శుక్రవారం, సెప్టెంబర్ 24, 2010

బ్లాగులు-FREE HUGS...

ఆకాశం ఉరిమినప్పుడు దట్టంగా పేరుకున్న మేఘం కరిగి వర్షించడం మొదలు పెడుతుంది. సముద్రపు అట్టడుగున ముత్యపు చిప్ప నోరు తెరుచుకుని వాన చినుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కురిసే కోట్లాది చినుకుల్లో ఒక్క స్వాతిచినుకు మాత్రమే ముత్యపు చిప్పలో చేరి స్వచ్చమైన స్వాతిముత్యమై మెరుస్తుంది. కురిసే ప్రతి చినుకూ స్వాతిచినుకు కాలేదు.

ఆరేడు నెలల క్రితం.. బ్లాగు మిత్రులొకరు "మురళీ, మీరు ఫ్రీహగ్స్ బ్లాగు చూస్తున్నారా?" అని మెయిల్లో అడిగినప్పుడు, క్షణం కూడా ఆలోచించకుండా "నేను ఇంగ్లీష్ బ్లాగులు పెద్దగా చదవనండీ" అని వినయంగా జవాబిచ్చేశాను. నా జవాబు వారికెంత నవ్వు తెప్పించి ఉంటుందో FREE HUGS... బ్లాగు చూశాక కానీ అర్ధం కాలేదు. ఎందుకంటే.. అచ్చమైన, స్వచ్చమైన, పదహారణాల తెలుగు బ్లాగిది.

"నిస్పృహతో భూమిలో దాగిన మొలకని పులకింపజేయడానికిఆనందంగా వచ్చే తొలకరి చినుకు యొక్క హర్షాతిరేకాన్ని నేను.తర్వాత నాకేమవుతుంది అన్న ఆలోచన, భయమూ నాకు లేవు.నేను ఈ క్షణపు సౌందర్యాన్ని." అంటూ 'ఒంటరి ఆలాపన' చేసినా.. "గగనకాంత మోహనక్రుష్ణుని కౌగిలి బంధనం లో మునిగిపోయి గాఢ నీలపు రంగులోకి మారిపోయింది. చంద్రుడు చుక్కలతో దొంగాట ఆడుతూ మా పెరటి చెట్టు వెనక్కి నక్కాడు." అని రొమాంటిగ్గా రాస్తూనే "టైము గాడు బండిని సర్రున లాగించేసాడు. జెలసీ ఫెలో. మేము వెళ్ళిపోవాల్సిన టైము వచ్చేసింది." అంటూ తన 'పరవశా'న్ని పంచుకున్నా...బ్లాగర్ 'మురారి'ది ఓ విలక్షణ శైలి. కవితాత్మకమైన వచనం ఈయన సొంతం.

అందంగా పరుచుకున్న అక్షరాల వెంట కళ్ళు పరుగులు తీస్తుండగానే, వాక్యాల్లో కవితాత్మకతకి మనసు, రచయిత భావాలకి మెదడు ఏకకాలంలో స్పందిస్తాయి. ఆ స్పందన అలా కొనసాగుతూనే ఉంటుంది.. ఎందుకంటే ఒక్కసారి చదవడం మొదలుపెట్టాక బాహ్యస్మృతిలోకి రావడం అంత సులువైన పనేమీ కాదు.

"మనసు ఎప్పుడూ మాతృభాషలోనే స్పందిస్తుంది" అంటూ మూడేళ్ళ క్రితం జూలై 21 న 'ముందుమాట'తో బ్లాగ్ప్రపంచం లోకి అడుగుపెట్టిన మురారి (గోపిశెట్టి శ్రీనివాస్), "I look like an unsolved bug" అంటూ తన గురించి చెప్పారు. 'చిన్న చిన్న ఆనందాల'నీ, 'టింగ్ టింగ్స్'నీ పంచుకుంటూ పాఠకులని తన ప్రపంచం లోకి తీసుకెళ్ళిన మురారి 'డార్క్ కార్నర్' కథతో పఠితల ఆసక్తిని పెంచారు. 'తనని తాను తెలుసుకోవడం' అనేది చాలా రచనల్లో కనిపిస్తుంది.

