై ఒక్క అధ్యాయాలుగా విభజించిన రామచంద్ర ప్రతి అధ్యాయాన్నీ ఒక సంస్కృత శ్లోకంతో మొదలు పెట్టి, మరో శ్లోకం తో ముగించారు. ప్రతి శ్లోకానికీ అర్ధ వివరణ ఇవ్వడం మర్చిపోలేదు. అధ్యాయాల మధ్యలో సందర్భానుసారంగా మరికొన్ని ప్రాకృత శ్లోకాలనీ, కబీర్ దోహాలనీ పరిచయం చేశారు పాఠకులకి.
ఈ ఆత్మకథలో కుటుంబాన్ని గురించి రాసిన వివరాలు తక్కువ. తన వైవాహిక జీవితాన్ని గురించి కేవలం రేఖామాత్రంగానే చెప్పారు రచయిత. దేశంలో ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలనీ, ఎందరో ముఖ్య వ్యక్తులనీ మనకి పరిచయం చేయడం తో పాటు, భారత స్వంతంత్ర సంగ్రామం, అందులో పాల్గొన్న దేశ భక్తులకి ఎదురైన సమస్యలనీ కళ్ళకు కట్టిందీ పుస్తకం. పుస్తక ప్రియులంతా తప్పక చదవాల్సిన ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది. వెల రూ. 225.
మాతృభాషా దినోత్సవం నాడు మరువలేని పుస్తకాన్ని గురించి చెప్పారు. నేను ఈ పుస్తకం కొనాలని చాలా రోజులనుంచీ వెతుకుతున్నాను. ఆంధ్ర ప్రభ పత్రికలో నేను చదివినది కొన్ని భాగాలే అయినా నాకు చాలా నచ్చిన పుస్తకం, మొత్తం చదవలేకపోయానని చాలా బాధ పడ్డాను. అసలు నాకు చరిత్ర మీద అవగాహనా, ఆసక్తీ కలిగించిన పుస్తకం అదే. ప్రతీ ఒక తెలుగువాడూ తన చరిత్రను హంపీలో చూసుకుని సంబరపడతాడు ఈ పుస్తకం చదివితే !!
రిప్లయితొలగించండిమీ పోస్ట్ చదివాక ఎలాగైనా చదవాలని కోరిక గా ఉంది... చాలా బాగా రాసారు.
రిప్లయితొలగించండిee book naenu kooDaa chadivaanu. naaku baagaa nachchindi.
రిప్లయితొలగించండిchala bagundi
రిప్లయితొలగించండిమంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు థాంక్సులు .
రిప్లయితొలగించండిమీరు ఇన్ని పుస్తకాలు ఎలా ఎప్పుడు చదివారండీ (చదువుతారు ) బాబూ. మీ ఇంట్లో గ్రంథాలయాన్ని ఒక్కసారి చూడాలని ఉంది. ఒక టపా (ఫోటో తో సహా ) దానికి కేటాయిస్తే బావుంటుంది. నాకు చాలా కుతూహలంగా ఉంది మీ కలెక్షన్ చూడాలని.
ఇంత పెద్ద పుస్తకాలు.. నా ఇచ్చావళి లో పెట్టుకోవడానికి కూడా కష్టం అనిపిస్తోంది అండీ కానీ మీరు రాసే ప్రతీ పుస్తకం చదవాలి అనిపించేడట్టు రాస్తారు.
అన్నట్టు కోతి కొమ్మచ్చి, ఇంకోతి కొమ్మచ్చి పూర్తి చేశా.
ఎంత శ్రద్దగా చదువుతారో అంతే శ్రద్దగా ప్రెజెంట్ చేస్తారు మురళీ గారూ..చాలా బాగుంది అని ప్రతీసారీ చెప్పడం అనవసరమేమో. ఎలాగూ 100% బాగుంటాయి కదా.
రిప్లయితొలగించండి@విరజాజి: కొత్త ప్రింట్ వచ్చిందండీ.. ఆలస్యం అమృతం విషం.. త్వరగా తీసేసుకోండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@కృష్ణప్రియ: తప్పక చదవాల్సిన పుస్తకమండీ.. ధన్యవాదాలు.
@సునీత: ఇలాంటివి చదివినప్పుడు బ్లాగులో ఓ నాలుగు ముక్కలు రాస్తే బాగుంటుందేమో ఆలోచించండి.. ధన్యవాదాలు.
@myopenid: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@వాసు: మీ 'కోతి కొమ్మచ్చి' విన్నానండీ.. ఈమధ్య బ్లాగుల్లో కొద్దిగా గ్యాప్ వచ్చింది.. ఓసారి తీరికగా చూడాలి, తర్వాత ఏం రాశారో. ఇక నా పుస్తకాలు అన్నీ ఒకే చోట ఉండవండీ.. రెండు మూడు చోట్ల ఉంటాయి. నాకు క్రికెట్ చూడడం లాంటి అలవాట్లు లేకపోవడం వల్ల, అలాంటి సమయాలని పుస్తకాలకి కేటాయిస్తూ ఉంటానండీ.. అంతకన్నా రహస్యం ఏమీ లేదు. ..ధన్యవాదాలు.
@ప్రణీత స్వాతి: మీక్కూడా బాగా నచ్చే పుస్తకమండీ ఇది.. సైజు చూసి భయపడకుండా తప్పక తీసుకోండి.. ధన్యవాదాలు.