"నాలోని దాగుండిపోయిన పసివాడు నీ సమక్షంలో బయటకి వచ్చినప్పుడు వాడి మారాన్ని, కేరింతలని కాకిఎంగిలి చేసి పంచుకుంటావని... నా అనురాగాన్నంతటినీ ముద్దులు చేసి ముద్దలుగా నీకు కొసరి, కొసరి తినిపించాలని... నీకోసం ఆగిపోయాను." అంటూ నెచ్చెలి కోసం ఎదురు చూసినప్పుడు ఓ అచ్చమైన ప్రేమికుడు కళ్ళముందు మెదులుతాడు.

అయితే "నా ఊహలో నువ్వున్నప్పుడు ఈ దేహం సుగంధంతో తొణుకుతుంటుంది కదా.. మరి ఈ ధూపాలెందుకు అనిపించింది" అంటూ సుప్రజని పరిచయం చేసినప్పుడూ, "పొద్దున్నే లేచి అందంగా తయారయ్యాను. నీకోసం అలంకరించుకోవడమన్నది ఎంత మనోహరమైన వ్యాపకమో!. ఈ రోజు నువ్వు రావని తెలుసు. కానీ 'పొరపాటున వచ్చేస్తేనో!' అని ఆశపడే మనసుకి ఏమని సర్దిచెప్పను?" అని 'విరహ భోగా'న్ని వర్ణించినప్పుడూ ఎవరో అమ్మాయి కలంపేరుతో రాస్తున్న బ్లాగేమో అనిపించక మానదు. ఇక 'పూల పల్లకి' కథ సరేసరి.

"ప్రతి ఒక్కరిలోనూ కొంత అబ్బాయితనం, కొంత అమ్మాయితనం ఉంటాయి" అంటారాయన. మురారి రాసిన 'ఇన్నర్ డైమెన్షన్స్' చదువుతున్నప్పుడు అందులోని మూడు పాత్రల్నీ ఒకే రచయిత సృష్టించారంటే నమ్మడానికి కొంచం సమయం పడుతుంది. "నేను రచయితని కాదు" అన్న జవాబు ఆయన దగ్గర సిద్ధంగా ఉంటుంది.

టపాలు చదువుతుంటే ఇంత చక్కని బ్లాగుకి యూఆరెల్ లో ఉన్నఅచ్చతెనుగు పేరు 'స్వాతిచినుకు' చక్కగా సరిపోతుంది కదా అనిపించింది..అయితే "నా ఆలోచనలనూ, ఆవేశాలను మాటల కౌగిలింతలుగా ఇస్తున్నాను కాబట్టి 'Free Hugs' అని పేరు పెట్టాను" అన్నవ్యాఖ్య చూడగానే జవాబు దొరికినట్టు అనిపించింది. గడిచిన మూడేళ్ళ కాలంలో ఈ బ్లాగులో కనిపించిన టపాలు కేవలం నలభై ఎనిమిది. మురారి టపాల కోసం ఎంతకాలమైనా ఎదురుచూసే అభిమానులు ఉన్నారు. చినుకులెన్ని రాలినా స్వాతిచినుకు ప్రత్యేకమైనది మరి.

23 కామెంట్‌లు:

  1. >>అందంగా పరుచుకున్న అక్షరాల వెంట కళ్ళు పరుగులు తీస్తుండగానే, వాక్యాల్లో కవితాత్మకతకి మనసు, రచయిత భావాలకి మెదడు ఏకకాలంలో స్పందిస్తాయి.

    మీ రివ్యూ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. థాంక్స్. మీ వల్ల ఒక మంచి టపా తెలిసింది

    రిప్లయితొలగించండి
  3. caalaa baaguMdi mee paricayam.
    mee paricayaanni batti... atanu caalaa baagaa raastunnaaarani arthamaindi ikanundi nenu follower ne!

    రిప్లయితొలగించండి
  4. మురళి గారు, ఇప్పుడే చూశానండీ free hugs బ్లాగ్ ! టపాలు తక్కువే ఐనా చక్కటి అనుభూతిని వెదచల్లుతున్నాయ్!పరిచయం చేసినందుకు థాంక్స్ !

    రిప్లయితొలగించండి
  5. శీర్షికలో FREE HUGS చూడటంతోనే ఇదేమిటి ఇంగ్లీషుబ్లాగుల గురించికూడా మొదలెట్టేశారా అనుకున్నా :). కిందచదివేటప్పుడు గుర్తొచ్చింది ఆరోజుల్లో అంటే తెలుగుబ్లాగులను సాధించి శోధించేరోజుల్లో దీన్నిచదివాను. బహుశా తరుచుదనం తక్కువైనందువల్లనేమో తర్వాత టచ్ పోయింది. కేక బ్లాగర్ మురళీగారు. నాలాంటి బెమ్మచారుల్ని అలా ఊహల్లో తిప్పేస్తారాయన ;)

    రిప్లయితొలగించండి
  6. ఫ్రీ హగ్స్ నేనూ చూస్తుంటాను....ఆ మాటకొస్తే నేనే మొదట చూస్తాను....:-)
    చాలా బాగుంది మీ రివ్యూ....చైతన్య అన్నట్టు మాలాంటి బెమ్మచారులకి ఆయన కొన్ని టపాలు అలా ఊహల్లోకి పంపించేస్తుంటాయి...

    రిప్లయితొలగించండి
  7. బాగుందండి రివ్యూ..చూస్తాము. నాకు తెలియదుఇప్పటి దాకా.

    రిప్లయితొలగించండి
  8. అప్పుడెప్పుడో శేఖర్ బ్లాగ్ ఏటిగట్టు పరిచయం చేసినపుడు మీ బ్లాగ్ లో కామెంట్ చూసి వెళ్ళాను చక్కని బ్లాగ్ .అన్నట్లు శేఖర్ ముందు చూస్తారట ఇదేదో ఆలోచించాల్సిన విషయం :-)

    రిప్లయితొలగించండి
  9. ఇంత మంచి బ్లాగ్ ని మీరు చెప్పాకే నేనూ చూస్తున్నాను. ఈ స్వాతిముత్యాలన్నీ అప్పుడప్పుడూ చూస్తూ ఉంటే కాసేపు వేరే లోకాల్లో విహరించి వొచ్చిన అనుభూతి కలుగుతోంది. చాలా రిలాక్షేషన్ ఇస్తోంది. చక్కటి భాష...భావాలు. మీ పరిచయం కూడా చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  10. చిన్ని గారు, చూస్తే మీరు అంత:పుర రహస్యాలు అన్నీ చేదించేటట్టు ఉన్నారు..:-) అదేంలేదండి...కాస్త భావుకతపాళ్ళు కొన్ని టపాల్లో ఎక్కువ..అలాంటి వాటికోసం మెయిల్ నోటిఫికేషన్ వచ్చీరాగానే చూసేస్తాను..అంతే!

    రిప్లయితొలగించండి
  11. మురళి గారు,
    మీరు నా బ్లాగ్ ని ప్రస్తావించడాన్ని చూసి ముందుగా ఆశ్చర్యం కలిగింది.. తర్వాత ఆనందం!. నేనంత ఆక్టివ్ బ్లాగర్ ని కాదు కాబట్టి.. ఇలా వేరొకరు నా బ్లాగ్ ని ఇంత అందంగా పరిచయం చేస్తారని అస్సలు ఊహించలేదు. మీకు నా కృతజ్ఞతలు.

    నన్ను నేను రచయితగా కన్నా, భావకుడిగానే చెప్పుకోవడానికి ఇష్టపడతాను. హృద్యమైన సంఘర్షణలు మనోఫలకంలో మెదిలినప్పుడు వాటిని వ్యక్తీకరించాలన్న ప్రయాస నా టపాల రూపాన్ని సంతరించుకుంటుంది. చాలాసార్లు నా విజువలైజేషన్ ని చెప్పాలన్న తొందర్లో భాషకి ప్రాధాన్యమివ్వను. పదాలని ఇంకాస్త బాగా వాడితే మీ పాయింట్ మరింత ప్రభావవంతంగా ఉంటుంది కదా అని తోటి బ్లాగర్లు సుతిమెత్తగా అక్షింతలు వేస్తుంటారు కూడా.

    ఈ సందర్భంగా మీకు, నా బ్లాగుని అభిమానించే పాఠకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. Thanks for the nice introduction మురళి గారు. ఇంత మంచి బ్లాగ్ ను నేను ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానా అనుకున్నాను. మీ రివ్యూ కూడా ఆ బ్లాగంత బాగుంది.

    రిప్లయితొలగించండి
  13. మురళి గారు, మురారి గారి టపాలన్నీ చదివేశాను.. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండీ ఇంత మంచి బ్లాగుని పరిచయం చేసినందుకు..:)
    మీ రివ్యూ కూడా చాలా చాలా బాగుంది... నిజానికి మీ రివ్యూ చూశాకే నాకు ఆ బ్లాగుని చూడాలనిపించింది..:)) Thanks..

    రిప్లయితొలగించండి
  14. murali garu, modati sari mi blog ni "shanigalamasam" tapa tho chadavadam aarambinchanu,alage add chesesukunnanu. ivvala mi valla inko kotta blog ni chudadam chadavadam add chesukovadam jarigindhi. thanks andi murali garu atlage murari garu.inthakalathmaka hrudayam, baavukathvam tapalallo, blogs lo chusthunte, nenemi rayalekapothunnanduku badhaga unna, intha chakkani blogs mana thelugulo vosthunnanduku, chala santhoshanganu,trupthiganu untondhi, chala thanks andi.

    రిప్లయితొలగించండి
  15. @సునీత: తప్పక చూడండి.. ధన్యవాదాలు.
    @3g: ధన్యవాదాలండీ..
    @వాసు: ధన్యవాదాలండీ

    రిప్లయితొలగించండి
  16. @సవ్వడి: మంచి పని అండీ.. ధన్యవాదాలు.
    @పరిమళం: ఆ టపాలు చదివిన తర్వాత ఆయనంతంత విరామం తీసుకోడం సబబే అనిపిస్తుందండీ ఒక్కోసారి.. ధన్యవాదాలు.
    @సుబ్రహ్మణ్య చైతన్య: ఇంతకీ ఊహల్లోనుంచి బయటికి వచ్చారా లేదా? :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @శేఖర్ పెద్దగోపు: 'నేనే మొదటి చూస్తాను' 'అంతఃపుర రహస్యాలు' ..ఏదో చెప్పకనే చెబుతున్నట్టున్నారు :-) :-) ..ధన్యవాదాలండీ..
    @భావన; తప్పక చూడండి.. ధన్యవాదాలు.
    @చిన్ని: మీరు చెప్పాకే నేనూ ఆలోచించడం మొదలు పెట్టానండీ :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @జయ: ధన్యవాదాలండీ..
    @మురారి: ఆక్టివ్, పాసివ్ అంటూ ఏమీ లేదండీ.. బ్లాగర్ ఈజ్ బ్లాగర్ అంతే.. ఈ సందర్భంగా, మీ బ్లాగులో నేను గమనించిన ఒక విషయం గత మూడేళ్ళలో భాషలో చాలా చక్కని మార్పు వచ్చింది.. ఇలాగే కొనసాగించండి మీ బ్లాగు ప్రయాణాన్ని.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: ఇక చదివెయ్యండి మరి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @మనసు పలికే: ధన్యవాదాలండీ..
    @స్ఫూర్తి: ధన్యవాదాలండీ..
    @ఉమాశంకర్: కుశలమే కదండీ.. 'అనంతం' ని ఒక చూపు చూడ ప్రార్ధన.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. మురళి గారూ మీకెన్ని థాంక్సులు చెప్పుకున్నా తక్కువే. అద్భుతమైన బ్లాగుని పరిచయం చేసారు. ఇప్పుడే చదివాను, చదివి సంతోషం పట్టలేక మీకు కామెంటుదామని పరిగెత్తుకుని వచ్చాను. నిజంగా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి